చెయ్యి వెయ్యగానే ముడుచుకుపోయిన ఆమెను జూసి “నేనంటే యిష్టం లేదా?” అడిగాడతను.
“అబ్బే అటువంటిదేమీ లేదు” సర్దుకొని అతని భుజం మీద చెయ్యవేసిందామె. ఎందుకంటే కస్టమరు తన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే జరగబోయే పరిణామాలు ఆమెలోని అణువణువుకూ తెలుసు. నెత్తురొలికే గాయాలు తనువునీ, మనసునీ కబలించేస్తాయి. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికితోడు మనసుకయ్యే గాయాలు కప్పిపుచ్చుకోవచ్చు. కాని తనువుకయ్యే గాయాలు అలా కాదు కదా! నొప్పితో విలవిల్లాడుతూ, మేమున్నామంటూ గుర్తుచేస్తూనే ఉంటాయి. దాని బదులు ఇప్పుడిది భరించడమే సులువనుకొని, అయిష్టంగా ముడుచుకుపోబోతున్న కండరాలను మందలించి, మనసుకు సర్దిచెప్పి, అతనికనుగుణంగా కదిలించింది తనువును. తన స్పర్శకు స్పందిస్తున్న ఆమెను అల్లుకుపోతున్నాడతను.
మధ్యలో చేస్తున్న పనినాపి హఠాత్తుగా “నేనందుకు పనికొస్తానా?” ప్రశ్నించాడతను.
కస్టమరుకి ఏది కావాలో అది అందించి, వాళ్లని సంతృప్తి పరిచి పంపించాలిక్కడ. అందుకే “ఎందుకలా అనుకుంటున్నారు? మీకేమి తక్కువ?” అని లేని ఉత్సాహాన్ని గొంతులో నింపుకొని అడిగింది.
“నిజంగానా! నువ్వబద్దం చెప్పడం లేదు కదా!” అని అంటూ, “పర్వాలేదా! నీకేమీ ఇబ్బంది కలగడం లేదు కదా! ఉంటే చెప్పంటూ” ఆమెను పెనవేసుకుంటున్నాడు.
ఇదో కొత్త అనుభవమామెకు. తన తనువుతో ఆడుకునేవాళ్లే గాని, “నీకేమీ ఇబ్బంది లేదు కదా!” అని అడిగిన కష్టమరుని ఇంతవరకు తన సర్వీసులో చూడలేదామె. తొలిసారిగా ఆమె మనసు స్పందిస్తోంది పరస్పర్శకు. ఆమె తనువును తీగగా చేసి మీటుతున్నాడు. తీగ మీటితే నాదము పలికినట్టు, ఆమె మనసు ఆనందనాదాన్ని పలుకుతోంది. పారవశ్యం ఉత్తుంగ తరంగంలా ఇద్దరినీ అల్లుకుపోతుంది.
అలసి, సేదదీరిన అతను “నాలో ఏమీ లోపం లేదు కదా?” ఆమె చెవిలో గుసగుసలాడాడు. అలసి అతని చేతుల్లో సేదతీరుతున్న ఆమె “మీకా అనుమానమెందుకొచ్చిందంది ఆశ్చర్యంగా.
ఆమె స్వరంలోని మాధుర్యమో, మార్దవమో కదిలించిందతనిని. “నేనందుకు పనికిరాని వాడినంటున్నారంతా!” చిన్నపిల్లాడిలా చెప్పాడతను.
“మీమీద మీకా నమ్మకం లేదా?” అని అడిగిన ఆమెతో “ఏమో! నా మీద నాకే నమ్మకం పోయింది” నిట్టూర్చాడతను.
“ఎందుకలా?” అని అడిగిన ఆమెతో “తానిష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుంటానని, ఇంటినుండి వెళ్లిపోయిన నా మరదలిని తీసుకొచ్చి, పరువుమర్యాదల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటే ఆనందంగానే చేసుకున్నాను. ఎందుకంటే తనంటే చిన్నప్పటినుండి నాకిష్టం కనక. మొదటిరాత్రి ‘యింతకుముందు జరిగిందంతా మర్చిపోదాం. ఇకనుండి ఒకరికొకరమవుదాం’ అని తనను దగ్గరకు తీసుకుంటున్న నాతో, ‘ఛీ! నువ్వసలు మగాడివేనా? చీమూ నెత్తురూ లేదా!’ అని ఛీత్కరించుకొని గదిలోనుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా, నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ప్రేమించాననుకున్నవాడు దక్కలేదన్న బాధతో అలా అందేమోనని సరి పెట్టుకున్నాను. కాని, ఎప్పుడు తనకి దగ్గరవుదామని చూసినా ఆమె ముఖంలో ఒక రకమైన చీదరింపు… ‘నువ్వు మగాడివి కావంటూ….’
నేను మగాడిని కానా అని నామీద నాకే అపనమ్మకమేస్తుంటే …. నాలోనే ఏదో లోపం ఉందేమోనని నామనసుకే అనుమానం వేస్తుంటే… అవునో కాదో తెలుసుకోవడానికి రహస్యంగా యిలా అప్పుడప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్ళినా… వాళ్లు నా మీద చెయ్యి వెయ్యగానే నేను చేస్తున్నది తప్పని నా మనసు నన్నే మందలిస్తుంటే… ముడుచుకుపోయి, ఏమి చెయ్యని నన్ను, జాలిగా చూస్తూ… ‘మగతనం లేనప్పుడు ఎవరి దగ్గరైనా అంతే!’ అనేవాళ్లే గాని నీలా మృదువుగా నన్ను దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ అనుమానం” యేమి గుర్తొచ్చిందో కాసేపాగిపోయి….
తాను ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని…. నేను సంసారానికి పనికి రానని, విడాకులు కావాలని నా మరదలు కోర్టుకెక్కితే… వీడు మగవాడు కాదని కొంతమంది జాలిగా… కొంతమంది హేళనగా చూస్తుంటే… కట్టుకున్న భార్యే అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోతే ఎందుకీ జీవితమని… బ్రతికి ఎవరినుద్ధరించాలని… ఇంకొకవైపు నా తప్పూ లేదు, నాలో యే లోపమూ లేదు, నేను మగవాడినే… అని అరిచి చెప్పాలని… ఇటువంటి విరుద్ధ భావాలతో, పోయేముందు ఒక్కసారైనా నేను మగవాడినేనని నిరూపించుకోవాలని…. యిదిగో యిప్పుడిలా నీ ముందు…. నీలా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వైనా నిజం చెప్పు” అన్న అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా “నీకేమి? నువ్వు బంగారు కొండవి. నిన్ను వద్దనుకున్నవాళ్లే దురదృష్టవంతులు” అతని పెదవులను తన పెదవులతో సన్నగా స్పర్శిస్తూ అందామె.
“నిజంగానా?” అతని మాటల్లో చిన్నపిల్లవాడిలోని ఉత్సుకత. “కాక?” సమాధానాన్ని అతనికే వదిలేసిందామె. తృప్తిగా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు.
“నన్ను పెళ్లి చేసుకుంటావా?” కౌగిట ఆమెను బంధించి అడిగాడతను. దూరంగా జరిగిందామె.
“చూసావా! పెళ్లి విషయమొచ్చేసరికి నువ్వూ దూరంగా జరిగావు. అంటే నిజంగానే నాలో ఏదో లోపముండి, నా మరదలు నన్ను విడిచి వెళ్లిందన్నమాట” విచారంగా అన్నాడతను.
“ఆమె మిమ్మల్ని విడిచి యెందుకు వెళ్లిందో తెలియదు గాని, మీలో యే లోపమూ లేదు” అతని చెయ్యిమీద చెయ్యివేసి చెప్పిందామె.
“నన్ను పెళ్లి చేసుకోమంటే, దూరంగా జరిగావెందుకు?” సూటిగా చూస్తూ ఆమెనడిగాడతను.
“నా సంగతి తెలిసే అడుగుతున్నారా?” దిగులుగా అడిగిందామె.
“నీకేమి? నీలాంటి మంచిమనిషిని నేనింతవరకూ చూడలేదు.”
“నా మంచితనాన్ని మీరేమీ చూసారు?” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.
“ఇంకొకరి బలహీనతను అలుసుగా తీసుకోకపోవడమే అసలైన మంచితనం. చావు అంచుల దగ్గర వేల్లాడుతున్న నన్ను, వొడ్డున పడేసావు. మోడైపోయిన చెట్టు వసంతంలో విరబూసినట్టు, మగవాడినేనన్న ధైర్యాన్ని నాలో విరబూయించావు. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణమెలా తీర్చుకోగలను? నిన్ను పువ్వుల్లో పెట్టి నీ రుణం తీర్చుకోవాలని వుంది. నన్ను పెళ్లి చేసుకొని, నా జీవితానికొక అర్ధాన్ని కల్పించవా?” అభ్యర్థించాడతను.
ముసుగు వేసుకున్న ఆమె మనసు, లోపలి పొరలను తాకుతున్నాయతని మాటలు. కాని ఆ మాటలు నమ్మొచ్చా! లేదా! ఆమె మనసు తేల్చుకోలేక పోతుంది. నాలుగేళ్ల క్రింద ఇటువంటి మాటలే విని గడప దాటింది. ఏమైంది? జీవితమే చిధ్రమైపోయింది. ఎన్ని కలలో… ఎన్ని ఆశలో…. అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. నిజమేనని నమ్మింది. తనలాంటి వాళ్ళను మోసం చెయ్యడమే అతని వృత్తని తెలుసుకోలేకపోయింది. తెలిశాక ఏమి చెయ్యగలిగింది? కొన్నాళ్లు పోరాడింది బయటపడాలని. కానీ వోడిపోయింది. ప్రాణం తీసుకునే ధైర్యం చెయ్యలేక, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుంది. అలాగని యిప్పుడితని మాటలు అబద్ధమని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదు. ఒకవేళ యితని మనసే నిజమైతే…? జీవితంలో కోల్పోయిన వసంతమే తిరిగి వస్తానంటుంటే… కాని, మరొక్కసారి మోసపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఆశపడి, భంగపడడానికి మనసు సిద్ధపడడం లేదు. అయినా భంగపడడానికి ఏమి మిగిలిందని తనకు జీవితంలో?
కాదంటే, జీవితంలో మరల ఇటువంటి అవకాశం తనకొస్తుందా? ఒకవేళ ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటే…. అది తనకూ పునర్జన్మే అవుతుంది. కానీ తానతనిని పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితెలా ఉంటుంది? ఇప్పటికే అతనెన్నో అవమానాలను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే, మరింత అవమానించి, అవహేళన చెయ్యదా లోకం? తన నుండి ఆయన మరిన్ని అవహేళనలకు గురికావాలా? ఒప్పుకుంటే… ఏమవుతుంది? ఒప్పుకోకపోతే అతనెలా స్పందిస్తాడు? ఏమి చెయ్యాలో తోచడం లేదు. విరుద్ధ భావాల మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు.
***
“రమణగాడు పెళ్లి చేసుకున్నాడట”.
“వాడి సంగతి తెలిసి ముందుకొచ్చిన అభాగ్యురాలెవ్వరో?”
“నీకీ సంగతి తెలుసా! వాడు చేసుకున్న ఆడది ఆ టైపట”
“అంతేలే! లేకపోతే వీడి సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు? వాడికున్న ఆస్తి పీల్చేశాక, ఛీ! నువ్వు మగాడివే కాదు పొమ్మంటుంది”
“మగవాడిననిపించు కోవడానికి బజారుదాన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ! ఇంతకన్నా చావే మేలు”
“వీడి చాటుగా దుకాణం తెరుస్తుందంటావా?” అది అనుమానమో! లేక అలా అవ్వాలన్న కోరికో!
“రామ! రామ! ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడో! పదిమందికి పక్క వేసిన దానిని పెళ్ళాడాడా? దాని బదులు కొజ్జా అనిపించుకోవడమే మేలు”
“మమ్మల్నడిగితే మేము మంచి సంబంధం కుదర్చమా! లోకంలో ఆడపిల్లలే గొడ్డు పోయారా? ఇదేమి పనని, లేని పెద్దరికాన్ని నెత్తినేసుకొని మందలిస్తూ కొందరు…
“అదెన్నాళ్ళుంటుందిలే? ఆరునెలల్లో వీడిని తన్నితగిలెయ్యకపోతే, మీసం గొరిగించుకుంటానని ఒకడి శపథం. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నట్టుంది. వీడెలాగూ అందుకు పనికిరాడు. ఎన్నాళ్ళు మడికట్టుక్కూర్చుంటుంది. ట్రై చేస్తే పడిపోతుందని ఇంకొకడి దురాలోచన.
రకరకాల వ్యాఖ్యానాలు. మనసును తూట్లు పొడిసేలా మాటల తూటాలు. గుండె గాయమయ్యేలా అసహ్యకరమైన చూపులు…… కుతూహలం ఆపుకోలేక కొందరు… దురుద్దేశాలు మనసుల్లో పెట్టుకొని కొందరు…. రకరకాల ఉద్దేశాలతో రమణ ఇంటి గడప తొక్కుతూనే వున్నారు.
వేటినీ లెక్కించలేదు రమణ. చాలా నిబ్బరంగా ఉన్నాడు. పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటో? అడగనే లేదు. వసంత అని పిలుస్తున్నాడు. ఎందుకా పేరని ఆమె అడిగితే నా జీవితంలో తిరిగి వచ్చిన వసంతానివి నువ్వన్నాడు. ఆమె రమణ నమ్మకాన్ని నిలబెడుతూ, యెవరు యెటువంటి వ్యాఖ్యానాలు చేసినా చలించకుండా, రాయిలా రమణ వెన్నంటే స్థిరంగా నిలబడింది.
***
రమణ పెళ్ళై యెన్నాళ్ళో గడవలేదు. రమణ పెళ్ళాం నెల తప్పిందని యిరుగుపొరుగుల గుసగుసలు.
“కారణం రమణేనంటావా?” ఒకమ్మ అనుమానం. “ఆవిడికే తెలియాలి” ఒకరి సమాధానం.
“ఆవిడకైనా తెలుసంటావా?” ఇంకొకరి సందేహం. “నిజమేలే! ఎంతమందో!” ఇంకొకరి కనుబొమ్మల ఎగురవేత.
“ఛీ! ఊరుకోండే. కడుపుతో వున్న పిల్లని గురించి అవేం మాటలు” మందలించింది ఒక పెద్దామె.
“మనకెరుక లేని ఆ పిల్ల గతం గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? నాలుగునెలల నుండీ చూస్తూనే వున్నాం కదా! వంక పెట్టడానికి వీల్లేని పిల్ల. మీరేమంటే అనండి గాని, ఆ పిల్లని పెళ్లి చేసుకొని రమణ మంచిపనే చేశాడు” వత్తాసు పలికింది ఒకామె.
“మనకెందుకులేమ్మా! ఆవిడ గురించిన తగువులు” ఒకరి నిష్టూరపు మాటలు. నీలాటిరేవు దగ్గర మాటలిలా వుంటే, రచ్చబండ దగ్గర మాటలెలా వున్నాయంటే….
“ఆవిడ నెల తప్పిందట కదా!” కళ్లెగరేసాడొకడు.
“మనోడి ప్రతాపమేనంటావా?” అదోరకంగా చూస్తూ ఒకడు.
“ఏమో! ఎవడికి తెలుసు? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక” పెదవి విరిచాడొకడు.
“మీరేమంటే అనండి గాని, మనందరిలోకెల్లా అదృష్టవంతుడు వాడే” అన్నాడొకడు.
“నిజమేరా! ఈ పిల్లను పెళ్లి చేసుకొని సుఖపడ్డాడు. గతానిదేముంది? ఇప్పుడెలా వుందో చూడాలి గాని!” వత్తాసు పలికాడు ఇంకో స్నేహితుడు.
“ఏరా! మీకేమైనా మత్తు జల్లిందా! వెనకేసుకొస్తున్నారు” ఒకడి వెటకారం. “చూస్తుంటే తెలుస్తోంది కదా!” ఇంకొకడి వేళాకోళం.
“ఛీ! మీరు మారరురా!” ఛీత్కరించి అక్కడ నుండి లేచిపోయారు, రమణ అదృష్టాన్ని పొగిడిన ఆ ఇద్దరు స్నేహితులు.
“రమణను వాళ్ళావిడ గౌరవించినట్టు, మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండిరా! పోకిరి కబుర్లు చెప్పడం కాదు. ఆవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే, మీ అందరి జాతకాలూ బయట పెట్టీగలను” భుజంమీద తువ్వాలు దులిపి వార్నింగిచ్చాడు, అక్కడ కూర్చున్నవాళ్ళలో ఒకడు.
అక్కడున్న ఎంతోమందికి అనుభవమే. రమణ భార్య నిప్పులాంటి మనిషని, ముట్టుకోబోతే కాలుతుందని. దానికి తోడు రమణను ఆమె యెంత అపురూపంగా చూసుకుంటుందో, అక్కడ వున్న అందరూ చూస్తూనే వున్నారు. అందుకే నోరు మెదపలేదు యే ఒక్కడూ.
***
అప్పటినుండీ చర్చల్లో అగ్రస్థానం రమణ గురించే, పుట్టబోయే బిడ్డ గురించే… ఎవరి పోలికలొస్తాయా అని. వీళ్లందరి చర్చలకు తెరదించుతూ అచ్చు గుద్ధినట్టు రమణ పోలికలతో పుట్టి, రమణ లలితలను ఆనంద డోలికలలో ముంచేస్తూ, వాళ్ల జీవితాల్లో వచ్చిన వసంతాన్ని మరింత వర్ణమయం చేశాడు రమణ, లలితలకు పుట్టిన మగబిడ్డ.
***