“జయహో!

కవిత

               కామేశ్వరి చంగల్వల

పట్టు తప్పిన చేతులతోపనిచేయలేరు
శక్తి తగ్గిన కాళ్లతో నడవలేరు
అరిగిపోయిన దంతసిరి
చేతికర్రే చేయూత
చేవతగ్గిన మేను

ఆకలి ఉన్నాతినలేరు
తిన్నా అరుగుదలుండదు
తమ పనులు తమ చేత కావు
పట్టుతప్పిన శరీరావసరాలు

మనుష్యుల ఆసరాలుతప్పవు
మనుగడ ఉనికిమారకతప్పదు
తాము సాధించిన ఘనవిజయాలు
గత చరిత్రగా మారిపోతాయి

చెప్పుకున్నా వినేవారెవరు
ఒంటి చేత్తో ఈదిన సంసారసాగరాన్ని
ఒడిదుడుకుల తాకిడిలో నేర్చుకున్న
ఓర్పు నేర్పులు తెలిసిందెవరికి

ఈత మరిచి ఒడ్డున
పడిన చేప
వయసు బారినపడ్డ
మనిషి ఒకరే
మంచంపట్టినా మదిలో తీరనివెతలు
మమతలు కలబోసిన మాటలే ఔషధం

కోరలు తీసిననాగులా
రోషాల బుసలు
పంజా విసరలేని వార్ధక్యం చేస్తుందివ్యాఘ్రాలనుసైతంమార్జాలంతో సమానం
మనుగడంతా మనిషి పై ఆధారితం

కూడబెట్టుకున్న ఆస్తులున్నా
ఆదరించే ఆప్తులుండాలి
చక్రవర్తులమయినా సేవలు
చేసే కుటుంబముండాలి

ఎలాపుడతామో ఎలా పెరుగుతామో
తెలియకుండా కాలంనడిపిస్తుంది
అంతా బాగున్నప్పుడు అందరుంటారు
అసలు బాగోనప్పుడు కొందరే మనవారు

మనకు ఎవరున్నారన్నది
ఎలా జరుగుతుందన్నది
అనారోగ్యంలో అవగతమవుతుంది
వారు చేసే సేవలతో కనువిప్పవుతుంది

ఎంతటివారికయినా
తప్పదు ఈదశ
ఎప్పుడో ఒకప్పుడు రానే వచ్చే ఈ దశకు బాసట గా
ఊరట గా తోడుండటమే
మనిషి జన్మకు పరమార్ధం

తమని కంటిపాపలా సాకేవారి దక్షతకుఆనందాశ్రువులనే
ఆశీర్వాదాల అక్షింతలుగా చల్లే పావనమూర్తులు
మనింటి జ్యేష్టపౌరులు

ఇంటి పెద్దలని అన్ని దశల లో
ఆదరించే ఆత్మీయత కలిగిన
అమృతహృదయాలకు
జయహో!
మానవత్వపు సహృదయాలకు జయహో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓటు

“తిరిగివచ్చినవసంతం”