పరంధామము

కథ

దేవులపల్లి విజయ లక్ష్మి

సుబ్రహ్మణ్యం కళ్ళు ఆవేదనతో మంకెన పుష్పాలయ్యాయి.కంటినీరు రెప్ప అంచున జారనా వద్దా అన్నట్టుఊగిసలాడుతున్నాయి.
ఆయనలోని అహంకారానికి అవి బయటకు రావడానికి సాహసం చేయలేకపోయాయి. రాకింగ్ చైర్లో వెనక్కువాలిన సుబ్రహ్మణ్యం చేతిలోని భగవద్గీతను గుండెలమీద అదిమిపెట్టారు అంతరంగ కల్లోలానికి ఆసరా కావాలన్నట్టు.

“ఓటమి చవిచూడని జీవితంలో ఓటమి అంగీకరించాల్సి వస్తుందని నేను కలలో అనుకోలేదు”అస్పష్టంగా అనుకున్నాడు.

ఇన్నాళ్ళూ తనూ జానకి గర్వంగా తలెత్తుకొని కాస్తంత అహంకారంతో,మరికాస్తంత ఆత్మస్థైర్యం తో చుట్టూ ఉన్న తమ బంధువుల స్నేహితుల ఇళ్ళల్లోని.కుటుంబాలలోని లోటుపాట్లు ముచ్చటించుకుంటూ చేతనైనంతవరకూ వారికి సహాయం చేస్తూ తమకి ఏలోటూ లేకుండా జీవితం గడుపుతున్నారు.

వారి ఆశయాలు కార్యాచరణకకి అవరోధాలు లేకపోవటంతో వారి ఆత్మవిశ్వాసం మరింత బలపడింది.

★★★

సుబ్రహ్మణ్యం భార్య జానకి స్వంత మేనమామ కూతురు.చిన్నప్పటినించీ ఒకే కాలేజీలో చదివి ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు.కంటికి రెప్పలా జానకిని చూసుకున్నాడు సుబ్రహ్మణ్యం. జానకికి బట్టల కొట్టుకి వెళ్ళి చీర కొనే అవసరం,టైలర్ దగ్గరకి వెళ్ళే అవసరం,ఈ నగ కొనిపెట్టండి అని అడిగే పరిస్థితి గానీ రానివ్వలేదు సుబ్రహ్మణ్యం.

సుబ్రహ్మణ్యం ఒక జాతీయ బ్యాంక్ ఉద్యోగి.జానకి చదువుల సరస్వతి.భర్తతో ఊరూరా తిరగుతూ కాలక్షేపంగా ఉంటుందని అధ్యాపక.వృత్తిని చేపట్టి ఆర్ధికంగా భర్తకి. చేదోడు వాదోడుగా ఉంటూ తమ ప్రేమపంటలైన ఇద్దరు మగపిల్లలని అత్యంత శ్రధ్ధగా క్రమశిక్షణ తో పెంచింది.
భర్తకు తీరుబడి లేకపోయినా జానకి పిల్లల విద్యాది విషయాల్లో ఎంతో శ్రధ్ధవహించి జిల్లా పరంగా, రాష్ట్రపరంగా మొదటి స్థానంలో ఉత్తీర్ణులవడాని దోహదపడింది. ఒకరు ఐ.ఐ.టి ఇంకొకరు మెడిసిన్ చేసి వారి తల్లిదండ్రుల ఆశయంతో వారి ఆశయాల్ని సఫలం చేసుకున్నారు.సుబ్రహ్మణ్యం దంపదులకు ఒకమోతాదులో దేశభక్తి, ప్రేమ ఎక్కువనే చెప్పొచ్చు. పిల్లలకి సైన్సు తోపాటు భారత దేశ చరిత్ర, ప్రముఖుల జీవిత చరిత్రలు,సాంప్రదాయం చక్కగా నేర్పించారు.
.
,★★★

అడపాదడపా స్వీట్ బాక్స్ తో స్టాఫ్రూమ్ లోఅడుగు పెట్టే జానకిని.చూసి తోటి సహోద్యులు కొంచెం ఈర్ష్యతో, ” ఈవిడగారి కొడుకులకి ఎందులో ప్రైజ్ వచ్చిందో ” అని చెవులు కొఱుక్కునే వారు.” పోనీలే బ్రేక్ టైమ్ కి స్నాక్స్ రెడీ”
అని ఇంకొకతె కన్ను గీటి నవ్వేది.

ఇవేమీ పట్టించుకునే స్థితిలో ఉండేదికాదు జానకి.పేరు పేరునా తమ పుత్రుల ఘనకార్యాలు వాళ్లు సాధించిన విజయాలు ఏకరువు పెట్తూ ఆమెతెచ్చిన తినుబండారాలని పంచేది.సుష్టుగా ఆరగించేవారు సహోధ్యాపకులు.

సంధ్య కి జానకంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కారణం పేరు పేరునా అందరినీ పలకరించడం,వారేమన్నా దులిపేసుకోవటం, స్కూలుకి వచ్చింది మొదలూ అడిగినవారికి, అడగనివారికి ఉచిత సలహాలిస్తూ తను తన పిల్లల ఉత్తీర్ణతకు ఏఏపూజలు చేసిందో,ఏఏ వ్రతాలు నోచిందో,ఏరోజుల్లో ఉపవాసాలు చేసిందో చెప్తూనే విద్యార్ధుల క్లాస్ వర్క్స పర్ఫెక్ట్ గా అప్డేట్ గా దిద్ది సంధ్య మనసులో ఇంకోమెట్టు ఎదిగింది.

పదిమంది లో పాటపాడినా అంకితమెవరికో ఒకరికే అన్నట్లు అంతమందిలో ఉన్నా సంధ్య జానకిల భోజనపు అలవాట్లు కళలపట్ల ఆశక్తి, పనిపట్ల శ్రధ్ధ వారిద్దరినీ స్నేహమనే బంధం ముడి వేసింది.జానకిది మేథ్స్ అయితే సంధ్య ది సైన్స్. ప్రతీ స్కూల్ ఏక్టివిటీస్ లో మిగతావారితో పోటీపడేవాళ్ళు.వారి విద్యార్ధులు కాదు వారే పోటీలో పాల్గొన్న ట్లు.అది ఒక మధురమైన బాధ్యతా యుతమైన ఆరోగ్యకరమైన ఆశయం.

★★★

చూస్తూఉండగానే కాలచక్రం గిర్రున తిరిగింది. జానకి కొడుకులు స్కాలర్షిప్ లతో పై చదువులకి స్టేట్స్ కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు గాంధీ గారు తల్లి కి ఇచ్చిన మాటలాగా అమ్మానాన్నలతో, ” మేము అక్కడ చదువు కోసమే వెళ్తున్నాం.చదువైపోగానే ఇండియాకి వచ్చి ఇక్కడ సెర్వ్ చేయాలన్నది మా ఎయిమ్” అని చెప్పారని గర్వంగా చెప్పుకునేది జానకి.
చదువులు పూర్తిచేసి పెద్దకొడుకు పేరు న్నపెద్ద కంపెనీలో, చిన్నకొడుకు ‘మస్సాచు సెట్స్ జనరల్ హాస్పిటల్ బోస్టన్ ” లోఉద్యోగాలు ఉద్యోగాలు సంపాదించుకున్నారు.

సుబ్రహ్మణ్యం వలంటరీ రిటైర్మెంటు తీసుకున్నాడు. అమెరికన్ డాలర్లు రూపాయలుగా మార్చడం.ఆ రూపాయలని ఆస్తులుగామార్చటంతో బిజీ అయిపోయాడు.
జానకి సంధ్య కంటే నాలుగు మెట్లు ధనవంతుల స్థాయిలో చేరింది.సంధ్య తో స్నేహం అంత గంభీరంగా లేదు. ఎప్పుడూ చుట్టుప్రక్కల వారి ఆలోచనా సరళిని గమనించే సంధ్య ఆమెలోని మార్పుని గమనించి తన పరిధిలో ఉండటం మొదలు పెట్టింది. సంధ్య కి ఇద్దరూ కూతుళ్ళు.వారి చదువులూ పెళ్ళిళ్ళూ పురుళ్ళూ పుణ్యాలంటూ ఆమె సంసారపు గొడవల్లో పెద్ద పట్టించుకోలేదు.

★★★

చాలా రోజుల తరువాత మళ్ళీ ఒకరోజు స్వీట్సతో ప్రత్యక్షమైంది జానకి.
” హాయ్ మేము ఇరవై ఎకరాల పొలం కొన్నాం. రెండు విల్లాలు పిల్లలిద్దరికీ.ఫామ్ హౌస్ పూర్తి అయ్యింది.ఒక సండే ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం.ప్రక్కనే మామిడి తోటుంది.” అంటూ ఊపిరి పీల్చుకోకుండా ఎనౌన్స్మెంట్ ఇచ్చింది.గోలగోలగా అభినందనలతో స్టాఫ్ రూమ్ మారుమ్రోగింది. సంధ్యకి ఆవాతావరణం ఎందుకోనచ్చలేదు. ఎందుకో వాళ్ళందరూ నీవెనక మాట్లడేవాళ్ళని చెప్పాలనుకుని తనకెందుకని ఊరుకుంది. అది జానకి ఈర్ష్య తో అనుకునే ప్రమాదముందని.

కాలగర్భంలోమరికొన్నిసంవత్సరాలు గడిచాయి. జానకి, సంధ్య రిటైర్ అయ్యారు..అడపా దడపా ఫోన్కాల్స్ తప్ప సంధ్య కి జానకి కి మధ్య దూరం పెరిగింది. కారణం మాటల్లో గొప్పతనంతోపాటు కించపరచటం స్నేహపూరితమైన సంభాషణ కరువయ్యింది.

పిల్లలిద్దరికీగొప్పసంబంధాలు ,
చదువుల సరస్వతులతో పెళ్ళిచెసింది. ఎప్పడైనా ఫోన్చేస్తే బెంగగా మాట్లాడేది. కాలచక్రం ఇంకో నాలుగు సంవత్సరాలు తిరిగింది. ఎంతో గొప్పగా పిల్లల గురించి చెప్పుకునే జానకి సంధ్యకి ఫోన్ చేసి ఎంతో దిగులుగా “నువ్వదృష్టవంతురాలివి.నీ పిల్లలు నీ కళ్ళముందున్నారు.”అంటూ .

★★★

ముందు కష్టపడితేతరువాత సుఖ పడతాము.ముందు సుఖ పడితే తరువాతకష్టపడతాము అన్న ఆర్యోక్తి అక్షర సత్యం. ” అమ్మా అక్కడ చదివి ఇక్కడ స్థిరపడతాము.” అన్న కొడుకులు ,”మాకు సిటిజెన్షిప్ వచ్చింది మేము ఇండియాకి రాము” అన్నారు.
కొడుకులు పంపిన డబ్బుని ఆత్మాభిమానంగల సుబ్రహ్మణ్యం పొలాలు తోటలూ కొని అంతా అణా.పైసలతో లెక్క. కట్టి ఉంచారు. వాటి సంరక్షణార్ధం ఉన్న కాస్త శక్తిని ధారపోసారు.

” మాకు సిటిజెన్షిప్ వచ్చింది. అక్కడి ఆస్తులన్నీ అమ్మేయండి.మిమ్మల్ని అమ్మని ఇక్కడి కి తెచ్చుకుంటాం.”అన్న ఫోన్ కాల్ సుబ్రహ్మణ్యం హృదయాన్ని గాయపరచింది.కారణం పిల్లలు పంపిన డబ్బులతో ఆస్తులు కూడబెట్టటమేకాదు, బంధువర్గంలో ఎంతోమంది చదువులకి ఆర్ధిక సహాయం, అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి అన్నివిధాల అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తననుఒక్క మాట అడగకుండా తన అభిప్రాయం తో నిమిత్తం లేకుండా తామేదో వస్తువైనట్లు “తెచ్చుకుంటాం” అన్న మాట చెవుల్లో మారుమ్రోగుతోంది.

అప్పుడే అటుగా వెళ్తున్న గోపాలం లాన్ లో హాయిగా కూర్చున్నట్లున్న సుబ్రహ్మణ్యాన్ని చూసి ” ఏంటోయ్ సుబ్రమణ్యం! ఖబుర్లు.మళ్ళీ అమెరికా ప్రయాణం.ఎప్పుడు? నీకేమయ్యా!రిటైర్ అయ్యాక ఇండియా టూర్స్,అమెరికా ట్రిప్స్ తో చీకు చింతా లేదు.నా అవస్ద చూడు ఈ మనవళ్ళని ఆడించుకుంటూ స్కూలుకి దింపటం తీసుకు రావటంతో ఒక్క నిమిషం తీరుబడి లేదు. మా ఆవిడ సంగతి సరే సరి మొగుడన్నవాడున్నాడన్న సంగతే మరచింది.ఎంతకూ మనుమలూమనుమరాళ్ళు.
కూతుళ్ళు పురుళ్ళూపుణ్యాలంటూ వండి పెట్టటంతో సరిపోతుంది.నేను ఒకపేపర్ చదవడానికి గానీ,కాస్సేపు భగవద్గీత చదవడానికి గానీ నోచుకోలేదు.ఏం అనుకోవద్దు సుబ్రహ్మణ్యం ఏదో ఫ్లోలో బర్స్ట్ అయ్యా.సరే పిల్లవాడిని స్కూలులో దింపాలి.మళ్ళీ వస్తా!”అంటూ వాచీ చూసుకుంటూ హడావుడిగా వెళ్ళాడు గోపాలం.

చేతిలో భగవద్గీతను చూసి ఒక శుష్క మందహాసం చేసాడు సుబ్రమణ్యం మొట్టమొదటి సారి తాను ఏం కోల్పోయానో తెలుసుకున్నాడు! ఇన్నాళ్ళూ అవతలి వారిని చూసి జాలిపడ్డ సుబ్రహ్మణ్యానికి తనమీద తనకే జాలివేసింది.

పిల్లలు తమకంటే అన్ని విధాల ఎత్తు ఎదగాలన్నదే ప్రతీ తల్లిదండ్రుల ఆరాటం ఆశయం. తల్లిదండ్రులకి చిన్న చిన్న కోరికలుంటాయని,వారికి తాము బిడ్డలుగా వారి జీవితంలోకి రాక మునుపే వారికంటూ అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు బంధువర్గం ఉందని అది కూకటి వేళ్ళతో పెకలించే ప్రయత్నం ప్రమాదమని,ఆ అనుబంధాలని శాశ్వతంగా వదులుకునే వాతావరణంలో పెరగలేదన్న విషయం తన పిల్లలు గ్రహించలేదన్న బాధ ఒకవైపు, తనపిల్లలకు కనీసపు విలువలని నేర్పలేకపోయనే అన్నబాధ, ఒక సలహా సంప్రదింపు లేకుండా,తమ అభిప్రాయం తెలుసుకోకుండా తమగురించి వారి నిర్ణయం తెలిపారన్న ఆలోచనలతో సుబ్రహ్మణ్యం ఆత్మాభిమానం దెబ్బతింది.

గుండెరోదించింది.మనస్సు మధనపడింది.సుబ్రమణ్యం కళ్ళలో ఊగిసలాడుతున్న రెండు కన్నీటి బిందువులు భగవద్గీతమీద కృష్ణుని పాదాలమీద పడ్డాయి.ఎంత తేలికగా “ఆస్తులన్నీ అమ్మేయండి” అన్నారు తమ పిల్లలు. బ్యాంక్ క్లర్క్ స్థాయి నుండీ వారి ఉన్నతికి భార్యాభర్తలిద్దరూ పడ్డ కష్టం కన్నీరు కాలవై ప్రవహించింది.

అప్పుడే అటుగా వచ్చిన జానకమ్మ ఉరఫ్ జానకి “ఏమిటండీ పెద్దవాడూ చిన్నవాడూ ఫోన్లో ఏదేదో మాట్లాడుతున్నారు” గద్గద స్వరంతో అంది.

కొత్థల్లో మోజుగా అమెరికా ప్రయాణం గురించి ఆర్భాటంగా ఇరుగు పొరుగు వారికి గొప్పగా చెప్పుకునేవారు భార్యా భర్త.తీరా అక్కడికెళ్ళిన రెండు నెలలకే “దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!”అన్న రాయప్రోలు వారి గేయం గుర్తుకు రా సాగింది. తమంత తాము ఎక్కడికీ వెళ్ళలేరు.పిల్లలు తీసికెళ్తేతప్ప. ఎంతోమంది బంధువులున్నా కలిసే అవకాశం ఉండదు.

అన్నిటికంటే ఒకే ఇంట్లో ఉన్నా శని ఆదివారాలు తప్ప పిల్లలతో మాట్లాడటం కుదరదు. ఏమన్నా అంటే రోజూ మాట్లాడటానికి ఏముంటాయి అంటూ నవ్వుతారు. అది సకలవసతులున్న ఖరీదైన జైలులా అనిపించేది.వారికి. కోడళ్ళు సరేసరి హడావుడిగా సలాడ్స్ అని, ఫ్రూట్స్అని జ్యూస్ లని ఏవవో రెడీమేడ్ ఫూడ్స్ తో కడుపు నింపుకొని,అత్తగారికి వంటిల్లు పరిచయం చేసి, “అత్తయ్యా ! మీరు వండింది మాకూ అట్టె పెట్టండి.మీ చేతివంట నాకూ మీ అబ్బాయికి చాలా ఇష్టం.లవ్ యూ అత్తయ్యా !బై బై !టేక్ కేర్! “అంటూ తుర్రుమని పారి పోయేవారు.

భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ సాయంత్రం ఎప్పుడౌతుందా !గూటికి చిలకలు ఎప్పుడొస్తాయా! అని చూడటం పరిపాటైపోయింది. పసివాళ్ళని డే కేర్ లో వదలి వాళ్ళని కూడా వీళ్ళు వచ్చేటప్పుడు తెచ్చేవారు.రాంగానే తాగి తిని.కాస్సేపు ఆడి మామ్మా బెడ్ టైమ్ స్టోరీస్ అంటూ వచ్చేవారు. చెపుతూ ఉంటెనే నిద్రలోకి జారుకునేవారు.
మనుమలతో గడుపుదామన్న ఆశ అడియాస అయ్యేది. ఒక గుడికాని గోపురంగానీ ఎక్కడికెళ్ళాలన్నా పిల్లలు తీసికెళ్తేనే!ఎంతో ఆశతో వచ్చిన సుబ్రహ్మణ్యం దంపతులకు ఆయాంత్రిక జీవితానికి ఇమడ లేక పోయారు.వేరులు భరత భూమిలో పాతుకొని పర దేశంలో శాఖలు విస్తరించగలవేమో కాని పాతుకుపోయిన వేరుని పెకలించలేమని తెలుసుకున్నారు. ఈ ఒక్క ట్రిప్ చాలురా బాబూ అనిపించింది.అలాగే ఒక పదేళ్ళు లాక్కొచ్చారు.

కొన్నిసంవత్సరాల సంపాదన తరువాత తమ పిల్లలు మళ్ళీ మాతృభూమికి తిరిగి వస్తారని మనుమలతో ఆనందంగా గడపవచ్చని చాలా గట్టి నమ్మకం తో ఉన్నారు.కారణం వారు తమ పిల్లలకి మాతృదేశంమీద చాలా గౌరవం,భక్తి,ప్రేమ కలిగిన వారన్న ఆబధ్ధపు నిజాన్ని ఆసరాగా చేసుకుని బ్రతుకుతున్న సగటు మధ్యతరగతి తల్లి తండ్రులు.

సుప్రీంకోర్టు తీర్పులాంటి పిల్లల నిర్ణయం కొడిగట్టే.దీపానికి.జడివానలతో గూడిన ఈదురు గాలులు తోడైనట్లైంది.
★★★
మనస్సుని నిగ్రహించుకొని మంద్రస్థాయిలో “జానకీ” అంటూ భార్య ని పిలిచాడు సుబ్రహ్మణ్యం. “ఊ”
మనస్సు చికాకుగా ఉంది ఒక్కసారి భగవద్గీత అష్టమోధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం వచనం చదవవా!

” అవ్యక్తో౽క్షర ఈత్యుక్తం తమాహుః పరమాం గతిమ్!
యం ప్రాప్యన నివర్తంతే తద్దామ పరమం మమ౹౹

ఈ అవ్యక్తమనే అక్షరము అని అందురు.ఇదియే పరమగతి.నా పరమధామము.ఈ సనాతన అవ్యక్తమును అనగా పరంధామమును చేరిన వారు మరల తిరిగి రారు.

కళ్ళలో నీళ్ళుతిరుగగా పూర్తచేసింది జానకి.

“మన పిల్లల పరంధామము అమెరికా జానకీ!వెళ్ళటమే కాని తి‌రిగి రారు జానకీ!”

“ఇంకొక్క శ్లోకం జానకీ! నాకళ్ళలో నీటిపొరలు దృష్టికి అవరోధాన్ని కలిగిస్తున్నాయి. అష్టోదశోధ్యాయంలో డెభ్భైమూడవ శ్లోకం వచనం చదివి పెట్టవూ! ” ఆర్తిగా అన్నాడు సుబ్రమణ్యం.

అర్జున ఉవాచ

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ర్పసాదాన్మయాచ్యుత
స్థితో౽స్మి గత సందేహః కరిష్యే వచనం తవ౹౹

అర్జునుడు పలికెను

ఓ అచ్యుతా! నీ కృపచే నా మోహము పూర్తిగా తొలిగినది. స్మృతిని పొందితిని.ఇప్పుడు సంశయరహితుడనైతిని.కనుక నీ ఆజ్ఞను తల దాల్చెదను.

ఎక్కిళ్ళ మధ్య పూర్త చేసి భర్త ఎదపై తల వాల్చింది జానకి భర్త తన చేత చదివించటంలో ఆంతర్యం గ్రహించి.

సమాప్తం.

దేవులపల్లి విజయలక్ష్మి.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎల్ల లోకం ఒక ఇల్లై – community health

నుడి క్రీడ -11