ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతత. పెద్ద సుఖాలు లేకున్నా, గొప్ప గొప్ప ఆస్తులు లేకున్నా హృదయాలు గాయపడని పరిస్థితులు ఉంటే చాలు అని అనుకుంటారు. ప్రకృతిలో ఎన్నో వింతలు విచిత్రాలు. పక్షులు జంతువులు పగలంతా తిరిగినా రాత్రి కాగానే గూడు చేరుతాయి, గుహలు చేరుతాయి. వాటి శరీరాలకూ ప్రాణభయం ఉంటుంది. జంతుజాతికే ఇంత తెలివితేటలు ఉంటే, వాటి సంరక్షణ అవే చూసుకుంటుంటాయే… మరి సకల ప్రాణి కోటి లో సర్వోత్కృష్టమైనటువంటి మనిషి ఎంత బాగా ఉండడానికి ప్రయత్నించాలి? మనుషులు తమ తెలివితో సంపదలను సృష్టించుకున్నారు ఆదిమానవుల కాలం నుంచి తనదైన అభివృద్ధి ఆకాంక్షించే స్వభావం. అత్యాధునిక కాలం వరకూ అతి ఆదర్శంగా ఉండాలని తరతరాలుగా ఒక ప్రత్యేకత ఉండాలి అని పరితపిస్తున్న జీవులు మనుషులు.
ఏదో బ్రతికేద్దాం” చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష” అనుకుంటే ఎలా ? మన కడుపు నిండడంతో పాటు ఇతరుల కడుపు కూడా నిండితే తిన్న తిండితో మనసుకు కాస్తయినా సంతృప్తి దొరుకుతుంది. అలాగని లోకంలో ఉన్న పేదలందరికీ దానధర్మాలు చేసి ఏమీ లేకుండా అయిపోవాలని కాదు. “తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం ” అని పెద్ద లేనాడో చెప్పింది వాస్తవం . ఇక్కడ సమస్య డబ్బులో , ధనమో , మన సంపదనివ్వడమో , ఆస్తిపాస్తులను పంచి పెట్టడమో కాదు. మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయడం . అయితే ఈ సహాయం కేవలం ఆర్థిక సహాయమే అని కూడా అనుకోవద్దు . ఇతర సహాయాలు ఏవీ చేయలేని వాళ్ళు కనీసం ఆర్థిక సహాయం అయినా చేయాలి. కానీ తెలివి ,శక్తి ,సంఘసంస్కరణ అభిలాష ,సామాజిక ఉద్ధరణాభిలాష వంటి ఏ కొన్ని మంచి విషయాలు మనసులో ఉన్నా చుట్టుపక్కల వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలి. దీనితోటే సమాజం బాగుంటుంది. మనము బాగుంటాం . నైబర్స్ అంటే ఎవరు? చుట్టుపక్కల వాళ్ళు , పక్క ఇండ్లల్లో ను వాళ్లు . ఈ పక్క ఆ పక్క ఇల్లు వెనక ఇల్లు ముందు ఇల్లు కొద్ది దూరంలో ఉన్న ఇల్లు ఇలా వాళ్ళ తో పాటు మనం అనే స్పృహ ఉండే నైబర్స్. మన వీధి వాళ్ళు, మన సందులోని వాళ్ళు. ఇప్పుడు కాలనీ వాళ్ళు అనీ అంటున్నాము. ఇలా మనుషులంతా బాగుండాలి.
అందరూ బాగుండాలి అనే పాజిటివ్ థింకింగ్ తోనే కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనుసులలో శాపనార్థాలు పెట్టినట్టుగా మాట్లాడకుండా, ఎవరి చెడును కోరకుండా, కేవలం మంచి మాటలు మాట్లాడుతూ… మంచి ఆలోచనలు చేస్తూ… మంచి పనులు చేస్తూ ఉంటే “ఎల్ల లోకం ఒక్క ఇల్లు”అవుతుంది..
Community health అన్నప్పుడు మన ప్రవర్తన, మనం ప్రజలతో అప్రోచ్ అయ్యే విధానం కూడా లెక్కలోకి వస్తుంది. మనకు ఆరోగ్యం బాలేనప్పుడు మనం అంతట మనం ప్రివెన్షన్ గా జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇతరులకు అంటకుండా చేయడం అంటే కమ్యూనిటీ హెల్త్ ను జాగ్రత్తగా చూస్తున్నాం అన్నట్టే.
సైకిల్ పై రోడ్డు మీద వెళ్లేప్పుడు ఈ సైడ్ నుంచి వెళితే ఎదుటించు వచ్చే వ్యక్తులకు ఇబ్బంది కాదు అని ఒక సెన్స్ మనలో ఉంటే కమ్యూనిటీ హెల్త్ కోసం చూసినట్టే.
కమ్యూనిటీ హెల్త్ అంటే వైద్యశాలల ముందు అంటే హాస్పిటల్స్ ముందు గానీ క్లినిక్ లో ముందుగానీ ఒక నాన్ ట్రీట్మెంట్ కోసం సూచించే ఆరోగ్య సేవలు. ప్రజల ఆరోగ్యం కొరకు ఒక ఉపసమితిలా ఒక ఇన్ డైరెక్ట్ వైద్య బృందంలా, మానవ సాధారణ విధులుగా భావించడమే. ఇది దేశంలో పౌర హక్కులు బాధ్యతలు గురించి మాట్లాడేటువంటిదే.
అంతేకాదు ఎకనామికల్ గానూ ప్రజల ఆరోగ్యం పై మన ప్రవర్తన ప్రభావం చూపిస్తుంది. అనవసర హంగులు, ఆర్భాటాలు చేయడం వలన నైబర్హుడ్ ఆలోచన , మానసిక విధానాలనూ దెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నది. అత్యంత పాపులేషన్ ఉన్న దేశం మనది. పేద గొప్ప కలిసి జీవిస్తుంటారు. ధనవంతులమన్న గర్వపూరిత ప్రవర్తన ఎన్విరాన్మెంట్ పై దెబ్బతీస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ మానవ ఎన్వరాన్మెంట్! మనసులు కలుషితమైపోతాయి.
ఏమిటి ఈ కమ్యూనిటీ హెల్త్ ? ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నది? ఒకసారి మనసుపెట్టి ఆలోచించాలి. పబ్లిక్ హెల్త్ పరిరక్షణ అనేది సమాజాభివృద్ధికి తోడవుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎన్విరాన్మెంట్ ని బాధ్యతాయుతమైన వాళ్ళు పని కట్టుకొని పని చేయాలి. వీటిలో భాగంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ కేర్, భావ సంస్కరణలు, మత సంస్కరణలు కూడా వస్తాయి. ఇది విశ్వజనీనమైన విషయం.
ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి ఆచార వ్యవహారాలను చూసి గేలి చేయకపోవడం, మా పద్ధతులే గొప్ప, మేమే గొప్ప అని అనకుండా ఉండడం. ఇతరుల హక్కులను సాధించి , శోధించి వేయకుండా, మన హక్కులను ఇతరుల పై రుద్దకుండా ఉండడం. ఇవే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తాయి. మనము మన వంతు కృషి చేద్దాం.