దొరసాని

ధారావాహికం – 32 వ భాగం

ఇంట్లో శాస్త్ర ప్రకారం నామకరణోత్సవం చేయాలని నిర్ణయం చేసుకున్నారు.. సరిగ్గా 21వ దినం నామకరణం చేస్తారు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు నీలాంబరి భూపతి .

దగ్గర బంధువులను మాత్రమే పిలిచి చేసుకోవాలని అనుకున్నారు… వియ్యాలవారికి కబురు పంపించారు… ఇంకా కొంతమంది ఆత్మీయులకు శుభవార్తను తెలియజేశారు…

రోజు పాపకు పిండితో నలుగు స్నానం చేయించి ఇంట్లో చేయించిన కాటుకతో బొట్టు కాటుక పెడుతున్నారు… నీలాంబరికి ఒక ఆలోచన వచ్చింది . తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తనకు అగరుతో బొట్టు పెట్టేది… ఇంట్లో అగరు చేయించడం ఎన్నో సార్లు తను చూసింది ..చిన్నపిల్లలకు అగరితో బొట్టు పెడితే చాలా అందంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచిది కూడా ఏ విధమైన రసాయన పదార్థాలు కల్పబడవు కాబట్టి పిల్లలకి చాలా బాగుంటుంది…

అనుకున్న వెంటనే మహేశ్వరిని పిలిచింది నీలాంబరి…

” మహీ! ఇలా రా ఒకసారి..”

” ఏంటమ్మా” అంటూ వచ్చి నిలబడింది మహేశ్వరి.

” నరసింహకు చెప్పి కొంచెం తుమ్మకాయ తీసుకొని రా” అన్నది నీలాంబరి

” తుమ్మకాయ నా అమ్మ?.. ఎందుకమ్మా తుమ్మకాయతో ఏం చేస్తాం”? అని అడిగింది మహేశ్వరి.

” ఏం చేస్తానో చెప్తే కానీ తీసుకురావా ఏంటి? .. అగరబొట్టు చేయాలే ..అది ఎలా చేస్తారు అని ఇప్పుడే అడగకు. చూపిస్తాను కదా”! అన్నది నీలాంబరి.

” సరేనమ్మా ఇప్పుడే చెప్తాను” అని చెప్పి పెరట్లోకి వెళ్లి నరసింహను పిలిచింి.

ఇదంతా గమనిస్తున్న అలేఖ్య అడిగింది..

” అగరు అంటే ఏంటమ్మా నేను ఎప్పుడూ ఈ మాట వినలేదు” అన్నది అలేఖ్య..

” పిల్లలకు బొట్టు పెట్టడానికి తుమ్మకాయతో చేస్తారు ..చేసిన తర్వాత చూద్దువు కానీ” అన్నది నీలాంబరి.

” ఏంటి తుమ్మకాయతో చేస్తారా అమ్మో! పాపకి ఏమైనా అయితే ఇలాంటివి వద్దమ్మా !అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది” అన్నది అలేఖ్య.

” దాని గురించి ఎంత మాత్రం ఆలోచించకుండానే ఇలా చేస్తానంటావా అలేఖ్య!” అన్నది నీలాంబరి.

” అది కాదమ్మా సుధీర్ ఏమంటాడో” అన్నది అలేఖ్య.

“నేను తయారు చేసి పెడతాను సుధీర్ చూసిన తర్వాతే పెడదాము ..పెద్దవాళ్ళం కూడా పెట్టుకోవచ్చు” అని చెప్పింది నీలాంబరి.

అన్యమనస్కంగా ఒప్పుకుంది అలేఖ్య.

సాయంత్రం తుమ్మకాయ కడిగి చక్కగా ఆరబెట్టి దానిని దంచి రసం తీసి ఆ రసాన్ని అంతా చిన్న చిన్న గిన్నెలలో పెట్టి ఒక గదిలో మంచం కింద పెట్టించింది నీలాంబరి. అది ఆరిపోతే నల్లని బొట్టు కింద తయారవుతుంది ..దాంట్లో కొంచెం నీళ్లు వేసి అరగదీసి బొట్టు పెట్టుకుంటే చక్కగా మెరుస్తుంది.. శరీరానికి ఏ విధమైన హాని కూడా జరగదు.

ఆరోజు సాయంకాలమే సుధీర్ వచ్చాడు.. వాళ్ళ అమ్మానాన్న నామకరణోత్సవం రోజే వస్తామని చెప్పారట…

రాత్రి భోజనాలు అయిన తర్వాత పేర్ల గురించి చర్చ వచ్చింది..

నీలాంబరి చెప్పింది” మీరు ఏ పేరు పెట్టుకున్న పర్వాలేదు కానీ అది అర్థవంతంగా ఉండాలి ఈ మధ్యకాలంలో భార్యాభర్తల పేర్లు కలిపి ఒక అర్థం లేని కొత్త పేరు సృష్టించి పెడుతున్నారు అలా కాకుండా చక్కని పేరు పెడితే పిలుచుకోవడానికి బాగుంటుంది ..రేపు స్కూల్లో కాలేజీల్లో కూడా బాగుంటుంది మీరే ఆలోచించండి మంచిపేరును నిర్ణయించుకోండి” అని చెప్పింది.

అందరూ కూర్చొని ఎన్నో పేర్లు ఆలోచిస్తున్నారు వీడియో కాల్ లో సుధీర్ తల్లి తండ్రి కూడా వింటున్నారు అందరూ రకరకాల పేర్లను సూచిస్తున్నారు ఏ పేరు ఒక పట్టాన ఎవరికి నచ్చడం లేదు…

” సౌందర్య లహరి ఎలా ఉంటుంది?” అన్నది నీలాంబరి.

కాసేపు మౌనంగా ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు…

ఈ పేరే చాలా బాగుంది అని అందరూ మద్దతు తెలిపారు…

” ఆది శంకరులు అమ్మ వారి గురించి వర్ణన చేసిన స్తోత్రము సౌందర్యలహరి ఇంతకన్నా మంచి పేరు ఇంకేముంటుంది!” అన్నారు సుధీర్ తల్లి తండ్రి….

అందరూ మాట్లాడుకుంటుండగా కొంచెం ఉదాసీనంగా మారిపోయింది నీలాంబరి..

” సాగర్ కూడా ఉంటే బాగుండేది కదా వస్తానని చెప్పాడు కానీ ఏ డేటో తెలియదు ఎన్ని రోజులైంది బిడ్డని చూసి” అని అనుకొని కళ్ళలోకి వచ్చిన తడిని మెల్లగా ఎవరూ చూడకుండా చేతులతో అద్దుకొని హాల్లో అటు తిరిగి నిలబడి ఏదో సర్దుతున్నట్లు చేసింది… అంతలోనే వెనుక నుంచి ఎవరో భుజాలను చేయితో గట్టిగా పట్టుకున్నారు…

వెనక్కి తిరిగి చూసేసరికి సాగర్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు… ఒక్కసారి నీలాంబరి మొహం వెలిగిపోయింది సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది… సాగర్ నీ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది…

” వస్తానని చెప్పలేదేంట్రా నాన్నకు తెలుసా నువ్వు వచ్చేది” అన్నది నీలాంబరి..

” మాకందరికీ సాగర్ వచ్చేది తెలుసు దొరసాని గారు తమరికి మాత్రమే తెలియదు మీ పుత్రుడు చెప్పొద్దని మాతో ఒట్టు వేయించుకున్నాడు అందుకని ఎవ్వరం నోరు మెదపకుండా ఉన్నాము” అన్నాడు భూపతి నవ్వుతూ..

” ఓహో అందరూ కలిసి నాతో నాటకం ఆడారా” అని చిరు కోపంతో అందరి వంక చూసి నవ్వేసింది నీలాంబరి.

” సాగర్ వెళ్లి స్నానం చేసి రా భోజనం చేద్దువు గాని అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చావు కదా!” అన్నది నీలాంబరి.

” సరేనమ్మా.. ముందు నా మేనకోడల్ని చూడాలి.. అని భూపతి దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.. పక్కనే కూర్చున్న అక్క బావలను పలకరించి..

” అక్కా! ఏది మన ముద్దుల పాప ?తీసుకొని రా నేను ఎత్తుకోవాలి” అన్నాడు సాగర్.

” అలా కాదు నువ్వు వెళ్లి చక్కగా స్నానం చేసి రా అప్పుడు కానీ ఎత్తుకోవడానికి వీల్లేదు చిన్న పిల్లలను అలా ఎత్తుకోకుడదు..” అని చెప్పింది అలేఖ్య.

” ఇంతలో అంత పెద్ద దానివి అయిపోయావా? నాకే అన్ని చెప్తున్నావ్ నాకన్నా రెండేళ్లు మాత్రమే పెద్ద నువ్వు వెళ్లి తీసుకుని రా” అన్నాడు సాగర్..

వీళ్ళ సంభాషణ నవ్వుతూ చూస్తున్నాడు సుధీర్..

” చూడమ్మా నువ్వైనా సాగర్ కి చెప్పు అలా ఎత్తుకోకూడదని” అని తల్లిని అడిగింది అలేఖ్య.

” ఏంటమ్మా అక్క అంతా ముసలమ్మలా చేస్తుంది” అన్నాడు సాగర్.

” అవును రా చిన్నపిల్లల్ని ఎలా పడితే అలా ఎత్తుకోకూడదు వెళ్లి స్నానం చేసి రా అప్పుడు ఎత్తుకుందువు గాని” అని చెప్పింది నీలాంబరి.

“అందరూ ఒకటయ్యారు” అని గొణుగుతూ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోయాడు సాగర్.

సూట్ కేసులు అన్నిటిని నరసింహ సాగర్ రూమ్లో పెట్టాడు.

స్నానం చేసి వచ్చిన సాగర్ గదిలోకి వెళ్లి పాపను తీసుకుని ఎత్తుకున్నాడు…

” ఇంత చక్కగా ఎత్తుకోవడం నీకెలా తెలుసురా ఇప్పటికీ బావగారికే సరిగ్గా ఎత్తుకోవడం రావడం లేదు” అన్నది ఆశ్చర్యంగా అలేఖ్య.

” మరి ఏమనుకున్నావు సాగర్ అంటే నీ కన్నా కూడా నేను బాగానే ఎత్తుకోగలను” అన్నాడు సాగర్ అలేఖ్యను ఉడికిస్తూ…

ఇలా ఇద్దరు ఒకరినొకరు ఏడిపించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎన్నో రోజులకు పిల్లల సంభాషణలు వింటున్న భూపతి అలేఖ్య ఎంతో మురిపంగా వాళ్ళనే చూస్తున్నారు.. సుధీర్ అయితే వాళ్ళని చూసి ముచ్చట పడుతున్నాడు “అక్క తమ్ముడు ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు” అని.

“ఇంతకీ పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు అక్క” అన్నాడు సాగర్..

“ఇప్పుడే అమ్మ చెప్పింది రా సౌందర్యలహరి అయితే బాగుంటుందని అందరికీ నచ్చింది మరి నువ్వేమంటావ్?” అన్నది అలేఖ్య..

” మన మాత చెప్పడము నేను కాదనడము నా.. తను ఏది చెప్తే అదే జీ హుజూర్” అని హాస్యం చేశాడు సుధీర్.

అందరూ గలగల నవ్వుకున్నారు..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

ఎల్ల లోకం ఒక ఇల్లై – community health