నువ్వు నేర్పిన విద్యయే

కథ

               శీల సుభద్ర దేవి

“అరే! మల్లేష్! ఏంట్రా అలా బేలన్స్ చేసి చేస్తున్నావ్ ? కళ్ళలోనే కాదు అరుంధతి గొంతులో కూడా కంగారు తొణికిసలాడింది.
టేబులు దానిమీద కుర్చీ, కుర్చీ హ్యాండిల్స్ మీద ఒక చెక్క వేసుకొని ఫేంట్ ను పైకి మడచుకొని, తలకి షర్టు తలపాగా లా చుట్టి, చక చక తరగతి గోడలకి పైనుండి సున్నం వేస్తున్నాడు మల్లేష్. టేబుల్ మీద కుర్చీ కదలకుండా పట్టుకొని మరో చేత్తో సున్నం డబ్బా ని పట్టుకొని మరొకడు .

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా క్లాసులన్నీ బూజులు దులిపి కడిగి ముగ్గులేసి చార్టులు అంటిస్తూ పెళ్లి హడావిడిలా ఉంది స్కూలంతా.

“మరేం పర్లేదు టీచర్ మా ఇంట్లో తొలేకాశికి నేనే కలర్స్ గిట్టా వేస్తా, నాకు అలవాటే” కాన్ఫిడెంట్ గా అన్నాడు మల్లేష్. అయినా అరుంధతికి గుండె దడ దడమంటూనే ఉంది. వాళ్ళ క్లాస్ టీచర్ సరళ దగ్గరికి వెళ్లింది.

” బూజులు దులిపి చార్టులు తగిలిస్తే పోయేదానికి ఆ పిల్లల్ని గోడలకి కలర్స్ వేయమని ఎందుకు చెప్పావు? పొరపాటున ఒకదానికి ఒకటైతే ఇంకేమైనా ఉందా? అంది.
“వాళ్లకి అలవాటే లెండి డిస్టెంపరు అది వాళ్ళే తెచ్చుకున్నారు. మల్లేష్ వాళ్ళ నాన్న ఎక్కడో ఇళ్ళకి కలర్స్ వేసే పని చేస్తున్నాడంట. అక్కడ నుండే కొంచెం తెచ్చి పలచగా చేసి వేసేస్తున్నారు . క్లాసు నీటుగా అవుతుంది కదండీ” చాలా క్యాజువల్ గా అనేసింది సరళ.

ఆమెతో వాదన ఎందుకని ఊరుకున్నా అరుంధతి దృష్టంతా ఆ పిల్లలు ఎప్పుడూ పని పూర్తి చేసి వస్తారా అనే ధ్యాసలోనే ఉంది.
స్కూలు విడిచి పెట్టే సమయం కాగానే టీచర్లంతా బేగులు తీసుకొని బయలుదేరుతున్న ఇన్చార్జిగా ఉన్నందుకు పిల్లలంతా క్లాసుల్లో పని పూర్తి చేసే వరకు కూర్చోక తప్పలేదు అరుంధతికి.
ఎట్టకేలకు మల్లేష్, శ్రీనివాసు కలర్స్ పని పూర్తి చేసి బయటికి వచ్చారు. ఎంతవరకు అయిందో చూసి వాళ్ళని ఇక ఆపి ఇంటికి పంపెయ్యడానికి వాళ్ళ క్లాస్కు వెళ్ళింది అరుంధతి.
తలకి చుట్టుకున్న షర్టు తీసి దులిపి తొడుక్కుంటున్న 12 ఏళ్ల మల్లేషు కళ్ళల్లో గోడల పై పడిన సూర్యకిరణం వెలుగు తళుక్కుమంది. వాడి ముఖంలో తీరులో ఎంతో అనుభవం ఉన్న పని వాడిలా కనిపించాడు.
ఆమెకెందుకో గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అయింది అన్యమస్కంగానే పిల్లలందరినీ బయటికి పంపి క్లాసులకి తాళాలు వేసేయమని ఆయా కి పురమాయించింది.

ఓ రెండు వారాల తర్వాత సోమవారం హాఫ్ డే కి వచ్చిన సరళని ఆమె సన్నిహిత మిత్రురాలు”పొద్దుట రాలేదేమో” అని ప్రశ్నించింది
“మొన్న శనివారం మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో జన్మభూమి కార్యక్రమంలో మావాడు గోడలకు మేకులు కొడుతూ చేతి మీద కొట్టుకున్నాడు బాగా దెబ్బ తగిలింది. వాళ్ళ స్కూలుకి వెళ్లాను. ఎవరైనా పెద్దవాళ్లతో చేయించాలి గానీ ఏడో తరగతి పిల్లల్ని అలా టేబుల్స్ ఎక్కించి అలాంటి పనులు చేయించడం ఏమిటి మరీ పని వాళ్ళలా చేయిస్తున్నారు”అంటూ ఆ స్కూల్ టీచర్లని గూర్చి అనటం విని “తనదాకా వచ్చేసరికి …”అనుకొని నవ్వుకున్నది అరుంధతి.
ప్రతివారం ఈ ప్రహసనాలు జరుగుతూనే ఉన్నాయి.
తర్వాత తర్వాత ఒక్కొక్క టీచర్ రిటైర్ కావటం ఇంగ్లీష్ మీడియం మోజుతో తెలుగు మీడియం పాఠశాలలో ఏడాది ఏడాదికి అడ్మిషన్లు రాను రాను తగ్గిపోసాగాయి. కొత్త టీచర్లని నింపటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ఎనభై ఏళ్ల నాటి స్కూలు. రాను రాను శిధిల స్థితికి చేరిపోతుంది. దానిని ఆకర్షణీయంగా చేస్తే విద్యార్థులు చేరతారని ఆశతో టీచర్లు అంతా సమావేశమై పాత విద్యార్థుల సమావేశం పెట్టుకొని విరాళాలను సేకరించాలని నిర్ణయించుకున్నారు.

అరుంధతి కుటుంబా అవసరార్థం ఆరు నెలలు స్కూలుకి సెలవు పెట్టాల్సి వచ్చింది. ఈ లోగా సరళ ప్రధానోపాధ్యాయిని అయ్యింది. అంతకుముందు అనుకున్నట్లుగా పాత విద్యార్థుల సమావేశం విజయవంతమై కొంత విరాళాలు రావటంతో స్కూలు రిపేర్లు చేయించడం మొదలుపెట్టారు.
అరుంధతి ఆరు నెలల తర్వాత తిరిగి స్కూల్ లోకి వచ్చేసరికి చాలా మార్పులు కనిపించాయి. ఆమెని చూడగానే కొందరు విద్యార్థులు పలకరించడానికని ముందుకు వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు చేతులు వెనక్కి పెట్టుకొని ఉన్నారు. అరుంధతికి కుతూహలం కలిగి వాళ్ళ చేతుల్ని చూస్తే అందరి చేతుల్లోనూ ఇటికలు. “ఇటికలు ఎందుకురా ” ఆశ్చర్యంగా అడిగింది. “గేటు కాడ గోడ కూలింది కదా టీచర్ ! ఆ పక్కింటి తాన కన్స్ట్రక్షన్ అయితాంది ఆడ నుండి తెస్తున్నాం” అమాయకంగా చెప్పారు.
పిల్లలు వెళ్తున్న వైపు చూస్తూ అక్కడ దాదాపు పాతిక పైగా ఇటికలు కనిపించాయి
” అవన్నీ అట్లా దొంగతనంగా తెచ్చినవేనా?” కొంచెం కోపంగానే అంది. వాళ్ళు తలవంచుకునే ఉన్నారు.
వెనుక వైపు గేటు దగ్గర మరో టీచరు కొంతమంది విద్యార్థులకు సైగలతో ఏదో చెప్తోంది.
అటు నుండి కొందరు పిల్లలు ఇనప వూచనలను పట్టుకొని తక్కుతూ తారుతూ లోపలికి తెస్తున్నారు.
అరుంధతి గుండెఝల్లుమంది ఆ టీచర్ దగ్గరికి వెళ్లి పలకరించింది.
“కిటికీల ఊచలు పోయాయి కదా వీటిని కట్ చేయించి పెట్టిస్తున్నాం టీచర్ ” అంటూ చాలా సాధారణంగా అంది.
“ఆ మధ్య విరాళాలు బాగానే వచ్చాయి కదా ఇలా దొంగతనంగా పిల్లల చేత …” అరుంధతి మాట పూర్తిగా కాకుండానే
“అవి ఏమాత్రం సరిపోతాయి ? గవర్నమెంటేమో ఏ గ్రాంట్లు ఎయిడెడ్ స్కూల్స్ కి ఇవ్వదు. పైగా రేషనల్లైజేషన్ అంటూ మెడ మీద కత్తి పెడుతుంది. ఎట్లాగో అట్లా స్కూలు బాగు చేసుకోక తప్పదు కదా” అంటూ చిరు కోపంతో వెళ్లిపోయింది.
అంతలోనే వేరే క్లాసులు ఉండి ఒక టీచరు విద్యార్థి చేయి పట్టుకుని లాక్కైతూ మరో చేత్తో బెత్తాన్ని జరిపిస్తుంది.
ఏమైంది ఏమైందని అందరూ క్లాస్ లోంచి తొంగి చూస్తున్నారు
“క్లాస్ రూమ్ లో మర్చిపోయిన నా హ్యాండ్ బ్యాగ్ ని తీసుకురమ్మని పంపితే అందులోంచి 500 రూపాయలు కొట్టేశాడు. నాకు అనుమానం వచ్చి జేబులు వెతికితే జేబులోనే దొరికాయి. కోపంగా చెప్తోంది ఆ టీచర్.
” లేదు టీచర్ నేను దొంగతనం చెయ్యలే. మాయమ్మ ఇయ్యాల స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బియ్యం తెమ్మని ఇచ్చిన పైసలు టీచర్” అంటూ టీచర్ దెబ్బలు తప్పించుకుంటూ ఏడుస్తున్నాడు.
దొంగతనం నేరం నిజానికి ఎవరిది? స్కూల్లో మౌలిక సదుపాయాలు పట్టించుకోని ప్రభుత్వానిదా? పక్కా బిల్డింగు ఉంటే ఉద్యోగానికి డోకా ఉండదని కర్తవ్యాన్ని మరిచి పక్కదారులు ప్రోత్సహిస్తున్న టీచర్ల దా ?
ఆలోచనల్లో పడింది అరుంధతి.
( జూన్ 2015, శీలా సుభద్రాదేవి గారి “ఇస్కూలు కతలు’ కథా సంపుటి లోంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

మన మహిళామణులు