క్యాన్సర్ పోరాట యోధులు

ఆరోగ్యం

తరుణి పాఠకులు నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎవరికి ఏం జబ్బులు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. కాన్సర్ ఆయితే మరీను. ఒక కాన్సర్ పేషంట్ ను దగ్గర నుండి చూసిన రచయిత్రి లక్ష్మీ మదన్. మనందరికీ అవగాహన కల్పించేందుకు,స్ఫూర్తి ని నింపడానికి, మనమంతా సరైన విధంగా ఆలోచించ డానికి కాలమ్ రాస్తున్నారు. చదవండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. _ తరుణి పత్రిక సంపాదకులు.

          లక్ష్మి మదన్

క్యాన్సర్ పోరాటయోధుల కు అభినందనలు

జూన్ మొదటి వారం క్యాన్సర్ పోరాటయోధుల వారమట… ఇప్పుడే నేను నా స్నేహితురాలు నళిని ఎర్రగారు పెట్టిన పోస్టింగ్ చూశాను…

మనకు క్యాన్సర్ అనే మాట పెద్ద భూతం లాగా వినిపిస్తుంది… ఎందుకంటే ఈ వ్యాధి పట్ల మనకు అవగాహన లేదు కనక…

ఎవరికైనా క్యాన్సర్ అని తెలిస్తే ఎక్కడ లేని భయం వస్తుంది… ఆ సమయంలో మనకి చిన్న problem ఏదైనా వస్తె అది క్యాన్సర్ కావొచ్చు అని ఆందోళన చెందుతాము…

కానీ ఇప్పుడు మెరుగైన వైద్యం లభించి క్యాన్సర్ మీద పోరాటం చేసి ఆరోగ్య వంతులు అవుతున్నారు మన పోరాట యోధులు…

మనం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త గా ఉన్నా ఇది ఎందుకో వారినే దగ్గర తీసుకుంటుంది…దానికి కారణం ” పురుగుల మందులు వేసి పండించిన కూరగాయలను మరియు ధాన్యం.. కలుషితం గా మారిన పరిసరాలు…సమాజం పట్ల బాధ్యత లేకుండా మనం ప్రవర్తించే తీరు…మన చుట్టు పక్కల బాగుంటే చాలు అనుకుంటాము…ఎక్కడంటే అక్కడ ఉమ్మేయడం…చెత్తని ఇష్టాను సారంగా రోడ్డు మీదకి తోసేయడం…ఇవి చదువుకున్న మేధావులు కూడా చేస్తున్నారు…ఇదొక్కటే కాదు ఇలాంటివి ఎన్నో..

సరే విషయానికి వద్దాం! ఆహ్వానం లేకుండా వచ్చే ఈమె అంటే క్యాన్సర్ కొందరికి కొన్ని సూచనల ద్వారా తెలియజేస్తుంది మరికొందరికి తెలియకుండానే వ్యాపిస్తుంది…

ఈనాటి కాల పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఏ చిన్న వ్యాధిని మనం అశ్రద్ధ చేయకూడదు… ఏమవుతుందిలే ఈ చిన్న దానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాలా !అనే మన మైండ్ సెట్ ని ముందుగా మార్చుకోవాలి… అప్పుడు మనకు ఏదైనా తగ్గడానికి సమయం తక్కువగా పడుతుంది ..నాకు తెలుసు కదా అని ఏదో ఒక మందు మింగేసి తగ్గిపోతుంది అనే అపోహలో ఉంటారు చాలా మంది.

మరికొందరు ఆంకాలజీ చేసిన డాక్టర్స్ కన్నా ఎక్కువ విజ్ఞానం ఉందని వాళ్ళ సలహాలు అన్ని అవతలి వాళ్ళ పై రుద్ది అయోమయానికి గురి చేస్తారు…

కానీ మనం నమ్మాల్సింది మొదటగా భగవంతుడిని తర్వాత వైద్యో నారాయణో హరి… అన్నట్లుగా మనం డాక్టర్ని నమ్మాలి…

తూచా తప్పకుండా వారి మీద నమ్మకం ఉంచి వారిచ్చిన సలహాలను పాటించాలి… కౌన్సిలింగ్లో ముందే వైద్యులు చెప్తారు క్యాన్సర్ బారిన పడ్డ వారికి కొంత అసౌకర్యం ఉంటుందని ..ముఖ్యమైనది భోజనం అది సహించదు కానీ సహించదు అని పక్కకు నెట్టేస్తే శరీరం బలహీన పడుతుంది. మన శరీరం కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టం లేకున్నా కొన్ని చేయాలి ..అయినా మనం ఇష్టం ఉండి క్యాన్సర్ని ఆహ్వానించామా! లేదు కదా అందుకని మనం తొందరగా కోలుకోవడానికి చేయాల్సిన పని ఆహారం తీసుకోవడం తర్వాత మానసిక ప్రశాంతత తెచ్చుకోవడం… ఈ మానసిక ప్రశాంతత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది ..ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు చేసుకోవచ్చు…

కొందరు జపం చేయడం ద్వారా ఊరట చెందుతారు మరికొందరు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి పరిపక్వతం పొందుతారు.. మరికొందరు ఈ రోజుల్లో ట్రెండింగ్ లో ఉన్న సోషల్ మీడియాలో నిరంతరం ఉండి మరింత టెన్షన్ ని మైండ్ కు తెచ్చుకుంటారు.. ఏది పొందాలన్నా కూడా మన మనసుకు నిగ్రహం అవసరం ..ఏది అవసరమో దానిని ఆశ్రయిస్తే బాధ నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది… దైవ ధ్యానం కన్నా మించినది ఇంకేముంటుంది నమ్మిన దైవాన్ని కొలుస్తూ ఆ పాదములను పట్టుకుంటే ఆ స్వామి చల్లగా చూస్తాడు కదా! అలాగని తనను కొలువలేదని తన బిడ్డలను ఎప్పుడూ దేవుడు నిర్లక్ష్యం చేయడు అందరినీ రక్షిస్తాడు…

మొదటగా మనకు వచ్చిన ఇబ్బందిలను ఏదో విధంగా తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తాము.. కానీ అవి ఫలించవు అప్పుడు తప్పనిసరి హాస్పిటల్ కి వెళ్తాము ఊహించని రిపోర్టు మన కళ్ళ ముందు కనిపిస్తుంది అప్పుడు ప్రపంచం తలకిందులు అయినట్లుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన వారి కన్నా పక్కన ఉన్నవారికి మానసికంగా డిస్ట్రబెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే ఈ పదంలోనే ఒక విధమైన భయం ఉంది.. అంటే అది మన అవగాహన లోపం.. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భయపడడం అనేది అవివేకం కాకపోతే దానిని జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది…

ఇప్పుడు మనం చేయాల్సిన పని ఈ వ్యాధిని అనుకోని అతిథిగా వచ్చి చేరిన ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవడం తర్వాత వారికి మానసికమైన ధైర్యాన్ని కలిగించడం ముందుగా మనం ఆ ధైర్యాన్ని తెచ్చుకోవడం…

మరొక విషయం చేయాల్సింది ఏమిటంటే దీనిని చాటింపు వేసుకోకుండా ఉండాలి… మనలాగానే వారికి కూడా ఈ జబ్బు మీద అవగాహన ఉండదు కదా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్పందిస్తారు… ఎక్కడో దూరంగా ఉండి వారి ఎమోషన్ మనకు చూపిస్తారు కానీ మనం నిరంతరం దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి ఎమోషన్ చూపిస్తే ముఖ్యంగా దీనిని ఆహ్వానించిన వ్యక్తి బెంబేలు పడే ప్రమాదం ఉంది…

ఈ వ్యాధిగ్రస్తులు కూడా వాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఇంట్లో వాళ్లకి పూర్తి సహకారం అందించాలి.. ఇచ్చిన ఆహారం తినడం సమయానికి మందులు వేసుకోవడం నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఉండటం అసహనం ఎలాగూ ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎందుకు ఓర్చుకుంటారు ఓర్చుకున్నా కూడా ఒక్కొక్క సమయంలో ఇంట్లో వాళ్ళు కూడా సహనం కోల్పోయే పరిస్థితి వస్తుంది దానికి కారణం వారి వేదన చూసి భరించలేకపోవడమే…

ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అని రాస్తున్నాను..ఎవ్వరూ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ..కానీ వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి గురించి మాత్రమే నేను రాస్తున్నాను..

ఎందుకు నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను అనేది నేను కొంచెం కొంచెంగా రాసి నా భావాలను వ్యక్తపరిస్తాను ..ఈరోజు ఈ ఉపోద్ఘాతము రాయాలనిపించింది మరొక ఎపిసోడ్లో మరికొంచెం రాస్తాను…

మానసికంగా దృఢంగా ఉండడం ముఖ్యం ఇది పదేపదే గుర్తుంచుకోవాల్సిన విషయం..

సర్వేజనా సుఖినోభవంతు

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంధి అంటే

ఎడారి కొలను