సాక్షిత్వం అంటే జరిగేవాటి యందు కలగజేసుకోకుండా, విషయాల యందు నిశ్చలత్వంగా గమనిస్తూ ఉండటం. ఇది మానవుడు అవలంబించవలసిన సద్గుణాలలో ఒకటి. న్యాయస్థానాలలో జరిగింది చెప్పడానికి వచ్చే సాక్షి కాదు ఇది. అందులో న్యాయాన్యాయాలకు తావుంది. సాక్షిత్వము అలవరచుకుంటే ఇహ పరము లందు కూడా సౌఖ్యదాయకముగా ఉంటుంది. ఆధ్యాత్మికంలో చివర మెట్టు సాక్షిగా ఉండటం అంటారు. నిత్య జీవనంలో కూడా దీనిని అవలంబిస్తే ఒడిదుడుకులు లేని జీవితాన్ని అందిపుచ్చుకోవచ్చు. కుటుంబం నుంచి ప్రపంచం దాకా జరిగేవన్నీ తనలోకి తీసుకోకుండా చల్లగా ఉండే వాళ్లు స్థిమి తంగా ఉంటాడు. వాళ్లని స్థితప్రజ్ఞుత కలిగిన వాళ్లు అని కూడా అని అనవచ్చు. బయట ప్రపంచాన్ని సాక్షిగా చూడటం వల్ల దేనికి ముట్టక అంటక స్థిరంగా ఉండి మానసిక సుఖాన్ని పొందుతారు.ఇది కష్టమైన ప్రక్రియ కానీ అభ్యాసం చేస్తే సాధించవచ్చు. ప్రతివారికి కావలసిన హితోపకారమైన చర్య సాక్షిత్వం. సూర్యచంద్రులు పంచభూతాలు , సాక్షిగా ఉంటూ తమ పని తాను చేసుకుంటూ పోతారు. మన నుంచి ఏమీ కోరుకోరు.
మానవ జీవిత పరిస్థితి దాని స్వభావంతో వివిధ భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. వాటిలో కొన్ని సానుకూలమైనవి,కొన్ని తటస్థమైనవి, కొన్ని విధ్వంస కరంగానూ ఉంటాయి. భయము, కోపము, ఆవేశము లాంటి తామస రాజస గుణాలు మనశాంతిని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. సాక్షి కాన్షియస్నెస్ యొక్క అభ్యాసం మనోభావాల మూలాలను మరింత స్పష్టంగా గమనించడానికి వీలు కల్పిస్తుంది. సాక్షిత్వం మన భావోద్వేగాలు గడిచే దశ నిజమైన స్వభావం కాదని బోధిస్తుంది. వాస్తవానికి ప్రతికూల భావావేశాల శక్తిని తగ్గించి, ఆపై వాటిని నిర్మూలించడం ద్వారా సాక్షి కాన్షియస్నెస్ ఆశావాదము మరియు సానుకూల మానసిక స్థితికి దారితీస్తుంది. మనల్ని మనం గమనించుకునే సామర్థ్యం పెరగటం వలన ప్రతికూలత యొక్క మూలాలను క్రమంగా బలహీనపరచుకోగలుగుతాం మరియు మనస్సును కుదుటపరచుకోగలుగుతాము.
ఒక్కొక్కసారి ఈ సాక్షిత్వము సోమరి తనానికి, నిష్క్రియాత్మకు దారితీస్తుంది. సాక్షిత్వంలో ఉన్న వాళ్లు తమకు తాము ఉద్ధరించుకున్న వారే కాక తోటి మానవులకు కూడా సహాయం చేయగలరు. మన హిందూ ధర్మంలో” సాక్షి కాన్ఫిషియస్నెస్ “ఆలోచన మరియు దాని అభ్యాసము యొక్క మూలము ఉపనిషత్తులలో పొందుపరచబడింది. దాని ద్వారానే ముక్తిని ( Eternal bless) చేరవచ్చు . ఉపనిషత్తులు “పర్సనల్ మేనేజ్మెంట్ “ను బోధించే పురాతన గ్రంధాలు. ఇవి మతాలకు సంబంధించినవి కావు. ప్రతి ఒక్కరి మనుగడకు ప్రబోధకాలు. అలజడు లేని జీవితాలు గడపడానికి కావలసిన వాటిని అందించే భాండాగారాలు. సాక్షిత్వ స్పృహలో ఉండడం కూడా ధ్యానంతో ( మెడిటేషన్) తో సమానమే. ముక్తికి దోహద కారి అని కూడా మన సనాతన ధర్మం బోధిస్తోంది. సాక్షిత్వంలో ఉండి ఏ పని చేసిన దానియందు అప్రమత్తంగా ఉండటం వలన చేసిన పని వాళ్లను బాధించదు. అనాలోచితంగా పనులు అవి అంతటి అవి జరిగిపోతా ఉంటాయి సాక్షికి. ఫలితాల కోసం ఎదురు చూడటం ఉండదు.
నేటి సమాజం అంతా ఉరుకులు పరుగులతో నిండి ఉంది. నిలకడ లేకపోవడం వలన సాక్షిత్వాన్ని గుర్తించలేక, లేనిపోనివన్నీ నెత్తి మీద వేసుకొని తలకు మించిన భారంతో బాధపడుతున్నారు . దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కుంటుపడుతోంది. ఎన్నో దీర్ఘ రోగాలకు ఎదుర్కొంటున్నారు. సాక్షిత్వం అనే చిన్న దివిటీని చేత పట్టుకుంటే కష్టతరమైన ముళ్ళమార్గమైనా నేర్పుతో దాటవచ్చు. చెప్పే పెద్దలు కూడా కరువైన నేటి కాలంలో ” కౌన్సిలింగ్ సెంటర్లు” వెలిసి మనసులను కూడగట్టుకునేలా చేస్తున్నాయి. నేడు ప్రవచనకర్తలు చెప్పే ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా సహాయపడుతున్నాయి. “”నిన్ను నీవు తెలుసుకుంటే అంతా తెలిసినట్టే ” “అనే ఉపనిషత్ వాక్యం ఉండనే ఉంది. దీనినే మన పెద్దలు రోజు వారి మాటగా ” ఒళ్ళు దగ్గర పెట్టి మసులుకో “అనేవారు. ప్రతి వాళ్లు పరిస్థితి నుండి వేరుగా నిలబడటం మరియు దానిని గుర్తించకుండా ఉండటం అనే మంచి అలవాటు చేసుకుంటే అదీ సాక్షిత్వమే. డాక్టర్లు, లాయర్లు, శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ ఇంచుమించు సాక్షి భావనలో ఉండి తమ పనులను చేస్తుంటారు. కర్తవ్యంతో చేసే పని ప్రతిదీ సాక్షి భావన లోకి వస్తుంది. అందులో ఇష్ట అయిష్ట లకు తావు ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తాను దేనికి అంటనని, సాక్షిభూతుడనని వెల్లడించాడు. ప్రతి పనికి ఫలితం ఆశించక సాక్షిత్వంలో పనిచేయాలని చెప్పాడు. మనిషి ఉన్నతికి సాక్షిత్వం వెలకట్టలేని సద్గుణం. సాక్షిత్వాన్ని ఆచరించే వాళ్ళు సాన పెట్టిన వజ్రంలా ప్రకాశిస్తారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తారు.