షార్లెట్ చోపిన్

వ్యాసం

యోగా గురువుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ నాలుగవ అత్యుత్తమ ‘పద్మ’ పురస్కార గ్రహీత స్థాయికి ఎదిగినతీరు ప్రశంసనీయం.

ఈ వృద్ధవనిత వయసు 101 సంవత్సరాలు .పద్మ అవార్డుల వేడుకలో ఓ విదేశీవనిత అందరిదృష్టిని ఆకర్షించి అలరించారు. మే 9, 20 24 న న్యూఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుండి ‘పద్మశ్రీ’ అవార్డు స్వీకరించిన ఈమె 50 యేండ్లు దాటిన తర్వాత యోగ నేర్చుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు .నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతూ ఇప్పటికి చలాకీగా నేర్పిస్తూనే ఉన్నారు .అవార్డుల స్వీకరణ మహోత్సవానికి భారతీయ వస్త్ర విశేషమైన సంప్రదాయపు చీరకట్టుతో స్వయంగా నడుచుకుంటూ వచ్చి అవార్డు అందుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫ్రాన్స్ దేశం లోని’ లేరే’ పట్టణంలో జన్మించిన ఈమె, తన ఏడు సంవత్సరాల వయసులో భారతదేశం వచ్చినప్పుడు అక్కడ యోగ విద్యను అభ్యాసం చేసే బాలురను చూసి ముచ్చటపడి, తాను కూడా యోగా చేయాలని నిర్ణయించుకుంది . కానీ మగ పిల్లలు చేసినట్టు తాను చేయగలనా అనే మీమాంసకు గురైయ్యానంటారు. తిరిగి తన దేశం వెళ్ళి చదువులో నిమగ్నమై ‘బాల్ రూమ్’ డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి ప్రయాణాన్ని కొనసాగించే క్రమంలో మూడుసార్లు హిప్ రీ ప్లేస్మెంట్ ఆపరేషన్ కావడంతో , ఆ అవస్థనుండి బయటపడే మార్గంగా , తను చిన్నప్పుడు చూసిన యోగాను మార్గంగా ఎంచుకున్నారు. 52 సంవత్సరాలు దాటిన వయసులో సాధన మొదలు పెట్టారు. అదే ఆమె జీవిత ధ్యేయంగా మారిపోయింది. 50 ఏళ్లుగా యోగా శిక్షణ కొనసాగిస్తూనే ఉన్నారు.

1982లో ఫ్రాన్స్ లో యోగా ‘లేరే’ పట్టణంలో యోగ నేర్పడం మొదలుపెట్టి ఖ్యాతిగాంచారు. ఫిట్నెస్ మరియు మానసిక ప్రశాంతతలు కోరే ఫ్రెంచ్ దేశీయులకు యోగ అతి ముఖ్యమైన సాధనం. ఈమె తన అభిరుచి ననుసరించి నచ్చిన విషయాలను నేర్చుకోవడానికి వయసు ఒక అవరోధం కాదని, కేవలం అది ఒక సంఖ్య మాత్రమే నంటారు . చురకైన జీవనశైలితో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఇప్పటికీ చక్కటి ఆరోగ్యంతో చలాకీగా ఉంటూ, సన్నిహితులతో కలిసి శాపింగ్ చేయడానికి ఇష్టపడే వీరిని గూర్చి ‘మన్ కి బాత్’ సెషన్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు . ‘బాస్టిల్ డే పరేడ్’ కు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ ఈమెను కలిసి ఆమె చేస్తున్న కృషికి ప్రశంసలందించారు . యోగాతో ఆత్మానందపు అనుభూతిని, చక్కటి ఆరోగ్యాన్నిఎలా పొందవచ్చో మోడీకి వివరించారామె. యోగాలో విప్లవాన్ని సృష్టించిన ఈ ఫిట్నెస్ ప్రభావశీలి ఫ్రాన్స్ లో యోగా ప్రభంజనాన్ని సృష్టించి ఎంతోమందిలో ఆరోగ్య స్ఫూర్తిని నింపి ముందుకు సాగుతున్నారు.

పలు టీవీ షోలు చేస్తూ, యోగాసనాలతో ‘గిన్నిస్ ‘రికార్డ్ సొంతం చేవీ షో “ఫ్రాన్స్ గాట్ ఇన్ క్రెడిబుల్ టాలెంట్ “లో పాల్గొన్నారు.

భారతీయ సనాతన ఆరోగ్య సాధనమైన యోగ వయసు హద్దులు చెరిపేసుకుంటూ ఎల్లలు దాటి పరిఢవిల్లడం అత్యంత
హర్షదాయకం. ఈ యోగా మాంత్రికురాలు మరింత మందికి శిక్షణ ఇస్తూ ప్రశాంత జీవనంతో ఆరోగ్యంగా ఉండాలని అభిలషిద్దాం.

రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

సాక్షిత్వం ( అంతర్దృష్టి )