ఇంట్లో పాపాయి ఉండడంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది… పాపని చూడడానికి ఎవరు వచ్చినా వాకిట్లో గంగాళంలో ఉంచిన నీళ్లతో చక్కగా కాళ్లు కడుక్కొని లోపలికి ఆహ్వానించేవారు…
చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండదు కాబట్టి వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉండాలి అందుకే పూర్వకాలం నుండి కాళ్లు చేతులు కడుక్కొని గాని లోపలికి అనుమతించేవారు కాదు…
పాప ఇంట్లో అందరికీ అపురూపంగా మారింది పాపచిన్నగా ఏడ్చినా కూడా ఇంట్లో అందరూ కంగారు పడుతూనే ఉన్నారు… అప్పటికి అలేఖ్య అంటూనే ఉంటుంది…
” అమ్మా! నువ్వు మమ్మల్ని పెంచావు కదా అయినా కూడా నీకింత కంగారు ఎందుకు? ఏడిస్తే కూడా ఇంత గాబరా పడాలా!” అని అనేది.
” ఏంటో తల్లి అసలు ప్రతిదీ కొత్తగా చేస్తున్నట్లుగా ఉంది నాకు అప్పుడు అంతా బాధ్యత ..ఇప్పుడేమో అంతా అపురూపం పాప కొంచెం ఏడ్చినా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు” అని అన్నది నీలాంబరి.
అప్పుడప్పుడు ఇంటి పెరట్లోకి వెళ్లి నీలాంబరి మువ్వతో మాట్లాడి వస్తుంది…
” నువ్వు వచ్చిన వేళా విశేషమేమువ్వా! ఇంట్లో చక్కని పాపాయి పుట్టింది కొన్ని రోజులైన తర్వాత ఇద్దరు ఆడుకుంటారా!” ఇలా మాట్లాడుతూ ఉండేది..
ఇంట్లో అందరూ నీలాంబరిని చూసి నవ్వుకునేవాళ్లు…
” ఎప్పుడు గుంభనంగా ఉండే అమ్మ ఇలా చిన్న పిల్లలా తయారయింది ఏమిటి! చివరికి మువ్వతో” కూడా మాట్లాడుతుంది ఈమధ్య దేవుడితో కూడా కబుర్లు చెబుతుంది.. గమనించావా నాన్న!”అని భూపతితో అన్నది అలేఖ్య.
” అన్ని గమనిస్తున్నాను రా! మీ అమ్మ పట్టలేనంత ఆనందం ఉన్నదని అర్థం” అన్నాడు భూపతి.
పురుడు రేపనగా అలేఖ్య అత్త మామ గారు వచ్చారు… మనవరాలను చూసి బోలెడు సంబరపడిపోయారు…
పురుడు కోసం అత్తవారింటి వాళ్లు.. పురిటి పాపాయికి బాలింతరాలికి తెల్లని వస్త్రములు తీసుకొని రావాలి..
అలేఖ్య అత్త అలేఖ్య కోసం తెలుపు చీర మీద పింక్ పువ్వులు ఉన్న కోటా చీర తీసుకొని వచ్చింది.. పాప కోసం తెల్ల గౌను దానిపైన చక్కని ఎంబ్రాయిడరీ చేసి తీసుకొని వచ్చింది..
నీలాంబరి అలేఖ్య కోసం పింక్ కలర్ జార్జెట్ చీర దానిపైన జరీబుటా ఉన్నది తీసుకొని వచ్చింది.. పాప కోసం ఊర్లో ఉన్న టైలర్ తో లంగా జాకెట్ కుట్టించింది… కాటుక ఇంట్లోనే పట్టించింది…. మంగలి మహిళను పిలిచింది.. పురుడంతా మంగలి వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి కదా!
ఉదయమే మహేశ్వరి వచ్చి పెద్ద అండాలో ( నీళ్లు కాచుకునే ఒక పెద్ద పాత్ర) నీళ్లు నింపి అందులో కడిగిన వాయిలి ఆకును వేసి కింద కట్టెలమంటవేసి నీళ్లు బాగా కాచింది…
మంగలామె వచ్చి అలేఖ్యకు ఒళ్లంతా పసుపు నూనె పట్టించి పిండితో నలుగు పెట్టింది… తర్వాత చిన్న పాపకి ఒళ్లంతా నూనెతో మర్దన చేసి వాయిలాకుతో కాచిన నీళ్లను తీసుకొని వచ్చి స్నానం చేయించింది…
ఓ గంపనిండా బియ్యం పోసి పైన ఒక ఉతికిన తెల్లని వస్త్రం పరిచి గదిలో ఓ మూల పెట్టించారు…
స్నానం అయిన తర్వాత చెంబులో కాసిన బియ్యం వేసి అందులో నీళ్ళు పోసి బంగారు ఉంగరం వేసి ఆ నీళ్లతో పాప ఒంటిమీద పోసి తర్వాత చక్కగా ఒక పొడి వస్త్రంలో పాపను చుట్టి బియ్యం గంపలో పడుకోబెట్టారు… ఆ బియ్యం నీళ్లు చల్లడాన్ని కలి చల్లడం అంటారు.
తర్వాత అలేఖ్యకు అదే నీటితో స్నానం చేయించింది మంగలి మహిళ…
తల్లి పిల్ల స్నానం అయిన తర్వాత మంగలామే తను కూడా స్నానం చేసుకొని ఇంటి వాళ్ళు ఇచ్చిన వస్త్రం కట్టుకొని తాను తెచ్చుకున్న దేవుళ్లకు పూజ చేసి ఇంటి మధ్యలో ఒక కుర్చీ వేసి ఆ కుర్చీకి నాలుగు వైపులా పసుపుతో వండిన అన్నాన్ని విస్తళ్ళలో పెట్టి ఉంచారు… ఒక డబ్బాలో రాళ్లను వేసుకొని మంగలి మహిళ ఇల్లంతా పరిగెత్తుతూ పాట పాడుతుంది… ఇవన్నీ వేడుక కోసం చేసుకోవడమే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉండవచ్చును… ఆమె అనే పదాలు ” పామోలే పాకులాడు.. కప్పోలే దుంకులాడు” అంటూ ఇల్లంతా తిరుగుతుంటే అందరూ ఆమె డబ్బాలో తోచినంత డబ్బులు వేస్తారు ఇది ఒక రకమైన ఆచారం.
తర్వాత ఆమెకు కొంత డబ్బు ఇచ్చి వస్త్రములు పెట్టి ఆ పసుపు అన్నం తీసుకెళ్లమని చెప్పారు వెనుకకు తిరిగి చూడకుండా ఆమె వెళ్ళాలి…
తర్వాత అందరూ భోజనాలు చేశాక సాయంత్రం తల్లి పిల్లలకు కొత్త బట్టలు తొడిగి…పాపకి కాటుక తో బొట్టు ..దిష్టి చుక్క పెట్టీ..తర్వాత అలేఖ్య కు కూడా కాటుక చుక్క అరికాలి లో పెట్టారు.. ఇదంతా దిష్టి కోసం. చిన్నపిల్లలకు బాలింతలకి దృష్టి దోషం తగులుతుందని ఇలాంటి పద్ధతులన్నీ చేస్తారు..తర్వాత. వడి బియ్యం పోయించింది నీలాంబరి..
ఐదు జాకెట్ ముక్కలు ఐదు వెల్లుల్లి గడ్డలు ఐదు కొబ్బరి కుడకలు ఐదు వాము పొట్లాలు ఐదు కుంకుమ పొట్లాలు ఐదు పసుపు పొట్లాలు కట్టించి.. ఐదు దోసిళ్ళ బియ్యం పోసి అందులో పసుపు నూనె కలిపి బియ్యం తయారుచేసి ఇవన్నీ అందులో వేసి ఒక్కొక్క ముత్తయిదువ ఒడిలో బియ్యం పోస్తారు… ఈ వేడుక అంతా అయిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
రాత్రిపూట భోజనాలైన తర్వాత ఊయల ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నారు… పద్ధతి ప్రకారమైతే 21 రోజుకే ఊయలలో వేయడం ఆనవాయితీ. “ఎలా చేసుకుందాం వదినగారూ” అని అడిగింది నీలాంబరి.
“ఇప్పటివరకు అందరికీ ఇరవై ఒక్క రోజుకే ఊయల ఫంక్షన్ చేశాము కానీ ఇప్పటి పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు బయట వాతావరణం కూడా పడడం లేదు అందుకని శాస్త్రానికి 21 రోజులలో చేసుకొని తర్వాత మూడవ నెలలో ఫంక్షన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నలుగురు వస్తుంటారు కాబట్టి పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంది” అని చెప్పింది అలేఖ్య అత్తగారు.
” నాకు అలాగే అనిపించింది కానీ మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుదామని ఆలోచించాను ఈ పద్ధతి నాక్కూడా సంతోషంగానే ఉంది” అని చెప్పింది నీలాంబరి.
” 21కి చేసే తంతు మొత్తం ఇంట్లోనే చిన్నగా చేసుకుని మూడవ నెల అందరిని పిలుచుకొని చేసుకుందాం అప్పటికి పాపకి మూడవ నెల వస్తుంది అలేఖ్య ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది” అని చెప్పింది నీలాంబరి.
ఇలా అన్ని మాట్లాడుకున్న తర్వాత అలేఖ్య వాళ్ళ అత్తగారికి చెప్పింది..
” అత్తయ్యా! అమ్మ బాలసదనం కట్టిస్తున్నారు.. ఎప్పటినుంచో ఇలాంటి కోరిక ఉంది.. అమ్మ వేసే చిత్రాలు కూడా అలాగే వేసేది చిన్నప్పటినుండి… అమ్మ అమెరికాకు వచ్చినప్పుడు ఇలా జరిగింది” అని మొత్తము చెప్పింది అలేఖ్య.
” మీరు అమెరికాలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అమ్మతో కూడా మాట్లాడాను నేను. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు” అని నీలాంబరిని చూసి చిన్నగా నవ్వింది అలేఖ్య అత్తగారు.
” అంత గొప్ప దాన్ని ఏం కాదండి కానీ నాకు వేసే ప్రతి చిత్రము ఇలా చిన్న పిల్లల గురించి వేయాలనే ఉండేది ఎక్కడ పిల్లలు కష్టపడుతున్న కూడా నా మనసు చాలా బాధపడేది అందుకోసం ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేస్తున్నాను ఈ ప్రయత్నం విజయం సాధించి ఇంకా ఇలా ఎన్నో సదనాలు ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది నీలాంబరి…
మరో రెండు రోజులు ఉండి అలేఖ్య అత్తగారు మామగారు వారితోపాటు సుధీర్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు.
ఇంకా ఉంది