మనసా కవ్వించకే నన్నిలా – పాట విశ్లేషణ

పద్మశ్రీ చెన్నోజ్జ్వల

పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించి , జి. హనుమంతరావు నిర్మాతగా, ఎస్. వి. రంగారావు,గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ,జమున, దేవిక, బి. సరోజాదేవి , విజయ నిర్మల , జయసుధ ముఖ్య తారాగణంగా నిర్మించబడిన పండంటి కాపురం చిత్రంలోనిది ఈ పాట. గీత రచయిత – గోపి, సంగీతం – ఎస్. పి. కోదండ పాణి, గానం – పి. సుశీల

అవివాహితగా గర్భం దాల్చిన స్త్రీ , ఇటు కుటుంబ పరంగా విలువైన బంధాల్ని (ఉరితాడుకు వేలాడిన కన్నతండ్రి) కోల్పోయి, అటు సామాజికంగా ఘోరమైన అవహేళనలను భరిస్తూ, ఫిరంగి గుండుకు గాయపడిన ఆడ సింహం వలె, భగభగ మండే అగ్నిగోళం వంటి
పగ ప్రతీకారాలతో మమతాను రాగాల కోవెల వంటి ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తుంది.

పల్లవి:

మనసా కవ్వించకే నన్నిలా

ప్రేమానురాగాలకు – పగ ప్రతీకారాలకు నడుమ, ఔన్నత్యానికి – అహంకారానికి నడుమ ఈమె అంతరంగం నలిగిపోతూ ఉంటుంది.

ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా గమనిస్తే గనుక దుర్మార్గం , దుష్టత్వం నిండిన మనసు ఎంతటి ఆకృత్యానికైనా ఒ డిగడుతుంది , ఎంతటి నీచత్వానికైనా దిగజారుతుంది.

కానీ పరిస్థితుల ప్రభావంతో, అవతలి పక్షాన్ని సరిగ్గా అంచనా వేయలేక, వారి సాధక బాధకాలు తెలియకపోవడం వల్ల వారి పండంటి కాపురంపై పగబడుతుందేతప్ప , స్వతహాగా దుర్మార్గురాలు కాదు సరికదా , మధుర రసం తో నిండిన పండంటి హృదయం ఆమెది.

కార్మికుల పట్లగానీ, అనాథ పిల్లల పట్లగానీ ఆమె చూపే ఆదరణ, సేవా కార్యక్రమాల వల్ల మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావాల (ప్రేమ – పగ) వల్ల సంఘర్షణకు లోనవుతూ ఉంటుందన్న విషయాన్ని పాటలోని పల్లవి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

చరణం:

ఎదురీద లేక కుమిలేను నేను
సుడిగాలిలో చిక్కిన నావను
మనసా కవ్వించకే నన్నిలా

ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందలేకా, సమాజానికి జడిసి అమ్మతనాన్ని ఆస్వాదించలేకా దుర్భరమైన మానసిక వేదన ననుభవిస్తూ ఉంటుంది .

చరణం:

ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా
ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోన
నేనోడిపోయి గెలుపొందినాను
గెలిచానని నవ్వనా ఏడ్వనా
మనసా కవ్వించకే నన్నిలా

మితిమీరిన వేగం మనసుకైనా, ప్రవర్తనకైనా సరికాదనీ, నియంత్రణ ఒక్కసారి అదుపు తప్పితే గ నుక ఎంతటి విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో (శిఖరాగ్రం నుంచి అగాధం లోకి జారిపడడానికి ఒక్క క్షణం చాలనీ) ఈ చరణంలో గేయ రచయిత అద్భుతంగా తెలియజేశారు.

చరణం:

మోముపై ముంగుగరులేమో వ సివాడి మల్లియలాయే గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
ఏ తీవెకైనా కావాలి తోడు
నా జీవితం శాపమా పాపమా మనసా కవ్వించకే నన్నిలా

స్తంభించడం ఎరుగని కాలచక్రం తన దారిన తాను వెళుతూనే ఉంటుంది. ఆనందాల్లో తేలిపోయే హృదయాలకైనా, బాధల్లో కాలిపోయే గుండెలకైనా ఏ విధమైన వివక్షను చూపకుండా సమ న్యాయమే చేస్తుంది, ఒకే తీరుగా ప్రవర్తిస్తుంది.

కథానాయక ఏ ఆనందానికి నోచుకోకుండా, ఆశలన్నీ హారతి కర్పూరమై వార్ధక్య దశకు చేరువవుతుంది.

“నా జీవితం శాపమా పాపమా” అంటూ
తన మీద తానే సానుభూతిని వ్యక్తం చేసుకుంటూ ఉంటుంది.

నిజమే, ఎవరు కాదనలేని సత్యమే కానీ , నాకెందుకో ఇక్కడ మనం కాస్త విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

జీవితంలో కోలుకోలేనంతగా దెబ్బతిన్నప్పటికీ, తండ్రి సమానుడైన ఒక సంపన్నుడి ద్వారా సంక్రమించిన ఆస్తిని పదింతలు చేసి, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతూ, చక్కని సామాజిక సేవ చేస్తూ తనకు తాను నిలదొక్కుకున్న తీరు అభినందనీయమే, ప్రశంసనీయమే కానీ మితిమీరిన ఆ వేగం వల్లనే కూతుర్ని ఏదైనా అనాథా శ్రమంలో చేర్పించమని ఆసుపత్రిలోని నర్స్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

నాటకీయ పరిస్థితుల వల్ల అయినప్పటికీ ఆ శిశువు సద్గుణవతి అయిన లక్ష్మి (దేవిక) ఒడికి చేరి చల్లని నీడలో పెరిగి పెద్దవుతుంది.

అరటాకు – ముల్లు విషయం అందరికీ తెలిసిందే. అందరికీ ఇటువంటి చల్లని ఒ డి దొరుకుతుందన్న భరోసా లేదు కాబట్టి ఆ వేగానికి కాస్త కళ్లెం వేసి, మనిషి తనను తాను నియంత్రించుకోగలిగితే ఇటువంటి విపరీత పరిణామాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

తను కన్నబిడ్డను గుండెల్లో పొదువుకొని పెంచిన ఆ అనురాగ దేవత(లక్ష్మి) గర్భశోకానికి కారణమైన రాణీమాలినీదేవి (ఈమె కూడా మహోన్నతమైన వ్యక్తిత్వమున్న స్త్రీమూర్తే అయినప్పటికీ) ఏ అపరాధ భావానికి లోను కాకుండా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడప గలుగుతుందంటారా?

మామూలు మనుషుల విషయంలో తెలియదుగానీ ఆలోచనల్లో ఔన్నత్యం, హృదయంలో ప్రేమ నిండిన ఈ మహోన్నతమూర్తికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యే విషయం కాదని నా భావన.

ఇంత ఆర్ద్రంగా ఈ పాటను రచించిన గేయ రచయితకు, పాత్రకు జీవం పోసిన జమున గారికి, దర్శకనిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక బృందానికి, అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.హక్కు

శతక పద్యాలు- జీవన మార్గాలు