ప్రామాణికం – Standerd

 25-5-2024 తరుణి పత్రిక సంపాదకీయం

మొక్కై వంగనిది మానై వంగదు అని ఏనాడో మన పెద్దలు సామెత చెప్పారు. ఎందుకంటారు? చిన్ననాటి నుంచి సద్గుణాలను అలవర్చుకోవడానికి ..కష్టపడే స్వభావం నేర్చుకోవడానికి …మంచితనంతో మెలగడానికి, వెలగడానికి,!! కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు, కోరినన్ని సాధించుకోవచ్చు. నిజాయితీతో సాధించుకున్నవి సంపాదించుకున్నవి ఎనలేని సంతృప్తినిస్తాయి. వెనుతిరిగి చూసుకుంటే మనం ఎక్కడున్నామో తెలియజేస్తాయి. ఏ పరిస్థితుల్లోనూ ఆత్మన్యూనతకు గురికానటువంటి ప్రవర్తనా , అధికార దాహం లేని సద్భావం మనిషిని ఎవరెస్ట్ శిఖరమంత ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఇటువంటి విషయాలకే ప్రామాణికత అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం.

ప్రామాణికత అంటే ఏంటి కొలతలకు సంబంధించిందా? ఇది ఒక విశేషణమైన పదమా? లేకుంటే విశేషమా?
మనిషికో మాట గొడ్డు కో దెబ్బ అన్నారు మన పెద్దలు. గొడ్డును ఎంత కొట్టినా కదలదు. చురకలా బాగా గట్టి దెబ్బ తగిలితే కొన్ని కదులుతాయి.
ఆత్మాభిమానం, హృదయ నిష్ట ఉన్న వ్యక్తులు ఒక్క నిష్టూరమైన మాటను కూడా భరించలేరు. పొరపాట్లు జరగడం చాలా సహజం. కానీ ‘తప్పులు’ చేయడం సహజం కాదు. అబద్ధాలాడడం,దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం,మత్తుకు బానిసలు కావడం, హత్యలు చేయడం వంటి దుర్వ్యసనాలు మనిషిని అధఃపాతాళం లో పడేస్తాయి. పాతాళం ఎక్కడుంది? అట్టడుగు స్థానం, నీచ స్థానం, వృధా స్థానం వీటిని పాతాళం అనాలి. అంటే విలువలు లేనటువంటి పనులు, ఆలోచనలు. విలువలతో కూడిన విజయాలు విశ్వానికి ఆదర్శనీయాలు. అంటే ప్రామాణికం క్రియా విశేషమా? ప్రామాణికం భాష విశేషణమా? ప్రామాణికం నియమమా? ఈ అన్నింటితో కలిపి మనిషి తన నుండి ఉద్భవించే భావం ఉద్భవించే ఫలితం ఉద్భవించే ప్రమాణం నలుగురు అనుసరించేలా ఉండాలి.

శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవే. మెదడు, గుండె, కాలేయం, జీర్ణావయవం వంటి లోపలి అవయవాల కన్నా బాహ్య అవయవాలకే ప్రాముఖ్యత ఇస్తున్న సమాజాన్ని చూస్తున్నాం. రంగు,ఎత్తు, లావు, సన్నం వంటి విశేషణాలతోనే మనిషిని మనిషిగా గుర్తిస్తున్న రోజువి. ఈ బాహ్య అవయవాల రూపు సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం మిన్న . ఒక వస్తువు ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఉపయోగించే మాటను ప్రామాణికమంటాం. ఇది కేవలం వస్తు గతమైనది.ఇది సూత్రం వంటిది.వస్తు శ్రేష్టతకు Standard గా ఉన్నది అని చెప్పడానికి ఉపయోగించేది.
మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి ఆమోదయోగ్యమైంది ఇదీ అని చెప్పేది ఏంటి ? చెప్పగలిగేదేంటి? ఒక టచ్! రక్తానికి ఉన్నటువంటి స్వచ్ఛత!

మాటల్లో డాంబికత చూపిస్తూ, చేతల్లో డొల్లతనం బయటపడటం చాలామందిలో చూస్తుంటాం. అందుకే చేయగలిగేవి చెప్పాలి చేసినవే చెప్పాలి అని ఒక నియమాన్ని పెట్టుకుంటారు చాలామంది గొప్ప వ్యక్తులు. జీవితంలో పాటిస్తుంటారు చివరి క్షణం వరకు…..! అయితే చెప్పినవన్నీ చేయడానికి వీలు కాకపోవచ్చు. ఆచరణలో సాధ్యం కాకుండా కనీసం ఆలోచనలోనైనా నిబద్ధత ఉండాలి కదా? ఈ నిబద్ధత అంటే ఏంటి? చట్టాలకు అందని చట్టాలకు లొంగని చట్టాల అవసరం లేని కొన్ని మానవీయ విలువలు ఉంటాయి. ఎదుటి వ్యక్తితో ప్రేమగా ఉండడం, అందరిని గౌరవించడం , ఆడిన మాట తప్పకపోవడం, జీవితం తెరిచిన పుస్తకంలా ఉండడం పంటి గుణాలకు ఇదే ఇంతే అనే కొలతలుండవు. ప్రామాణికత అనే ఫీలింగ్ ను ఏ కొలమానం లో చూపించేది ఉండదు కానీ , ప్రామాణికమైన దృష్టి తప్పకుండా ఉంటుంది. ఏ కొలమానాలకు అందని భావగర్భ విలువలు ఉంటాయి. అందరికీ ఆమోదయోగ్యమైన,విద్యావంతుల, విజ్ఞానవంతుల బోధనల వలె, శోధనల వలె, సాధన లవలే ఉంటాయి కొన్ని….. ప్రామాణికాలు! స్త్రీలకైనా పురుషులకైనా … రోల్ మోడల్స్ గా నిలవడానికి హృదయపూర్వక ప్రమాణాలు…! సహేతికమైనవి …! తప్పకుండా రెఫెరెన్స్ పాయింట్స్ లాగా తీసుకుంటారు.
దీన్ని మరికొంత విస్తృతి తో చూస్తే, మన రాజుల కాలంలో సాయంత్రం , సూర్యాస్తమం తర్వాత యుద్ధాన్ని విరమించి మళ్లీ సూర్యోదయం తర్వాతనే ప్రారంభించాలి అని. కుయుక్తులు చేసే వాళ్ళు మోసంతోనే ఆపోజిట్ వారితో వ్యవహరించడం…అంటే వాళ్ళ శత్రువుని హతమార్చడం అనేది చూసాం మనం. కానీ కార్యక్రమాల్లో ఎన్నో మార్పులు సంభవించి యుద్ధాలనేవి అప్రకటితంగా కూడా చేస్తున్నారు. రాజ్యాల మధ్యనే దేశాల మధ్యనే ఇటువంటివి ఉన్నప్పుడు మానవమాత్రుల జీవితాలలో చెప్పనక్కర్లేదు. మనుషుల మధ్య మానవ సంబంధాల మధ్య శాశ్వతంగా నిలిచి ఉంటాయా? ఉండవు! ఇదేమైనా బ్యానర్ కట్టినట్టా? ఇదేమైనా ర్యాలీలను నిర్వహించినట్టా? సెంటీమీటర్లు సెంటిమెంట్స్ వంటివా….. మిల్లీమీటర్లు మేనరిజమ్స్ వంటివా?
భార్యాభర్త ల సంబంధాలు సోదర సోదరీ ప్రేమలు తల్లిదండ్రుల ఆప్యాయతలు స్నేహితుల మధ్య సత్సంబంధాలు లెక్కలోకి తీసుకున్నప్పుడు.. లెక్కల ఎగుడు దిగుడు లేకుండా సాగడమే ప్రామాణికం.
కావలసిన వ్యక్తులకు దగ్గరి వాళ్లకు అయిన వాళ్లకు ఎంత దూరం వెళ్ళినా సరే ఎన్ని కష్టాలు పడైనా సరే సాయ శక్తుల సాయం చేయడం ఈ కొలతలకు లొంగదు.
అటువంటిదే అత్తా కోడళ్ళ మధ్య ఈ డిస్క్రిమినేషన్స్ లేకుండా ఉన్నప్పుడే మామ అల్లుళ్ళ మధ్య ఏ డిస్క్రిమినేషన్స్ లేకుండా ఉన్నప్పుడే నెక్స్ట్ జనరేషన్ కి గట్టి పునాది పడుతుంది. ఎక్కువ తక్కువలు కొలతలు కుటుంబాల్లో ఉండకూడదు. ఆయా సమస్యలను బట్టి ఆయా అవసరాలను బట్టి ఆయా మంచి చెడులను బట్టి మార్పులు జరుగుతుంటాయి చూడాల్సింది కేవలం నిజాయితీ ఒక్కటే….! నేల విడిచి సాము చేయలేము అన్న నిజాన్ని గుర్తుంచుకున్నప్పుడు కుటుంబాలు నిలుస్తాయి.

అవసరాలే మనిషి నడిపిస్తున్నాయా? ఇది జవాబు దొరకని ప్రశ్న! లిట్మస్ టెస్ట్ వంటిది….
వస్తు వినిమయంలో
వ్యాసాన్ని, నిడివిని, లోతుని , మందాన్ని నిర్ధారించే నిర్దిష్ట కోణాల్ని నాణ్యతను చెప్పేటువంటి సాధన కాదు మనిషి ప్రామాణికత…
వీటన్నింటికీ అందనంత ఎత్తులో వీటన్నింటికీ లొంగనంత ఎత్తులో ఎక్కడో
ఎలాగో
అంతు పట్టని అనధికార కొలమానం…..
అనిర్వచనీయ స్వాభిమానం
జీవన ప్రమాణం…..,,!!
వందేళ్ళా,?పదేళ్ళా?
యవ్వనమా,? నడివయస్సా? వృద్ధాప్యమా?
వ్యవస్థీకృత ద్రవ్య వ్యవస్థ నుండి
మానవ నిర్మిత కుటుంబ వ్యవస్థకి
అంతులేని వెలుగుల ప్రస్థానం వరకు….. ప్రామాణికం… ప్రామాణికం… ప్రామాణిక…
ఏది ?ఎందుకు? ఎలా?
__***_

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

Modern Indian working women