కొత్తగా పెళ్ళిచేసుకుని వచ్చిన మాధురికి అత్తగారిల్లు చూడగానే అయోమయంగా అనిపించింది… ఏదో తిన్నాము అన్నట్లు ఉంటారు… లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవడం…మామగారు రిటైర్ అయ్యారు… ఆయనకి ఒక రూమ్ అందులో టి వి… అత్తగారు, ఆమె తల్లి మధ్య హాల్లో ఉంటారు… అత్తగారి తల్లి మంచంలోనే ఉంటుంది… అన్నీ చేతికి ఇవ్వాలి…ఇద్దరూ తెలుగు హిందీ సీరియల్స్ కలిపి రాత్రి పది గంటల వరకు చూస్తూనే ఉంటారు…
తమది పెద్దలు కుదిర్చిన వివాహమే.. ప్రశాంత్ ది ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం… పెళ్ళిచూపుల్లోనే చెప్పాడు ఆమె ఉద్యోగం చెయ్యటం తనకు ఇష్టం లేదని…తన ఇంటి పరిస్థితి తెలిసిన ప్రశాంత్ ఆవిషయం చెప్పకుండా తనకే ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని చెప్పాడు…తనకు ఎప్పుడూ ఒక మంచి గృహిణిగా ఉండాలని కోరిక… అదే మాట ఇలా వినడం నెత్తిన పాలు పోసి నట్లుగా అనిపించి ఒప్పుకుంది…మొదటి రాత్రి తన ఇంటి వ్యవహారం చెప్పాడు… ఈ ఇల్లు అమ్మమ్మది అనీ, అమ్మ ఒక్కతే కూతురనీ, అన్నిటికీ తను సర్దుకు పోవాలని… నీకు వీలైతే ఇంటి వాతావరణం మార్చు అంటూ హింట్ ఇచ్చాడు… బలాదూరుగా తిరిగే మరిది శ్రీకాంత్… ఉద్యోగం లేదు… బి టెక్ చదివినా ఉద్యోగం చెయ్యడు… బయటి వ్యాపకాలు ఎక్కువ…
డిగ్రీ చదివి ఎమ్ బి ఎ పూర్తి చేసిన మాధురి, ఒక గృహిణిగా ఆ ఇంట్లో కాలు పెట్టింది… బ్రేక్ ఫాస్ట్, కూరలు బయటి నుంచి వస్తాయి… అన్నం మాత్రం వండుకుంటారు… టి వి సీరియల్లో వంట చెయ్యని అత్తగారిని మాత్రం, ఇద్దరూ తిట్టుకుంటూ కూర్చుంటారు… వింతగా అనిపించింది తనకు…
ఇలా పనీ పాటా లేకుండా కూర్చోవడం, తనకు నచ్చటం లేదు… ఒక రోజు భర్తని అడిగింది…”ఇక నుంచి రోజూ నేను వంట చేస్తాను..”
“అందరూ పని చెయ్యకుండా సినిమాలూ, షికార్లూ,పార్లర్ల చుట్టూ తిరగడం చేస్తారు… నువ్వేంటి ఇలా ?” అంటూ నవ్వాడు…
“అయినా నీది ఒంటరి పోరాటం అవుతుంది… ఇక్కడ ఎవరూ అంతగా పాటించరు జాగ్రత్త సుమా” అని హెచ్చరించాడు…
“మీరు అవసరం అయిన సహాయం చెయ్యండి చాలు…” అంటూ తన నిర్ణయం చెప్పింది…
“ఓకె “అంటూ తంబ్ చూపించాడు ప్రశాంత్…
మరుసటి రోజు అత్తగారితో చెప్పింది…”ఈ కూరలు ఇలా బయట నుండి వద్దు అత్తయ్యా! నేను వంట చేస్తాను ఈ రోజు నుంచి”
సీరియల్లో మునిగి ఉన్న అత్తగారు మొహం పక్కకి తిప్పి, “ ఇదుగో అమ్మాయ్! నీ ఇష్టం… నాకు మాత్రం పని చెప్పకు…” అని అన్నది…
ఏమనాలో తెలియక, తల ఊపి లోపలికి వెళ్ళింది మాధురి…పనిమనిషిని పిలిచి వంట గది శుభ్రం చేయించింది… రోజూ చేసే పనులు కాకుండా ముందుగా కూరగాయలు తరిగి ఇవ్వాలని చెప్పింది…
అది డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్… ఫస్ట్ ఫ్లోరులో మూడు బెడ్ రూములు ఉన్నాయి… అందులో ఒక రూమ్ తమది, ఒకటి మామగారిది, ఇంకొకటి ఊర్లో ఉన్న ఆడపడుచు పద్మది… ఆడపడుచు ప్రతి వారం వస్తూనే ఉంటుంది…సెకండ్ ఫ్లోరులో పెంట్ హౌసులా, ఒకే రూమ్ వేసారు… అది మరిది రూము… అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ, ఎవరి లోకం వారిదే అన్నట్టుగా వుంటారు… మామగారికి రాజకీయాలు, అత్తగారు, ఆమె తల్లిగారలకు సీరియల్స్, మరిదికి సినిమాలు… వింత ప్రపంచంలో వున్నట్టుగా వుంది… తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది ఈ ఇంట్లో పరిస్థితి… పాత సినిమాల్లో సావిత్రి బతుకులా ఉంది అనుకుని ప్రక్షాళన మొదలు పెట్టింది మాధురి…
కిచెన్ లో ఒక ప్రక్కన ఉన్న దేవుడి బొమ్మలు అన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపారాధన చేసింది… మామగారు రోజూ కాసేపు తోట పని చేస్తారు… ఆ కాస్త జాగాలోనే ఎన్నో పూలు… అవి కోసి పూజ చేసింది… రోజూ అందరూ పాలల్లో బ్రూ కలుపుకుని త్రాగుతారు…. అలా కాదని ఫిల్టర్ వేసి అందరికీ కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో పెట్టుకుని, తీసుకు వెళ్ళి ముందు మామ గారికి ఇచ్చి, తరువాత అత్తగారికి, మామ్మగారికి ఇచ్చింది…
“కాఫీ సూపర్” అంటూ అత్తగారు ఈమోజీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది… “ అమ్మాయి! అచ్చం కొంగు ముడి సీరియల్లోలా తెచ్చావు… బాగుంది…” ఆమె మెచ్చుకున్నది సీరియల్నా, నన్నా, ఒకింత ఆశ్చర్యపడుతూ, ఒక పిచ్చి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది…
ఇంకా పిండి అదీ రుబ్బుకోలేదని, గోధుమరవ్వ ఉప్మా అన్ని కూరగాయలు, జీడిపప్పు, బఠాణీలు వేసి చేసింది…ఆ రోజు ప్రశాంత్, శ్రీకాంత్, మామగారు వెంకట్రావు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు… టేబుల్ పైన ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి రెండు గులాబీలు పెట్టింది… మామగారు ఆ పూలని చూసి ఆమె అభిరుచికి మెచ్చుకున్నారు…
రోజూ ఆఫీసులో తినే ప్రశాంత్ కు ఆనందంగా ఉంది…ఒక ఇంటిని స్వర్గం చేసినా, నరకంగా మార్చినా స్త్రీ చేతిలోనే ఉంటుంది అని అనుకున్నాడు… “ఏమండీ! రేపటి నుండి మీకు లంచ్ బాక్స్ కూడా ఇస్తాను…” అన్నది…
“మాధురీ ఏమైనా కొనాలంటే తీసుకో…” అంటూ కొంత డబ్బు ఇచ్చాడు…
అత్తగారికి, మామ్మ గారికి టిఫిన్ పెట్టి, తరువాత పనిమనిషికి పెట్టి, తను కూడా తిన్నది…
మధ్యాహ్నం వంటలో మామిడికాయ పప్పు, కంది పచ్చడి, బెండకాయ కూర, చారు చేసింది… అత్తగారితో ఆమె సీరియల్స్ భాషలో మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది…
మామ్మగారికి అన్నం పెట్టి, కాసేపు టి వి ఆఫ్ చేసింది… సీరియల్ తరువాత హాట్ స్టార్ లో చూడవచ్చు ప్రశాంతంగా తినమని చెప్పింది…
“అమ్మాయి! నీ కోడలు వంట బాగా చేసింది… ఉదయ రాగం సీరియల్లోలా పనంతా ఒక్కతే చేస్తోంది… కంది పచ్చడి పేరు కూడా మరచి పోయాను…” అని కూతురుతో చెపుతూ, తన వైపు తిరిగి “వంట బాగా చేసావు మాధురీ…” అంటూ మెచ్చుకుంది మామ్మగారు…
సీరియల్స్ చూస్తూ బద్దకంతో కదలని శరీరాలు వాళ్ళని అశక్తులుగా మార్చాయి… అందుకే పని చెయ్యకుండా ఇలా తయారయ్యారు…
అత్తగారికి, మామగారికి, వెండి కంచాలు పెట్టి వడ్డించింది… కొంగుముడి సీరియల్లో కొత్త కోడలులా ఉంటుంది అనుకున్న తనకు ఇంత మంచి కోడలు వచ్చినందుకు మనసులో సంతోషిస్తూ, తృప్తిగా భోజనం చేసింది విజయ…
వాళ్ళలో మార్పు చూసి తను ఇంటిని మార్చగలను అనుకుంది మాధురి…
ఈ రచన నా స్వంతం… ఎక్కడా ప్రచురించలేదు..
షామీర్ జానకీదేవి
హైదరాబాద్
9394611037