బావండీ!

మాలా కుమార్

“మనసెరిగి మసలు కునే వాళ్ళేమన వాళ్ళు.” అప్పటికి లక్షా తొంభై సార్లు… కాదు కాదు కోటీ థొంభై షార్లు… ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు అనుకున్నాడు రంగారావు. కళ్ళల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తామూ అని మారాము చేస్తున్నాయి. గొంతు గురఘురా అంటోంది. చీ… తన బతుకెంత అధ్వానం అయిపోయింది? తనేమన్నా చిన్నా చితకా వాడా? ఆకుపచ్చ సంతకాలు చేసిన గెజిటెడ్ ఆఫీసర్! హిప్పుడు చప్రాసీ అయిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? గత కొన్ని నెలలు గా జరిగిన దానికన్నా ఈరోజు జరిగింది గుండెను మండిస్తోంది. రిటైర్ అవుతే జీవితం ఇంతలా మారిపోతుందా? ఆ రోజు…

తన రిటైర్మెంట్ రోజున, తననూ, కాంతం నూ కూర్చోబెట్టి ఘనసన్మానం చేసారు. సహోద్యోగులందరూ తన గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. పెద్దపెద్ద దండలు వేసారు. శాలువా కప్పారు. హబ్బో ఆ ఫంక్షన్ తెలుచుకుంటేనే వళ్ళు ఉప్పొంగుతుంది. తనకు ఇష్టమైన వాటితో మంచి విందు ఇచ్చారు. ఇంటికొచ్చాక ఎవరికీ జరగనంత గొప్పగా తన రిటైర్మెంట్ పార్టీ జరిగిందని  తలుచుకొని మురిసిపోతుంటే “ఆ… అమ్మయ్య మనకు వీడి బాధ తప్పింది, అని అంత పార్టీ ఇచ్చారేమోలే” అని తీసిపారేసింది కాంతం. చుప్పనాతి శూర్ఫణక పోనీలే అని ఊరుకున్నాడు.

మరునాడు రోజులాగే పొద్దున్నే మెలుకువ వచ్చింది. ఆ అప్పుడే లేచి చేసేదేముంది అని కాసేపు అలాగే మంచం మీద అటూఇటూ దొర్లి, ఇక దొర్లలేక లేచాడు. కాంతం ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడే వచ్చిన పేపర్ చదివాడు. స్నానం అయ్యాక దండం పెట్టుకోవటమే కానీ రోజూ వారీ జపాలు, పూజ ఎప్పుడూ అలవాటు లేదు. కాసేపు వరండాలో అటూ ఇటూ అచార్లు, పచార్లు చేసి టిఫిన్ తిన్నాక ఇంకేం చేయాలబ్బా అని చించీ…చించీ కేబుల్ వాడికి అప్పనంగా కి బోలెడంత డబ్బుపోస్తున్నాము, ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు ఇక చూద్దాం అని టీ.వీ పెట్టాడు. ఎన్ని ఛానల్సో! ఎన్ని ప్రోగ్రాం లో! రోజంతా, రోజంతా ఏమిటీ రాత్రి దాకా ఛానల్స్ తిప్పీతిప్పి అర్ణబ్ వార్తలు, టీ.వీ వార్తలూ, అత్తకోడళ్ళ సీరియల్లూ హబ్బో అన్నీ  చూసీసీ…  అలవాటు లేని పని కావటం తో కళ్ళూ, వేళ్ళూ నొప్పులు పుట్టాక టీ.వీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అరే ఇదేదో బాగుందే! అందుకే అందరూ టీ.వీ కి అతుక్కుపోతారు అని ఆ ప్రోగ్రాం కే ఫిక్సైపోయాడు. తినటం, టీ.వీ చూడటం, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్, స్నాక్స్ తో సహా టీ.వీ ముందే సెటిల్డ్! ఇలా కొన్ని నెలలు గడిచాయి…

సడన్ గా కాంతం కు ఏమయిందో “ఊరికే మిడిగుడ్లేసుకొని టీ.వీ ముందు కూర్చోకపోతే మార్కెట్ దాకా వెళ్ళి కూరలు తేవచ్చుగా” అని సంచీ విసురుగా వళ్ళో వేసింది. కాంతం సణుగుడు భరించలేక కూరలు తెచ్చి ఇచ్చాడు. సాయంకాలం రామం ఏవో స్వీట్స్ పాకెట్స్ తెస్తే, అవేమిటీ నాకిటివ్వరా అని కొడుకును అడుగుతున్నా వినిపించుకోకుండా కోడలు అంజలి కొంగు చాటుగా పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.

ఇదేమిటీ ఎప్పుడూ లేని అలవాటు అనుకొని హాచర్యపోతూ “కాంతం  ఇదేమిటే అడుగుతున్నా పెట్టకుండాతీసుకుపోయింది?” రాత్రి భోజనానికి పిలిచిన కాంతం ను అడిగాడు.

“అన్ని ఆరాలూ కావాలి. అయినా ఇప్పుడు నీ తిండికే లోటు వచ్చింది?” విసుక్కుంటూ కంచంలో రెండు ఫుల్కాలూ, పక్కన ప్లేట్ లో ఏవో కూరగాయముక్కలూ, గ్లాస్ లో మజ్జిగ పెట్టింది.

“ఈ రొట్టెముక్కలు, పచ్చి కూరగాయలు, మజ్జిగ ఏమిటీ? నేనెప్పుడైనా తిన్నానా? ఎన్నడైనా పెరుగు తప్ప మజ్జిగ పోసుకున్నానా?” కోపంగా అరిచాడు.

వినిపించుకోకుండా మనవడికి తినిపించటం లో ఉండిపోయింది.

అదిమొదలు తన తిండి ఖనాఖష్టం అయిపోయింది. స్వీట్స్ తనకు పెట్టకుండా దాచుకోని తినటం, తనకిష్టమైన పూరీలు అవీ కూడా తన ముందే తనకు పెట్టకుండా మనవడికి పెట్టటం ఇలా బోలెడు మార్పులు తన తిండిలో. అప్పటికీ ఉక్రోషం ఆపుకోలేక “నేనేమైనా పశువునా ఈ గడ్డీగాదం తింటానికి?” అని అరిచినా పట్టించుకున్న వాళ్ళే లేరు. సాత్వికులైన కొడుకూ కోడలు మారిపోయారు. “నా కొడుకు అమాయకుడమ్మా, వాడికి కాస్త తిండిపుష్ఠి ఉన్నదని వాడి మనసెరిగి కావలసినవి చేసిపెడుతూ, కాస్త కనిపెట్టుకొని ఉంటావని నీ చేతిలో పెడుతున్నానే కోడలుపిల్లా” అని అమ్మ మేనకోడలికి తనను అప్పగించినప్పటి నుంచీ ఏదో అప్పుడప్పుడు అరవటం తప్ప ముద్దుగా చూసుకుంటున్న కాంతం సూర్యకాంతం పేరును సార్ధకం చేసుకుంటూ ముందే కాస్త గట్టిదేమో ఇప్పుడు మరీ గంపగయ్యాళమ్మ అయిపోయి కొడుకుకు, కోడలికి వంతపాడుతోంది. పైగా “ఎద్దులా కూర్చున్నావు. కాస్త మనవడిని పార్క్ కు తీసుకెళ్ళి ఆడించవచ్చుగా” అని కూడా కసురుకుంటోంది మొగుడన్న మర్యాదలేకుండా! అందుకే మావకూతురిని పెళ్ళి చేసుకోకూడదు. ఇట్లాగే నెత్తినెక్కుతారు. ఇప్పుడనుకొని ఏమి లాభం!

అంతటితో తన కష్టాలు  ఆగలేదు, “ఎప్పుడూ ఆ టీ.వీ ముందు కూర్చొని అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూడకపోతే చెట్లకు నీళ్ళుపోసి, తోట పని చూసుకోవచ్చుగా రెండురోజుల నుంచి మాలి రావటం లేదు. పెరట్లో కూరగాయల మడులు, ముందు పూల మొక్కలూ ఎండిపోతున్నాయి. ఏదీ పట్టదు దిష్ఠిబొమ్మలా హాల్ మధ్యలో కూర్చున్నావు” అని చిరాకు పడ్డాడు రామం.

అట్లా ఒక్కొక్కపని తనకు అప్పగించారు. పకోడీల వాసన వస్తుంటే హబ్బా తనకిష్టమైన పకోడీలూ హూ అని వంటింట్లోకి వెళ్ళాడు. మీకిక్కడేమి పని బయటకెళ్ళండి అని తరిమింది అంజలి. హంతే తనకు పౌరుషం వచ్చేసింది. “రామం” భీకరంగా అరిచాడు.

ఆ అరుపుకు అదురుబెదురు లేకుండా గదిలో నుంచి బయటకు వచ్చి “ఏమిటీ” అడిగాడు థాఫీగా.

“ఆ మధ్య నా బాంక్ పాస్ బుక్ తీసుకున్నావు అది ఇటివ్వు. ముద్దకుడుముల్లా నా పెన్షన్ బోలెడు మీ చేతుల్లో పోస్తుంటే నాకుతిండి పెట్టకుండా గొడ్డు చాకిరీ చేయిస్తూ హీనంగా చూస్తున్నారు. ఇంకా ఊరుకునేదిలేదు. నాకన్నా ముందే మీ అమ్మ డబ్బులు తెచ్చేసుకుంటోంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తోంది.నా ఎకౌంట్ మీ అమ్మతో జాయింట్ కాకుండా నా పేరు మీదకే మార్చుకుంటాను. నాకు కావలసినవి తెచ్చుకుంటాను. హోటల్ కు వెళ్ళి తింటాను.అప్పుడు కుదురుతుంది మీ తిక్క.నువ్వు పాస్ బుక్ ఇవ్వకపోయినా బాంక్ కు వెళ్ళి మార్చుకోగలను ఏమనుకుంటున్నారో ఖబడ్ధార్” ఆయాసపడిపోయి, ఖళ్ ఖళ్ మని కాస్త దగ్గాడు కూడా!

“ఓయబ్బో మహా వచ్చాడండీ.ఆ పని నువ్వు చేస్తే ఇదో ఈ ఫాన్ కు ఉరేసుకొని చస్తా. దయ్యమై నిన్ను పీడిస్తా” కళ్ళు పెద్దగా చేసి, చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.

ఒక్క క్షణం బిత్తరపోయి, ఇంక ఏమి మాట్లాడలేకవిసురుగా బయటకు వచ్చి మొక్కలల్లో గడ్డిని పీకుతూ కూర్చున్నాడు. పక్కింటి ఛాయమ్మ ఎందుకో బయటకు వచ్చి తనను చూసి “ఇదేంటన్నయ్యగారూ, వేళకాని వేళ గడ్డి పీకుతున్నారు? చాయ్ తాగారా?” అడిగింది.

ఆప్తురాలు దొరికినట్లుగా తన ఘోషను వెళ్ళబోసుకుంటుంటే “ఏమిటో నండి ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు” అని సానుభూతిని చూపిస్తున్న ఛాయమ్మను భర్త రమణారావు వచ్చి “నీకెందుకూ లోపలికి రా” అనిగడకర్రలాగాలికి ఊగిపోతూ పిలుస్తూనే ఉన్నాడు లోపలి నుంచి కాంతమ్మ వచ్చింది.

“బజార్ లో పక్కింటోళ్ళతో పంచాయితీ పెట్టిస్తున్నావా?దేభ్యమొహం వేసుకొనిఆడోళ్ళతో నీకేమిటి మాటలు? ఏందమ్మా ఛాయమ్మ నా కాపురంలో నిప్పులు పోస్తావా?” అని అరిచేస్తుంటే ఛాయమ్మ ఊరుకుంటుందా? ఇద్దరూ చేతులు తిప్పుకుంటూ పెద్ద గొంతులేసుకొని అరుచుకుంటుంటే తను ఆ గంపమ్మ కథ చూడలేకఇదో ఇట్లా వచ్చి, పార్క్ లో  వేపచెట్టుకింద బెంచీ మీద కూలబడ్డాడు.

అవును ఏ రచయత అన్నాడో కానీ “మనసెరిగి మసలు…కునే వాళ్ళే మన వాళ్ళు.” వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని మళ్ళీ లెక్కపెట్టలేనన్నోసారి అనేసుకొని, పరిపరి విధాల చింతిస్తూ, ధుఃఖిస్తూన్న రంగారావు నెత్తిన ఠప్ మని ఓ వేపకాయ, ఆ వెనువెంటనే ఓ వేప రెమ్మ వచ్చి నెత్తిన పడ్డాయి. అవి చూడగానే, అప్పుడే కాంతగంపమ్మ ఉరేసుకున్నట్లూ, దయ్యమై తనను ఘట్టిగా పట్టేసుకొని ఖంగాళీ నృత్యం తనతో చేయిస్తున్నట్లూ, మంత్రాల మాంచారయ్య వచ్చి వేపకొమ్మలతో కసాబిసా బాదేస్తున్నట్లూ, గంపమ్మ వికట్టాట్టహ్హాసం చేస్తున్నట్లూ ఊహ వచ్చేసి వణికిపోయాడు రంగారావు. అంతలోనే తెలివి తెచ్చుకొని చుట్టూ చూసాడు. పార్క్ లో అందరూ వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న మనవడు కూడా లేడు. వెధవ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? ఇహ ఇప్పుడేమి గోల ఉందో కొంపలో నిట్టూరుస్తూ, అయినానేనెందుకు వీళ్ళకు భయపడాలి?  అసలు ఆ చావేదో నేనే చచ్చి వీళ్ళను పీడిస్తే! మంత్రాల మాంచారయ్య వీళ్ళను చితక బాదాలి.తను భీకరంగా నవ్వాలి.  వళ్ళో పడ్డ వేపకాయను నలుస్తూ, కాసేపు ఏ విధంగా చస్తే బాధలేకుండా చావొచ్చా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలతోనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.

“ఇంతసేపటి వరకు ఎక్కడికెళ్ళావు?” గయ్ మంది కాంతమ్మ.

కాంతమ్మను నిర్లిప్తంగా చూసి, లోపలి నుంచి నిద్ర మాత్రల సీసా తెచ్చి చూపిస్తూ “నేనింక నీ కడవళ్ళు భరించలేను. ఈ మాత్రలు మింగి చస్తాను” అని చేతిలోకి సీసా వంపుకొని, మంచి నీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ, మనవడు, కొడుకు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద పొగలు చిమ్ముతూ అన్నం, ముక్కుపుటాలను అధిరిస్తూ ఘాటుఘాటు కొత్తావకాయ, కొద్ది దూరం లో చెరుకు రసాలు కనిపించి నోరూరించాయి. అవి తిని చద్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిచ్చికానీ ఈ రాక్షసులు  తనను తిననిస్తారా విరక్తిగా అనుకొని వాటి వైపు చూడకుండా మనసును అదుపు చేసుకుంటూ,కళ్ళుమూసుకొని నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు.

“బావండీ…”

“డాడీ…”

“మామయ్యగారూ…”

“తాతయ్యా…”

అందరూ గగ్గోలుగా అరిచారు. పక్కింటి నుంచి రమణారావు, ఛాయమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. రమణారావు, రంగారావు చేతిలోనుంచి మాత్రలు గుంజుకొని “ఏం పనిది” మందలింపుగా అన్నాడు.

“మీకు తెలియదు వీళ్ళు నాకు తిండిపెట్ట కుండా ఎంత హింస పెడుతున్నారో, చాకిరీ చేయిస్తున్నారో” అన్నాడు ఉక్రోషంగా.

“బావండీ నన్ను క్షమించు బావా క్షమించు” రంగారావు చేతులు పట్టుకొని బాధగా అంది కాంతం.

“దీని దుంపతెగ ఇప్పుడూ కాళ్ళు కాకుండా చేతులు పట్టుకుంది హెంత గీర” మనసులో అనుకొని “క్షమించను పో” అన్నాడు రంగారావు మరింత గీరగా!

“నాన్నా అదికాదు, అసలు సంగతేమిటంటే అయిదు నెలల క్రితం నువ్వు టీ. వీ చూస్తుండగా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో” రింగులు తిప్పాడు రామారావు.

“ఆ …ఇప్పుడు రింగులు తిప్పి అంత హవస్త ఎందుకు కానీ, బావండీ ఆరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అట్లా రెండు సార్లు జరిగే సరికి నిన్ను రామం డాక్టర్ కు చూపించాడు. అన్ని టెస్ట్ లూ చేసి, నీకు బీ.పీ బాగా పెరిగిందనీ, షుగర్ బార్డర్ లోకి వచ్చిందనీ, బరువు 200 కిలోలు పెరిగావు, బరువు తగ్గాలనీ జాగ్రత్త పడాలనీ చెప్పాడు గుర్తుందా?కుర్చీలో నుంచి లేవటానికీ, నడవటానికీ ఇబ్బంది పడ్డావు. పైగా ఆ శంఖుమార్క్ లుంగీలు వదలవు. గడ్డం చేసుకోమన్నా చిరాకు పడిపోతూ ఎంతసేపటికీటీ.వీ ముందు నుంచి లేవవు. అక్కడికే రకరకాల రుచులతో స్నాక్స్ కావాలి.ఎంత చెప్పినా నీకు తిండియావ తగ్గదు.”

“వాకింగ్ కు వెళ్ళమంటే వెళ్ళవు.”

“అమ్మాయ్ అంజలీ నువ్వు మీ అత్తయ్యా ఓసారి ఈ సీరియల్ లో లాగా పోట్లాడుకోండి అని సరదా పడిపోయారు.”

ఒకళ్ళ తరువాత ఒకరు చెప్పుకుంటూ పోయారు.

“భారీ ఏనుగులా వళ్ళు పెంచేసావు. తాతయ్య కు బీ.పీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి ఎన్నాళ్ళో మంచాన తీసుకొని తీసుకొనిపోయాడు. బామ్మా, తాతయ్యషుగర్ ఎక్కువ అయ్యి గుండెపోటుతో పోయారు. నీకు ఆ పరిస్తితి రాకూడదని ఎంతో  ఆలోచించి ఈ ప్లాన్ వేసాము. ఇప్పుడు చూడు నువ్వు గున్న ఏనుగులాగా కాదు బుజ్జి ఏనుగుసైజుకు వచ్చావు. నీకోసమే డాడీ ఇదంతా నీ కోసమే”  బాధగా పిడికిలి నోటికి సుతారంగా ఆనించుకొని, మొహం బాధగా పెట్టిఅన్నాడు రామారావ్.

“అవును మామయ్యగారు అట్లా మాట్లాడినప్పుడల్లా ఎంత బాధ పడ్డామో తెలుసా” చేతులు నలుపుకుంటూ, కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది అంజలి.

“బావండీ నిన్ను చూసినప్పుడల్లా మాయాబజార్ లోని ఘటోత్కచునిలా కనిపించి ఎంత దడుచుకునే దాన్నో తెలుసా? ఉమ్మడి కుటుంబం లో యమధర్మరాజులాగా దున్నపోతెక్కి యముండ అని భీఖరంగా అరుస్తూ యమధర్మరాజు వస్తుంటే నిన్ను కాపాడాలని ఆ సావిత్రిలా నీతో ఈ నిరాహార దీక్ష హెంత నిష్ఠతో చేయించాను” అంటూకాంతం కొంగు నోట్లో కుక్కుకుంటూ ఆపసోపాలు పడుతోంది.

హోరినీ హిదా సంగతి అని రమణారవు, ఛాయాదేవి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.

శుభం కార్డ్ పట్టుకొని తన చుట్టూ నిలుచున్న అందరి మొహాలు ఒకటొకటిగా స్లో మోషన్ లో చూసాడు. చిన్నగా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు…

“అమ్మాయ్ ఆ రెండు చెరుకు రసాలు ఇటందుకో”అంటూకంచం దగ్గరికి జరుపుకున్నాడు…

వేడి అన్నం, ఆవకాయ కంచంలో తోడుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్న వెన్న ముద్దను చేతిలోకి తీసుకొని మొత్తం వేసేసుకున్నాడు…

అన్నం కలిపాడు…

గుండ్రాయంత ముద్దను చేసి, ఆబగా నోటి దగ్గరగా తెస్తుంటే…

“బావండీ…”

“డాడీ…”

“మామయ్యగారూ…”

“తాతయ్యా…”

“రంగారావ్…”

“హన్నయ్యగారు…”

ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా, చేతిలోని ఆవకాయ ముద్దను మురిపెంగా చూసి, ఘాఠ్ఠిగా వాసన పీల్చి, ఆ ఘాటుకు, ముక్కు, కళ్లు ధారలు కారుతుండగా అందరి వంకా చిద్విలాసంగా చూసి, నోట్లో కూరుతూ, ఆహా ఇది కదా “స్వర్గం అంటే” తన్మయంగా అన్నాడు.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తిశ్రగతి

ఇంటిదేవత