దాతృత్వం

వ్యాసం

          కామేశ్వరి

దాతృత్వం అంటే మానవజాతి యశస్సును పెంచడానికి ధర్మకతృత్వ సహాయం లేక అభిరుచి. మానసిక ఆనందానికి కూడా దోహదపడుతుంది. క్రమబద్ధమైన ఏ పనైనా కొన్ని ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అదేమిటంటే ప్రకృతి కొన్ని నియమాలను ఏర్పరచి తాను పాటిస్తూ మనకు కూడా మార్గదర్శకమవుతోంది. ఒకసారి ప్రకృతిని పరిశీలించండి… దానికి ఇవ్వడమే కానీ తీసుకోవడం చేతకాదు. మనం పాడు చేసిన దానిని కొంతవరకు బాగు చేస్తుంది కూడా. ఒక చెట్టును చూడండి అది మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. అలాగే మట్టి,గాలి, నిప్పు నీరు ఏమీ ఆశించక నిజమైన దాతృత్వాన్ని చూపుతున్నాయి. లాభాపేక్షను ఉపేక్షిస్తాయి. ఆఖరికి మన శరీరాన్ని కూడా గమనించండి. లోపల ఉన్న అంతర్గతవయాలు ఈ శరీరాన్ని నిలబెట్టడానికి ఎంతలాగా సహాయపడుతున్నాయో కదా. ఇది మనం నిత్యం తీసుకునే దాతృత్వం. ఈ దాతృత్వం భూమిపై ఉన్న సమస్తానికి ఉంది మనం గమనించంగాని.
ఇక మానవుల విషయానికొస్తే దాతృత్వం ఒక పుణ్యకార్యంగా ఉండేది పూర్వపు రోజులలో.ఒకరికి పెడితే మనకు భగవంతుని మరల ఇస్తాడని ధార్మికమైన నమ్మకం ఉండేది.అందుకేమనపెద్దలు”పెట్టిపుట్టాడు”అనేవారు. ఎందరో మహారాజులు ప్రజల కొరకు ఎన్నో ధార్మికమైన పనులు చేసేవారు. పురాణాల్లోకెళ్తే బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, కర్ణుడు, ఇలా ఎందరో ఎందరో మనకు ఆదర్శంగా కనిపిస్తారు. చిన్నప్పుడు వారి కథలు మనకి పెద్దలు బోధించి మనలో దాతృత్వాన్ని నింపడానికి అలవాటు చేసేవారు.ఆ రోజులలో రవాణా సౌకర్యములు అంతగా లేనందున మన పూర్వీకులు కూడా ఊరు ఊరికి సత్రవులు కట్టించి బస, భోజనం ఏర్పాటు చేసేవారు. భారతదేశంలో నాటి నుండే దాతృత్వము నర నరాలలో జీర్ణించుకుపోయి ఉంది.
దాతృత్వం ఇంటి నుండే ప్రారంభించవచ్చు. ఎలాగంటే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ ఒక్కరికొకరు అర్థం చేసుకుని ఉంటే… ఇంట్లో గొడవలు రాకుండా చూసుకోవడం కూడా ఒక గొప్ప దాతృత్వమే. అలాగే సంఘంలో కూడా. కుటుంబ పోషణ కూడా ఒకరకంగా ధాతృత్వమే.”మాటే మూట “అంటారు మన పెద్దలు కదా. మాట సహాయం కూడా సంపదే.
దానధర్మాలనే దాతృత్వం అని కూడా అంటారు. కానీ దానం మన శ్రేయస్ కొరకు,ధర్మం ఇతరుల శ్రేయస్సు కొరకు అంటారు. కొన్ని దానాలు ఇస్తే మనకు గ్రహదోషాలు కూడా పోయాయి అంటారు కొన్ని పుణ్యం తెస్తాయి అంటారు కదా. దానగుణాన్ని మన పెద్దలు చిన్నతనం నుంచి రంగరించి పోస్తారు ఉగ్గుపాలల. వీధిలోకి ఒక బిచ్చగాడు వస్తే ఒక దోసెడు బియ్యం వేయండి రా అనేవారు పెద్దలు. గంగిరెడ్డి వాళ్ళు వస్తే పాత బట్టలు ఇచ్చేవారు. పనివారికి, పాలిగాళ్ళకి సరే సరి. ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకోవడం కూడా దాతృత్వమే కదా. ప్రేమే దాతృత్వ రూపానికి మరో పేరు. జాలి దయ లేనిదే ఎవరికి ఏం ఇవ్వలేము. మన పెద్దలు “లేదు “అనే మాటను పలకడానికికూడాఇష్టపడక”ల” కు “ఏ”త్వము”ద”ఊ త్వము వద్దు అనేవారు.
నేటి ఆధునిక కాలంలో దాని రూపురేఖలు కూడా మారాయి. ఉదాహరణకి అపరిచితులకు ఒక చిరునవ్వు…. వ్యక్తిగత కృతజ్ఞతా లేఖ…, ప్రోత్సహించే కౌగిలింత…. ఊహించని ఫోన్ కాల్.. ఇలా ఆలోచనాత్మకమైన ప్రశంస పదాలు కూడా దానాలే. వాటిని మనం దాతృత్వంగా గమనించం. అది ఒక యాంత్రిక క్రియగా అయిపోయింది థాంక్స్,సారీ లాగా. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చడం, అస్వస్థత లో ఉన్న వారి గురించి ప్రార్థించడం ఇవన్నీ మానసిక దానాలు. ఇది మన కర్తవ్యం, బాధ్యతలనే కాదు మనలో ఉన్న ప్రేమ యొక్క సమృద్ధిని తెలియజేస్తుంది. మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుందంటారు పెద్దలు కర్మ సిద్ధాంతం ప్రకారం. ప్రేమ దాతృత్వం యొక్క అభివ్యక్తీకరణమే . ఇది చెట్టుకు తల్లి వేరు లాంటిది.
ఈ దాతృత్వంలో పేరన్నదగిన ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీటిని ఎన్జీవోలు కూడా అంటారు. ఇవి తరచుగా విద్య, ఆరోగ్యపరిరక్షణ,పేదరిక నిర్మూలన, పర్యావరణ సంరక్షణ, జంతు సంరక్షణ, అటవీ మృగ సంరక్షణ, ప్రకృతి విపత్తు నందు తక్షణ సహాయాలు చేస్తూ ఉంటాయి. వీరు ధనవంతుల నుండి సొమ్మును సేకరించి సహాయ సహకారాలు అందిస్తారు. కొంచెం ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉంటుంది. యుద్ధ భూములందు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఇందులో పేరన్నదగ్గరికి ” రెడ్ క్రాస్”సొసైటీ. మన తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక సంస్థలైన రామకృష్ణ మిషన్, ఇస్కాన్, సత్యసాయి సంస్థలు, ఇలా ఎన్నో దాతృత్వంలో తమ పాత్రను పోషిస్తున్నాయి. మన జీవితంలో దాతృత్వం జ్వాలలో ఒక ” స్పార్క్ “గా మారాలి. దాని కాంతి, వెచ్చదనం ద్వారా ప్రేమ మరింత ప్రకాశిస్తుంది.
నేటి కాలంలో సైన్సు వృద్ధి పొందడంతో మన శరీరావయాలను కూడా దానం చేస్తూ పదిమందికి ఉపయోగపడుతున్నారు. వీటిల్లో కళ్ళు, లివరు,గుండె, కిడ్నీలు, కూడా ఉన్నాయి.” బొన్మేరో ” కూడా క్యాన్సర్ కు వైద్యంగా తీసుకుంటున్నారు. ఇక రక్త దానం గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో శిబిరాలు ఏర్పాటు చెసి రక్తం తీసుకుంటున్నారు. ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ సహాయం ఇదే కదా. ఇప్పుడు ఇంటర్నెట్ హైపుల్ సహాయ సహకారాలు అందిస్తూ దాతకు గ్రహీతకు తక్షణ అనుసంధాన కర్తగా ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా సహాయం చిటికలో అందుతోంది.
కానీ వ్యక్తిగత దాతృత్వానికి కొంత హద్దులు ఉన్నాయి. ” తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము ” పెద్దలు ముద్దుగా చెప్పారు. అలాగని ఊరకుండక మనకున్నదానలో కొంత భావాన్ని దాతృత్వానికి ఉపయోగించాలి. దానివల్ల ఇంటా రచ్చ కూడా గెలుస్తాము. అప్పుడే సమాజంలో ప్రేమ నుండి అందరిని దగ్గరకు చేరుస్తుంది. నేడు నడిపే” ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా ఒక రకంగా ధార్మిక సంస్థలే అనాలి. నా అనే వాళ్ళు దగ్గర లేక బాధపడుతున్న నేటి ఆధునిక సీనియర్ సిటిజన్ కి ఇది ఒక వరప్రసాదం. ఇక అనాధ శరణాలయాలు చెప్పనే అక్కర్లేదు. ఇలా భారతదేశంలో అడుగడుగునా అన్ని రంగాలలో గొప్ప దానాలు చేసే గుప్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అవార్డులు రివార్డులు కూడా ఇస్తోంది.అలాంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరించవలసిందే. మనం మనసుతో చూడాలే కానీ లాయరు, డాక్టరు ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్యకార్మికులు, కార్ఖానాలలో పనిచేసే కార్మికులు, ఆఖరికి మన ఇంట్లో పనిమనిషి కూడా తమ దాతృత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు.” సొంత లాభం కొంత మానుకొని, పొరుగు వారికి తోడ్పడవోయ్ “అన్నారు గురజాడ వారు. వేసవిలో చలివేంద్రాలు పెట్టి దాతృత్వం చాటుకోవచ్చు, శీతాకాలంలో బీదలకు కంబళ్ళు పంచవచ్చు. ఇంటికి వచ్చిన వారికి గుక్కిడి కాఫీ నీళ్లు పోయడం కూడా ప్రేమతో కూడిన దాతృత్వమే.” డొక్కా సీతమ్మ గారు “అనే మహాదాత యొక్క పేరు నేటికి గోదావరి జిల్లాలో వినిపిస్తూ ఉంటుంది. రాత్రి పగలు అని తేడా లేక వచ్చిన వారందరికీ భోజనం పెట్టేదిట. దాతృత్వంలో ఒక దైవిక విషయం కూడా కలిపి” మానవసేవ మాధవ సేవ”తో సమానం ఇది ఇహపరాలకు దోహదమని మన భారత జాతి నమ్ముతుంది. ఇన్ని పరమార్ధాలు ఉన్నా దాతృత్వాన్ని మనకు వీలున్నంతలో ఆచరించడమే కాకుండ చేయగల వారితో చేయించడానికి ప్రోత్సాహం ఇవ్వవచ్చు. 10 చేతులు కలిస్తేనే కదా పెద్ద చప్పుళ్ళు. ఆ చెప్పుళ్ళు 100 మంది అంతరంగానికి చేరగలగాలి. అవి వందలు…వేలు…లక్షలు,… కోట్లు…అవ్వాలి. అప్పుడు పని మరింత సులువు అవుతుంది. ప్రతిపలాపేక్ష లేని దానం ఇహ పరములందు వన్నె తెస్తుంది…
ఇలాంటి దాతృత్వాలనందిస్తున్న సంఘాలకి, ప్రముఖులకి ప్రోత్సాహ సహకారాలు అందించండి. వారికి శిరస్సు వంచి కైమోడ్పులు అందిద్దాం

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

ఎడారి కొలను