ఎడారి కొలను 

ధారావాహికం – 18 వ భాగం

(ఇప్పటివరకు:ప్రసాద్ టూర్ కి వెళ్లి పోయాడు. అక్కమ్మ కూడా పనికి రావటంలేదు. మైత్రేయి ఒంటరిగా ఉంది ఇంట్లోనే.అనుకోని విధంగా ఆమె భర్త మీద హత్యాప్రయత్నం కేసుకింద ఆమెను అరెస్ట్ చేసి స్టేష న్ కి తీసుకెళతాడు ఇన్స్పెక్టర్ యోగరాజ్. ఏమి అడగకుండానే రాత్రి కల్లా ఇంటికి పంపించివేస్తాడు. రెండు రోజుల తరువాత మళ్ళి  కానిస్టేబుల్ రేఖ మైత్రేయి ని స్టేషన్ కి తీసుకెళుతుంది యసై తీసుకురమ్మన్నాడని. తిరిగి పంపే సమయంలో యోగరాజ్ కొంచం  అసభ్యంగ  ప్రవర్తిస్తాడు. రేఖ చొరవతో మైత్రేయి  తప్పించుకుంటుంది ఆ గండం నుంచి.)   

మైత్రేయి లో భయం మొదలయింది. ఇదంతా ఏమిటీ ? ఎవరు జరిపిస్తున్నారు? ఇలాటి సమయం లో వసుంధర ఉంటె బాగుండేది. అది ఉంటె ఇలా జరిగేది కాదేమో? ఏమో ? ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. రేపు మళ్ళి  ఆ యసై వస్తే ఎలాగా? ఎలా తప్పించుకోవడం? ఇవే ఆలోచనలతో అలాగే కూర్చొని ఉంది మైత్రేయి. రాత్రి ఎంతసేపయిందో తెలియదు లైట్ కూడా ఆపలేదు తను.

రాత్రి ఒంటి గంట సమయం లో ప్రసాద్ వచ్చాడు టూర్ నుండి. లోపలికొస్తూనే గమనించాడు మైత్రేయి ఇంట్లో  లైటు  వెలుగుతూ ఉండడం. ఇంత  రాత్రి వేళా పలకరించడం మంచిది కాదని ఊరుకున్నాడు. అంతె  కాకుండా లైటు ఆర్పడం మరిచిపోయి నిద్దర పోయారేమో అని కూడా అనిపించి నిశబ్దంగ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

క్యాంపు కెళ్ళి రావటం వాళ్ళ ప్రసాద్ ఆ రోజుకి ఆఫ్ తీసుకున్నాడు. అందుకనే కాస్త లేటుగా నిద్ర లేచాడు. అప్పటికె పది గంటలు కావస్తున్నది. మైత్రేయి ఇంటి వైపు చూసాడు. తలుపులు అలాగే వేసి ఉన్నాయి. అలా చూస్తుండగానే పోలీస్ జీప్  వచ్చి ఇంటిముందు ఆగింది. యసై తో పాటు ఇద్దరు లేడీ కాన్స్టేబుల్పై కూడా వచ్చారు లోపలకి. నేరుగా వెళ్లి మైత్రేయి తలుపు తట్టారు. మైత్రేయి తలుపు తెరిచింది. యసై యోగ రాజ్ , “ఏంటి మేడం ఇంకా తయారవ లేదా స్టేషన్ కి రావటానికి? . మీరెలా ఉంటె అలాగే తీసుకు పోతాం. నడవండి అంటూ తొందర చేసాడు. ఉన్నదాన్ని ఉన్నట్టు జీప్ ఎక్కించారు. ప్రసాద్ వెంటనే ఎదో అడగ పోయాడు యసై యోగరాజ్ ని,”మీరు ఎవరు సార్? మీకు ఈమెకు ఏమిటి సంబంధం? మమల్ని మా డ్యూటీ చేయనివ్వండి “అంటూ ప్రసాద్ ని పక్కకు తోసాడు రూడ్ గ.

“ప్రసాద్ గారు ‘ప్లీజ్’ అని చేతులు జోడించింది మైత్రేయి .

“కనీసం ఆమెను ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలుసుకోవచ్చా ?” అంటూ కాస్త కోపంగానే అడిగాడు.

“సార్ కి కోపమొచ్చినట్లున్నదే? మీరు కూడా రండి సార్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, అమ్మవారి గుడి సంత ఏరియాలో, ”అంటూ  జీప్ ని నడిపించమని చెప్పాడు.

ప్రసాద్ కి మొదట్లో ఏమి అర్ధం కాలేదు. వెంటనే రమాదేవి గారి తలుపు తట్టాడు. అప్పటి వరకు కిటికీలోంచి చూస్తున్న రమాదేవి ఏమి ఎరగని దాని లాగా వచ్చి తలుపు తీసి,”ఏంటి ప్రసాదు? ఎప్పుడొచ్చావు? ఏమైనా కావాలా?”అని అడిగింది.

“ఇప్పుడేం జరిగిందో మీకు తెలుసనుకుంటాను,”

“ఇప్పుడేం జరిగింది నాయన.”

“నిజం గ తెలియదా?”

ప్రసాద్ మొహం లోకనిపిస్తున్న కోపం , అడిగిన తీరులోని తీవ్రతకు రమాదేవి కి కొంచం భయం వేసి, “అదా బాబు! మైత్రేయిని  పోలీసులు నాలుగు రోజులనుండి ఇలాగె తీసు కెళుతున్నారుగా,” చెప్పింది

“ఎందుకు?”  అదే తీవ్రతతో  అడిగాడు.

“నాకేం  తెలుసు నాయన. సంసారులం , ఇవన్నీ మేమెందుకు పట్టించుకుంటాము. పైగా మా ఇంటికి పోలీసులు రావడం ఇదే మొదటిసారి. వాళ్ళని చూస్తేనే పైప్రాణాలు పైన పోతాయి. అడగటం కూడాన” అంటూ గబగబా  చెప్పేసి లోపలికెళ్ళి పోయింది.

ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన బండి మీద బయలు దేరాడు పోలీస్ స్టేషన్ కి.

రమాదేవి ఇంట్లోకి వేళ్ళు తూనే పంతులు గారిని గట్టిగా పిలిచింది, “మీకేమయినా పడుతుందా, మన కొంపలో ఎం జరుగుతుందో. ఒకడేమో స్టూవర్టుపురం నుంచి వచ్చి మనింట్లో తిష్ట వేసాడు. ఇంకొకతేమో రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వస్తుంటుంది షికారుగా. మన పరిస్థితి ఏమిటో,”

“ఊరు కోవే ఇంతలోకే అంత కొంపలేమి మునిగిపోయాయి, అట్లా అరుస్తున్నావు” అంటూ జంధ్యం తో వీపు గోక్కుంటూ వచ్చాడు. “మీరు నా మాటలస్సలు లెక్కే చేయరు. ఇదే నా ఆఖరి మాట . ఆ పిల్ల చేత , ఆ పిల్ల గాడి  చేత, ఇల్లు  ఖాళీ చేయించాల్సిందే,

“ఇప్పటికిప్పుడంటే ఎలాగే ! చూద్దాములే అంటూ చల్లగా బయటికి జారుకున్నాడు.

జరుగుతున్న విషయాలు తెలిసిన,మైత్రేయి ని ఇల్లు ఖాళీ చేయమని చెబితే తనకు దొరికిన ఆంజనేయ స్వామి అర్చకత్వం చేయి జారిపోతుందేమో నన్న భయమయితే ఉన్నది పంతులు గారికి.  రమాదేవి రుస రుస లాడుతూనే ఉన్నది  రోజంతా. పదే పదే  వాకిలి వైపు కూడా చూస్తూనే ఉన్నది.  పోలీసులు తీసుకెళ్లిన మైత్రేయి గాని, ఆవేశం గ వెళ్లిన  ప్రసాద్ గాని ఇంకా తిరిగిరాలేదు.

(ఇంకావుంది)                  .

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంధి అంటే….

దాతృత్వం