అలేఖ్యను రెండు రోజులకు డిశ్చార్జ్ చేశారు… హాస్పిటల్లో బాలింతకు ఆహారం వాళ్లే ఇచ్చారు.. వెనుకటి రోజుల్లో పథ్యం అని చెప్పి ఉత్త వెల్లుల్లి కారం అన్నం పెట్టేవాళ్ళు… బిడ్డకు సరిపడా పాలు రావాలన్నా తల్లి ఆరోగ్యంగా ఉండాలన్న అన్ని ఆహార పదార్థాలు బాలింతరాలు తినాలి… లేదంటే శరీరంలో ఉన్న కాల్షియం అంతా బిడ్డకు పాల రూపంలో వెళ్లిపోయి తల్లులు బలహీనంగా అయిపోతారు ..ఆ రోజుల్లో అలాంటి భోజనం పెట్టేవాళ్ళు అవగాహన రాహిత్యం వల్ల… ఊపిరాడని గదిలో ఉంచి మరీ తలుపులు వేసి.. ఉక్కపోస్తున్న దళసరి బట్టలు వేసి ఉంచేవాళ్లు ..కానీ ప్రసవించడం అనేది జబ్బు కాదు… అన్ని రకాల భోజన పదార్థాలు అందించాలి. తగినంత గాలీ వెలుతురూ ఉండాలి.
మూడో రోజు హాస్పిటల్ నుండి ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు… నీలాంబరి కారు పంపించమని భూపతికి చెప్పింది.
” అమ్మా! మొదటిసారి నాపాప నీకు ఇష్టమైన కచ్చరం ఎక్కాలని ఉందమ్మా నాకు” అని చెప్పింది అలేఖ్య.
” సంతోషమే కానీ నువ్వు పాపా కచ్చరంలో కూర్చోగలరా? ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు కుదుపుతుంది” అని అన్నది నీలాంబరి.
” పర్వాలేదు అమ్మ కచ్చరంలోనే ఇంటికి పోదాం” అని అన్నది అలేఖ్య.
” ఏంటమ్మా మీ అమ్మకు కచ్చరం ఇష్టమని చంటి పాపను కచ్చరంలో తీసుకెళ్దామా! వద్దులేమ్మ మరోసారి వెళదాం కావాలంటే” అన్నాడు అక్కడే ఉన్న భూపతి.
” ఏం కాదు నాన్న పది నిమిషాలలో ఇల్లు చేరిపోతాం మన ఇల్లు దగ్గరే కదా” అని చెప్పింది అలేఖ్య.
” అలాగే కానివ్వండి మామయ్యా! లేకపోతే జీవితాంతం ఈవిషయం గుర్తుపెట్టుకుంటుంది అలేఖ్య” అన్నాడు సుధీర్ నవ్వుతూ.
ఇంటికి ఫోన్ చేసి మహేశ్వరితో చెప్పాడు భూపతి సిద్దయ్యను కచ్చరం శుభ్రం చేసి లోపల చక్కని వస్త్రములు పరిచి రెండు వైపులా చక్కని పరదాలు కట్టించి తీసుకొని రమ్మని చెప్పాడు…
దాదాపు ఒక గంట తర్వాత హాస్పిటల్ దగ్గరికి కచ్చరం వచ్చింది…
హాస్పిటల్లో ఉన్న నర్సులకు ఆయాలకు ఇంకా పనిచేసే వాళ్ళందరికీ తన సంతోషం కొద్ది బహుమతులు ఇచ్చింది నీలాంబరి.
మెల్లగా కచ్చరం ఎక్కింది అలేఖ్య తర్వాత పాపను తన ఒడిలోకి తీసుకుంది అదే కచ్చరంలో నీలాంబరి కూడా ఎక్కి కూర్చుంది….
” చిన్న దొరసాని కచ్చరం ఎక్కిందన్నమాట” అన్నాడు నవ్వుతూ భూపతి.
కచ్చరం ఇంటికి బయలుదేరి వచ్చింది వాకిట్లోనే మహేశ్వరి ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసింది…
ఇల్లంతా అలంకరించి ఉంచారు కొత్త పాపకు స్వాగతం చెప్పడానికి.. ఇంటి ముందు రకరకాల ముగ్గులు ఇంట్లో పూల తోరణాలు బెలూన్సు అన్ని కట్టించి ఉంచారు.
ఇల్లంతా చూస్తూ సంతోషంతో లోపలికి అడుగు పెట్టింది అలేఖ్య…
” చూడు నీకోసం స్వాగతం చెబుతున్నారు అందరూ” తన చేతుల్లో ఉన్న పాపతో మాట్లాడింది అలేఖ్య.
దోసిట్లో ఇమిడిన గులాబీలా చాలా ముద్దుగా ఉంది చిన్ని పాప..
” అమ్మా! దీని మొహంలో నీ రాజసమంతా కనబడుతుంది ” అన్నది అలేఖ్య.
” అచ్చం మా పెద్దమ్మ గారి లాగే ఉంది” అన్నారు ఇంట్లో పని చేసే అందరూ.. మహేశ్వరి అయితే పాపను చూసి మురిసిపోతూనే ఉంది..
అలేఖ్యను, పాపని గదిలోకి తీసుకెళ్లారు… తెల్లటి బెడ్ షీట్ పరిచి పాప కోసం చిన్న పరుపు వేసి మంచం మధ్యలో పడుకోబెట్టింది నీలాంబరి… ఒక పక్కన చిన్న కత్తిని పెట్టింది… అప్పటి రోజుల్లో కత్తి చీపురు కుంపటి పెట్టేవాళ్ళు… ఎందుకంటే ఇళ్లల్లో పురుగులు పుట్రా వస్తాయని ముందు జాగ్రత్త కోసం కుంపటి ఏమో వెచ్చదనానికి.. దిష్టి తగలకుండా చీపురు ఇప్పుడు ఇవన్నీ పాటించకపోయినా కూడా ఒక కత్తి మాత్రం మంచం పక్కన పెడుతున్నారు…
ఆరోజు మూడవ రోజు అయినందువల్ల నీళ్లల్లో వాయిలి ఆకులు వేసి మరిగించి తల్లికి బిడ్డకు చక్కగా స్నానం చేయించారు…
ఆ తర్వాత అలేఖ్యకు వేడివేడిగా అన్నం బీరకాయ కూర టమాటో చారు తో అన్నం పెట్టారు… చక్కగా తల్లి కూతుర్లు ఆదమరిచి నిద్రపోయారు.
అలేఖ్య అత్త మామకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు భూపతి గారు..
వాళ్లు పురుడు రోజుకు వస్తామని చెప్పారు…
ఇంట్లో సందడి మొదలయ్యింది చిన్నపిల్లలు ఉంటే ఎన్ని పనులు చేసినా తీరిక ఉండదు ఎంతమంది చేసినా ఇంకా తక్కువగానే ఉంటుంది…
ఇంట్లో అందరూ పనివాళ్ళు ఉన్నా కూడా పసిపాపకు నీలాంబరినే స్నానం చేయిస్తుంది. ఆ ముచ్చట తీరాలంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది.. అప్పటికి అలేఖ్య అంటూనే ఉంది “ఎందుకమ్మా మహేశ్వరి పోస్తుంది కదా” అని.. కానీ పిల్లలకు స్నానం పోస్తుంటే ఆ ఆనందం గొప్పగా ఉంటుంది ఆ చిన్న ని మెత్తని ఒళ్ళుకి అలవోకగా నలుగు పిండి రాస్తూ నీళ్లు పోస్తుంటే కాళ్ళ మీద ఒదిగిన ఆ పిల్లల్ని చూస్తుంటే ఆ సంతోషం వేరు అందుకే ఆ సంతోషాన్ని తనే అనుభవించాలనే అనుకుంది నీలాంబరి…
” నీలా అమ్మమ్మ కాగానే నీలో చాలా మార్పు వచ్చింది అసలు నీ మొహంలో సంతోషం తాండవమాడుతుంది నిజంగా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.” అన్నాడు భూపతి.
” అవునండి !నాకు దీన్ని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో! మనం మన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎక్కువగా బాధ్యతలే చూస్తాము ఇలా ముద్దు చేయడం తక్కువగా ఉంటుంది .. మనవళ్ళ రూపంలో మళ్లీ మనకు ఆఅపురూపమైన సమయం దక్కుతుంది” అన్నది నీలాంబరి…
“ఏమండీ బాబుకి ఫోన్ చేసి చెప్పారా ?నాకు వాడితో మాట్లాడటం అసలే కుదరలేదు వాడు ఈనెల వస్తానని చెప్పాడు వాడు వచ్చే డేట్స్ చూసి మనం ఉయ్యాల ఫంక్షన్ ఏర్పాటు చేసుకుందాం” అన్నది నీలాంబరి.
” చేశాను నీలా వాడు కూడా నీతో మాట్లాడాలని రెండు మూడు సార్లు అనుకున్నాడు ..కానీ! నువ్వు బిజీగా ఉంటావని వాడు ఫోన్ చేయలేదు వాడు ఈనెల వస్తానని చెప్పాడు ఒకసారి మన వియ్యాల వారిని అడిగిన తర్వాత ఏర్పాటు చేసుకుందాం. ఎలాగూ పురుడుకు వాళ్ళు వస్తానన్నారు కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అని చెప్పాడు భూపతి..