మాతృదేవోభవ

అమ్మలకు , అమ్మల కన్న అమ్మలందరికీ మాతృ దినోత్సవ సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాభివందనాలు
ఈ సందర్భంగా మా అమ్మ గురించి నాలుగు ముక్కలు చెప్పాలనే తపననే నా ఈ చిరుప్రయత్నము. చిన్నప్పటినుండి తను కన్న మా ముగ్గురిని ముద్దుమురిపాలతో మరియు క్రమశిక్షణతో పెంచి,మాకు కావలసినవి అవసరాలను మించి ఎక్కువగానే సమకూర్చేది.

రకరకాల వంటకాలు, పిండి వంటలు రుచిగా చేయడంలో మా అమ్మ సిద్ధహస్తురాలు. మా నాన్నగారు వృత్తిరీత్యా ఆఫీసు పనులలో బిజీగా ఉండడం వలన ఇంటి బాధ్యతలు నిర్వహించడంలో అమ్మ అన్ని తానై అన్ని విషయాలలోనూ కీలకంగా వ్యవహరించేది. మమ్మల్ని క్రమశిక్షణగా పెంచడమే కాకుండా, మా చదువులు, ఇతర విషయాలలో మేము ఏ విధంగా వ్యవహరిస్తున్నాము అని మమ్మల్ని అనుక్షణం ఒక కంట కనిపెడుతూ ఉండేది. ఎక్కడా ఏ విషయము లోనూ ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచడంలో మా అమ్మ పాత్ర చాలా కీలకం. కోడి తన పిల్లలను పెంచినట్లుగా మా అమ్మ మమ్ములను తన కను సన్నలలోనే గమనిస్తూ సాకింది.

మేము పెరిగి పెద్దయి, మా పెళ్లిళ్లు జరిగి మా బాధ్యతలు మేము నిర్వహించుకుంటున్నప్పడు కూడా పిల్లలకి ఏం కావాలి అని గమనిస్తూ మాకు కావలసిన సహాయం చేయడం, మనవలు,మనవరాళ్లకు (మా పిల్లలు) కూడా ఇష్టమైన వంటలు వండి పెట్టడం,. ముద్దు మురిపాలు పంచడం ,మా అమ్మ ప్రత్యేకత.
ప్రస్తుతం మా అమ్మ ఎనబైయవ పడిలోఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఏదో మాకు చేయలనే తాపత్రయం అమ్మలో కనపడుతుంది. అందుకే అమ్మ స్థానము మా హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేకమే. ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పెద్దలు అన్నట్టు తల్లిదండ్రుల ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం, వారిని మంచి ఆయురారోగ్యాలతో దీవించమని భగవంతుని కోరుకోవడం తప్ప
ఎంత వయసు వచ్చినా తల్లితండ్రుల ముందు మనం ఎప్పుడు చిన్నపిల్లలమే

                      జ్యోతి

Written by Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రేమ బంధాలు

కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ పాట విశ్లేషణ: