మన మహిళామణులు

శ్రీమతి పద్మా కల్యాణ్

ముగ్గురు పిల్లలు పుట్టినాకగూడా డాన్స్ ని మానకుండా తాను చేస్తూ ఇతరులకి నేర్పారు ఆమె.బాల్యంలో పడిన బీజం డాన్సర్ కావాలి అనే కోరిక తపన ఆమె ను నేడు ఆదర్శనృత్య అధ్యాపకులు గా నిలబెట్టింది.డాన్స్ ఖరీదైన కళ.పెళ్ళికాగానే ఆపేస్తారు.కానీ పద్మ కల్యాణ్ గారు 1986 లో రెండో బాబు పుట్టాక గూడా చేసి నేర్పిస్తూ నృత్యం పట్ల తనకున్న మక్కువను సాకారం చేసుకున్నారు.ఇద్దరు అబ్బాయిలు ఓకూతురు.పాపని డాన్సర్ గా తీర్చి దిద్దారు.ఆమెయే శ్రీమతి పద్మా కల్యాణ్…

శ్రీ చయనం శ్రీనివాసరావు అనసూయ దేవి గార్లకి 6గురు అబ్బాయిలు ఏకైక కుమార్తె పద్మావతి.5 గురు అన్నలు ఒక తమ్ముడు తో బాల్యం బాగానే గడిచింది.చిన్నప్పట్నించీ నాట్యం అంటే విపరీతమైన క్రేజ్ పిచ్చి.ఎలాగైనా నేర్చుకోవాలి అనే తాపత్రయం.కానీ సనాతన సంప్రదాయ కుటుంబంలో ఏకైక ఆడపిల్ల కావడంతో తండ్రి సంగీతం మాత్రం నేర్పించారు.బలవంతంగా సంగీతం క్లాస్ కి వెళ్తున్నా ఆమె మనసంతా డాన్స్ మీదనే.రాజపాప అనే టీచర్ సంగీతం నేర్పేవారు.ఆమెఈచిన్నారి కోరిక తీర్చాలని బాలభారతి అనే సంస్థను నడుపుతున్న శ్రీకృష్ణారావుగారికి పరిచయం చేశారు.తెలుగుమీడియం స్కూల్ లో చదువు తున్న పద్మ ప్రతి స్కూల్ ప్రోగ్రాం లో తానే స్వయంగా కంపోజ్ కొరియోగ్రఫీ చేసుకుని డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేది.బడికాబట్టి ఇంట్లో ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.5 వక్లాస్ లో ఉండగా ఉమా ప్రహ్లాద్ గారు డాన్స్ ప్రోగ్రామ్స్ చేయించేవారు.ప్రోగ్రాంరోజు రెగ్యులర్ గా వచ్చే ఒకమ్మాయి రాకపోవడంతో పద్మకి ఛాన్స్ దొరికింది.అలా భరతనాట్యం స్టెప్స్ త్వరగా నేర్చుకున్నారామె.


అలరిప్పుతో తొలి సారి అసలు నాట్యం చేయకుండా రోజూ చూడటంతో బానే ప్రశంసలు పొందింది ఆచిన్నారి.డాన్స్ పై మోజు అభిమానం ఇంతింతై అన్నట్టుగా రోజురోజుకూ పెరుగుతోంది కానీ ఇంట్లో వారు ససేమిరా అన్నారు.దానికితోడు 7వక్లాస్ లో ఉండగా బంధువుల అబ్బాయి తో పెళ్ళి చేశారు మంచి సంబంధం అని.ఎలాగో 9వక్లాస్ దాకా చదువు సాగింది.దానికితోడుబాలభారతి నిర్వాహకులు వేరే చోటికి షిఫ్ట్ అవడంతో సంగీతం చదువు గుంటకట్టి గంటవాయించారు.భర్తకి నిజామాబాద్ లో గవర్నమెంట్ జాబ్ రావడం‌ ఈమె కాపురానికి వెళ్ళడం అప్పుడే సరస్వతీ గాన సభలో శోభానాయుడు గారి డాన్స్ చూసిన పద్మకి ఎలాగైనా నృత్యం నేర్చుకొని ఓడాన్స్ ఆర్టిస్ట్ గా పేరు పొందాలనే కోరిక వటవృక్షం లా పెరిగింది.17 ఏళ్ల ఆమె గర్భవతి.చిన్నపిల్లలా ఏడుస్తూ ” నేను డాన్స్ నేర్చుకుంటా” అని మొండి కేస్తే “కాన్పు ఐనాక నేర్చుకో” అని భర్త ఓదార్చడం ఆమె జీవితంలో ఓ మలుపు.నిజంగా ఆయన సహృదయుడు.పురిటికి 9 వనెలలో హైదరాబాద్ పుట్టింటికి వచ్చిన ఆమె కి బాబు పుట్టాడు.తొలిగురువు వేదాంతం సాంబయ్య గారు.డెలివరీ ఐనా రెండో రోజు నుంచే డాన్స్ నేర్పించండి అని గొడవచేసిన ఈమెకు తండ్రి సరేనని ఒప్పుకోవడం 29 వరోజునించే డాన్స్ నేర్పడానికి వేదాంతంవారు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట కు వారింట్లో భోజనం చేసి వెళ్లేవారు. 5 నిముషాలు చేయగానే పచ్చిబాలింతకి కాళ్లనెప్పి ప్రారంభం అయ్యేది.3 వనెల రాగానే భర్త దగ్గరకు వెళ్ళి పోయింది.తల్లి వదినెలు కాళ్లకు నూనె మర్దన చేసి మంచి పుష్టికరమైన ఆహారం పథ్యంపెట్టారు.”చెల్లి కి చిన్నప్పుడే నేర్పిస్తే దానికి ఇంత క్షోభ మనకి బాధ ఉండేది కాదు కదా నాన్నా!” అని అన్నలు అనేవారు.ప్రతివారం పసివాడితో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమె డాన్స్ నేర్చుకోవడం మనకి వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది కదూ?!                                                                              

ఆమె రెండో సారి గర్భవతి ఐంది.డాన్స్ పిచ్చి తో సంతానం వద్దు అనుకున్న ఆమె తో గురువు గారు ” నీకు ఆడపిల్ల పుడితే ఆమె కి నేర్పిస్తూ నీవూ ప్రాక్టీస్ చెయ్యి” అనడంతో పాటు థియరీ బుక్ ఇచ్చారు.అభినయదర్పణం అనే ఆపుస్తకాన్ని రోజూ పారాయణ చేసేది ఆమె.పాపపుట్టాక మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టింది.1979 లో మాష్టారు మరణించారు.శ్రీ పసుమర్తి రామలింగశాస్త్రి గారు ఈమె కు రెండో గురువు.ఆయన మహబూబ్ నగర్ నుంచి వచ్చి నేర్పేవారు.1981 లో పద్మ ఇద్దరు పిల్లలతల్లి తొలి డాన్స్ ప్రదర్శన స్టేజీపై ఇవ్వడం పెద్ద మలుపు.


పద్మ ఇద్దరు పిల్లలతల్లి.పాపకి రెండవనెల.కానీ మనసు డాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే కూచునే జావళీలు క్షేత్రయ్య పదాలు ఆధ్యాత్మ రామాయణం కీర్తనలు ప్రాక్టీస్ చేశారామె.భర్తకి టెలిఫోన్ శాఖలో జాబ్.అక్కడ సరిదె మాణిక్యమ్మ గారు అనే దేవదాసి వద్ద ఇవి నేర్చుకున్నారు.1984 లో కూచిపూడి లో వెంపటి చినసత్యం గారు స్టైఫెండ్ తో శిక్షణా తరగతులు ప్రారంభించారు.కానీ ఈమె కి తెలిసి డేట్ ఐపోటంతో ఓగది అద్దెకి తీసుకుని ఇద్దరు పిల్లలతో ఉదయం 8_ నుంచి రాత్రి 8 దాకా పనులు డాన్సుసాధన చేశారు.మాపాపకి డాన్స్ నేర్పిస్తూ ఆమె తో నేను కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని.టీచింగ్ సైడ్ వెళ్లడంకోసం శిక్షణ తీసుకున్న ” అని తన అనుభవాలను చెప్పారు ఆమె” క్రమంగా పిల్లలకి ట్యూషన్ చెప్తూ వారు సర్టిఫికెట్ కోర్సు మొదలు డిప్లొమా దాకా నాదగ్గర పాసైన వారున్నారు.15 బాలేలు 60_70 దాకా సోలో నృత్యాలు ఆతర్వాత వివిధ స్కూళ్ళలో డాన్స్ టీచర్ గా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాను.నాదగ్గర నేర్చుకున్న వారు ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం నాకు సంతోషం.మా అమ్మాయి డిప్లొమా పాసైంది.స్వరాలయ నృత్యోత్సవ బాలోత్సవ్ అన్నింటా ఈమె శిష్యులు ఫస్ట్ ప్రైజులు తెచ్చుకున్నారు.కళాతపస్వి అవార్డు కూచిపూడి జీవన సాఫల్య కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలా ఎన్నో ఎన్నెన్నో నాఖాతాలో ఉన్నాయి.ప్రభుత్వబడులలో పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అని నాకోరిక.కానీ అది నెరవేరలేదు.” నిజంగా ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యం కల్గిస్తాయి.భర్త పిల్లలు సహకారం తో ఆమె తన కోరిక కలనెరవేర్చుకోటం అద్భుతంగా అనిపిస్తోంది కదూ!?
పద్మా కల్యాణ్ ఫోన్ 944037771

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

మాతృ దినోత్సవం ( అమ్మల పండగ )