ఎడారి కొలను 

ధారావాహికం- 17 వ భాగం)

పద్మావతి నీలంరాజు

(ఇప్పటివరకు: ప్రసాద్ తన గురించి మైత్రేయి కి చెబుతాడు. ఆ రోజు రాత్రే ప్రసాద్ టూర్ కి వెళ్లి పోయాడు. అక్కమ్మ కూడా పనికి రావటంలేదు. మైత్రేయి ఒంటరిగా ఉంది ఇంట్లోనే.అనుకోని విధంగా ఆమె భర్త మీద హత్యాప్రయత్నం కేసుకింద ఆమెను అరెస్ట్ చేసి స్టేషనికి  తీసుకెళతాడు ఇన్స్పెక్టర్ యోగరాజు) 

అసలు సుబ్బారావు కి ఏమయిందో అర్ధం కాలేదు. పోలీస్ కేస్ ఎందుకు పెట్టారో తన పైన అర్ధం కావటం లేదు. మధ్యాహ్నం వేళ తీసుకొచ్చి పోలీస్ స్టెషన్ లో కూర్చో బెట్టారు సెల్ పక్కనున్న బెంచి మీద. ఇప్పటికి రాత్రి ఎనిమిది గంటలయింది. ఎవ్వరు ఏమి మాట్లాడటం లేదు. స్టేషన్ లో అందరు తనని తలొకరకంగా చూస్తున్నారు. ఏడుపు రావటం లేదు. ఎదో భయం తో కళ్ళు మాత్రం పెద్దగా అయి నేనే అందర్నీ చూస్తున్నట్లుంది. గొంతు తడారిపోయింది. ఎన్ని సార్లు నీళ్లు తాగానో నాకే తెలియదు. “మేడం ,అన్ని నీళ్లు మీరే తాగేయకండి మాకోసం  కాసిని మిగల్చండి ,”అంటూ కిసుక్కున నవ్వింది ఒక కాన్స్టేబుల్.
అలా ఏవేవో జోకులేస్తున్నారు తన మీద. “ఈమె మొగుణ్ణి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. ఇంక వాడేం లేస్తాడు”, అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం తనకు వినిపిస్తూనే ఉన్నది.
ఇవన్నీ వీళ్లకేలా  తెలుసు? అయినా కోర్ట్ లో వాదనలప్పుడు అతను బాగానే ఉన్నాడే? ఇప్పుడీ ఉపద్రవం ఎక్కడనుంచి వచ్చి పడింది? వీళ్ళు  ఎవరికీ ఫోన్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తాను ఏదయినా అడిగితే “సార్ రావాలి మేడం! అప్పటివరకు గమ్ముగుండండి,” అంటూ గదమాయిస్తున్నారు. తలా పగిలిపోతుంది ఆలోచనలతో.
అలా ఎనిమిది గంటలు దాటాక ఇన్స్పెక్టర్ యోగరాజ్ వచ్చాడు. “అరరె!  మేడం  ఇంకా స్టేషన్ లోనే కూర్చొని ఉన్నారా? ఎవరు రాలేదా ? ఏంటి మేడం? మీ వాళ్లెవరు రాలేదా? అదే మీకు బాగా కావాల్సిన వాళ్ళు ? ఒక్కరు కూడా?” అంటూ పాకెట్స్ తడుముకుంటూ “అయ్యో !మరిచేపోయాను. మీ సెల్ నా దగ్గరే ఉండిపోయింది.” అంటూ వెటకారంగ  నవ్వుతూ ఆమె మొబైల్ ఆమె ఒడిలోకి విసిరేసాడు. “ఇవాల్టికి వెళ్ళిపోండి.  రేపు మళ్ళి  వస్తాను,”అంటూ “రేఖ, ఆమెను ఆటో ఎక్కించి ఇంటికి పంపించు 9 గంటల లోపే ఆమె ఇల్లు చేరిపోవాలి,” అన్నాడు.  ఇంటి తాళం వేసిన కానిస్టేబుల్ రేఖ ఆమె కి తాళాలిచ్చి స్టేషన్ బయటికి వచ్చి, “మీరు ఆటో లో వెళ్లి పొండి”  అంటూ మళ్ళి స్టేషన్ లోకి వెళ్లి పోయింది. బయటంతా నిర్మానుష్యంగ ఉన్నది. చాలాసేపటి దాక అటు వైపుగా ఒక్క ఆటో కూడా రాలేదు. అందుకని వణుకుతున్న కాళ్ళతో అలాగే ధైర్యాన్ని కూడ గట్టుకొని నడవటం మొదలు పెట్టింది. కొంత దూరం నడిచాక ఒక ఆటో దొరికింది. ఇంటి అడ్రస్ చెప్పి  ఇల్లు చేరుకుంది. గేట్ తెరవగానే వరండాలో లైటు వెలిగింది. రమాదేవి  తలుపుతెరిచి వరండాలోకి వచ్చింది.
“ఎమ్మా పోలీసువాళ్ళు నిన్ను రానిచ్చారా ? లేక నువ్వే పారి పోయివచ్చావా?”
కళ్లెత్తి  ఆమెను చూడలేక పోయింది. గుడ్లనీరు కుక్కుకుంటూ తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తలుపు, కిటికీ మూసేసింది. మంచం మీద పడిపోయింది. ఏడుపు ఆగలేదు. ఆలా ఎంతసేపు ఉండి  పోయిందో ఆమెకే తెలియలేదు.
ఆ రోజు పగ లంతా తాను బయటి ప్రపంచానికి తన మొహం చూపించలేదు. రాత్రి వేళకి కొంచం పా లు తాగి స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుండి  పోయింది. మళ్ళి అదే కల.
“పాము, పాము నన్ను తరుముతున్నది, కాపాడండి కాపాడండి,”అని అరుస్తూనే ఉన్నది నిద్దట్లో. కానీ మంచం పైనుంచి మాత్రం లేవలేక పోతున్నది. అలా రెండు రోజులు గడిచాయి. మూడోరోజు ఉదయం పదింటికల్లా కానిస్టేబుల్ రేఖ మైత్రేయి ఇంటికి వచ్చింది.
“మేడం, మిమ్మల్ని మా యసై సార్ మాట్లాడటానికి స్టేషన్ కి  తీసుకు రమ్మన్నారు. పదండి, ” అంటూ ఆమెని తొందరచేసింది.
“నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మీ దగ్గర ఏ కంప్లైంట్ ఉన్నదో నాకు చూపించు,” అంటూ ప్రాధేయ పడింది.
”నాకయితే తెలవదు మేడం,” జాలిగా చూసి చెప్పింది.
మళ్ళి  రేఖ  “చూడమ్మ , మిమ్మల్ని ఎవరో ఎదో ఆశించే ఇలా ఇరికిస్తున్నారనిపిస్తున్నది. అది తెలుసుకోండి ముందు.  ఇప్పటి కయితే మీ మీదేమి కేస్ ఫైల్ కాలెదని నాకనిపిస్తుంది. మిమ్మల్ని బెదిరించడానికే ఇలా చేస్తున్నారనిపిస్తుంది. మీకెవరయినా తెలిస్తే సాయం తీసుకోండి. ఈ  యోగరాజ్ సార్ అంత మంచోడు కాదు.” అని కొంచం స్నేహ పూర్వకంగా చెప్పింది. మళ్ళి ఆమె తోటి పోలీస్ స్టేషన్ కి పోక తప్పలేదు మైత్రేయి కి.
ఆ రోజంతా మళ్ళి  అలాగే స్టేషన్ లో కూర్చోబెట్టి రాత్రి టైం కి పంపించేశాడు యోగరాజ్.
పంపే ముందు కాస్త ధైర్యం గ అడిగింది అతన్ని మైత్రేయి,
“ఏ విషయం లో నన్నిలా రోజు స్టేషన్ లో కూర్చో పెడుతున్నారు,”
“రేఖ నువ్వు చెప్పలేదా? చెప్పావనుకున్నానే ,“అంటూ మైత్రేయి  మీద మీద కు వచ్చి, “క్రిమినల్స్ కెందుకు చెప్పాలి? అంతేకదా!  మేము పిలిస్తే మీరు రావాలి,”  అంటూ ఆమె జబ్బ పట్టుకొని తన మీదకు లాక్కోబోయాడు. ఆ ఊపులో మైత్రేయి అతని మీద పడబోయి నిలదొక్కుకున్నది . “అంత ఇదవ కండి మేడం. నేను మీకు ఫుల్ల్లుగా కోపరేట్ చేస్తాను మీరు కావాలనుకుంటే. నేను విన్నదానికంటే చాలా …..  ఉన్నారు. ఇంకాస్త దగ్గరిగా రండి విషయం చెబుతా,” అంటూ ఆమెను తన మీదకి  లాక్కోబోయాడు మళ్ళీ.
రేఖ వెంటనే కల్పించుకొని ,”ఆమెకేమి తెలియదు సార్. నేను కూడా చెప్పలేదు. నాక్కూడా ఏమి తెలియదు కదా,” . అంటూ చర చర మైత్రేయిని   యోగిరాజ్ ముందు నుండి ఇవతలకు లాగేసి,  “పదండి మేడం , మిమ్మల్ని ఆటో  ఎక్కిస్తాను.” అంటూ  స్టేషన్ బయటకు తీసుకు పోయింది. తన స్కూటీ మీద ఎక్కించుకుని దగ్గరలోనే ఉన్న ఆటో స్స్టాండ్ దగ్గర దిగబెట్టి , “అన్న, అక్కను జాగర్తగా ఇంటి కాడ దింపు,” అనేసి వెళ్ళిపోయింది. మైత్రేయికి ఆ రోజుకి గండం గడిచినట్లయింది.

(ఇంకా ఉంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మాతృదినోత్సవ ప్రత్యేక పాట

మన మహిళామణులు