జాబిలి

కవిత

నెల్లుట్ల రమాదేవి

అమ్మ నా చేతికందిన జాబిలి
నిండైన వాత్సల్యపు దోసిలి
హాయినిచ్చే చల్లని పైరగాలి
అమ్మా ! నీ ఋణమెలా తీరాలి ?!

ఈ మట్టి అమ్మ నుదుటి బొట్టు
ఆ చేను అమ్మ చెమట బొట్టు
అమ్మ మా ఇంటి కలిమి చెట్టు
అమ్మా ! నా ప్రగతికి నువ్వే ప్రతి మెట్టు !

అమ్మంటే అంతులేని శ్రమ గీతం
మమకారపు మాధుర్య జలపాతం
చిరునవ్వు చెదరని పారిజాతం
ఆప్యాయత అమ్మకు సహజాతం !

బుడిబుడి నడకలపుడు బువ్వయి
తడబడే అడుగుల నాడు తొవ్వయి
వడివడి పరుగుల వేళ వెలుగుల దివ్వెయి
అమ్మా ! ఉన్నావు సదా నా పెదాల నవ్వయి !!

జీవిత పాఠాలు నేర్పిన ఆది గురువు
కోర్కెలు తెల్సుకుని తీర్చిన కల్పతరువు
అమ్మ ఉన్న చోటే ఆనందానికి నెలవు
అమ్మా ! కళలెన్నో నీలోనే కలవు !!

నిదురించే సమయాన వెచ్చని ఒడి
నీతి నేర్పిన తరుణాన విలువైన బడి
మానవత్వపు మహోన్నతపు గుడి
అమ్మా ! రానీయకు నీ కంట తడి !!

నా ఆకలి తెలిసిన అన్నపు మూట
అలసిన వేళ సేదతీర్చిన పూలతోట
అమ్మ నన్ను నిద్రపుచ్చిన జోలపాట
అమ్మా ! నువ్వే ఆనందాల వెలుగు బాట !!

నేను చూసిన తొలి రూపం
మా ఇంట వెలిగిన దీపం
ఆమె సమక్షం అగరు ధూపం
అమ్మా ! నీ రూపం ఇంద్రచాపం !!

అమ్మ నడకలే ఆనంద నర్తన
అమ్మ తలపే అపురూప భావన
అమ్మ చిరునవ్వే ఆత్మీయ దీవెన
అమ్మా ! కుటుంబ క్షేమమే నీ కామన !

అమ్మ నేర్పిన నడకే ఇప్పటికీ
అమ్మ చూపిన దారే ఈనాటికీ
అమ్మ తీర్చిన నడతే ఎప్పటికీ
అమ్మా! నువ్వే దైవం ముమ్మాటికీ !!

Written by Nellutla Ramadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మాతృదినోత్సవ ప్రత్యేక పాట