దొరసాని

ధారావాహికం – 28 వ భాగం

      లక్ష్మిమదన్

కారు ఎక్కిన వెంటనే అడిగాడు భూపతి…

” ఏమైంది నీలా! ఎందుకు కార్ దిగావు?”

విషయం అంతా చెప్పింది నీలాంబరి…” మరి మొబైల్ తెచ్చావు ఏం చేద్దాం అనుకుంటున్నావు?” అన్నాడు భూపతి.

” తర్వాత చెప్తానండి మీరు ఇప్పుడు వెళ్లడానికి తొందరలో ఉన్నారు కదా వచ్చాక చెప్తాను” అన్నది నీలాంబరి.

ఇల్లు చేరుకున్న వెంటనే భోజనం చేసి పట్నం వెళ్ళాడు భూపతి.

నీలాంబరి అలేఖ్య కూర్చొని భోజనం చేశారు.. బాలసదనం గురించి అన్ని విషయాలు చర్చించుకున్నారు….

ఇంకా కొన్ని సాంకేతికపరమైన విషయాలను అలేఖ్య నుండి తెలుసుకొని నీలాంబరి.. తర్వాత దారిలో జరిగిన విషయం చెప్పింది నీలాంబరి.

” మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అమ్మా!” అని అడిగింది అలేఖ్య.

ఈ విషయం గురించి నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నానమ్మా. చిన్నపిల్లలు ఈ వెబ్సైట్ చూడడం వల్ల ఎలా పాడవుతున్నారో నేను గమనిస్తున్నాను. ఎవరికి వాళ్ళము నాకెందుకులే అనుకుంటే పిల్లలు ఎలా బాగుపడతారు అందుకని నా వంతుగా నా దృష్టికి వచ్చిన విషయాన్ని నేను పరిష్కరించాలని అనుకుంటున్నాను… చూద్దాం ఎలా జరుగుతుందో సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రులని రమ్మన్నాను” అని చెప్పింది నీలాంబరి.

సాయంత్రం ఐదు అవుతుండగా ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక జంట దివాణం గేటు బయట నిలబడ్డారు… అక్కడే ఉన్న సిద్దయ్య…

” ఎవలు గావాలే..ఈడ ఎందుకు నిలబడ్డరు? ” అని అడిగాడు..

” అమ్మగారు కావాలి ఒకసారి లోపలికి పోయి చెప్పుర్రి” అని అన్నారు వాళ్లు.

” సిద్దయ్యా! ఎవరు బయట లోపలికి వచ్చి కూర్చొమని చెప్పు” అని చెప్పింది నీలాంబరి లోపటి నుండి.

గేటు తీసి వాళ్ళని లోపలికి రానిచ్చి కచేరీలో వేసిన కుర్చీలలో కూర్చోమని చెప్పాడు సిద్దయ్య.

ఒక పది నిమిషాల తర్వాత నీలాంబరి బయటకు వచ్చింది…

నీలాంబరిని చూసి ఆఇద్దరు పిల్లలు తల్లిదండ్రి వెనుక దాక్కున్నారు..

” చెప్పండి దేనికోసం వచ్చారు” అని అడిగింది నీలాంబరి.

” అమ్మా! పొద్దుగాల మా పిల్లల ఫోన్లు మీరు గుంజుకున్నరట.. గది అడిగి తీసుక పోనీకి వచ్చినం” అన్నారు వాళ్లు.

” ఫోన్లు ఎందుకు తీసుకొచ్చానో మీ పిల్లలు చెప్పలేదా” అని అడిగింది నీలాంబరి.

” ఏమోనమ్మా ఏం చెప్పలేదు అడిగి అడిగి ఆష్టకొచ్చింది” అన్నారు తల్లిదండ్రులు.

” వాళ్ళిద్దరూ బడికి పోకుండా చెట్టు కింద కూర్చొని ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు.. అందుకని నేను ఫోన్లు తీసుకుని వచ్చాను..

అసలు వాళ్ళ వయసెంతని వాళ్లకు ఫోన్లు ఎందుకు ఇచ్చారు అసలు మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు స్కూలుకు వెళ్ళేది కూడా చూడలేరా!” అని అడిగింది నీలాంబరి.

” ఫోన్లు పిల్లలు తీసుకెళ్లింది మేం చూడలేదమ్మా నేను బీడీల కంపెనీల బీడీలు చేస్తా మా ఆయన రైస్ మిల్లుల పనిచేస్తడు.. ఇవాళ నాకు శాతకాక పడుకున్న… మా ఆయన ఏదో పని మీద ఉన్నడు వీళ్ళిద్దరూ చెప్పకుండా ఫోన్లు తీసుకొని బడికి పోతున్నమని పోయిండ్రు”

అని చెప్పింది ఆ పిల్లల తల్లి.

“ఈ మొబైల్స్ ద్వారా పిల్లలు ఎంత పాడైపోతున్నారో మీకు తెలుసా? ఇంత చిన్న వయసులో వాళ్ళు పిచ్చిపిచ్చి చిత్రాలన్నీ చూస్తున్నారు రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎందుకు కొరకాకుండా పోతారు ఫోన్లను వాళ్లకు అందకుండా చూడండి ఫోన్ వాడడం తప్పని నేను అనడం లేదు ఈరోజుల్లో అది సర్వసాధారణం కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయం మీరు గమనించుకోవాలి. పిల్లలు ఒకవేళ ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్లు చూడకుండా కొన్నిటిని లాక్ వేసే అవకాశం ఉంటుంది అవి ఎవరితోనైనా చెప్పి చేయించుకోవాలి. మీకు ఒకవేళ తెలియకుంటే అంతేకానీ ఫోన్ వాళ్ళ చేతుల్లో పెట్టి మీ పనులు మీరు చేసుకుంటే సరిపోదు ఇకనుండి అయినా జాగ్రత్తగా ఉండండి పిల్లలకు ఫోన్ అందకుండా చూసుకోండి ఒకవేళ ఇచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకోండి!” అని చెప్పి మహేశ్వరి ని పిలిచి వాళ్ళ మొబైల్స్ వాళ్ళకి ఇప్పించింది..

పిల్లలను గట్టిగా హెచ్చరించింది నీలాంబరి ఇంకొకసారి బడికి వెళ్లకుండా ఇలా ఎక్కడైనా కనబడ్డారంటే పట్నం హాస్టల్లో చేర్పిస్తాను మిమ్మల్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళు పంపిస్తారు” అని చెప్పింది నీలాంబరి.

పిల్లలు భయంతో..” ఇంకెప్పుడూ ఫోన్లు తీసుకొని వెళ్ళాము మేము ఇక్కడే చదువుకుంటాము హాస్టల్లో ఉండము” అని చెప్పారు.

తర్వాత వాళ్లు ఇళ్లల్లోకి వెళ్లిపోయారు కానీ నీలాంబరి మదిలో ఇంకా ఈ సంఘటన తిరుగుతూనే ఉంది ఈ ఇద్దరు పిల్లలతో ఇది అయిపోదు ఊళ్లో మిగతా పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది సర్వే చేయించాలి. అందరికీ ఒకసారి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి ఎవరితో చేయించాలి అనేది ఆలోచించింది నీలాంబరి…

ఇంట్లోకి వచ్చిన నీలాంబరికి కూతురు కాస్త నలతగా ఉండడం గమనించింది..

” ఏమైందమ్మా ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు ముందే చెప్పు మనం హాస్పిటల్ కి వెళదాము మన ఊళ్లో మంచి హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి డాక్టర్స్ కూడా చాలా బాధ్యతగా చూస్తున్నారు” అని చెప్పింది నీలాంబరి.

” ఏం లేదమ్మా కడుపులో గ్యాస్ వచ్చినట్టుగా ఉంటుంది గొంతులో మంటగా ఉంటుంది ఎటు పడుకున్న పడుకోవడానికి కుదరడం లేదు చాలా ఇబ్బందిగా ఉందమ్మా” అని చెప్పింది అలేఖ్య.

” ఈ సమయంలో ఇవన్నీ సర్వసాధారణం తల్లి! తిన్నది జీర్ణం కాకపోవడం గ్యాస్ రావడం గొంతు మంట రావడం ఎందుకంటే బిడ్డ పెరిగిన కొద్దీ జీర్ణ కోశం మీద ఒత్తిడి పడుతుంది కదా ఆ ఆమ్లాలన్నీ గొంతులోకి వస్తుంటాయి దాంతో మంటగా ఉంటుంది అయినా నీకు తెలియనిది కాదు చదువుకున్న పిల్లవే కదా ఇక పడుకోవడం డెలివరీ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది ఒక ప్రాణిని మరొక ప్రాణి మోయడం అంటే ఒక ఆడవాళ్ళకే చెల్లుతుంది ఇదే మాతృత్వం దేవుడు మహిళలకు ఇచ్చిన వరం” అని చెప్పింది నీలాంబరి.

” ఎంత తెలిసిన చదువుకున్న అనుభవం మాది అనుభవించిన అనుభవం మీది ఎలాగైనా కొంచెం భయంగానే ఉందమ్మా” అని చెప్పింది అలేఖ్య.

అలేఖ్య తల మీద చేయి వేసి దగ్గర కూర్చుంది నీలాంబరి.

” ఏమీ భయపడకు అంతా సవ్యంగా జరుగుతుంది నీ బిడ్డను చూసుకున్న తర్వాత అన్ని మర్చిపోతావు” అని నవ్వింది నీలాంబరి.

నవ్వుతూ కళ్ళు మూసుకుని నీలాంబరి ఒడిలో తలపెట్టుకొని పడుకుంది అలేఖ్య.

శ్రావణమాసం వచ్చేసింది… వానలు జోరుగా కురుస్తున్నాయి… ఈ నెల అంతా పూజలు నోములు ఉండనే ఉంటాయి…. అలేఖ్య మంగళ గౌరీ నోము నోచుకోవాలి ఈసారి మూడవ సంవత్సరం కానీ 9వ నెల వచ్చినందువల్ల పూజారి గారు వద్దని చెప్పారు “ఈ పరిస్థితిలో నోములు ఏమి చేసుకోకూడదమ్మా!” అని చెప్పారు.

శివాలయంకు వెళ్లి అభిషేకాలు చేయించుకుంది నీలాంబరి.. సోమవారాలు ఉపవాసం చేస్తుంది.

రెండవ శుక్రవారం వచ్చింది. ఆరోజు వరలక్ష్మీ వ్రతం నోచుకోవాలని అనుకున్నది నీలాంబరి… అంతకు ముందు రోజు రాత్రి అమెరికా నుండి సుధీర్ వచ్చాడు డెలివరీకి ఇంకా 15 రోజుల టైం ఉన్నందువల్ల అలేఖ్యకు ఏదైనా సహాయం చేయవచ్చని ముందుగానే వచ్చాడు.

వరలక్ష్మీ వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు… ఇంతలో ఉన్నట్టుండి అలేఖ్య.”.అమ్మా..” అని గట్టిగా పిలిచింది

ఒక్క ఉదుటున నీలాంబరి సుధీర్ భూపతి పరుగు పెట్టి అలేఖ్య గదిలోకి వెళ్లారు…

అలేఖ్య పొట్ట పట్టుకుని “నొప్పి వస్తుందమ్మా” అని ఏడుస్తుంది…

హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ కి పరిస్థితి వివరించారు కండిషన్ అంతా వివరించిన తర్వాత వాళ్లు సాయంత్రం తీసుకొని రమ్మని చెప్పారు…

నీలాంబరి అలేఖ్యకు గోరువెచ్చని నీళ్లలో కొంచెం నెయ్యి వేసి తాగడానికి ఇచ్చింది అవి తాగిన తర్వాత కొంచెం ఉపశమనం అనిపించి పడుకుంది అలేఖ్య.

నీలాంబరి వరలక్ష్మి వ్రతం నోచుకోని సాయంత్రం తొందరగానే అందరికీ తాంబూలాలు ఇచ్చుకొని హాస్పిటల్కు బయలుదేరారు..

హాస్పిటల్కి వెళ్ళగానే అలేఖ్యను చూసే డాక్టర్ వచ్చి ఒకసారి పరీక్షించి మరొక రెండు గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పి లేబర్ రూమ్ కి తీసుకొని వెళ్లారు…

అందరూ ఆతృతగా బయట కూర్చుని ఎదురుచూస్తున్నారు…

రెండు గంటల తర్వాత డాక్టర్ వచ్చి నవ్వుతూ..” శ్రావణ లక్ష్మి పుట్టింది మీ ఇంట్లో” అని చెప్పింది.

ఒక్కసారి నీలాంబరి భూపతి సుధీర్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు… నీలాంబరి భూపతి లకు మొదటిసారి ఆడపిల్ల పుట్టాలని అనుకున్నారు సుధీర్ కు మాత్రం ఎవరు పుడతారో ముందే తెలుసు ఎందుకంటే అమెరికాలో ముందే చెప్తారు కాబట్టి..

వెంటనే సుధీర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు వాళ్ల సంతోషానికి అవధులు లేవు…

ఒక అరగంట తర్వాత పాపను చూడడానికి అనుమతి ఇచ్చారు…

అలేఖ్య నవ్వుతూ పాపను మురిపెంగా చూస్తుంది…

నీలాంబరి పాపని తన చేతుల్లోకి తీసుకొని అలా మెల్లగా గుండెలకు హత్తుకుంది.. ఆ తర్వాత సుధీర్ కి ఇచ్చింది సుదీర్ తన ఒడిలోకి తీసుకొని తండ్రి వాత్సల్యాన్ని చూపించారు.. భూపతికి ఎత్తుకోవడం చేతకాదు కాబట్టి అలా దూరం నుండి చూసి మురిసిపోతున్నాడు.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సేవానిరతిలో మెరిసిన స్వాతిముత్యం – పి. గీత

జాబిలి