అమ్మా!నీ ప్రేమకన్న మిన్న ఏది జగతిలో
తల్లీ!నీ కరుణ కన్న ఘనత లేదు అవినిలో.
“అమ్మా”
నవమాసాలు మోసి
నవనాడులు కూడ దీసి
నరకయాతనంతటినీ
ప్రసవానికి భరియించి
నందనముగ పసిబిడ్డను
ఒడిలోనికి చేరదీసి
నగమువంటి నగవులతో ప్రేమ దీప్తి పంచెదవు.
“అమ్మా”
చిన్నారి చిట్టి వేళ్ళ
స్పర్శలోన మురిసిపోయి
పొన్నారి బుజ్జిపదము
ముద్దాడి ముగ్ధవయ్యి
మురిపెముగా పసిపాప
కనులకాంతి హృదిన నిలిపి
ముదమార హత్తుకున్న
అమృతానుమూర్తివమ్మ.
“అమ్మా”
బుడి బుడి అడుగులతో
చిట్టిపొటి నడకలతో
నిను చేర వచ్చేటి
బుజ్జాయిని ఎత్తుకొని
ఆనందమూర్తివై
మమతానురక్తివై
ఆత్మీయత పెనవేసిన
అనురాగ వల్లివమ్మ.
“అమ్మా”
తడబడు అడుగులకు
ఒదిగియుండు నడత నేర్పి
తనువంతా సత్తు చేర్చి
శ్రమ శక్తిగ నీవు నిలిచి
తాపసిగా తపనచెంది
నీ బిడ్డల శ్రేయమెంచి
తల్లడిల్లి పోయెదవు
తల్లీ!మా వందనము.
“అమ్మా”