దూరాన ఉన్నా…
దండిగా దీవెనలు అందిస్తుంది!
విసుగుతో కసురుకున్నా…
చిరునవ్వుతో వరాలు ఇస్తుంది!
సేవకురాలిగా, వంటకత్తెగా, పనిమనిషిగా…
నెచ్చెలిగా,గురువుగా,
వైద్యురాలిగా…
పలు రూపాల అవతారమెత్తుతుంది!
ఆపదలో ఆవేదనతో పిలిస్తే చాలు…
గజేంద్రుని రక్షించే శ్రీమన్నారాయణుని వలె
ఎక్కడివక్కడే వదిలేసి…
వడివడిగా పరుగులెత్తుతూ
నీ చెంతకు చేరుతుంది!
సంతాన సంతోషమే ఆమె స్వర్గం!
వారి దుఃఖమే ఆమెకు నరకం!
అడగకుండానే కోరికలు తీరుస్తుంది…
ఆకలి తెలుసుకుని కడుపు నింపుతుంది…
నీ మనసు తెలిసి మసలుకుంటుంది!
సమస్యలకు పరిష్కారపు గొడుగై నిలుస్తుంది…
నీ ఆశయాలకు వెన్నుదన్నుగా నిలిచి…
నీవు సాధించిన విజయాలకు
వెన్ను తడుతుంది!
అమ్మంటే అనురాగ గోపురం…
క్షమ,ప్రేమలకు ప్రతిరూపం…
అమ్మంటే ఎల్లవేళలా నీకు అండదండ!
పూజా పునస్కారాలను అడగని…
స్తుతి స్తోత్రాలను ఆశించని…
సేవా నైవేద్యాలను కోరుకోని
గుడి లేని దైవమే కదా అమ్మ!
**************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.