మనం మామూలు జీవితం గడుపుతున్నాం. మనకు రాజకీయాలతో పనేమున్నది అనే అనుకుంటూ బ్రతుకుతుంటాం. రాజకీయాల్లోకి వెళ్ళకున్నా, ఏ సంబంధం లేకున్నా అస్సలే నచ్చకున్నా, చిరాకైనా ఐనా… ఐనా.. ఇలాంటి వే ఎన్నో అభిప్రాయాలు ఉన్నా రాజకీయాల ప్రభావం ప్రతి వ్యక్తి పై ఉంటుంది.
మన తిండి, చదువు, ఉద్యోగం, మన విందు వినోదాలు, మన చావు పుట్టుకలన్నీ కూడా రాజకీయాలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం అయి ఉంటాయి. కాబట్టి రాజకీయాలపై కొంతైనా అవగాహన ఉండాలి.
రాజకీయాలకూ ఎన్నికలకూ ఉన్న సంబంధం ఏమిటి అనేదందరికీ తెలిసిందే ! నాయకులు, పార్టీలు , ఎజెండాలూ ఎన్నికలతో ముడిపడి ఉండే అంశాలు. ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు . మన భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ప్రాథమిక హక్కు. హక్కులను రక్షించాలని అడిగే అర్హత బాధ్యత లను గురించి నిర్వహించినప్పుడే పొందగలం. పౌర హక్కులు – బాధ్యతలు అనేవి వ్యక్తికి రెండు భుజాల వంటివి తప్పకుండా బాధ్యతను నెరవేర్చాలి . ఎన్నికలలో నిలబడిన వ్యక్తుల్లో నచ్చిన అభ్యర్థికి ఓటువేయాలా? నచ్చిన పార్టికి ఓటు వేయాలా ఒక సందిగ్ధత కూడా వస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలాచాలా పరిశీలించి పరిశోధించి ఓటు వేయాలి. పార్టీ చరిత్రనూ, నాయకుల నేచర్ నీ తెలుసుకోవాలి . మెనిఫెస్టోలలో చెప్పిన అంశాలు చూడాలి.
ఇవన్నీ తికమకను కలిగిస్తాయి. ఒక్కోసారి ఆలోచించి ఆలోచించి మనసు వేదన పడ్తుంది కూడా! విసుగు పుడుతుంది ! అయినా తప్పదు ! ఎందుకంటే దీనివల్ల రెండు నష్టాలున్నాయి. 1. పౌరహక్కును వదులుకోవడం తప్పు.
2. ఓటు వృధా అయిపోతుంది. ఓటు రిగ్గింగ్ చేసే అవకాశాలు పూర్వం ఉంటుండేవి.
ప్రలోభాలకు గురిచేస్తారు. ఆశలు పెడతారు. అబద్ధాలు చెప్తారు . ఇవన్నింటినీ అధిగమించాలి. నీరసమో, నిర్లక్ష్యమో డామినేట్ చేస్తుంటాయి. అధిగమించాలి. ఓపికగా వెళ్లి ఓటేయాలి. ముఖ్యంగా యువతలో స్తబ్దత వచ్చిందని ఈ మధ్య గమనిస్తున్నాం. ఇంట్లో వాళ్లు బలవంతంగానైనా పంపాలి. ముసలివాళ్లు ఎంత కష్టమైనా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇది చాలా ప్రేరణగా ఉంది. సీనియర్ సిటిజన్స్, నడవలేని వాళ్ళు, చేతకానివాళ్ళు తమ ఓటు వేయాలంటే ఎలక్షన్ కమిషనర్ కు సంబంధించిన సేవలను వినియోగం చేసుకోవడానికి నిబంధనలను తెలుసుకొని అప్లై చేయాలి వాళ్లే ఇంటికి వచ్చి ఓటు వేయించుకుని వెళ్తారు. కాబట్టి ఇలాంటి సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. ఇవన్నీ తెలియకనా కానీ, అన్నీ తెలిసీ ఏమవుతుందిలే నా ఒక్క ఓటు లేకుంటే ఏమవుతుంది అనుకుంటారు. ఇవన్నీ అధిగమించి ఓటు వేయాలి.
సమాజంలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తుల బాధ్యత.
2024 పార్లమెంట్ ఎలక్షన్లు ఈ నెల 13 న తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాలలో ఉన్నాయి. ఎండల భగభగలు ఎలా వేడిగా ఉన్నవో ఎన్నికల భుగభుగలు అంతకన్నా వాడిగా ఉన్నాయి.
ఓపిక ప్రదర్శిద్దాం !
ఓటు హక్కు ఉపయోగించుకుందాం!!