కాలింగ్ బెల్ చప్పుడుకి, ఉలిక్కిపడి లేచాను. ఎవరబ్బా ఇంత పొద్దున్నే…అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసా. తీరా చూస్తే వచ్చింది ఎవరో కాదు. ఓ అందమైన ఫ్లవర్ బొకే తీసుకుని ఎదురుగా కొరియర్ బాయ్..! హ్యాప్పీ మదర్స్ డే మేడమ్ …. మీకు యు.ఎస్ నుంచి కొరియర్ అంటూ బొకే నాకందించి, ఇక్కడ సంతకం పెట్టండి మేడమ్ అని ఓ పేపర్ నా ముందుంచాడు. ఓ ఈరోజు మదర్స్ డే నా… అందుకే ఎప్పుడూలాగే కృష్ణ విషెస్ పంపినట్లుంది అనుకుంటూ సంతకం పెట్టి బొకే తీసుకుని లోపలికి నడిచాను. అప్పుడే వికసించిన గులాబీల అందానికీ, సువాసనకీ మైమరిచిపోతూ వాటినే తదేకంగా చూస్తూ గత స్మృతుల్లోకి అప్రయత్నంగా జారుకున్నాను. అది నేను మొట్టమొదటిసారి అమెరికాలో ఉన్న మా ఒక్కొగనొక్క కూతురు కృష్ణని చూడటానికి వెళ్ళినప్పటి సంగతి. మేం వెళ్ళిన పది రోజులకనుకుంటా ఈ ‘మదర్స్ డే’ వచ్చింది. అప్పట్లో ఈ మదర్స్డే అనేది ఒకటుందని కూడ మాకు తెలీదు. ఆ రోజు నాకు బాగా గుర్తు మా చిట్టి తల్లి కృష్ణ నాకు ఓ వెలకట్టలేని గిఫ్ట్తో ఎంత సర్ప్రైజ్ ఇచ్చిందనీ…..చెప్పొద్దూ నేను ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైన ఆ క్షణం ఎన్నటికీ మరువలేనంటే నమ్మండీ..! ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే ఓ డైమండ్ లాకెట్తో చేసిన గోల్డ్ చెయిన్…అది చూసిన నాకు నామీద దానికున్న ప్రేమకు ఓ ప్రక్క పొంగిపోతూనే మరోప్రక్క ఇప్పుడు నా కోసం ఇంత ఖర్చు పెట్టడం ఇష్టంలేక, దాన్ని కొద్దిగామందలింపు ధోరణిలో ఎందుకే ఇప్పుడింత ఖర్చు పెట్టి ఇది కొనడం అంత అవసరమా అన్నాను. దానికది “ ఛఛ అలా అనకమ్మా ఇది మామూలు గిఫ్ట్ కాదమ్మా ఇందులో ఇన్నాళ్ళగా నన్ను కని పెంచి నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నీ ప్రేమకు కృతజ్ఞతగా నీ పట్ల నాకున్న ప్రేమను ప్రకటించుకునే ఒకే ఒక వారధి. అఫ్కోర్స్ మదర్స్ లవ్ అనేది వెలకట్టలేనిది. కానీ అది ప్రకటించుకోవడానికి ఏదో ఒక మీడియమ్ ఉండాలిగా…అదే నా ఈ గిఫ్ట్ అనుకో….కానీ నువ్వు ఈ పద్ధతికి అలవాటులేనిదానివి. మన దేశంలో మనం ఎరగం. కానీ అమెరికాలో ఇది కామన్. వీళ్ళకి ఈ మదర్స్డేఅంటే ఎంతో స్పెషల్. తల్లి పట్ల తమ ప్రేమాభిమానాలనూ, గ్రాటిట్యూడ్నూ ఈ మదర్స్డేనాడు ఆవిడకి ఆనందంకలిగించే గిఫ్ట్ ఇచ్చి సెలిబ్రేట్ చేస్తారు….కాబట్టి నువ్వు నాకు చేసినదానితో వెయ్ చేస్తే ఆఫ్ట్రాల్ దిస్ ఈజ్ నథింగ్ అమ్మా సో డోన్ట్ సే నో ఓకే మై డియర్ మామ్ అన్నది నన్ను హగ్ చేసుకుంటూ…!
‘ ఏంటోయ్ అంతలా ఆలోచనలో పడిపోయావు ….చేతిలో ఆ బొకే ఏంటి? ఎవరు పంపారు పొద్దున్నే…” మార్నింగ్ వాక్నుంచి వచ్చి అన్న శ్రీవారి మాటలకి ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. ఆ ఏం లేదండీ ఇవ్వాళ మదర్స్ డేట కదా మన కృష్ణ పంపించింది. పిచ్చి తల్లి ప్రతీ ఇయర్ మరిచిపోకుండ పంపుతుంది…. ఊ పదండి పదండి దానికి కాల్ చేసి బొకే అందిందని చెప్పొద్దూ….అంటూ లేచాను.అవునవును చెప్పాలి అయినా వసూ గత కొన్నేళ్ళల్లో ఎంత మార్పు….అసలు మదర్స్డే అంటేనే తెలీని మనదేశంలో కూడ ఇప్పుడు అందరూ మదర్స్డేని సెలిబ్రేట్ చేస్తున్నారు కదోయ్…కానీ ఈ విషయంలో టోటల్ యాక్సప్టెన్స్ మన దేశంలో ఇంకా రాలేదు. ఎందుకో చెప్పమంటావా? మన కల్చర్ ప్రకారం తల్లి తండ్రులను పూజించడం….ఓ పెడస్టల్లో పెట్టడం వగైరా ఉన్నాయి కదా…మరి అలాంటప్పుడు ఎల్లప్పుడూ తలచుకోవలసిన తల్లిని ఇలా ఏడాదికోసారి గిఫ్ట్ లు ఇచ్చి గౌరవించడం అంటే తల్లిని అవమానించడమేనని కొందరి ఒపీనియన్. మరి నీవేమంటావ్…?
ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమేనండీ. నా మటుకు నాకు తల్లీబిడ్డల అనుబంధం విడదీయరానిదే అయినా కాలం గడుస్తున్నకొద్దీ వారి మద్య అంచెలంచెలుగా దూరం పెరుగుతూ వస్తుంది. ముందు ఈ దూరం పిల్లలు స్కూలుకెళ్ళటం మొదలుపెట్టినప్పటినుంచీ స్టార్ట్ అయి, స్కూల్నుంచి కాలేజీలకు,తరువాత ఉద్యోగాలకై వేరే ప్రాంతాలు,పైచదువులకై విదేశాలకూ, ఫైనల్గా పెళ్ళిళ్ళతో ఆ దూరం మరింత పెరిగి తల్లీ, తల్లిప్రేమ, ఆమెతో గడిపిన క్షణాలూ అన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకాలపుటలలోకి వెళ్ళి తాత్కాలికంగా మరుపుకు గురవుతాయని ఒప్పుకుంటారా…! అదుగో అప్పుడే ఈ మదర్స్డేయొక్క ఇమ్పార్టెన్స్ బయటపడేదంటాను. ఓ విధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకునైనా పిల్లలు తప్పనిసరిగా తల్లినీ తల్లితో తమకున్న అనుబంధాన్నీ ఈ రూపంగానైనా గుర్తు చేసుకుని ఆమెతో ఒక రోజైనా సంతోషంగా గడుపుతారన్న ఒకానొక సదుద్దేశ్యమే తప్ప దీని వెనుక మరే ఉద్దేశ్యమూ లేదు . ఏమంటారు…?
“ వావ్ వెల్ సెడ్ మైడియర్ వాసంతీ” అంటూనే నాకెందుకో నిన్ను చూస్తుంటే మహ జెలసీగా ఉందోయ్” అన్నాడు మహేష్ చిలిపిగా. ఎందుకూ అన్నట్లు చూసింది…” ఎందుకా…ఏడాది తిరిగేసరికల్లా కూతురి దగ్గరనుంచి బొకేలూ,కాస్టలీ గిఫ్ట్లూ కొట్టేస్తున్నావుగా..అందుకూ”
“ ఓహ్ అందుకేనా మరే తమరికీ వస్తుందిగా ఫాదర్స్ డే అదీను…”
ఎట్టా అయినా అదృష్టమంటే మీ ఆడవాళ్ళదేనోయ్, మాదేముందీ ఏం కట్టుకున్నా..ఏం వేసుకున్నా ఒకటే నో డిఫరెన్స్ ఎట్ఆల్…” అన్నాడు. బదులుగా వాసంతి ఏదో అనేలోగా పక్కింటి పదేళ్ళ తరుణ్ చేతిలో లిలీ పూలతో లోపలికి వచ్చి “ హ్యాప్పీ మదర్స్ డే ఆంటీ “అంటూ విష్ చేసాడు. ‘ నాట్ బ్యాడ్ ఇండియా ఈజ్ ఆల్సో ప్రోగ్రెస్సింగ్’ అనుకుని భార్యను చూసి కన్ను గీటాడు మహేష్.
*
మాధవపెద్ది ఉష
7-5-2024