మహిళల సమస్యలు – మానసిక ఒత్తిడి

డా. వై. సుభాషిణి

మహిళలు జనాభాలో సగభాగం. స్త్రీలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు. కానీ వారి జీవితంలో నిరంతరం ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు. ఒకప్పుడు వంటపనికే పరిమితమై ఉండేది స్త్రీజీవితం. పురుషులు చదువుకున్నంత సంఖ్యలో మహిళలు విద్యావంతులు కాకపోవడంతో వారు సమాజంలో నాటుకొనిపోయిన మూఢవిశ్వాసాలకు దురభిప్రాయాలకు బానిసలై ఉండేవారు. నిరక్షరాస్యత, సతీసహగమనం మొదలైన దురాచారాలతో అనేక రకాలుగా పీడింపబడేవాళ్లు. కానీ క్రమంగా వారు విద్యావంతులై అనేక రంగాలలో విశేష ప్రతిభను కనబరుస్తూ రాణిస్తున్నారు. నేటి మహిళలు మహిళలు మాత్రమే కాదు, మహా శక్తి స్వరూపిణులు. ఎందరో స్త్రీలు వారి అభ్యుదయానికి వివిధ రంగాలలో కృషిచేసి సమాజానికి మేలు చేయడం స్త్రీ లోకానికే ఆదర్శం. కానీ మహిళల విషయంలో జరిగిన అభివృద్ధికంటే దేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలే లెక్కకు మిక్కిలి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహిళలు స్వతంత్రంగా నడివీధిలో తిరిగిన రోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ ఆనాడే పేర్కొన్నట్లుగా స్త్రీ స్వాతంత్ర్యమే దేశ స్వాతంత్ర్యమని అర్థం. కానీ ఇప్పటికీ స్త్రీలు పురుషులవలె బహిరంగంగా తిరగడానికి సంకోచిస్తున్నారు దానికి కారణం సమాజంలో నానాటికీ ప్రబలుతున్న మద్యపానం, అవినీతి మొదలైన దురాచారాలే. ఇవన్నీ స్త్రీలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

స్త్రీ జీవితమే ఒత్తిడి. అనేక బాధ్యతలతో కూడుకున్నది. అందుకే ఒత్తిడి సహజం. ఒత్తిడి ఒక మేర వరమే.ఎందుకంటేపనులు వేగవంతం కావడానికి అది అవసరం. పరిమితి మించినా, నిరంతరం ఒత్తిడికి గురి అయినాఅదిహర్షించదగ్గ విషయం కాదు. వెంటనే తొలగించుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆఒత్తిడి మనిషి మానసిక శక్తులపై ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎన్నో కోణాలలో ఉంది. అందులో కొన్ని: ఆర్థిక సామాజిక సమస్యలు, అసమానతలు, లైంగిక వేధింపులు, పేదరికం, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యంవంటివి.

  1. ఆర్థిక సామాజిక సమస్యలు : ఆర్థిక, సామాజికపరమైన ఒత్తిడి స్త్రీపై ఉంటుంది. అది ఎక్కువైతే అవధిలేని సమస్యగామారి మానసిక క్షోభకు గురిచేస్తుంది.ఆర్థిక, సామాజిక సమస్యలు అవి కల్పించే మానసిక ఒత్తిడి అనంతం. సాధారణంగా మహిళల్లో పెళ్లి, ఆ కారణంగా ఏర్పడే సమస్యల గురించి భావోద్వేగాలకు గురైతే, ఆ తర్వాత కాలంలో పిల్లలూ, వారి చదువుల గురించి ఆలోచిస్తారు.నలభై, యాభై ఏళ్ల వయసులో ఎక్కువగా ఆర్థిక అభద్రతకు లోనవుతారు. ఫలితంగా వారిలో ఒత్తిడి పెరిగిపోతుంది. మనదేశంలో అత్యధికమంది మహిళలు అభివృద్ధిపరంగా వెనకడుగు వేయడానికీ,ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేకపోవడానికి ప్రధానకారణం ఆర్థికపరమైన అభద్రతాభావమే. ఇదే మహిళలను ఒత్తిడికి ఆత్మన్యూనతకూ గురి చేస్తున్నది. ఇది ఇలా ఉండగా మరో వైపు పురుషుల దోపిడీ స్త్రీలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె సంపాదనాపరురాలైతే మరీను. ఆర్జించే సామర్థ్యం ఎక్కువయ్యే కొద్దీ అది మరింత ఎక్కువగా ఉంటుంది. సంపాదనాపరురాలైన స్త్రీకి అధి కేవలం శారీరక కష్టం మాత్రమే కాదు సుమా! విపరీతమైన మానసిక ఒత్తిడి కూడా.
  2. అసమానతలు : ప్రపంచంలో మహిళలకు స్వేచ్ఛ సమానత్వం ఉన్నాయనీ, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని చెప్పే కబుర్లకీ, వాస్తవంగా స్త్రీ గడుపుతున్న జీవితానికీ మధ్య అంతరం ఎంతో ఉంది. ఎందుకంటే స్త్రీ పురుషుల అసమానతల్లో ఎన్నో సున్నితమైన అంశాలున్నాయి. కనీసం కంటికి కనిపించనంతటి బాధలున్నాయి. అవి బాధలుగా స్త్రీలు కూడా గుర్తించని సందర్భాలున్నాయి. అటువంటి చిన్న విషయాలనే మనం నిత్యం కుటుంబ జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ ఎదురయ్యే సన్నివేశాలలో గమనించవచ్చు. ఈ అసమానతలు కేవలం ఇప్పటివి కావు. ఎప్పటినుండో ఉన్నాయి. ఆలోచనాధోరణులలోనూ, దృక్పథంలోనూ అంతరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది అభిలాషణీయంకాదని తెలిసినా మార్పులేదు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలను మానసిక శారీరక బాధలకు గురి చేస్తున్నాయి ఈ అసమానతలు. ఎందరినో అకాలమరణం పాలుచేస్తున్నాయి. ఇది అన్ని వర్గాలలో,అన్నిసమాజాలలో, అన్ని రంగాలలోనూ కనిపిస్తోంది. ప్రాచీనకాలంనుండి ఆధునికకాలం వరకు మహిళలు అసమానతా సంకెళ్ళలోనే బంధింపబడి ఉన్నారు. ఇది మూఢాచారంగా కొంతయితే, అలవాటుగా మరికొంత అణగారి బ్రతకడమే మహిళ బ్రతుకుగా పరిణమించిందనే నిస్పృహ వారిని ఎంతో మానసిక వ్యధకు గురిచేస్తోంది.
  3. లైంగిక వేధింపులు : స్త్రీలు ఎదుర్కొనే మరోప్రధాన సమస్య. ఇది ఫలానా చోట అనేది ఉండదు. అడుగడుగునా స్త్రీ భయపడే సమస్య ఇది. చిన్న వయస్సులోనే ఆడపిల్లల మీద ఎన్నో లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. పసిమొగ్గలాంటి ఆడపిల్లలమీద ఇళ్లల్లో, పాఠశాలల్లో, హాస్టళ్ళలో, పొలాల్లో కాముకులు చేసే లైంగికదాడులు అన్నీ ఇన్నీ కావు. అడ్డూ అదుపూలేని లైంగిక దాడులతో కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేక కొందరు, మానసికంగా చితికిపోయి మానసిక రోగులుగా మరికొందరు తయారవుతున్నారు. మరికొందరు ధైర్యంగా ఫిర్యాదుచేసినా నిరుపేద మహిళలకు సరైనన్యాయంకూడా దక్కడంలేదు. ఈ సమస్యలతో స్త్రీలు ఎంత మానసిక వేదనకు గురవుతారో ఎవరూ గుర్తించరు. కనీసం ఊహించలేరు. స్త్రీల అభ్యుదయాన్ని కోరి ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు సంస్కర్తలు ఎన్నో చట్టాలు చేశాయి. ఉద్యమాలు నడిపాయి. అయినా కొత్త రూపాలలో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. విస్తృతమవుతున్నాయి. స్త్రీల జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఫలితంగా స్త్రీలు ఎంతో ఒత్తిడికి, మానసిక దౌర్భల్యానికి గురి అవుతున్నారు.
  4. పేదరికం : స్త్రీ అనేదే కష్టాల పరంపర. హద్దులు అంటూ లేవు. అది ఎప్పుడైనా కావచ్చు ఎలాగైనా జరగవచ్చు. స్త్రీకి సమస్య ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ సమస్యలకు తోడు స్త్రీకి పేదరికం తోడైతే మరి ఆకష్టం మాటల్లో వ్యక్తం చేయలేనిది. ఎందుకంటే పేదరికపు స్త్రీలు సైతం పురుషాధిక్యతకే గురవుతున్నారు. పేద మహిళలు వారి జీవితంలో ఇంట్లోనూ, బయటా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కారణం ఇంట్లో భర్తదగ్గర దెబ్బలు తినాల్సి రావడం, బయట పనికి వెళ్ళినప్పుడు అక్కడ మరోరకమైన అనుమానాలు…. ఇవన్నీ దారుణమైన పరిణామాలే.వీరు ఎదుర్కొనే సమస్య శారీరకమేకాదు, మానసికం కూడా. మహిళలే పెద్దదిక్కుగా ఉన్న కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పేదరికమే వారి పాలిట శత్రువై వారిని మింగేస్తోంది.
  5. కుటుంబ బాధ్యతలు : సామాజిక జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని వ్యవస్థలు మారినా స్త్రీపట్ల పురుషుల వైఖరిలో పెద్దగా మార్పు వచ్చిందని చెప్పలేం. ఎందుకంటే సాంఘికంగానే కాదు కుటుంబంలోనూ స్త్రీని చిన్నచూపు చూడటం అన్ని వర్గాలలోనూ కనబడుతోంది. బానిసగా పరిగణించబడుతున్నారు. కుటుంబంలో స్త్రీకి భార్యగా, తల్లిగా, గృహిణిగా, అత్తగా, కోడలిగా నిర్వర్తించే బాధ్యతలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. దానికి తోడు భర్తలు తాగి తందనాలాడటం. స్త్రీలే అన్ని చేయాలంటారు పురుషులు. ఏదైనాసరే నోరు తెరిచి మాట్లాడకూడదని ఆక్షేపణలు విధిస్తారు. పిల్లలకి జన్మనివ్వడంతో పాటు వారి పోషణ, శిక్షణ అన్నీ మహిళలే చూసుకోవాలంటారు. నడుములు విరిగే చాకిరీతో నలిగిపోతున్నారు. ఇన్ని బాధ్యతలను నిర్వర్తించలేక కొంత ఒత్తిడికిలోనవడం సహజం.

మరి అదే స్త్రీ ఉద్యోగస్తురాలయితే ఆ స్త్రీ అనుభవించే శ్రమ ఒత్తిడి పేర్కొనడానికి భాష చాలదు.పేరుకుఉద్యోగస్తురాలే అయినా ఆమెకు ఆర్థిక స్వావలంబనలేదు. ప్రతి విషయానికీ భర్తపై ఆధారపడాలి. ప్రతి పైసాకు భర్తకు వివరణ ఇవ్వాలి. ఆ ఖర్చుకు అంగీకారం పొందుతుండాలి…. అనే స్థితి ఎందరో స్త్రీల విషయంలో సామాన్యం. ఇవన్నీ కుటుంబంద్వారా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు. వీటికి కృంగిపోయి మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడటం వల్ల వారికి కలిగే ఒత్తిడి చెప్పనలవికానిది.

  1. ఆరోగ్యం : పురుషుడు కల్పించిన ప్రపంచంలో స్త్రీ బందీగా ఉంది.స్త్రీ సుఖదుఃఖాలు, నిమ్నోన్నతాలు, ఆరోగ్యనారోగ్యాలకు పురుషుడే ప్రధాన కేంద్ర బిందువు అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే మూల పురుషుడు తనే.స్త్రీఆరోగ్యం, జీవిత చక్ర పరిణామంలో ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంది కారణం నేటి మహిళలు ఇంటా బయటా రకరకాల పనులతో బిజీగా ఉండటం. ఉద్యోగం, ఇంటిపనుల మధ్య నలిగిపోతూ తమ తిండితిప్పల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం. కనీసం భర్తలు కూడా వారి గురించి ఆలోచించకపోవడం… ఇవన్నీ వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఈక్రమంలో స్త్రీలు ఎదుర్కొనే ఒత్తిడికానీ వేదనకానీ కనీసం పురుషులు గుర్తించను కూడా గుర్తించరు. స్త్రీలు ఎన్నిరకాల ఒత్తిడులకు గురి అవుతారో ఆ సమస్యల మధ్య నలిగే మనసుకు తప్ప మరొకరికి తెలియవు, అర్థం కావు కూడా.
  2. పరిష్కార మార్గాలు : స్త్రీ జీవితంలో అనునిత్యం ఎన్నో రకాల ఒత్తిళ్ళూ, క్షణం తీరికలేని పనులు ఇలా కారణం ఏదైనా చాలాసార్లు మానసికంగా ఆందోళన చెందుతాం. దాన్ని అధిగమించాలంటే జీవితంలో నిత్యం ఎదురయ్యే ప్రతి సంఘటననూ, సన్నివేశాన్నీ స్త్రీ పరంగా పరిశీలించాలి. స్త్రీలు తమనుతాము శక్తివంతంగా మలుచుకొని ఈసమాజ పరిణామానికి మూలకర్తలు కావాలి. అదేవిధంగా పాజిటివ్ దృక్పథం అలవాటు చేసుకుని మానసికస్థైర్యం కలిగి ఉండాలి. మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. యోగా, ధ్యానం వంటి వాటిద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సవ్యంగా ఉంచుకోవచ్చని ఎన్నో వేలసంవత్సరాల కిందటే తేలింది కనుక వాటిని అనుసరించాలి. పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఫలితంగా కొంత ఉపశమనం కలిగి ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నవ్వడం, నవ్వించడం ఓ అలవాటుగా మార్చుకుంటే ఒత్తిడి చాలా మటుకూ అదుపులో ఉంటుంది.

Written by Dr. Y. Subhashini

డా. వై. సుభాషిణి
అసిస్టెంట్ప్రొఫెసర్
తెలుగుఅధ్యయనశాఖ
శ్రీపద్మావతిమహిళావిశ్వవిద్యాలయం
తిరుపతి - 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓటు హక్కు

మదర్స్ డే