ఓటు హక్కు

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అప్పటినుండి మనం బానిసత్వం పోయి ప్రజాతంత్ర పాలనలో ఉన్నాను. ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఎన్నికలలో రాష్ట్రపరంగా, దేశపరంగా మనకు నచ్చిన నాయకునికి ఓటేసి గెలిపించుకోవడం పరిపాటి. ఓటు అనేది ఒక దెబ్బతీయని ఆయుధం. మనకి నచ్చని నాయకుని తొలగించడానికి ఓటు ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అదే ఓటు ప్రజలను ఉద్ధరించే నాయకుని తెస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఒక పౌరుడిగా మన మీద చాలా బాధ్యత ఉంది. అది తెలుసుకున్నప్పుడే మనం మంచి నాయకుడిని ఎన్నుకోగలం.


ఇదివరకటికంటే ఇప్పుడు ఎన్నికలలో చాలా మార్పులు వచ్చాయి. మనుషుల తత్వాలు మారినట్టే ఎన్నికలలో నుంచునే నాయకుల మనస్తత్వాలు మారిపోయాయి. కక్షలు,కార్పణ్యాలతో నేడు జరుగుతున్నాయి ఎన్నికలు. వ్యక్తిగత దూషణలు, దాడులు కూడా కనిపిస్తున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలు కూడా ఎక్కువయ్యాయి. అందుకే మనం ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. మన పురాణాలలో నాయకులు ఎలా ఉండాలో కొన్నిఉదాహరణలతోసూచించారు.నాయకులకు ఉండ వలసిన లక్షణాలను ఈ విధంగా పోల్చి చెప్పారు. అది ఏమిటో ఒకసారి చూద్దాం….
మొదట నాయకుని సూర్యునితో పోల్చారు. సూర్యుడు ఎలాగైతే తన కిరణాలను బేధ బుద్ధి లేకుండా ప్రచురింప చేస్తాడు అలాగా తనను ఎన్నుకున్న ప్రజలను సమ బుద్ధితో చూడాలని.
తరువాత చంద్రునితో పోల్చారు. తన ఆహార్యంతో, తన చల్లని చూపులతో భూమిని పైరు పంటలతో సస్యశ్యామలం చేస్తాడు చంద్రుడు. అలాగే నాయకుడు కూడా తన ప్రజలకు కావలసినవి అందిస్తూ, ఎప్పుడు దయ కలిగి ఉండాలి
పిమ్మట భూదేవితో పోల్చారు. భూదేవి తనను ఎంతమంది ఎన్ని విధాల కష్టపెట్టినా చాలావరకు ఓరిమిగా ఉంటుంది. మితిమీరితే ఒక ఊపు ఊపుతుంది.అలాగే నాయకుడు కూడా వ్యక్తిగతంగా కానీ పరిపాలనాపరంగా కానీ ప్రజల దగ్గర ఓరిమితో మసలికోవాలి. దండించవలసిన సమయం వచ్చినప్పుడు దండించవచ్చు.
నాయకుని ఇంద్రునితో కూడా సరిచూపారు. ఇంద్రుడు మేఘాలకు అధిదేవత. ప్రజల యొక్క ధర్మాధర్మాలను పరిగణలోకి తీసుకుని వర్షం కురిపిస్తాడు. నాయకుడు కూడా అలాగే ప్రజల మీద హర్షమర్షలను కురిపించాలి. వర్షం కోసం ఎదురు చూసినట్లు నాయకుని దయ ఎన్నుకున్న ప్రజల మీద కురవాలి.
నాయకుడు వరుణ్ణి వలె గంభీరతను తనలో దాచుకోవాలి. అలాగే విలువలను తగ్గించుకోకూడదు. తనను తాను అదుపులో ఉంచుకోవాలి. ఎంతో గూఢంగా కార్యాన్ని నడుపుకోవాలి. అందుకే పెద్దలు అంటారు కదా “వాన రాకడ చట్టం పోకడ “తెలియదని. నాయకుడు ఎవరికి ఎలా ఇవ్వాలో ఒక అంచనా తో ముసులుకోవాలి. వరుణ దేవుడు కూడా అంతే కదా.
తర్వాత నాయకున్ని అగ్నితో పోల్చారు. అగ్నికి దగ్గరగా ఎవరూ వెళ్లలేరు. నాయకుడుగా కూడా కొన్నిసార్లు అగ్ని వల్లే ప్రవర్తిస్తూ తోటి నాయకులను నెత్తి మీద ఎక్కించుకోకూడదు. ఒకవేళ వాళ్ళు తిరగబడిన తన ప్రభావంతో వారిని అణిచి వేసేలా ఉండాలి . ఎందుకంటే అగ్నితో తలపడితే మిగిలేది బూడిదే.
వేదాలు నాయకుడిని వాయువుతో పోల్చారు. వాయువు రెండు రకాలుగా వ్యవహరిస్తాడు. గాలి రూపంలోనూ, ప్రాణ రూపంలోనూ. గాలి అంటే మనం తీసుకునే శ్వాస. ప్రాణం అంటే జీవాధారం. ఆత్మ లాగా అంతటా ఉండి ప్రజలు లోపల ఏమనుకుంటున్నారు…., బయట తన ప్రాబల్యం ఎలా ఉంది… అని తన అనుచరుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. కానీ బయటకి ఉదాసీనంగా ఉంటూ పొగిడినా తిట్టిన పట్టించుకోనట్లు ఉంటాడు. సకాలంలో స్పందిస్తాడు. వాయువు కూడా ఏ రుతువులో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది కదా.
ఆఖరికి ఆ నాయకుడు యముడులా ఉండాలట. యముడు ధర్మాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాడు. తన వారినైనా, పరాయి వారినైనా ధర్మ విషయంలో ఊరుకోడు. ధర్మం తప్పితే తొదముట్టిస్తాడు. దండన అందరికీ సమానం గా వేస్తాడు. పక్షపాతదోరణి లేని వానిగా మసులుకుంటాడు. శత్రువైన ధర్మంలో నడిస్తే క్షమిస్తాడు. నాయకుడైన వాడు యమధర్మరాజుని ఉదాహరణగా తీసుకోవాలి. అలాగే తర తమ భేదం లేకుండా పాలించాలి. అతడే ప్రజలను పాలించే నిజమైన నాయకుడు.
చూశారా నాయకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలో. అన్నీ కాకపోయినా… కొంతలో కొంత ఎక్కువ ఉన్న వానిని ఎన్నుకుందాం. అప్పుడే ప్రజలందరూ బీద బిక్కి భేధం లేకుండా సమానత్వంతో, సౌబ్రాతృత్వంతో, స్వాతంత్ర్యంతో నిర్భయంగా బతుక గలుగుతారు.
ఓటర్ మహాశయ యోచించు ఓటేయండి. లేకపోతే మిగిలేది చేటే . ప్రలోభాలకు లొంగకండి. పది బాగుంటేనే మనం బాగుంటాం. ‘దేశం అంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్ ” అన్నారు గురజాడ వారు. పశువులవలే కాక మనుషులు వలె విజ్ఞతతో మసులుకుందా.. ఓటు హక్కు కలిగిన భావి భారత పౌరులారా మీ నిర్ణయమే నీకు ఆదర్శం. మీరు కూడాభవిష్యత్తులో మార్గ నిర్దేశం చేసే నాయకునిగా ఎదిగి దేశ ప్రతిభా గౌరవాలను కాపాడండి. అప్పుడే భరతావని పుణ్యభూమి కాదు ధన్యజీవి కూడా అవుతుంది.

కామేశ్వరి

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అపురూప చిత్రాలు

మహిళల సమస్యలు – మానసిక ఒత్తిడి