ఎడారి కొలను 

ధారావాహికం – 16వ భాగం

   పద్మావతి నీలంరాజు

(ఇప్పటివరకు : మైత్రేయి కోర్ట్ కెళ్ళి వచ్చిన్న తరువాత చాలా తీవ్రమయిన ఆందోళనకు గురై తీవ్రమయిన జ్వరంతో బాధపడుతుంది. అక్కమ్మ చొరవతో వరండా గది లో అద్దెకుంటున్న  ప్రసాద్ తో కొత్త పరిచయం ఏర్పడుతుంది. కోర్ట్ ఫైనల్ తీర్పు ఎండాకాలం సెలవల తరవాతకి వాయిదాపడింది. వసుంధర ఒక నెల రోజులకి  లండన్ వెళుతున్నానని చెబుతుంది.)  

మైత్రేయి కూడా లాస్ట్ వర్కింగ్ డే వెళ్లి సైన్ చేసి వచ్చింది. కాలేజీకి సమ్మర్ సెలవలు మొదలయ్యాయి. ప్రతి సారి సెలవలకి అమ్మ దగ్గరికి పోయేది. కానీ ఈ సారి అమ్మ ముందే మొఖం మీద చెప్పేసింది, “నువ్వు ఇప్పుడు మా దగ్గరికి రావద్దు. మేము బంధువుల నోళ్లు మూయలేము. ఇప్పటికే పరువు పోయి మీ నాన్నగారు వీధి ముఖం చూడటం లేదు. మీ అన్నయ్య సరే సరి. వాడిని ఆఫీస్ లో కూడా ఎవరు వదిలిపెట్టటంలేదు. నీచెల్లెలికి విడాకులు వచ్చేసాయా అని వెంటపడుతున్నారు. పిల్లల్ని కంటాంగాని వాళ్ళ భాగ్యాన్ని కంటామా? ” అంటు  మాట్లాడింది.

“పాపం ఆమె మాత్రం ఎం చేస్తుంది. ఏది ఏమయినా ఆమె కూడా స్త్రీ నే కదా. భర్త మీద, కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నది. మరి కూతురు విషయంలో  నిస్సహాయురాలు. యుగాలుగా తయారుచేయబడిన మనః స్థితి ఆమెది. కుష్టు రోగి అయిన భర్త తనని వేశ్య ఇంటికి తీసుకెళ్లమంటే, తీసుకెళ్లగలిగేటంతటి గొప్ప పురాణ  స్త్రీ మూర్తులున్న సమాజం మనది. ఆమె చర్యని దైవ పరీక్షగ చాలా  అందంగ మసి పూసి మారేడుకాయ చేసారు మన విద్వాంసులు. మహాభారత  యుధానికి మూల కారణం ద్రౌపదియే  అని కూడా తమ విశ్లేషణను ఇచ్చారు. ఇలాటి మేధావి వర్గం ఉన్న ఈ సమాజంలో స్త్రీ ని కూడా ఒక ప్రాణమున్న మనిషిగా భావించగలిగే సంస్కారం, ఆమెకు కూడా మానవహక్కులన్నీ వర్తిస్తాయన్న గుర్తింపు ఎప్పటికి వచ్చేది? ఎందుకంటే స్త్రీకి రాజ్యాంగ పరమయిన హక్కులను కల్పించటం కూడా ఎన్నికల ముందే జరుగుతుంది. ఆ తరువాత ఆ హక్కుల పరిరక్షణ గవర్నమెంట్ ఆఫీసు లో ఫైల్స్ లోనే ఉండిపోతుంది. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూడడం తోనే ఈ స్త్రీ తరాలు తరిగిపోతుంటాయి. ఇలాటి సామాజిక పరిణామక్రమంలో తనకు ఎలా న్యాయం దొరుకుతుంది. పోరాడటం తప్ప.”  ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు కిటికీ దగ్గరున్న కుర్చీలోనే కూర్చొని ఉంటున్నది మైత్రేయి. సెలవలు మొదలయి నాలుగురోజులయి పోయినాయి. ఆమె బయటికి కదలటంలేదు.

ఆ రోజు అక్కమ్మ కొంచం దిగాలుగా పనికొచ్చింది. “ఏమైంది అక్కమ్మ అలాఉన్నావేంటి ?“అని అడిగింది తను. “మా అక్క బిడ్డ పురిటికొచ్చిందమ్మ, కానుపు  కష్టమవుతుందని పెద్దాసుపత్రిలో చేర్పించారు. నేను కూడా అక్కకు సాయం పోవాలా. మిమల్ని ఇలా వదిలేసి ఎలా పోవాలా అని దిగులుగా ఉంది,” అంటూ విషయం చెప్పింది అక్కమ్మ.

“అయ్యో అలాగా! మరయితే ఆలోచించడందేనికి. నాకేం కాదులే అక్కమ్మ నువ్వెళ్ళు,”  అని భరోసా ఇచ్చి, కొంచెం డబ్బులు కూడా ఇచ్చి  అక్కమ్మను పంపించింది.

“హలో మేడం! ఎలా ఉన్నారు? నాలుగు రోజులయింది మిమ్మల్ని చూసి,” అంటూ ఎంతో చనువుగా లోపలకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు ప్రసాదు.

“నేను బాగానే ఉన్నాను. ఇన్ని రోజులు మీరెక్కడికి మాయమై పోయారు” అంటూ  కాఫీ కప్ అందించింది.

“ఫీల్డ్ వర్క్ లో ఉన్నానండి. ఈ రోజు మాత్రమే నాకు రెస్ట్, రేపటినుంచి మళ్ళి కనిపించను ఇంకో నాలుగు రోజులదాకా” అంటూ కాఫీ తాగేసి “టేక్ కేర్ !” అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి పోయాడు ప్రసాద్. సాయంత్రాని కల్ల ఫ్రెష్ అయి మళ్ళి మైత్రేయి దగ్గరకొచ్చాడు ప్రసాద్.

“పదండి కాసేపు బయటికి వాకింగ్ కి తీసుకెళతాను ,” అన్నాడు

“వద్దండి. నాకు ఎక్కడికి బయటికి పోవాలని లేదు. మీరు వెళ్ళేసి రండి, కావాలంటే మీకోసం కూడా డిన్నర్ రెడీ చేస్తాను,” అన్నది సునిశితంగా అతను నొచ్చుకోకుండా.

“అలాగయితే నేను కూడా మీకు వంటలో సాయం చేస్తాను. మీకు అభ్యంతరం  లేక పోతే!”అన్నాడు చిరునవ్వుతో.

“అవునా ! మీకు కూడా వంట చేయడం వచ్చా?” చారడేసి కళ్ళరెప్పల్ని ఆడిస్తూ అడిగింది.

“అయ్యో! ఎంతమాటన్నారండి! నాకు వంట రాక పోవడమేమిటండి! నాకొక చ్ఛాన్సివ్వండి చాలు!” అంటూ చొరవగా వంటగదిలోకి వెళ్లి బంగాళాదుంపలుంటే పళ్లెంలోపెట్టుకొని  తీసుకొచ్చాడు.

అతని వెనకాతలే వెళ్లి ఒక నీళ్ళు  పోసిన గిన్నె,  చాకు తీసుకొచ్చి “ముందు తొక్క తీసి దుంపలను నీళ్లల్లో వేయండి. నేను పిండి కలుపుతాను. రాత్రికి చపాతీలు చేస్తాను, ”  అంటూ “మీ గురించి చెప్పండి వింటాను,” అన్నది.

అప్పటి వరకు సరదాగా మాట్లాడిన ప్రసాద్ కొంచం ముభావంగా అయ్యాడు. అది గమనించకుండానే “ఏమీ చెప్పరెంటి?”అంటూ పొడిగించింది.

“నాగురించి తెలిసిన తరువాత  మీరు నాతో ఇలాగే  స్నేహపూర్వకంగా ఉంటారా? అలా మాట ఇస్తేనే చెబుతాను,”అన్నాడు.  “ప్రామిస్! చెప్పండి,” అన్నది మైత్రేయి నాటకీయంగా.

“మీరు  గవ్వల  ప్రసాద్ అనే దొంగ పేరు విన్నారా?” వింతగా చూసింది మైత్రేయి. అటుగా వెళుతున్న రమాదేవి  వీళ్లేదో  మాట్లాడుకుంటున్నట్లనిపించి కిటికీ పక్కగ కదలకుండా నుంచున్నది, ”గవ్వల  ప్రసాద్! అమ్మో!”అంటూ ఆసక్తి గ అక్కడే నిలబడిపోయింది.

“అయన మా తాతగారండి. నా ఊరు స్టువర్ట్ పురం. అదే, జైలు నుండి రిలీజ్ అయినా దొంగలకు గవర్నమెంటు  ఏర్పాటు చేసిన సెటిల్మెంట్ ఏరియా, చీరాల బాపట్ల మధ్యలోకి వస్తుంది.”

“మా అమ్మ ఆయన అన్న బిడ్డ. మా అయ్య కూలి చేసేవాడు. మా అమ్మ ఇళ్లలో పాచిపని చేసేది. మా అందరిని ఒకప్పుడు ఆయనే పోషించేవాడని మా అమ్మ చెప్పేది. మా అమ్మకు అక్కడ ఉండాలని ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ సెటిల్ అయినా వాళ్ళు చాలామంది దొంగలు కాదు. చాలా కాలం అండర్ ట్రయల్  మీదుండి  బయట పడిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరికి ప్రభత్వం వాళ్ళ సత్ప్రవర్తన కు రివార్డ్ గ  భూమి పట్టాలిస్తే, అందులో చిన్న ఇల్లు కట్టు కొని ఇంకొక గది  ని కూడా తయారు చేసి, బయట బతకలేని చిన్న కూలీలకు , పనివాళ్లకు బాడుగ కు కూడా ఇస్తుంటారు. మా అమ్మ ,నాయన అలాటి కూలీలే. కానీ అక్కడున్న మాలాటి  వాళ్ళందరికి దొంగలు  ముద్ర పడిపోయింది. అందుకనే మా అయ్యా, మా అమ్మ నన్ను తీసుకొని ఆ ఊరు వొదిలేసి వచ్చేసారు. కానీ ఆ ఊరి ప్రభావం మా మీద  పడి  మా అయ్యకి ఎక్కడ కూలి దొరికేది కాదు. చివరికి ఆయన్ని దొంగతనం చేశాడన్న అనుమానంతో బాగా కొట్టారు ఒక మిల్లులో. ఆ అవమానం తో ఆయన  పురుగు మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. మా అమ్మ నన్నెత్తుకొని తమిళనాడు రైలు ఎక్కింది. అక్కడే చాల కష్టపడి నన్ను చదివించింది. ఒక అనాధ శరణాలయంలో పనిమనిషిగ చేరి వారి సాయంతో నన్ను చదివించింది.  ఆమె కు టీబీ వచ్చి చనిపోయింది. చారిటీ మీద నేను చదువుకున్నాను. నాకు ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది ముందు. తరవాతే నేను ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ గ చేరాను. ఇదే నా జీవిత చరిత్ర. అంత గొప్పదేమీ కాదు. ఈ ఇంట్లోకి వచ్చాక కొద్దీ రోజులకే మీ గురించి కొంత తెలిసింది. అది కూడా మన ఇళ్లలో ఉన్న అంటీల మాటల ద్వారా, “అంటూ చెప్పుకొచ్చాడు .

“మీరు నేను ఒకే రకమయిన పడవలో ప్రయాణం చేస్తున్నాము. వివాహం ద్వారా మీరు, నా జన్మ ద్వారా నేను ఈ సమాజం లో బహిష్కృతులం. అందుకే మీకు సహాయంగ నిలబడాలనిపించి అంతగా పరిచయం లేక పోయిన చొరవ చూపిస్తున్నాను.”అంటూ చెప్పాడు.

మైత్రేయికి అతని మీద జాలి కలిగింది.  అది కనిపించనీయకుండ, ”ప్రసాద్ గారు మీరు కబుర్లు చెప్పారు నేను వంట పూర్తి చేశాను. కూర్చోండి అక్కడికే  నేను తెచ్చేస్తున్నాను,”అంటూ రెండు పళ్లేలలో  తీసుకొచ్చింది. తినటం ముగించాక ప్రసాద్ “నేను వెళ్లి పడుకుంటానండి, నాకు మిడ్నైట్ 2 పీఎం కి ట్రైన్ ఉంది” అంటూ “మీకే అవసరమైన నాకు చెప్పండి. నేను కూడా మీకు నా చేతనయిన సాయం చేస్తాను. అధైర్య పడకండి. పరిస్థితులవే చక్కపడతాయి. ఈసారి నా ఫీల్డ్ వర్క్ మూడు నాలుగు రోజులుండవచ్చు” అంటూ తన ఫోన్ నెంబర్  గోడమీదున్న క్యాలండర్ మీద రాసి వెళ్ళిపోయాడు.

అంతా  చూస్తున్న రమాదేవి  “వీళ్ళ భాగోతం ఫోన్లు చేసుకునేదాకా వచ్చిందన్నమాట” అనుకుంటూ ఆ అబ్బాయి ఎక్కడ చూస్తోడో అని లోపలికెళ్ళి గడియపెట్టేసింది. అదేమీ గమనించని ప్రసాద్ తన రూంలోకెళ్ళి తలుపువేసుకున్నాడు.

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిశీధిలో వెలిగిన నియాన్ బల్బు – పూర్ణ సుందరి ఐ.ఏ.ఎస్.

దొరసాని