నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే
అని ఆ వ్యక్తి అనుకొని ఉంటే మహాశక్తిగా తనను తాను నిరూపించుకొని ఉండేదే కాదు.
పదేపదే సమస్యనే తలచుకుంటూ కుమిలిపోయి ఉంటే , దీపం కింది చీకటిగా మిగిలిపోయి ఉండేదే తప్ప , పోటీపరీక్షల సంద్రంలో స్వాతి చినుకై కురిసి ఉండేదే కాదు.
తన జీవితాన్ని అలుముకున్న విషాదం తల్లిదండ్రుల గుండెల్లో చితిమంటై రగులుతూ ఉంటే, ఆ మంటల్నే కాగడాలుగా మార్చుకొని ఎందరికో అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసుకొని ఉండేదే కాదు.
కంటి చూపును కోల్పోయి నప్పటికీ, సంకల్పబలంతో ఎదిగి యావద్భారతావని చూపును తన వైపు తిప్పుకొని ఉండేదే కాదు.
ఆ వజ్రసంకల్పం పేరే పూర్ణ సుందరి ఐ.ఏ.ఎస్. నిశీధిలో వెలిగిన ఆ నియాన్ బల్బ్ పేరే పూర్ణ సుందరి ఐ.ఏ.ఎస్.
తమిళనాడు రాష్ట్రంలోని మధురై కి చెందిన పూర్ణ సుందరి పుట్టుకతో అంధు రాలు కాదు. ఐదేళ్ల చిన్నారిపై పంజా విసిరిన అనారోగ్యం కంటి చూపును కబళించింది.
ముద్దులు మూటగట్టిన త మ ఇంటి దీపం కంటి వెలుగును కోల్పోయిందన్న వార్త ఆ తల్లిదండ్రుల గుండెల్లో విస్ఫోటనమై పేలింది. ఆర్థిక స్థితి ఏమాత్రం సహకరించకపోయినా, వైద్య పరంగా తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ , ఫలితం ఎండమావిగానే మిగిలింది.
జరుగుతున్నదేమిటో కూడా తెలియని వయసయినప్పటికీ, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. తల్లిదండ్రులు , సోదరుడు తన విషయంలో అనుభవించే మనోవేదనను ఆమె తన అంతర్నేత్రంతో చూస్తూనే ఉంది. పూట గడవడమే (అప్పుడప్పుడు) కష్టంగా ఉన్న సమయంలో కూడా తనకు అవసరమైన పుస్తకాలు కొని తెచ్చే తండ్రిని, దగ్గర కూర్చుని చదివి వినిపించే తల్లిని చూసి తన మనోక్షేత్రంలో సివిల్ సర్వీసెస్ లో రాణించాలనే బీజానికి హై స్కూల్ స్థాయిలో ఉండగానే అంకురార్పణ చేసుకుంది.
దానికి తగ్గట్టుగానే ప్రణాళిక రచించుకుని, సీనియర్లు మరియు స్నేహితుల సహకారంతో ఆడియో స్టడీ మెటీరియల్, లాప్టాప్ లో స్పీకింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంల ద్వారా ఐదు సంవత్సరాల సన్నద్ధతతో, నాలుగవ ప్రయత్నంలో, 286 వ ర్యాంకుతో, 2019 బ్యాచ్ అధికారినిగా జయ కేతనాన్ని ఎగరేసింది.
వారిలోని కార్యదీక్షతను, స్ఫూర్తిమంతమైన వారి జైత్రయాత్రను మన అడుగులకు ఆసరాగా (అవసరమైనపుడు) మలుచుకుందాం.