వీరు భారతదేశపు మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి. ఈమె పంజాబ్ లోని అమృత్ సర్ లో జూన్ 4,1949లో జన్మించారు. తల్లిదండ్రులు ప్రకాష్ లాల్ పేష్వారియా, ప్రేమలత. ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.
రాజనీతి శాస్త్రంలో యం. ఏ. చండీగఢ్, పంజాబ్ యూనివర్సిటీ నుండి చేసి పట్టా పొందారు. 1972 వ బ్యాచ్ కు చెందిన కిరణ్ బేడీ పోలీస్ శాఖలో పలు పదవుల్లో రాణించారు.
విధులు నిర్వర్తిస్తూనే న్యాయ శాస్త్రంలో పట్టాను, ఐఐటి ఢిల్లీ నుండి పీహెచ్డీ పట్టా పొందారు .
ఈమె చిన్న వయసులో క్రీడలో తమ ప్రతిభను చాటుతూ ఆల్ ఇండియా టెన్నిస్ టైటిల్ ని సాధించారు .అలాగే ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు, తమ 22 వ యేట ఏషియా ఉమెన్ టైటిల్ సాధించారు.
అమృత్సర్ సర్వెంట్ క్లబ్ లో అక్కడ సివిల్ సర్వెంట్లను చూస్తూ స్ఫూర్తి పొందేవారట.1973 రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్న తొలి మహిళా ఐ .పి.యస్. అధికారిణిని చూసి దేశం యావత్తు ఆశ్చర్యానందాల్లో మునిగిపోయిందట. మరునాడు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అల్పాహార విందుకు ఆహ్వానించారన్న వార్త సెన్సేషన్ ఐంది .ఒకసారి నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా గాంధీ గారి కారు ఆగి ఉంటే క్రేన్ సాయంతో తీసి వేయించిన ఆమె కర్తవ్యదీక్షకు, నిబద్ధతకు ప్రజలు సంతోషించి ‘క్రేన్ బేడీ’అంటూ ముద్దుగా పిలుచుకున్నారట.
వీరి భర్త శ్రీ బ్రిజ్ బేడీ ,ఒక కూతురు సుకృతి (సాన్యా) వైద్య విద్యను అభ్యసించారు. కుమార్తె అనారోగ్య కారణంగా ఎంతో వ్యాకులతకు లోనై విధి నిర్వహణను, కుటుంబాన్ని సమన్వయం చేయలేక చాలా సతమతమయ్యేవారట.
1988లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలోని విద్యార్థిని పర్స్ దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని మళ్లీ వదిలివేయగా, కొన్ని వారాలు అనంతరం తిరిగి అతడే అమ్మాయిల టాయిలెట్లో దూరి అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అతన్ని బేడీ అరెస్టు చేసిన సంఘటన వివాదాస్పదమైంది. అతడు లాయర్ అయిన కారణంతో విషయం అత్యంత విషమమై అల్లర్లకు కారణమైంది .పోలీసులకు లాయర్లకు మధ్య విషయంగా పరిణమించి ప్రకంపనలు సృష్టించింది .చివరకు అతడు తప్పు చేశాడని అయితే బేడీలు వేసి తీసుకురావాల్సింది కాదంటూకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె కెరీర్లో కీలక సంఘటనల్లో ఇదొకటి.
వీరి సేవలకు గుర్తింపుగా మెగసెసే అవార్డు తో పాటు సూర్య నేషనల్ అవార్డు 2007లో, యునైటెడ్ నేషన్ మెడల్ 2004లో, ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ అవార్డు 1979లో, ఇలా ఎన్నో ఆవార్డులు తీసుకున్నారు. ఆ సందర్భంలోనే మాదక ద్రవ్యాలు, గృహహింసపై దృష్టిసారించి అదే అంశంపై ఐ. ఐ. టి. ఢిల్లీ నుండి డాక్టరేట్ చేసారు.
ఉద్యోగ ధర్మం గా పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ,35 సంవత్సరాల విధి నిర్వహణ అనంతరం డిసెంబర్ 7, 2007లో స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశారు .
2015 లో బి. జె .పి.లో చేరారు. 2016 నుండి 2021 వరకు పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) గవర్నర్గా పనిచేశారు. సామాజిక సేవలో క్రియాశీలంగా ఉంటూ రచనలు చేస్తున్నారు .’ ఐ డేర్’ పేరిట తన ఆత్మ కథను రాసుకున్నారు.
ఐక్యరాజ్యసమితిలో ప్రధాన కార్యదర్శి కి పౌర పోలీస్ సలహాదారుగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితిలో నియమింపబడ్డ తొలి మహిళగా రికార్డు సాధించారు .
1999 లో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును కైవసం చేసుకున్నారు.
సామాజిక సేవలో క్రియాశీలంగా ఉంటూ రచనావ్యాసంగం చేసే వీరు నవజ్యోతి ,ఇండియన్ విజన్ ఫౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను స్థాపించి నిర్వహిస్తున్నారు. ఆమె ధైర్యానికి, విధి నిర్వహణకు ఆకర్షితులై ఎంతోమంది స్ఫూర్తి పొందిన సంఘటనలు కోకొల్లలు. ఆమెపై సామాజిక మాధ్యమాల్లో కథనాలు, వ్యాసాలు తరచుగా వచ్చేవి.తెలుగులో ‘కర్తవ్యం’ సినిమాకు ప్రేరణ వారే. ఎంతోమంది బాధ్యతాయుతమైన పదవులనలంకరిస్తారు కానీ కొంతమందే తమ పదవికి వన్నె తెచ్చి,వినీలాకాశంలో ధృవతారలా వెలిగిపోతుంటారు. అలాంటివారిలో ఒకరైన ఈ సాహసమూర్తికి సరైన సత్కారం అక్షరగుచ్ఛంతో అభినందించడం.