నాలుగవ తరగతిలో కొత్తగా జాయిన్ అయిన సింధు వచ్చి క్లాస్ ముందర నిలబడి..” మే ఐ కమిన్ టీచర్” అని అడిగింది..
“ఎస్ కమిన్” అన్నది టీచర్ మాధవి..
మొదటి రోజు కావడం వల్ల బిక్కుబిక్కుమంటూ వచ్చి వెనక బెంచ్ లో కూర్చుంది సింధు..
మిగతా పిల్లలందరూ పాత వాళ్ళు కాబట్టి ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు సింధుతో ఎవరూ మాట్లాడటం లేదు సింధుకి ఏడుపు వచ్చింది..
టీచర్ సింధుని అందరికీ పరిచయం చేసింది. అందులో సింధు గ్రామీణ ప్రాంతం నుండి రావడం వల్ల పట్నం వాతావరణం అంతగా అలవడలేదు.. మాట్లాడ్డంలో బెరుకు భయం స్పష్టంగా కనిపించేది… ఇంగ్లీష్ కూడా అంత స్పష్టంగా మాట్లాడలేకపోయేది.. పిల్లలకి అది ఇంకా అలుసుగా తోచింది.. సింధుకు ఇంగ్లీషు రాదని వెక్కిరించేవాళ్లు…
ఒకరోజు లంచ్ సమయంలో సింధు ఒక్కతే కూర్చుని తింటుంది ..అప్పుడే అక్కడికి వికాస్ వచ్చాడు..
” హాయ్ సింధు” అని పలకరించాడు..
” హాయ్” అన్నది సింధు మెల్లగా..
” నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా” ?అని అడిగాడు వికాస్..
” ఉహూ! ఎవరూ నాతో సరిగా మాట్లాడటం లేదు ఒకవేళ మాట్లాడినా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు ..నాకు ఇంకా మొత్తం అర్థం కావడం లేదు నేను మాట్లాడితే నవ్వుతున్నారు” అన్నది ఏడుపు ముఖంతో సింధు..
” అవునా! అయితే మనిద్దరం ఫ్రెండ్స్ ఇప్పటినుండి.. నీకు ఇంగ్లిష్ మాట్లాడటం నేను నేర్పిస్తా! మా ఇంట్లో మా మమ్మీ నాకు అన్ని చెప్తుంది నువ్వు కూడా మా ఇంటికి రా” అని చెప్పాడు వికాస్..
” వస్తాను నిజంగా నాకు నేర్పిస్తావా… ఇంతకీ నీ పేరేంటి?” అని అడిగింది సింధు..
” నా పేరు వికాస్ నేను నీకు తప్పకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాను మా మమ్మీ హెల్ప్ చేస్తుంది” అని చెప్పాడు వికాస్..
సింధుకు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది.. ఇన్ని రోజులు ఎవరూ తనతో మాట్లాడలేదు వికాస్ ఎంతో బాగా మాట్లాడాడు ..ఆ పసి మనసుకి వికాస్ పట్ల అభిమానం ఏర్పడింది..
ఒకరోజు సింధూని వాళ్ళింటికి తీసుకెళ్లాడు వికాస్…
” అమ్మా! ఇదిగో నా ఫ్రెండ్ సింధు నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తెలుసా” అని చెప్పాడు వాళ్ళ అమ్మతో..
” అవునా! నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే, నీ పేరేంటి తల్లి?” అని అడిగింది వికాస్ తల్లి అరుణ..
” నా పేరు సింధు ,ఆంటీ!” అని చెప్పింది..
సింధును చూస్తే ముచ్చటేసింది అరుణకి . రెండు పెద్ద జడలు వేసుకుని ఒక జడలో పువ్వులు పెట్టుకొని చక్కని పరికిణి జాకెట్ వేసుకొని ఎంతో ముద్దుగా ఉంది…
సింధుని దగ్గరికి తీసుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని తినడానికి చిప్స్ మరియు జిలేబి పెట్టింది..
అలా సింధు వికాస్ ఇంటికి వికాస్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళు.. వాళ్ళిద్దరి మధ్య స్నేహం బలపడింది…
వికాస్ సావాసంలో సింధు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంది..
చదువుకోవడంలో వికాస్ తల్లి అరుణ చాలా సహాయం చేసేది ..అలా చూస్తుండగానే అందరికన్నా బాగా చదివే అమ్మాయిగా తరగతిలో గుర్తింపు పొందింది… అప్పుడు ఇన్నాళ్లు అయితే ఎవరు వెక్కిరించారో వాళ్ళంతా సింధు చుట్టూ చేరారు.. అయినా సింధు ఎవరినీ చిన్నబుచ్చేది కాదు.. కానీ వికాస్ అంటే మాత్రం మనసు నిండా అభిమానం అలాగే ఉంది రోజు రోజుకి పెరిగింది కూడా..
అలా వీరి ప్రయాణం పదవ తరగతి వరకు వచ్చింది.. టీనేజ్లో అడుగుపెట్టగానే పిల్లల శరీరంలో మార్పు వచ్చినట్టు చూసే వారి దృష్టిలో కూడా మార్పు రాసాగింది…
వికాస్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ‘ఈ అబ్బాయి ఏంటి ఈ అమ్మాయితో తిరుగుతుంటాడు” ఇలా ఏదో ఒక గుసగుస వినిపించేది..
స్కూల్లో పిల్లలు కూడా ఏదోరకంగా టీజ్ చేసే వాళ్ళు..
” ఏరా వికాస్ ఆ అమ్మాయి తోనే తిరుగుతావా! ఫ్రెండా ఇంకేమైనానా” ? ఇలా అనేవాళ్లు..
ఆడపిల్లలు కూడా..
” సింధు! వికాస్ నీకు ఫ్రెండేనా మీ ఇద్దరి మధ్యలో కుచ్ కుచ్ ఏమైనా ఉందా” ఇలా అడిగేవాళ్లు..
సింధుకు మరియు వికాస్ కి చాలా కోపం వచ్చేది ఆ వయసులో ఏం సమాధానం చెప్పాలో అర్థం కూడా అయ్యేది కాదు…
పదవ తరగతి పరీక్షల ముందు పిల్లలందరూ కలుసుకున్నారు ..మళ్ళీ ఎవరెవరు ఏ కాలేజీకి వెళ్తారో తెలియదు కలుస్తారో లేదో కూడా తెలియదు .అందరూ క్లాస్లో కలుసుకొని చక్కగా ఆటపాటలతో ఆనందించారు.. ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు..
పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొంది ఎవరికి అందుబాటులో ఉన్న కాలేజీలో వారు చేరిపోయారు…
సింధు వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు..
వికాస్ అదే ఊళ్లో కాలేజీలో జాయిన్ అయిపోయాడు.. అలా సింధుకు వికాస్ కు మధ్య లింక్ కట్ అయిపోయింది అప్పుడప్పుడే ల్యాండ్ ఫోన్ రావడం వల్ల నంబర్లు కూడా తెలియవు ..అలా దాదాపు ఒక పది ఏళ్ళు గడిచాయి..
వికాస్ మంచి డాక్టర్ అయ్యాడు… అతనికి రిమోట్ ఏరియాలో ఉద్యోగం వచ్చింది.. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జన్ గా చేరాడు..
చిన్న ఊరు కావడం వల్ల అక్కడ ఉండటానికి పెద్దగా వస్తువులు లేకపోయాయి..
అక్కడి సర్పంచ్ గారింట్లో మేడ మీద రెండు గదుల పోర్షన్ ఉందంటే అందులో చేరిపోయాడు వికాస్..
రోజు దూర ప్రాంతాల నుండి ఎన్నో కేసులు వచ్చేవి ..ఒక్కొక్కసారి విషమించిన కేసులు కూడా వచ్చేవి సరైన పరికరాలు కూడా హాస్పిటల్లో ఉండేవి కావు.. వికాస్ ఎంతో ప్రయత్నం చేసి హాస్పిటల్ కి కావలసినవి ఎన్నో పరికరాలను తెప్పించి రోగులకు మంచి వైద్యం అందించేవాడు..
ఒకరోజు రాత్రి ఇంట్లో పడుకున్నాడు.. తన ఫోన్ కి హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది ..ఎమర్జెన్సీ కేసు వచ్చింది రమ్మని చెప్పారు..
వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు వికాస్..
అచేతనంగా పడుకున్నది ఒక అమ్మాయి…
వివరాలు చదివితే..
ఆ అమ్మాయి పేరు సింధు అని సూసైడ్ అటెంప్ట్ చేసిందని రాసి ఉంది…
సింధు అనే పేరు వినగానే వికాస్ కు ఒక్కసారి తన స్నేహితురాలు సింధు గుర్తుకు వచ్చింది…
“ఇంతకీ ఈ అమ్మాయి సింధు తన స్నేహితురాలు సింధు ఒకరేనా !”అని అనుకొని ఆ అమ్మాయిని ముందు ఎమర్జెన్సీ లో పెట్టి స్టమక్ వాష్ చేశారు..
ప్రాణాపాయం తప్పిందని తెలుసుకున్న వికాస్ ఒక్కసారిగా టెన్షన్ నుండి బయటపడ్డాడు..
అమ్మాయిని రూమ్ కి షిఫ్ట్ చేశారు…
అప్పుడు చూశాడు ఆ అమ్మాయి ముఖాన్ని.. ఆ అమ్మాయి తన స్నేహితురాలు సింధు యేనని వికాస్ కు అర్థం అయిపోయింది..
” ఎందుకు సింధు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఏం జరిగి ఉంటుంది” అని ఆలోచించాడు..
సింధు తో వచ్చిన ఒక ఆవిడను చూసి ఆమె తల్లిగా గుర్తించాడు వెంటనే దగ్గరికి వెళ్లి…
” ఆంటీ నన్ను గుర్తుపట్టారా”? అని అడిగాడు వికాస్..
” లేదు బాబు నేను గుర్తు పట్టలేదు” అన్నది ఆమె..
” నేను సింధు స్నేహితుడిని నా పేరు వికాస్ మీ ఇంటికి నేను చాలా సార్లు వచ్చేవాడిని” అన్నాడు వికాస్..
” నువ్వా బాబు” అని అతని పట్టుకొని గట్టిగా ఏడ్చింది సింధు తల్లి.
” ఇంతకు సింధుకు ఏమైంది ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది”? అని అడిగాడు వికాస్..
” తాను ఈ ఊర్లో టీచర్ గా చేస్తుంది.. ఇక్కడ రాజకీయ నాయకుల అండ చూసుకొని ఒక అబ్బాయి సింధు వెంటపడుతున్నాడు.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కూడా లాభం లేక పోయింది ..ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా వీలు లేకపోయింది.. ఈ విషయాలు ముందుగా మాకు అసలే చెప్పలేదు సింధు మేము ఊళ్లో ఇబ్బంది పడతామని మాకు ఏమీ చెప్పకుండా తాను ఒక్కతే ఇక్కడ బాధలన్నీ పడింది..
ఒకరోజు స్కూలుకు వెళ్లి సింధును ప్రేమిస్తున్నానని అసభ్యంగా ప్రవర్తించాడట ఆమె చీర పట్టుకొని లాగడము ఇలా చేశాడట అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు సహాయం చేయకపోగా అందరూ నవ్వుతూ ఉన్నారట ఇలా చాలాసార్లు చేసేసరికి సింధు తట్టుకోలేక ఏమీ చేయలేక ఇలా చేసిందట.. మా నెంబర్ తీసుకొని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చాము” అని చెప్పింది సింధు తల్లి ఏడుస్తూ..
” మీరేం భయపడకండి నేను సింధును చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి” అని చెప్పాడు వికాస్..
సింధుకి స్పృహ వచ్చిన తర్వాత వికాస్ ను చూసింది ముందుగా అతని ఎవరో అర్థం కాలేదు కానీ తర్వాత చూస్తే తన ఫ్రెండ్ వికాస్ అని గుర్తుపట్టింది.. ఒక్కసారి అతని చేతులు పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది..
“సింధు ఇంత చిన్న విషయానికి ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేస్తావా !ఎదిరించాలి కానీ, నీ ధైర్యం ఎక్కడ పోయింది ఇద్దరం కలిసే చదువుకున్నాం కదా నువ్వు నా స్నేహితురాలివే కదా ఇలా చేయడం తప్పని అనిపించలేదా” అన్నాడు సింధు చేతులు పట్టుకుని వికాస్..
మెల్లగా మామూలు మనిషి అయింది సింధు..
” వికాస్ నువ్వు వచ్చావు కదా ఇంక నేనేం భయపడను” అన్నది సింధు నవ్వుతూ..
” ఎప్పుడూ ఎవరో ఒకరి సపోర్ట్ కావాలని అనుకోకూడదు ఎవరికి వారే ధైర్యంగా ఉండడం అలవర్చుకోవాలి ముఖ్యంగా నీలాంటి ఆడపిల్లలకు అది అవసరం” అని చెప్పాడు వికాస్…
సింధు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చింది.. వికాస్ కూడా సింధు వాళ్ళింటికి వచ్చాడు..
ఆ తర్వాత తనని ఎవరైతే ఏడిపించారో వాళ్లని ఎదిరించి నిలబడింది. సింధు.. ఆమెకు అండగా వికాస్ నిలబడ్డాడు..
ఊళ్లో మళ్ళీ అందరూ గుసగుసలాడుకోసాగారు.. డాక్టర్కు టీచరమ్మకి మధ్య ఏదో సంబంధం ఉంది అని..
కానీ ఇద్దరు స్నేహాన్ని పవిత్రంగా భావించి మంచి స్నేహితులుగానే మిగిలిపోయారు. స్నేహానికి అర్థం మిగతా వారికి కూడా తెలిసేటట్లు చేశారు…
మెల్లిమెల్లిగా వీరి స్నేహాన్ని అందరూ అర్థం చేసుకున్నారు.. ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా జీవితాంతం స్నేహ బంధాన్ని నిలుపుకున్నారు.