బాలసదనం పనులు దాదాపు పూర్తి అయ్యాయి ఇంకా అలేఖ్య డెలివరీ డేట్ కూడా దగ్గరకు వచ్చింది… ప్రతినెల డాక్టర్ కు చూపించుకొని వస్తున్నారు… సుధీర్ అమెరికాకి వెళ్ళిపోయాడు డెలివరీ డేట్ కి ఒక వారం ముందు వస్తానని చెప్పి వెళ్ళాడు.
ఆరోజు ఉదయం నీలాంబరి భూపతి తో అన్నది…
” ఏమండీ ఈరోజు మనం బాలసదనం చూడడానికి వెళ్దాం నేను వెళ్లి దాదాపు నెల అయింది ఒకసారి వెళ్లి చూసొద్దాం అండి” అని అడిగింది…
” నేను వస్తాను నాన్న వచ్చినప్పటినుండి అడుగుతున్నాను నన్ను తీసుకెళ్లడం లేదు మీరు” అని అడిగింది అలేఖ్య.
” అలా కాదమ్మా కడుపుతో ఉన్నవాళ్లు ఇలా నిర్మాణంలో ఉన్న భవనాల లోపలికి వెళ్ళకూడదు గృహప్రవేశము వాస్తు హోమము ఇవన్నీ అయ్యాకే వెళ్ళాలి.. చంటి పిల్లలు కడుపుతో ఉన్నవాళ్లు వెళ్లకూడదమ్మా! అందుకే తీసుకెళ్లలేదు ఇంకా వచ్చే నెలలో మనము గృహప్రవేశం చేయిద్దాము అప్పుడు అందరం కలిసి వెళ్దాం తమ్ముడు కూడా ఆ సమయానికి వస్తానని ఫోన్ చేశాడు” అని చెప్పింది అక్కడే ఉన్న నీలాంబరి.
” ఓ ఓ అలాగా నాకు తెలియదమ్మా సరే! పూజ అయ్యాకే వెళ్దాము మీరిద్దరూ వెళ్లి రండి నేను కాసేపు పెరట్లోకి వెళ్లి మువ్వతో ఆడుకుంటాను” అని చెప్పింది.
” మువ్వ ఇప్పుడు పెద్దగా అయిపోయింది జాగ్రత్త అది కొమ్ములతో కుమ్మకుండా చూసుకో ఎక్కువసేపు కూడా పెరట్లో ఉండి ఆయాస పడకు వెంబడి మహేశ్వరుని తీసుకొని వెళ్ళు” అని చెప్పింది నీలాంబరి.
భూపతి వచ్చాడు..
” నీలా తొందరగా తయారవు మరి నాకు పట్నం వెళ్లే పని ఉంది ఊళ్లో కొన్ని పనుల గురించి ఎమ్మెల్యే గారిని కలవాలి అక్కడి నుండి వచ్చిన తర్వాత వెళ్తాను” అని అన్నాడు.
” నేను తయారుగానే ఉన్నానండి కాకపోతే మీతో కార్లో రావాలి నాకేమో ఈ ఊళ్లో కచ్చరంలో వెళ్లడమే ఇష్టం” అన్నది నీలాంబరి.
” కచ్చరంలో అయితే ఆలస్యం అవుతుంది నీలా కారులోనే వెళ్దాం ఈ ఒక్కసారి కి అడ్జస్ట్ అవుతావా! ” అన్నాడు భూపతి.
నీలాంబరి కారులో వెళ్లడానికి సిద్ధపడి బయటకు వచ్చింది…
తేలికగా ఉన్న పింక్ షిఫాన్ చీర కట్టుకుంది అమెరికా వెళ్లి వచ్చినప్పటి నుండి కొన్ని కట్టుబొట్లు మార్చుకుని నీలాంబరి తనకు నప్పే అన్ని చీరలను కట్టుకుంటుంది అయినా కూడా ఆమె ఎప్పుడూ నిండుగానే ఉంటుంది ఆమె ధరించే బట్టలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెబుతాయి… ఒక చేతికి అలేఖ్య తెచ్చిన గడియారం పెట్టుకుంది సింపుల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఎప్పుడు ఊళ్లోకి వెళ్లే నీలాంబరిలా కాకుండా కొంచెం వైవిధ్యంగా ఉంది కానీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు నీ రెండకు ఆమె ముఖం మెరిసిపోతుంది… పూజ చేసుకునేటప్పుడు ఆమె రాసుకునే గంధం పరిమళాలను వెదజల్లుతుంది… బయటకు వచ్చి కారులో కూర్చుంది నీలాంబరి.
కారు బాల సదనం వైపు వెళుతుంది… అరగంట ప్రయాణం చేసిన తర్వాత బాలసదనం చేరుకున్నారు…
కార్లో నుండి దిగిన నీలాంబరి ఒక్కసారి ఆ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయింది…
చుట్టూ పెద్ద ప్రహరీ గోడ మధ్యలో పెద్ద గేటు… గోడ చుట్టూరా రకరకాల చెట్లు… గేటు లోపలికి వెళ్ళగానే అన్ని రకాల పూల చెట్లు.. బోలెడంత పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఆటలాడుకునే జారుడుబల్లలు ఉయ్యాలలు ఇంకా రకరకాల సాధనాలు ఉన్నాయి..
గోడల చుట్టూ పిల్లలకు సంబంధించిన చిత్రాలు గీయబడి ఉన్నాయి అవన్నీ ఎంతో అందంగా జీవం ముట్టిపడేలాగా ఉన్నాయి.. అందులో నీలాంబరి గీసిన కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి…
మెట్లు ఎక్కగానే పెద్ద వరండా ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే పెద్ద హాలు అందులో మంచి కార్పెట్ పరవబడి ఉంది.. గోడలకు వేసిన పెయింట్ తెల్లగా మెరుస్తుంది అక్కడక్కడ చిన్ని కృష్ణుడు చిత్రాలు ఇంకా కొన్ని బాలల చిత్రాలు వేసి ఉన్నాయి. ఈ హాలంతా పిల్లలను వదిలేస్తే ఆడుకోవడానికి సౌకర్యంగా ఉంది… ఎక్కడ పిల్లలు దెబ్బ తాకించుకునే పరిస్థితి లేదు వాళ్లు ఆడుకోవడానికి రకరకాల బొమ్మలను ఆట వస్తువులను ఏర్పాటు చేశారు… హాలు దాటి గదిలోకి వెళితే.. పెద్ద పెద్ద ఊయలలు ఉన్నాయి అందులో ఐదు మంది చిన్నారులు పడుకోవడానికి వీలుగా ఉంది… పెరట్లో రకరకాల పండ్ల చెట్లు కూరగాయలకు సంబంధించిన చెట్లు అన్ని నాటబడి ఉన్నాయి తను కలలో ఏ విధంగా ఊహించుకుందో అవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి…
అప్పుడే కొంతమంది పిల్లల పేర్లు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కొంతమంది వాలంటీర్స్ ఊరు తిరిగి చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి ఈ బాలసదనం గురించి చెప్పి మీరు ఇక్కడ పిల్లల్ని నిశ్చింతగా వదిలి పనిచేసుకోవచ్చు అని వాళ్ళకిచెప్పి వస్తున్నారు… ఇలా నీలాంబరి అనుకున్న దానికన్నా ఏర్పాట్లు ఇంకా ఘనంగా ఉన్నాయి.
ఆ బాలసదనం మొత్తం తన్మయత్వం పొందుతూ తిరగసాగింది నీలాంబరి కళ్ళనుండి నీళ్లు రాలుతున్నాయి… తనను తాను మైమరిచిపోయింది…
అక్కడే ఉన్న భూపతి దగ్గరికి వచ్చి అతని రెండు చేతులు పట్టుకొని కళ్ళకు అద్దుకుంది నీలాంబరి…
” ఏంటి నీలా ఏమైంది?” అన్నాడు భూపతి.
” సంకల్పం మాత్రం నాది చేసే పనులన్నీ మీవే.. నా ఊహకందనంతా అద్భుతంగా ఈ సౌధాన్ని నిర్మించారు నా స్వప్నం సాకారం అయ్యింది” అన్నది ఉద్వేగంగా నీలాంబరి.
” ఊరుకో నీలా నువ్వు నేను ఒకటి కాదా !నీవు అనుకున్నది నేను చేయడం నాకు ఎంతో తృప్తినిస్తుంది నీ మనసు నాకు తెలుసు నీలా ఇంకా జరగబోయే కార్యక్రమం గురించి మనం ఆలోచించాలి పిల్లల్ని చూసుకోవడం అంటే ఆశామాశ వ్యవహారం కాదు ఎంతో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు జబ్బున భారిన పడకుండా ఒక డాక్టర్ని నర్సులని ఆయాలని ఒక చిన్న మెడికల్ షాప్ ని ఇవన్నీ మనం ఏర్పాటు చేయాలి ఇంకా మంచిగా పిల్లల్ని చూసుకునే ఆయాలని వంట వాళ్లని చాలామందిని ఏర్పాటు చేయాల్సి ఉంది ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అసలే అలేఖ్య కూడా డెలివరీకి వచ్చింది నువ్వు మనసులో ఎక్కువ ఒత్తిడి పెంచుకోకు. సరేనా” అన్నాడు భూపతి.
ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు… దారంతా నిర్మానుష్యంగా ఉంది.. చుట్టుపక్కల ఇల్లు పొలాలు ఏమీ లేవు కొండలు చెట్లు మాత్రమే ఉన్నాయి…. దూరంగా ఒక చెట్టు కింద ఇద్దరు పిల్లలు కూర్చుని కనిపించారు ఇద్దరు స్కూల్ బ్యాగులు ధరించి ఉన్నారు చేతుల్లో మొబైల్ పట్టుకున్నారు.. అలాగే గమనిస్తూ వారి ముందుకు వచ్చింది కారు అయినా కూడా వారు ఎవరిని పట్టించుకోకుండా మొబైల్ చూడడం లోనే నిమగ్నమై ఉన్నారు…
” కారు ముందుకు తీసుకెళ్లి ఆపండి” అని డ్రైవర్ కి చెప్పింది నీలాంబరి.
” ఎందుకు నీలా నేను పట్నం వెళ్లాలి నాకు టైం లేదు” అన్నాడు భూపతి.
” ఒక్క ఐదు నిమిషాలు అండి” అని చెప్పి కారు దిగి చప్పుడు కాకుండా ఆ పిల్లల వెనకాల వచ్చి నిలబడింది… వాళ్లు అంతగా మొబైల్లో ఏం చేస్తున్నారో అని చూసింది…
ఒక్కసారి నివ్వర పోవడం నీలాంబరివంతయింది…
వాళ్లు చూస్తున్న అశ్లీల చిత్రాలు చూస్తుంటే ఒళ్లంతా కంపరించింది…
అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంది నీలాంబరి…
చివరికి గొంతు పగులుచుకొని…
” ఇక్కడ ఏం చేస్తున్నారు స్కూలుకు వెళ్లే టైం దాటిపోయింది కదా మీరు స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగింది నీలాంబరి.
ఉలిక్కిపడ్డ పిల్లలు వెనక్కి తిరిగి మొబైల్ దాచుకునే ప్రయత్నం చేశారు…
” చెప్పండి స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు మొబైల్లో అంత శ్రద్ధగా ఏం చూస్తున్నారు?” అని అడిగింది నీలాంబరి..
” ఏమీ లేదు ఏమీ లేదు” అని నీళ్లు నమ్మినారు పిల్లలు.
” మీ తల్లిదండ్రులు ఎవరు వారి పేరేంటి!” అని అడిగింది నీలాంబరి.
భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పారు…
వెంటనే నీలాంబరి వారి చేతుల్లో నుండి మొబైల్స్ తీసుకొని “మీ అమ్మానాన్నలని సాయంత్రం మా ఇంటికి పంపించండి… అప్పుడు ఈ మొబైల్ ఇస్తాను భూపతి గారి ఇంటికి అని చెప్పండి” అన్నది నీలాంబరి.
” అదేంటి మా అమ్మానాన్న తిడతారు మీకు మొబైల్ ఇచ్చేస్తే అయినా మీరు ఎందుకు తీసుకుంటున్నారు!” అని ఎదురు ప్రశ్న వేశారు పిల్లలు.
ఒక్కసారి తీక్షణంగా వారి వైపు చూసి వెనక్కి వెళ్లి కారెక్కింది నీలాంబరి…
ఇంకా ఉంది