మరణ శాసనం

కథ

కామేశ్వరి వాడ్రేవు

బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ సుబ్బమ్మ గారు తనలో తాను అనుకుంటున్నారు ” ఈ పుట్టడాలు ఏమిటి? చివరకు ఈ మరణించడం ఏమిటి. ఏమీ అర్థం కావటం లేదు ఈ జీవిత సత్యం ఏమిటో ” అనుకుంటూ బావిలోని నీళ్లు తోడుకుని నాలుగు చేతల నీళ్లు నెత్తి మీద పోసుకున్నారు. కట్టుకున్న బట్టను బాగా తడుపుకున్నారు, మరొక బకెట్ నీళ్లతో స్నానం చేశారు. ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకుని కుర్చీలో కోలబడింది. మనసంతా ఏదో ఆరాటంగా, వెలితిగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు . ” మా ఇద్దరి కి కూడా వయసు పెరిగిపోతుంది. రేపు మా గతి ఏమిటి ” అని ఆలోచించ సాగింది. తప్పదు కదా… పల్లెటూరు కనక వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గు వేసింది. అది కొద్దిగా ఆధునికతను సొంతరించుకున్న పల్లెటూరు. ఇంకా పాత ఆచారాలు పూర్తిగా పోలేదు.
అలా రెండు గంటలు గడిచిన తర్వాత భర్త రాఘవయ్య గారు రానే వచ్చారు. ఆయన స్నానం చేసి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. మరల బావి దగ్గరికి వెళ్లి రెండు బాల్చీ నీళ్లు నెత్తిమీద కుమ్మరించుకొని సుబ్బమ్మ గారు అందించిన తుండు గుడ్డతో ఒళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వచ్చి పంచ కట్టుకుని, ఒక తువ్వాలు భుజం మీద వేసుకొని, వచ్చి కుర్చీలో కూలపడ్డారు. ఇంతలో సుబ్బమ్మ గారి ఇద్దరికీ కాపీ చేసి పట్టుకొచ్చారు. తాగుతూ ఇద్దరు మాటల్లోకి దిగారు . ముందుగా సుబ్బమ్మ గారు ” వెళ్లిన కార్యక్రమం అంతా సాఫీగా జరిగిందా! ఆ పెద్దాయన శంకరయ్య గారు ఎంతో అదృష్టవంతులు. కొడుకులు ఈ దేశంలోనే అందుబాటులో ఉన్నారు కనుక తండ్రి ఆఖరి క్షణాల్లో దగ్గరుండి ఎంతో ప్రేమగా చూసుకున్నారు చావు అనేది ఎప్పుడో ఒకప్పుడు తప్పదుగా! ఎలా బ్రతికామని కాదు…. చివరికి ఎలా వెళ్లారు అన్నదే అదృష్టం. ఎక్కువ కాలం మంచం పట్టకుండా వెళ్లిపోయారు. అయినా ఆయన చేసినది చిన్న ఉద్యోగమైన పిల్లలను సక్రమంగా పెంచి, ఉన్నంతలో చదువులు చెప్పించారు. వాళ్లు కూడా శ్రద్ధగా చదువుకుని వారికి తగిన కొలువులు పొందారు. పిల్లలందరూ సఖ్యతతో తల్లిదండ్రులను పువ్వులతో పెట్టి చూసుకున్నారు. పాడి ఎత్తుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎలా ఏడ్చారో…. చూశారు కదా! దానిలోనే వాళ్ళ ప్రేమ బయటపడింది. ” అంది. దానికి రాఘవయ్య గారు” ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. ఉన్న ఊరు వదిలి వెళ్ళకుండా అందరికీ తలలో నాలికలాగా మసులుకున్నాడు శంకరయ్య. ఎవరికైనా అవసరం వస్తే ముందుండేవాడు. ఆయన మంచితనమే తనను చివరిదాకా కాపాడింది ” అన్నారు. పక్క వీధిలో ఉండే శంకరయ్య గారు రాఘవయ్య గారు మంచి స్నేహితులు. మిత్రుడు లేని వెలితికి రాఘవయ్యారు ఎంతగానో బాధపడ్డారు.” మీరు వెళ్లి కాసేపు నడుంవాల్చండి. నేను వంట చేసి పిలుస్తాను” అని లోపలికి వెళ్లారు సుబ్బమ్మ గారు.
పడుకున్నారే కానీ మనసుకు స్థిమితంగా లేదు రాఘవయ్య గారికి. ఆలోచనలో పడ్డారు ” జాతస్య మరణం ధ్రువం ” అంటారు. పుట్టిన తర్వాత తెచ్చుకున్న, తీర్చవలసిన రుణాలు తీరగానే అందరూ పోవాల్సిందే. ఈ రెండింటికి మధ్యన ఈ ఆట అంతా. ఆలోచిస్తే శంకరయ్య అదృష్టవంతుడు. 86 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆరోగ్యంగా తన పనులు తను చేసుకున్నాడు. కాలం రాగానే నెమ్మదిగా జారుకున్నాడు. పిల్లలు ఎంతో వైభోగంగా సాగనంపారు. కానీ తమ పరిస్థితి ఏమిటి? పిల్లలు లేని మాకు రేపు దిక్కెవరు? మేము కూడా వయసు మళ్ళీ ఉన్నాము. రేపు మేము పోవాల్సిన వారమే కదా. కానీ భగవత్ నిర్ణయం ఎలా ఉందో! ఎవరినైనా పెంచుకుందామని ఆ రోజులలో అనుకున్నాము. కానీ ఇంచుమించు నా వయసు ఉన్న మా చిన్న మేనమామ చూశాను కదా… వాళ్లకు పిల్లలు లేకపోతే మా అత్త బలవంతం మీద ఆమె తరపు వాడిని దత్తత తీసుకున్నారు. వాడికి చదువు సంధ్య అని చెప్పించారు. ఉద్యోగస్తుడైన తర్వాత పెళ్లి కూడా చేశారు. ఆ పిల్ల కూడా కాస్త చదువుకుందికూడా. కానీ ఏం లాభం వచ్చినప్పటి నుంచి ఆస్తి వారి పేరు మీద రాయమని గోల. మా తదనంతరం నీకే కదా వచ్చేది ఇప్పటినుంచి ఎందుకురా, చదువు చెప్పించి నిన్ను ప్రయోజకుడ్ని చేసాము కదా, చాలదా అన్నారు. హాత్తేరి మీరు చచ్చిన తర్వాత ఇస్తే నేనేం చేసుకుంటాను. ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి రెండింతలు చేయవచ్చు ఆస్తిని. మా ఫ్రెండ్స్ అందరూ సైడ్ బిజినెస్ గా ఇది చేసి లక్షల గడుస్తున్నారు ” అని నాలుగు అల్లిబిల్లి కబుర్లు చెప్పి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి అంతా రెండేళ్లకే హుళక్కి చేశాడు. అంతా ఊడ్చి పెట్టుకుని పోయిన తర్వాత తన దారి తాను చూసుకున్నాడు. ఆఖరి దశలో ఎవరూ చూసేవారు లేక నాన అవస్థ పడ్డారు దంపతులు. ముందు మావయ్య వెళ్ళిపోయాడు. అత్త తన చుట్టమని పెంచుకున్న దత్తత కొడుకు దగ్గరకు చేరనీయలేదు. తర్వాత ఆవిడ ఒక అనాధ శరణాలయంలో తనువు చాలించింది. ఆవిడ బతికుంటగా నేనే ఆశ్రమానికి వెళ్లి కాస్త డబ్బు మందులు ఇచ్చి వచ్చేవాడిని,మంచి చెడ్డలు చూసి వచ్చేవాడిని. దత్తత అంటే ” కొరివి తెచ్చి తల మీద పెట్టుకున్నట్టే ” అని తెలిసి మానుకున్నాను. ” మరల ఇలా అనుకున్నారు వెంకట్రావు గారు ” ఓపిక ఉన్నన్నాళ్ళు చూద్దాం తరువాతది తర్వాత చూసుకుందాం ” అని కానీ మనసును సమజాయించ లేకపోయారు. ” శంకరయ్య నీ సగౌరవరంగా సాగనంపారు కొడుకులు. కానీ తమ గతి ఏమిటి? అని అనుకుంటుంటే సుబ్బమ్మ గారు” ఏమిటి మళ్లీ పాత ఆలోచనలోకి వెళ్లిపోయారా! ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. చచ్చిన తర్వాత ఎవరో ఒకరు తగలేస్తారు. అలా వదిలేస్తే పీనుగా వాసన వచ్చి చేస్తుంది.. భరించలేక చచ్చిన కుక్కను పాతిపెట్టినట్లు ఎవరో ఒకరు తగలేస్తారు. వంట అయి పోవచ్చింది. లేచి రండి “అని ఆవిడ వెళ్లిపోయారు.
కానీ రాఘవయ్య గారిని మళ్ళీ ఆలోచనలు చుట్టు ముట్టాయి. నిరుడు చనిపోయిన వెంకట్రావు గారు గుర్తుకొచ్చారు. ఆయన గవర్నమెంట్ లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయి, పుట్టిన ఊరు మమకారంతో,ఇక్కడికి వచ్చి, తన తండ్రి తాతల నాటి,ఇంటిని కాస్త ఆధునికంగా బాగు చేయించుకుని భార్యను తీసుకుని వచ్చి చేరారు. పాత మిత్రులందము వెళ్లి అభినందించాము మళ్ళీ మా ఊరు వచ్చినందుకు . మేము హైస్కూల్లో తోటి విద్యార్థులం. గవర్నమెంట్ వారి పెన్షన్ కూడా వచ్చేది ఆయనకి. పిత్రార్జిత పొలం కూడా ఉంది. వ్యవసాయం దగ్గరుండి చేయించు కునేవారు. ఆర్థికంగా ఎలాంటిఇబ్బంది లేదు. కానీ ఎటోచ్చి బీపీలు షుగర్ వచ్చి చేరాయి. మందులతో కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నత ఉద్యోగి అవటం వలన ఇద్దరి మగ పిల్లలను, ఆడపిల్లనుబాగా చదివించారు. పెద్ద పెద్ద సంబంధాలతో పెళ్లి చేశారు. అందరూ విదేశాల్లోనే స్థిరపడ్డారు. ఓపిక ఉన్నప్పుడు వారి దగ్గరికి( విదేశాలకి) వెళ్లి వచ్చేవారు. కొన్నాళ్లకు వాళ్లకు ఓపిక కూడా తగ్గి వెళ్లడాలు మానేశారు. పిల్లలే ఏడాదికో రెండు ఏళ్లకో ఒకసారి వచ్చి వెళ్లేవారు. వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండటం తక్కువ, సైట్ సీయింగ్ లని, అత్తవారిల్లకని, ఫ్రెండ్స్ కలవడానికి అని తిరుగుతూనే ఉండి వారు. వీళ్ళ దగ్గర ఉండేది తక్కువ కాలమే. కానీ పిల్లలు వచ్చారు కదా అని ఎంతో తృప్తిగా ఉండేవారు. ఒకసారి వెంకట్రావు గారికి బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయారు. భార్య పని వాడితో కబురు పంపితే వెళ్లి పట్నం నుంచి డాక్టర్ను తీసుకువచ్చి చూపించాము. బీపీ తగ్గడానికి మందులు ఇచ్చి ఈసారి బిపి ఎక్కువైతే బ్రెయిన్ హేమరేజ్ కూడా రావచ్చు. మందులు జాగ్రత్తగా చేసుకొని,ఎలాంటి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఒకనాడు ఉన్నట్టుండి బీపీ పెరగడం బ్రెయిన్ స్ట్రోక్ రావడము జరిగిపోయింది. 24 గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు అంబులెన్స్ లో పట్టణానికి తీసుకెళ్తే. భార్య చేత కొడుకులకు ఫోన్ చేయించి పరిస్థితి చెప్పించా. కానీ ఎవరూ వెంటనే రావడానికి కుదరదు అన్నారు. రావడానికి ఓ వారం రోజులైనా పడుతుంది అన్నారు. వీసాలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు ఆ తతంగం అంతా చూసుకొని రావాలి అన్నారు. ఈలోగా మరుసటి రోజునే…ఆయన కోమాలో కన్నుమూశారు. పిల్లలతో ఈ విషయం చెప్తే బాడీన మార్చురీలో ఉంచమని చెప్పారు. వీలు చూసుకుని బయలుదేరుతామన్నారు. అక్కడికీ మూడు రోజులు ఉంచాము. ఊరి పెద్దలు, పురోహితుడు” ఇన్నాళ్లు శవాన్ని ఉంచకూడదు ఆత్మ చాలా బాధపడుతుంది దహనం అయ్యేదాకా ” అని చెప్పడంతో మళ్లీ పెద్ద కొడుకు ఫోన్ చేశాం. నేను ప్రాజెక్టు విషయంలో చాలా బిజీగా ఉన్నాను. నాకు రావడం కుదరదు. మా తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించుకోండి అన్నాడు. తమ్ముడేమో కర్మ బాధ్యత పెద్దకొడుకుదే గాని నాది కాదు అన్నాడు. “మగ పిల్లలే కలిసి రాకపోతే పరాయి ఇంటికి వెళ్లిన ఆడపిల్లను నేనేమి చేయగలను అంది కూతురు. మొత్తానికి ఎలాగైతేనేమి నాలుగవ రోజున దహన కార్యక్రమం వారి కులపు అబ్బాయిని ఒప్పించి కానిచ్చాము. ఆరవ రోజున పెద్దాడు ఏడో రోజున కూతురు,చిన్న కొడుకు దిగారు. మిగిలిన కర్మకాండలు కానిచ్చారుఎంతో వైభవంగా. కానీ పోయిన వెంకట్రావు మాత్రం ఇదేమీ చూడలేదు కదా!… 13 రోజున ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవాలి అని పురోహితుడు అంటే వెళ్లి రావడం అంటే మాటలు అనుకున్నారా ఇదేమి పక్క ఊరు కాదు. ” అని టౌన్ కెళ్ళి హోటల్లో నిద్ర చేసి మరునాడు వచ్చి ఆస్తి వ్యవహారాలన్నీ చట్టబెట్టుకొని, తల్లికి ఒక ఆయాను ఏర్పాటు చేసి, అవసరమైనవన్నీ ఆన్లైన్ ద్వారా పంపిస్తామని తల్లికి చెప్పి ఒక ఏటీఎం కార్డు కూడా ఇవ్వబోయాడు పెద్ద కొడుకు. తల్లి పౌరుషంగా” వద్దు నాయనా…. మీ నాన్న పోయినా నాకు కొంత ఏర్పాటు ఉంది. అదే… ఆయన పెన్షన్ లోని సగభాగం. అది చాలు నాకు ఈ బతుకు ఏడ్చడానికి” అంది. వచ్చిన బంధువులను తమ తల్లిని చూస్తూ ఉండమని తమ దారిని తాము వెళ్ళిపోయారు. వెళ్లేముందు కూతురు ఒక్కత్తి దగ్గరికి వచ్చి ” నీ కొడుకులు పొలాలు పుట్ట అన్ని పంచేసు కున్నారు. ఈ ఇల్లు మాత్రం నాకే వ్రాయాలి సుమా… లేకపోతే నేను నీ కూతుర్ని కాను ” అని హెచ్చరించి వెళ్ళింది. ఏమి లోకం ఏమి పిల్లలు వీళ్ళ కోసమా జీవితమంతా ధారపోయడం. ” అని ఆలోచిస్తున్న రాఘవయ్య గారిని సుబ్బమ్మ గారు” రండి వడ్డించాను, భోంచేద్దురుగాని ” అని కేక పెట్టారు. ఆ కేక ఆలోచనలు చల్లా చెదరై భోజనానికి లేచారు రాఘవయ్య గారు.
ఒకనాడు రాఘవయ్య గారు పేపరు చదువుతుండగా ఒక వార్త కళ్ళ బడింది. సుదర్శన రావు గారు అనే భార్యని పోగొట్టుకున్న 84 ఏళ్ల ఇంజనీర్ గారు తన పిల్లలు ఎవరికీ తను అక్కర లేకపోవడంతో ఒక వీలునామా రాసి” ఇందులో తను మరణించిన తరువాత తన దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమని, వీలైతే పనికి వచ్చిన అవయవయాలు ఏమైనా ఉంటే అవి లేనివారికి దానం చేయమని, మిగిలిన శరీరాన్ని మెడికల్ స్టూడెంట్లకు అనాటమీ కొరకు తీసుకోవచ్చుని రాసి విల్లు రిజిస్టర్ కూడా చేయించుకున్నారు ” అని రాసి ఉంది. ఆయన కోరినట్లుగానే ఆయన శరీరము మెడికల్ కాలేజీకి అప్పగించబడింది. ఇది ఒక కొత్త రకం అయిన ముగింపు. ” అని ఆ పత్రికలో రాయబడి ఉంది
ఈ వార్త రాఘవయ్య గారికి ఎంతో ఊరట కలిగించింది.. వంటింట్లో కొచ్చి భార్యకు చదివి వినిపించారు.
” మనని కడతేర్చేవారు ఎవరూ లేరని విచారిస్తున్నావు కదా… మనం కూడా ఇలాగే విల్లు రాసి రిజిస్టర్ చేయించు కుందాం. “పరోపకారం వెధవ శరీరం” అన్నట్టుగా ఈ శరీరం కావలసిన వారికైనా ఉపయోగపడేలా చేద్దాం. చచ్చి నలుగురికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా మెడికల్ స్టూడెంట్ల ఆనాటిమీకి పనికి వస్తుంది. ఎవరు తగలబెడితే ఏమిటి అయ్యేది బూడిదే కదా. రోజులు మారాయి. మనంగా కొంచెం ఆధునికంగాఆలోచించడం నేర్చుకోవాలి. పున్నామ నరకానికి పోతే పోతాం. ఎవరి చూడొచ్చారు. ఈ పని వల్ల మనం స్వతృప్తిగా మరణించవచ్చు. అన్నారు రాఘవయ్య గారు. భర్త వినిపించిందానికి చిన్నగా నవ్వుకున్నారు సుబ్బమ్మ గారు. ” అలాగే కానీయండి. కృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలో చావు శరీరానికే కానీ ఆత్మకు కాదు అని చెప్పాడని మొన్న చాగంటి గారి ప్రవచనంలో విన్నాను కదా. శుద్ధమైన ఆత్మతో పైకెళ్తే చాలు దానిని భగవంతుడు కూడా హర్షిస్తాడు. ” అన్నారు సుబ్బమ్మ గారు.
ఈ విషయం డాక్యుమెంటర్ ద్వారా రాయించి రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వానికి అందజేశారు రాఘవయ్య గారు. ఈ విషయం ఊళ్లో వాళ్ళందరికీ చెప్పి, రిజిస్టర్ కాగితాలు కూడా చూపించారు. ఇది విన్న ఇంజనీర్ గారికి భార్య తనకు కూడా అది సమ్మతమేనని. కాగితాలన్నీ ఏర్పాటు చేస్తే సంతకం పెడతానని, తనకు ఆ ఏర్పాటు చేయమని బ్రతిమాలి మరీ అడిగి చేయించుకుంది. ఇది విన్న ఊర్లోని యువకులు పేపర్లో ఈ విషయాన్ని ప్రచురించేలా చేశారు. ఇది చదివి ఎంతో మంది బిడ్డల బాధితులు ప్రేరణ పొందిరో మా వాట్సాప్ గ్రూప్ కి షేర్ చేయండి అని పోస్ట్ పెట్టి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. మర్నాడు నుంచి వాట్సప్ కి ఎన్నో మెసేజ్లు, అభినందనలు. లైక్ కూడా వచ్చేశాయి. కొందరు వారి పరిస్థితిని వివరించి సలహాలు అడగటం, కొందరు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడగడం,. అంటే ఇంతమంది “కన్న పిల్లల “బాధితులు ఉన్నారన్నమాట. అని ఊరంతా తెలిసింది. అనుబంధాలు కూడా ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయని అనుకున్నారు ఊరివారు. కానీ ప్రతిదానికి ఒక పరిష్కారం పుట్టుకొస్తుంది కదా. అది ఈ రూపంలో ఈనాడు కనిపించింది. పిల్లల ఆదరణ లేని తల్లిదండ్రులకు ఇది ఒక మార్గదర్శకం అయింది. ఇది ఒక సవాల్ గా విసరాలి తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలకు అని నవభారత యువకులు నడుము బిగించారు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పుడమి పండుగ ట నేడు

దొరసాని