ఇంతకీ..మీరు బాగున్నారా!

కథ- లక్ష్మీ మదన్

“అక్కా! ఏం చేస్తున్నావ్?” అంటూ వచ్చింది రజిని..

అప్పుడే పిల్లలకి, భర్తకి కావలసినవి అన్నీ చేసి వాళ్ళు స్కూల్ కి ఆఫీసుకి పంపించి అత్తమామలకి కొంచెం సాఫ్ట్ గా ఉండే టిఫిన్ తయారు చేస్తుంది సుధ..

” రా రజిని” అంటూ పిలిచింది సుధ..

” పొద్దుటి నుండి తల నొప్పిగా ఉందక్కా! ఏమీ తినాలనిపించడం లేదు నువ్వేం టిఫిన్ చేసావు”? అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెల మూతలు తెరిచి చూస్తుంది రజిని..

సుధ నోరు తెరిచి చెప్పబోయేంతలోనే ప్లేట్ తీసుకొని అందులో ఉన్న నాలుగు వడలని పెట్టుకొని…

” అక్కా! ఇందులోకి ఏం పచ్చడి చేసావ్” ? అని అడిగింది రజిని..

ఒక్క నిట్టూర్పు విడిచి సుధ “అల్లం పచ్చడి చేశాను ఫ్రిజ్లో ఉంది తీసుకో” అన్నది..

రజిని పక్క పోర్షన్ లోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది ..వచ్చినప్పటి నుండి ఇదే తీరు నాకు తినబుద్ధి కావడం లేదని లేదా తాను చేసుకున్న టిఫిన్ బాలేదని ఏదో వంక చెప్పి సుధ దగ్గరికి వచ్చి ఏదంటే అది పెట్టుకొని తినేసి వెళ్ళిపోతుంది…. పోనీ ఇంట్లో చాలామంది ఉంటారనుకుంటే.. రజిని రజిని భర్త సంజయ్ మాత్రమే ఉంటారు.. సంజయ్ ది ఎక్కువగా టూర్లు ఉండే ఉద్యోగం.. ఎక్కువగా బయటే భోజనం చేస్తాడు ఏమున్నా ఇంట్లో సుధ ఒక్కతే వండుకొని తినాలి.. పనులన్నింటికీ పనిమనిషి ఉంది.. జాబ్ చేయడం ఇష్టం లేదంటూ ఇంట్లోనే ఉంటుంది…

ఎంతసేపు ఫోన్ లో టిక్ టాక్ వీడియోస్ చేయడం ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకోవడం ఇలాంటి వాటి మీదనే ఇంట్రెస్ట్… మళ్లీ తనకే కష్టాలన్నీ ఉన్నట్లు చెబుతూ ఉంటుంది..

” ఇంకా పని కాలేదా అక్కా” అంటూ ప్లేట్ పట్టుకొని కిచెన్ లో సుధ పక్కన నిలబడింది రజిని…

” లేదమ్మా అవుతున్నాయి.. పిల్లలు ఆయన ఇప్పుడే వెళ్లారు మా అత్తగారికి మామగారికి లైట్ గా ఉండే టిఫిన్ తయారు చేస్తున్నా” అన్నది సుధ.

” నువ్వు అదృష్టవంతురాలివి అక్క చక్కగా ఇంట్లో అందరూ ఉంటారు… అందరూ నిన్ను బాగా చూసుకుంటారు.. పొద్దున్నే పనులన్నీ అయిపోతాయి మిగతా టైం అంతా విశ్రాంతి కదా నీకు” అన్నది రజిని గబా గబా వడలను నోట్లో కుక్కుకుంటూ…

” నిజమే రజినీ! అందరి కోసం పనులు చేస్తుంటే సమయం అసలు తెలియదు.. అవును మిగతా సమయం అంతా నాకు ఖాళీనే.. కాకపోతే మధ్యాహ్నం సమయంలో రేపటి కోసం కూరగాయలు తరిగి పెట్టుకోవడం..బట్టలు ఆరేయడం..ఇస్త్రీ చేయడం…ఇల్లంతా సర్దుకోవడం చేస్తాను.. ఈ పనులన్నీ అయ్యేవరకు మూడు అవుతుంది..ముడున్నరకి పిల్లలు వస్తారు… అరగంట సమయం ఖాళీనే” అంది నవ్వుతూ..

ఇదేమీ పట్టించుకోని రజిని “అక్క కొంచెం కాఫీ ఇస్తావా ఎలాగూ మీ వాళ్లకి పెడతావు కదా నా కోసం ప్రత్యేకంగా ఏమీ వద్దులే అందులోనే కొంచెం ఇవ్వు” అన్నది.

ఇంట్లో ఉదయం ఒక్కసారి అందరూ టీ తాగుతారు కాఫీ అసలు ఎవరూ తాగరు ఎప్పుడైనా ఎవరైనా వస్తారని తెప్పించి పెడుతుంది సుధ.. కానీ, ఈ మధ్య రజనీ కోసం కాఫీ ఇవ్వడమే ఎక్కువైపోయింది…

మాట్లాడకుండా సుధ రజినీ కోసం కాఫీ చేసి చేతికి అందించింది…

కాఫీ తాగేసి కాఫీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి “నువ్వు ఇప్పుడు పనిలో ఉన్నావు కదక్క! మధ్యాహ్నం వస్తాలే అప్పుడు ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకుందాం” అంటూ టేబుల్ మీద కనబడ్డ రెండు ఆపిల్స్ ను చేతిలో తీసుకొని వెళ్ళిపోయింది…

సుధ అత్తగారు వచ్చి ..

” ఏంటమ్మా! ఈ పిల్ల…రోజు ఇలా వచ్చి స్వాహా చేస్తుంది” అన్నది చిరాకు పడుతూ…

” తిన్నందుకు నాకు బాధ లేదు అత్తయ్య.. కానీ ఈ అమ్మాయి బాధ్యతలు ఎప్పుడు తెలుసుకుంటుంది అని నా బాధంతా.. పాపం ఆమె భర్తకి ఎంత కష్టమైపోతుందో కూడా ఆలోచించడం లేదు.. ఆయన ఉన్న ఒకటి రెండు రోజుల్లో కూడా ఏమి చేసిపెట్టదట ఆయనే ఏదో తంటాలు పడతాడట ..ఈ అమ్మాయికి ఎప్పుడు తెలిసి వస్తుందో అర్థం కావడం లేదు.. చక్కని చదువు ఉంది ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పింది ..పోనీ ఉద్యోగం లేకున్నా పర్వాలేదు ఇల్లును చక్కబెట్టుకోవాలి కదా! ఈమె ఇలా ఉందని తెలిసి ఇటు పుట్టింటి వారు అటు అత్తింటి వారు ఎవరు ఈమె దగ్గరికి రావడం లేదు ..అయినా వాళ్ళందరూ తనని ఏదో రాసి రంపాన పెడుతున్నారు అనే భావనలో ఉంటుంది ఇ..ది చాలా మందిలో ఉండే రుగ్మతనే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాళ్లకే ఉన్నాయని అసలు వాళ్ళని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఇలా ఆలోచిస్తుంటారు ..ఈ అమ్మాయిని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను” అన్నది సుధ..

“నిజమేనమ్మా ఈ పిల్ల బాధ్యతలు ఎప్పుడూ తెలుసుకుంటుందో ఏమో! ఇంకా భర్త మంచివాడు కాబట్టి సరిపోతుంది లేకపోతే ఎప్పుడో వదిలించుకునేవాడు ఎలాగైనా ఈ అమ్మాయి కాపురం చక్కదిద్దాలమ్మ! దానికి నువ్వే తగిన ఉపాయం ఆలోచించు” అన్నారు సుధ అత్తగారు జానకమ్మ…

ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది సుధ ఎలాగైనా ఈ అమ్మాయిలో మార్పు తేవాలి అనుకుంది…

ఒకరోజు రజిని భర్త సంజయ్ ని పిలిచింది…

” రజిని గురించి మాట్లాడదామని పిలిచాను సంజయ్ గారు” అన్నది సుధ..

” ఏం చేయమంటారు.. రజిని మంచిదే కాదనడం లేదు కానీ బద్ధకం ఎక్కువ ఎప్పుడు తన గురించి తక్కువ చేసుకోవడం తనని ఎవరో సాధిస్తున్నారని భ్రమలో ఉండడం తనకున్న లక్షణం.. చాలా ప్రయత్నించాను మార్చడానికి నాకేమో సమయం తక్కువ నా ఉద్యోగం అంతా టూర్లతో ముడిపడి ఉంది రేపు పిల్లలు పుడితే వాళ్లనైనా సరిగా చూస్తుందా అనే భయం నాకు కలుగుతుంది సుధ గారూ” అన్నాడు సంజయ్…

” ఈసారి మీరు టూర్ ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకోండి అప్పుడు అంతా రజినినీ మా ఇంట్లో ఉండమంటాను ఆమెను మార్చడానికి ప్రయత్నిస్తాను ..మీరు నిశ్చింతగా ఉండండి నేను మీ సొంత అక్క లాంటిదాన్ని అనుకోండి” అని చెప్పింది సుధ..

” సరే నండి” అంటూ వెళ్లిపోయాడు సంజయ్..

అనుకున్నట్లుగానే సంజయ్ వారం రోజులు క్యాంపు పెట్టుకున్నాడు..

” రజినీ? ఈసారి నాకు ఎక్కువ రోజులు క్యాంపు పడింది నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి గాని వెళ్తావా” అన్నాడు సంజయ్

” నేను వెళ్ళనండి ఇటు అమ్మ దగ్గరకు వెళ్లినా అటు అత్తయ్య దగ్గరికి వెళ్లిన ఏవో పనులు చెప్తారు నాకు అక్కడ ఊపిరి సలపనట్లు ఉంటుంది నే..ను ఇక్కడే ఉంటాను అయినా పక్కన సుధక్క ఉంది కదా ఏం భయం లేదు మీరు వెళ్లి రండి” అన్నది రజిని..

అనుకున్నట్లుగానే సంజయ్ క్యాంపుకు వెళ్లిపోయాడు…

అదే రోజు పొద్దున రజిని సుధ ఇంటికి వెళ్ళింది…

” అక్కా! ఈసారి మా వారు వన్ వీక్ క్యాంపుకు వెళ్లారు .. ఒక్కదానివి ఎలా ఉంటావంటే నువ్వు ఉన్నావని చెప్పాను..” అన్నది రజనీ..

” అవును నేనుండగా నీకేం భయం చక్కగా మా ఇంట్లోనే ఉండు” అన్నది సుధ..

అదే ఎక్స్పెక్ట్ చేసిన రజిని “మీ ఇంట్లో నే ఉంటాను అక్కా!” అని చెప్పి బట్టలు తెచ్చుకుంటానని ఇంటికి వెళ్ళింది…

ప్లాన్ లో భాగంగా కరెంటు కనెక్షన్ తీసేయించాడు సంజయ్.. సుధ ఇంట్లో విసుగు వచ్చినా ఇంటికి రాకుండా ఉండడానికి..

ఇంటికి వచ్చిన రజినీకి కరెంటు లేకపోవడం చూసి…

” ఏమండీ ఇంట్లో కరెంటు పోయింది” అని భర్తకు ఫోన్ చేసి అడిగింది..

“అవును నేను వచ్చేటప్పుడే గమనించాను కానీ అది పెద్ద రిపేర్ అవసరం పడుతుంది నువ్వు ఎలాగో సుధ గారి ఇంట్లో ఉంటావు కదా నేను వచ్చాక రిపేర్ చేయిస్తాను.. అంతవరకు అడ్జస్ట్ చేసుకో రజినీ” అన్నాడు సంజయ్..

సరేనని చెప్పి బ్యాగ్ లో బట్టలు తనకు అవసరమున్న వస్తువులన్నీ పెట్టుకొని సుధ ఇంటికి వెళ్ళిపోయింది రజిని..

సుధా మరియు సుధా అత్తగారు సుధ భర్త ముందే ఒక ప్లాన్ వేసుకున్నారు.. రజిని ఉన్నన్ని రోజులు వాళ్లు ఎలా ప్రవర్తించాలో..

రోజంతా పనులు చేస్తూనే ఉన్నా కావాలని వంకలు పెట్టేసాగారు సుధ అత్తగారు భర్త వినయ్

” ఏంటి సుధా ఈ కూర ఇంత చండాలంగా ఉంది ఇంత నూనె నా పోసేది మా ఆరోగ్యాలు ఏమైపోవాలి”? ఇలా సాధించేది జానకమ్మ గారు…

ఇటు పిల్లల పనులు అటు భర్త పనులు అత్త మామగారు పనులు చేసుకుంటూ వాళ్ళు ఏదైనా అన్నా చిరునవ్వుతో ఉండగలగడం సుధ గొప్పతనం అనిపిస్తుంది…

నిజానికి పనులు రోజంతా చేసినా కూడా ఇంట్లో వాళ్ళు మాటలు ఏమీ అనరు అర్థం చేసుకుంటారు కానీ రజినిలో మార్పు కోసం వాళ్లు ఇలా చిన్న నాటకం ఆడారు…

వారం రోజులు గడిచిన తర్వాత రజినీలో చాలా మార్పు వచ్చింది… సుధక్క ఇన్ని పనులు చేస్తుంది ఒక్కరోజు కూడా సహనం కోల్పోదు ..తాను తన వంట కూడా చేసుకోవడం లేదు.. భర్తకు అయితే ఎప్పుడూ ఏమి చేసిపెట్టలేదు అయినా కూడా తాను ఒక్కరోజు కూడా ఏమీ అనలేదు.. ఇలా ఆలోచిస్తూనే ఉంది మెల్లిమెల్లిగా సుధకి చిన్న చిన్న పనులు సహాయం చేయసాగింది.. ఈ మార్పును గమనించిన సుధా సంతోషంగా ఫీల్ అయింది..

వారం గడిచాక సంజయ్ వచ్చి రజిని తీసుకుని వెళ్ళాడు..

ఇప్పుడు రజిని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ భర్తకు సహకారంగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయసాగింది.. ఊరికే సుధ ఇంటికి వచ్చి తిని వెళ్లడం మానేసింది…

ఎప్పుడూ తన కష్టాలు చెప్పుకుని రజిని ఒక రోజు సుధ కి ఫోన్ చేసి..

” అక్కా! నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను నా భర్తకి కూడా అన్ని చేసి పెడుతున్నాను ..ఇదంతా నీ వల్లనే జరిగింది నేను చాలా మారిపోయాను ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఎప్పుడూ నా సమస్యలే నీకు చెప్పేదాన్ని నిజానికి నాకు ఏ సమస్యలు లేవు ఉన్నదంతా బద్దకమే ఇప్పుడు అది పోగొట్టుకొని సంతోషంగా ఉన్నాను.. నాకు జాబ్ వచ్చింది కదా స్వీట్ బాక్స్ తీసుకుని వస్తా… ఇంతకీ మీరు బాగున్నారా”? అని అడిగింది రజిని..

రజినిలోని మార్పు చూసి సుధకి చాలా సంతోషం వేసింది…

ఇదే కదా తన కోరుకుంది అనుకుంది…

__శుభం___

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

పుడమి పండుగ ట నేడు