తడి చుక్కలు ఇగిరిపోయి
హృదయం భళ్ళున పగిలి
పొక్కిలి పొక్కిలిగా నేలతల్లి
విడిపోతోంది మట్టి కణాలుగా
తనలో చొచ్చుకుపోయిన
మూలాలకు గొంతు తడపలేక
వేడి కిరణాలకు చిక్కి
నిట్టూర్పు సెగలు కక్కుతోంది
పెకిలించ బడిన మానులు
నిర్జీవ శకలాలుగా
అమ్మ ఒడిలో ఒరిగాయి
పచ్చని యవ్వన పాలధారలను
అడుగంటా పీల్చిన
మానవ రక్కసులు
జీవితాన్ని ఇచ్చిన తల్లిపై
బిడ్డలు చేసిన ద్రోహచింతన
చేసిన పాపాన్ని కడుగుకోలేక
కృత్రిమ అధునాతనంలో
పరిహారం అనుభవిస్తున్న జాతి
జరిగిన అన్యాయానికి
తాను ఘోషిస్తున్నా
శాపాలు పెట్టలేని కరుణమూర్తి
గాయాలెన్నైనా భరిస్తూ
పేరు మోస్తూనే ఉంటుంది
‘సహన ధరిత్రి’గా శాశ్వతంగా..!!
(ధరిత్రి దినోత్సవ సందర్భంగా)