అవహేళన

కథ

డా.. కందేపి రాణీప్రసాద్

మా తరగతిలో అఖిల్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయంటే చాలా ఇష్టం నాకు. చాలా మంచివాడు. నిదానంగా ఉంటాడు. మా క్లాసులోని మిగతా స్నేహితుల్లా ఈర్ష్య పడకుండా ఉంటాడు. నాకు ఫస్ట్ ర్యాంకు వస్తే ఆనందంగా చప్పట్లు కొడతాడు. తను బాగా చదవలేడు. ఎప్పుడూ 70 శాతం దాటవు మార్కులు. అయినా నాకిష్టమే. టీచర్ల దగ్గర పక్క పిల్లల మీద పితూరీలు చెప్పడు. తన లోకంలో తనుంటాడు.
పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు బయటకు తీసి వాడుకున్న వెంటనే బ్యాగులో పెట్టుకోడు. పక్క పిల్లలు పుస్తకాలు అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు. మరల తెచ్చిచ్చారా లేదా అని గుర్తు పెట్టుకొని అడగడు. ఇంటికి వెళ్లేటపుడు అన్ని పుస్తకాలు, పెన్సిళ్లు బ్యాగులో పెట్టుకోవడం మర్చిపోతుంటాడు. అందుకని టీచర్లు అందరూ వీడిని అమాయకుడని అంటుంటారు. దీన్ని అలుసుగా తీసుకొని మా ఫ్రెండ్స్ వాడి పుస్తకాలూ పెన్సిళ్లూ కొట్టేస్తూ ఉంటారు. అయినా వాడికది అర్థం కాదు. నేనుంటే మాత్రం వాడి పుస్తకాలు, పెన్సిళ్లు బ్యాగులో సర్దేసి పెడతాను. ఇంకా ఎవరూ దొంగిలించకుండా కూడా చూస్తుంటాను. ఎందుకంటే మంచి స్నేహితులకు సహాయం చేయాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది.
నాకు జ్వరం వచ్చి నిన్న స్కూలుకు రాలేదు. ఈరోజు వచ్చాను. ఈరోజు లంచ్ అవర్లో అఖిల్ వాళ్ల అమ్మ వచ్చింది. నిన్న అఖిల్ పాఠ్య పుస్తకాలు పోయాయట అడగటానికి వచ్చింది.
‘మా అఖిల్ పుస్తకాలు స్కూల్లోనే ఉండిపోయాయండీ కొంచెం చూసి ఇవ్వండి’ అని ఆమె మాస్టారును అడిగింది. మా మాస్టారుకు బాగా చదవని వాళ్లంటే ఇష్టం ఉండదు. ఆయనకసలే ర్యాంకుల పిచ్చి. ర్యాంకులు వచ్చిన వాళ్లనే తెలివిగల వాళ్లంటూ పొగుడుతాడు.
‘ఇంకా ఎక్కడుంటాయమ్మా! బ్యాగులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు. అసలే మందమతి. మేం కాబట్టి స్కూల్లో చేర్చుకున్నాం గానీ వేరే స్కూల్లో అయితే చేర్చుకునే వాళ్లే కాదు” అని కాస్త అసహనంగా అన్నాడు.
ఆ మాటలకు అఖిల్ వాళ్లమ్మకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. వెంటనే తేరుకుని “మా అబ్బాయి తెలివి తక్కువ వాడయి పుస్తకాలు పారేసుకుంటే మాకు నష్టం కానీ మీకేం కష్టం. మా అబ్బాయి పుస్తకాలు ఇప్పించండి సార్” అన్నది.
‘మీరు భలే వారమ్మా! ఎవరైనా పుస్తకాలు మరిచిపోతే ఇంకా అక్కడే ఉంటాయా? ఎవరో తీసుకెళ్లి ఉంటారు. వాళ్లేమైనా మీ అబ్బాయి లాగా మందమతులా?’ కాస్త అవహేళనగా అన్నాడు మాస్టారు.
అప్పుడు అఖిల్ వాళ్లమ్మ ఇలా అన్నది ‘చూడండి మాస్టారూ! విద్యార్థులకు మంచి చెడులు నేర్పించాల్సిన మీరే ఇలా మాట్లాడుతున్నారు. మా అబ్బాయిని మండమతని, తెలివి తక్కువవాడనీ, తన వస్తువులు తను తీసుకెళ్ళటం మరిచిపోతాడని ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు తమ వస్తువులను పోగొట్టుకుంటారు తప్ప, మీరు పొగుడుతున్న తెలివికల వాళ్లలాగా ఇతరుల వస్తువులను తీసుకెళ్ళరు. మా అబ్బాయిలాంటి వారి వల్ల సమాజానికి ఏమీ నష్టం కలగదు. కానీ పక్క పిల్లల వస్తువులను తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్న పిల్లల వల్ల సమాజానికి చాలా నష్టం. రేపు వాళ్లు దొంగలుగానో, లంచగొండులుగానో, అవినీతిపరులుగానో తయారవుతారు. మా అబ్బాయిని ఎగతాళి చేయడం మాని మిగతా పిల్లల్ని మంచి దారిలో పెట్టే ప్రయత్నం చేయండి. మాస్టారంటే పిల్లలకు మార్గ నిర్దేశకుడిగా ఉండాలి గానీ పిల్లల్లోని అవకరాలను ఎత్తి పొడవడం కాదు. మీలాంటి మాస్టార్లున్న ఈ స్కూలులో మా అబ్బాయిని నేను చదివించను’ అంటూ ఆమె అఖిల్ ను తీసుకొని వెళ్లిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మార్చే కవిత్వం ఒక కళ

నేనెవరో తెలుసా?