“వాక్యం రసాత్మకం కావ్యం” అన్నారు లక్షణ కారులు..కావ్యం వల్ల యశస్సు,అర్థప్రయోజనం,వ్యవహార దక్షత,సమస్యలకు పరిష్కారం,కాంతా సమ్మితము,ఉపదేశం,ఆనందం కలుగుతాయని లక్షణాలు చెప్పారు.
ప్రాచీన దీర్ఘ కావ్యాలే కాక నేటి కవిత్వానికి కూడా ఈ లక్షణాలు వర్తిస్తాయి.
పద్యం లో చంపువు,కేవలం పద్యం,గద్యం భేదాలున్నా రాను రాను ఎన్నెన్నో ప్రక్రియలు వచ్చినప్పటికీ,కాలానుగుణంగా ఎన్నో మార్పులు సంతరించుకునప్పటికీ సమాజ హితమే కవిత్వం యొక్క ప్రయోజనం.
భావ కవిత్వం,అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం,దిగంబర కవిత్వం,సినిమా కవిత్వం ఎన్నెన్నో వచ్చాయి.నవలలు,కథలు,నాటికలు చోటు చేసుకున్నాయి.
ఏ రూపంలో చెప్పినా అసలు కవిత్వం మనసును తట్టిలేపేది,మనసుకు ఊరటనిచ్చేది,మనసుకు హాయి గొల్పేది కవిత్వం. చైతన్యం కలిగించేది,మానవ మేధస్సును పదును పెట్టేది.
ఆధునికంగా కవిత్వంలో హైకూలు ,నానీలు,రెక్కలు, మణిపూసలు,మొగ్గలు,ఇష్టపదులు,గజల్,రుబాయి,చిరు కవిత ,ద్విపద,పంచారత్నాలు ఎన్ని రకాలు,నూతన ప్రయోగాలతో ఆవిష్కృతమైనప్పటికీ నేడు వచన కవిత్వానికే పెద్ద పీఠాన్ని వేస్తున్నారు కవులు.
భావాన్ని సులువుగా అర్ధమయ్యే విధంగా,చైతన్యపరిచేదిగా ఉండేది ,మనసును కదిలించేది,సమాజాన్ని చూపించేది,తట్టి లేపేదే కవిత్వం.ఎంత చెప్పినా కవిత్వం చాలా విస్తృత పరిధితో మనిషిని మార్చే అసలు సిసలైన కవిత్వం గొప్ప కవిత్వం. ఇంకా చాలా చెప్పొచ్చు..