” ఒరేయ్ రాజా నాకన్నా ఒకసారిలారా రా!’ అంటూ పిలిచింది భాగ్యమ్మ మనవడు రాజేష్ ను..
ఆడుకుంటున్న రాజేష్ కొంచెం చిరాగ్గా..
” ఏంటి నాయనమ్మా! ఆడుకునేటప్పుడే పిలుస్తావు” అని అన్నాడు..
” అది కాదురా పాలలో కొంచెం సత్తుపిండి చక్కెర వేసి పెడతాను ఇలా దేవుడి అర్రలోకి రా” అని చిన్న గొంతుకతో చెప్పింది భాగ్యమ్మ..
అటు ఇటు చూసిన రాజేశ్ భాగ్యమ్మ చేయి పట్టుకొని దేవుడు గదిలోకి వెళ్లిపోయాడు.. దేవుడి గది తలుపు మూసి గిన్నెలో సత్తుపిండి పాలు చక్కెర వేసి మనవడికి ఇచ్చింది భాగ్యమ్మ..
” ఆహా! ఎంత బాగుందో”! “అంటూ లొట్టలేసుకొని తిన్నాడు పన్నెండేళ్ళ రాజేష్..
దేవుడి గది కిటికీ పెరట్లోకి తెరుచుకొని ఉంటుంది.. అందులోంచి రాజేష్ అక్క మరియు చెల్లి చూసి ఏడుపులంకించుకున్నారు…
” ఏంటి నాయనమ్మా! ఎప్పుడు తమ్ముడికే పెడతావు మాకు పెట్టవా” అని అడిగింది పెద్ద మనవరాలు సంధ్య..
చిన్న మనవరాలు ఉష ఏడుస్తూనే ఉంది..
“: వాడంటేనే నీకు ఇష్టం మాకు ఎప్పుడూ పెట్టవు అన్నీ వాడికే పెడతావు” అని ఇద్దరు ఏడవ సాగారు..
ఇంతలో అక్కడికి వచ్చిన సుజాత పిల్లలిద్దర్నీ చూసి..
” ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు”? అని అడిగింది ..ఆడపిల్లలి ద్దరినీ దగ్గరికి తీసుకుంటూ..
” చూడమ్మా! గదిలోకి తీసుకెళ్లి నాయనమ్మ వాడికి పాలు చక్కెర సత్తుపిండి పెడుతుంది మేము ఎప్పుడు అడిగినా పాలు లేవని చక్కెర లేదని అంటుంది” అని చెప్పింది ఉష..
ఇదంతా తెలిసిన సుజాత ఏమీ అనలేక కాసేపు మౌనంగా ఉండిపోయింది..
ఆమెకు తెలుసు అత్త భాగ్యమ్మకు మనవడు అంటేనే ఇష్టమని మగ పిల్లలను గొప్పగా చూడటం నాటి నుండి ఉన్నదే కదా !కానీ సుజాతకు ఆమె భర్త శ్రీనివాస్ కు గాని ఇలాంటివి ఇష్టం ఉండవు..
కానీ తల్లి పెద్దది ఏమీ అనలేక మనసు చంపుకుంటుంటారు.. ఒకవేళ అడిగిన గట్టిగా అరిచి గోల చేస్తుంది.. ఏడుపుతో ఇల్లంతా అదిరిపోయేలా చేస్తుంది. ఇదంతా ఊహించి మౌనంగా ఊరుకుంటారు సుజాత మరియు శ్రీనివాస్.
రాజశేఖర్ కి కూడా అలా ఒక్కడు తినాలని ఏమీ ఉండదు కానీ నాయనమ్మ గారాబంతో లోపలికి తీసుకెళ్తే అదో రకమైన గొప్పతనంగా ఫీల్ అయి తింటాడే తప్ప అక్క చెల్లెళ్ళంకు పెట్టకుండా తినాలని ఉండదు…
భాగ్యమ్మ ఇంట్లో ఆడ పని మగపని అని గిరిసేది…
ఒకసారి ఇలాగే ఇంట్లో అంతా చెత్త పడితే ఏదో పనిలో ఉన్న సుజాత కొడుకు రాజేష్ ని పిలిచి…
” ఒరేయ్ రాజా ఆ చెత్తంతా కాస్త చీపురుతో ఊడ్చేయరా” ! అని చెప్పింది.
” సరే ” అంటూ రాజేష్ పెరట్లోకి వెళ్లి చీపురు తీసుకొని వచ్చి ఊడ్చడానికి ఉపక్రమించాడు..
ఇంతలో అంత పెద్ద నోరు వేసుకొని భాగ్యమ్మ పరుగు పరుగున వచ్చి మనవడి చేతిలో నుంచి చీపురు లాక్కొని..
” నువ్వు మగపిల్లాడివి ..నువ్వు ఊడవడం ఏంటి రా! ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు.. నీకేం ఖర్మరా! రాజాలా వెళ్లి కూర్చో నీకు అన్నీ చేసిపెట్టడానికి మేమంతా ఉన్నాం కదా” అని మనవడిని చేయి పట్టుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టింది..
కోడలి వైపు చూస్తూ..
” నీకు ఏమైనా తెలుస్తుందా! మగ పిల్లాడిని పట్టుకొని ఇల్లు ఊడ్చమంటావా” అని గట్టిగా హుంకరించింది భాగ్యమ్మ..
” అందులో తప్పేముంది అత్తయ్యా!మన ఇంటి పనులు చేసుకుంటే ఏమవుతుంది? వీడు చదువుకుంటున్నాడు సంధ్య , ఉషా కూడా చదువుకుంటున్నారు.. అయినప్పుడు అన్ని సమానంగా చేస్తే తప్పేంటి” అని మెల్లగా అన్నది సుజాత..
అంత ఎత్తున లేచి పడింది భాగ్యమ్మ..
” మీ ఇంట్లో అలాంటి తేడాలు లేవేమో! కానీ మా ఇంట్లో ఉన్నాయి వాడు నా మనవడు ఆడ పనులు ఏమీ చేయడు.. అసలు ఆడ పని కాదు ఏ పని చేయడు” అని అరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది..
అప్పుడే బయట నుండి వస్తున్న శ్రీనివాస్ ఇదంతా విన్నాడు..
“రాను రానూ అమ్మ ఇలా మారిపోతుంది ఏమిటి.. రేపు పెరుగుతుంటే వాడికి ఎలాంటి వివక్ష వస్తుంది అసలు దేనికైనా పనికొస్తాడా! మగా ఆడ అనే తేడాలు ఇప్పటినుంచే వాడిలో నూరిపోస్తుంటే వాడు పెద్దయిన తర్వాత ఏమవుతాడు?” అని ఆలోచించసాగాడు శ్రీనివాస్..
భర్త కళ్ళల్లోకి మౌనంగా చూసి సుజాత మౌనంగా కూరగాయలు తరుగుతూ కూర్చుంది..
“ప్రతినిత్యం ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది దీనికి పరిష్కారం చూపకుంటే ఇది ఇలాగే జరుగుతుంది “అని రాత్రంతా ఆలోచించాడు శ్రీనివాస్..
తెల్లవారి స్నానం చేయడానికి సంధ్య బాత్రూంలో నీళ్ల బకెట్ పెట్టుకుంది… అంతే టవల్ తీసుకొని రాజేష్ బాత్రూంలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు…
” ఒరేయ్ నేను కష్టపడి నీళ్లు బాత్రూంలో పెట్టుకున్నాను రా. నువ్వు కావాలంటే తెచ్చుకో నా నీళ్లు ఎందుకు చేస్తావ్” ? అని గట్టిగా అరిచింది సంధ్య..
అక్కడే ఉన్న సుజాతకి కోపం వచ్చింది..
” రాజా నువ్వు బయటకు వస్తావా? లేదా ?నువ్వు రోజు ఇలాగే చేస్తున్నావ్ ఏం నీనీళ్లు నువ్వు పెట్టుకోలేవా? ఎందుకు నీకు అంత బద్ధకం” అన్నది సుజాత బాత్రూం తలుపు తడుతూ..
“వాళ్లు ఆడపిల్లలే కదా! నా పనులన్నీ వాళ్లే చేసి పెట్టాలి ..నాయనమ్మ చెప్పలేదా !అయినా ఈ పనులన్నీ నేనెందుకు చేస్తాను” అన్నాడు రాజేష్ లోపల నుండి..
అదంతా విన్న శ్రీనివాస్ కి పట్టరానంత కోపం వచ్చింది.. కానీ ఇది సమయం కాదని అలాగే ఊరుకున్నాడు…
పిల్లలంతా స్నానం చేసి పెరుగన్నం తినేసే స్కూలుకు వెళ్లిపోయారు…
వంటింట్లోకి వచ్చిన శ్రీనివాస్ తల్లితో..
” అమ్మా! ఒకసారి ఇలా వస్తావా!” అని అన్నాడు..
” ఏంట్రా ఆఫీసుకు సెలవు పెట్టావా? మళ్లీ నీకు ఆలస్యం అయిపోతుంది వంట మొదలుపెట్టాను” అన్నది భాగ్యమ్మ..
” నేను ఈరోజు సెలవు పెట్టానమ్మా! కాస్త నీతో మాట్లాడాలి” అన్నాడు అక్కడే ఉన్న పీటవాల్చుకొని కూర్చుంటూ…
” ఏంట్రా ఏం మాట్లాడాలి” అంటూ మరో పీటవాల్చుకొని కూర్చుంది భాగ్యమ్మ..
ఇద్దరికీ రెండు కప్పుల్లో చాయ్ పోసుకొని తీసుకొని వచ్చింది సుజాత..
” సుజాతా! నువ్వు కూడా కూర్చో ..పని తర్వాత చేసుకుందువు గాని” అన్నాడు శ్రీనివాస్..
” అందరం కూర్చుంటే పనులు ఎలా అవుతాయి రా? అయినా దాంతో మాట్లాడేది ఏముంటుందని” ? అన్నది భాగ్యమ్మ కొంచెం నిర్లక్ష్యంగా..
ఆ మాటలకు సుజాత నొచ్చుకొని బయటకు వెళ్ళిపోయింది..
” సుజాతా! చెప్పాను కదా వచ్చి కూర్చో” అన్నాడు శ్రీనివాస్ కొంచెం గట్టిగా..
సుజాత కొంచెం భయం భయంగా వచ్చి వారికి కొంచెం దూరంగా కూర్చుంది..
” అమ్మా! మా చిన్నతనంలోనే నాన్న కాలం చేశారు కష్టం సుఖం నువ్వు, నేను ,అక్క కలిసి పంచుకున్నాము… అదంతా గుర్తుందా !అమ్మా నీకు”? అని అడిగాడు శ్రీనివాస్..
” ఎందుకు గుర్తులేదూ! మనం ముగ్గురం ఎంత కష్టపడ్డామని బంధువుల్లో మనకు ఎవరైనా సహాయం చేశారా!!… నేను పొలం దగ్గరికి వెళ్తే అక్క నాకు అన్నం తీసుకుని వచ్చేది… ఇంట్లో అక్క వంట చేస్తే.. నువ్వు బయట పనులన్నీ చేసే వాడివి. ఇండ్లు ఊడ్చి గిన్నెలు కడిగి బట్టలు కూడా ఉతికేవాడివి.. అక్క వంట పని ఎంతైనా చేసేది కానీ ఈ బయట పని చేసేది కాదు” అని గుర్తు చేసుకొని అన్నది భాగ్యమ్మ..
” నువ్వు అక్కను నన్ను సమానంగానే పెంచావా మ్మా” అన్నాడు శ్రీనివాస్..
” అవును రా! ఇద్దరికీ అన్ని పనులు నేర్పించాను అక్క బయట పనులు కూడా చేసేది నువ్వు ఇంటి పనులు చేసే వాడివి. అలా జరిగింది కాబట్టే ఈరోజు మంచి స్థితిలో ఉన్నాము” అన్నది భాగ్యమ్మ..
” మరి నీ మనవడిని ఎందుకు పాడు చేస్తున్నావమ్మ ! ఆడ పని మగ పని అని తేడాలు చూపించి వాడిని ఎందుకు పనికిరాకుండా చేయాలని అనుకుంటున్నావా?”
” ఏంట్రా అలా మాట్లాడుతున్నావ్ నేను వాడిని చెడగొడుతున్నానా? ఏదో ఒక్క మనవడు కదా అని కొంచెం గారాబం చేస్తున్నాను” అన్నది భాగ్యమ్మ కోపంగా..
” ఒక్కడైతే ఏంటి ?ఇద్దరైతే ఏంటి? నీ మనవరాళ్లు మనుషులు కాదా? వాళ్ళని ఒక్కసారయినా ప్రేమగా దగ్గర తీసావా? మగ పిల్లలకు ఒక మనసు ఆడపిల్లలకు మరో మనసు ఉంటుందా? వాళ్లు ఎన్నిసార్లు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారో తెలుసా? నాయనమ్మకు మేమంటే ఇష్టం లేదు అని వాళ్ళు ఎంతో బాధ పడుతున్నారు.. ఇటేమో వాళ్ళని బాధకు గురి చేస్తున్నావు అటు మనవడిని ఎందుకు పనికిరాకుండా చేస్తున్నావు” అన్నాడు శ్రీనివాస్…
” అవునత్తయ్య! మీరు ఒకనాడు మగవాడిలా కష్టపడ్డారు కాబట్టే కుటుంబాన్ని ఇలా ఒక ఒడ్డుకు చేర్చగలిగారు.. కానీ !ఈరోజు వాడిని నువ్వు మగాడివి ఏ పని చేయొద్దు అని అంటే వాడిలో ఇప్పుడే ఒక ఈగో మొదలైంది ..ఈరోజు పొద్దున “ఆడపిల్లలే పని చేయాలి” అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ..ఇలా అయితే రేపు వేరే ఆడపిల్లలను వీడు గౌరవిస్తాడా మరో ఆడపిల్లపై వీడి అభిప్రాయం ఎలా ఉంటుంది ?అందుకే మొక్కగా ఉన్నప్పు మంచి బుద్ధులు చెప్పాలి.. ఇలాంటివి నేర్పిస్తే వాళ్లు పెద్దయిన తర్వాత మనం చెప్పిన కూడా మారరు.. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి” అన్నది బాధపడుతూ సుజాత..
” అక్క నాకన్నా పెద్దది నాకన్నా ముందుగా ఉద్యోగం సంపాదించుకుంది.. మన ఇంటిని పోషించింది.m ఎన్నో అవసరాలను తీర్చింది మరి అది మగ పని అనుకోవాలా! అక్క అలా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను వంట చేసి పెట్టే వాడిని.. అక్కకి ఏమేం కావాలో అన్ని సమకూర్చే వాడిని మరి ఇది ఆడ పని అనుకోవాలా! ఆ తేడా లేకుండా మేమిద్దరం కలిసిమెలిసి చేసుకున్నాం కాబట్టి ఇద్దరం మంచి స్థితిలో ఉన్నాము… అదీకాక వాడు ఇప్పుడు అక్కలనే చిన్న చూపు చూస్తున్నాడు రేపు పెళ్లయితే వాడు భార్యను మనిషిలా చూస్తాడా ఒక బానిసలా చూస్తాడు తనకు పని చేసి పెట్టే యంత్రంగా చూస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి అందుకే ఆడవాళ్లను గౌరవించడం ఇప్పటినుండే నేర్పాలమ్మ! అయినా ఆడవాళ్లే ఆడవాళ్ళ గురించి ఆలోచించకుంటే ఇంకెవరు ఆలోచిస్తారమ్మ.. ఇప్పుడు అన్నింట్లోనూ ఆడపిల్లల ముందంజలోనే ఉన్నారు వారిని మనం ప్రోత్సహించి ఇంకా ముందుకు ఎదిగేలా చూడాలి ఇదేనమ్మ నేను నీకు చెప్పేది! కొంచెం ఆలోచించమ్మ!” అన్నాడు శ్రీనివాస్..
జవాబు ఏమీ చెప్పకుండా భాగ్యమ్మ లోపలికి వెళ్ళిపోయింది…
తలనొప్పిగా ఉందని ఆరోజు వంట కూడా చేయలేదు..
సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చారు..
రాగానే పడుకున్న నాయనమ్మని చూసి సంధ్య మరియు ఉష నాయనమ్మ దగ్గరికి వచ్చి..
” నాయనమ్మా! ఏమైంది ఎప్పుడూ పడుకోని దానివి ఈరోజు ఇలా పడుకున్నావేంటి! ఒంట్లో బాగాలేదా మందులు ఏమైనా తీసుకొని రావాలా” అని అడిగారు దగ్గరగా కూర్చుని..
ఎప్పుడూ వాళ్ళని దగ్గర తీయని భాగ్యమ్మకు ఒక్కసారిగా మనసులో బాధ కలిగింది..
” వీళ్ళని నేను ఎప్పుడూ దగ్గర తీయకుండానే నేను ఒక్కరోజు పడుకుంటే దగ్గరికి వచ్చి ఆత్మీయంగా అడుగుతున్నారు” అని మనసులో అనుకొని..
” ఏమీ లేదురా బాగానే ఉన్నాను మీకు తపాలా రొట్టె చేసి పెట్టనా! మీ ఇద్దరికీ ఇష్టం కదా” అన్నది మనవరాళ్లను ఇద్దరినీ దగ్గరికి తీసుకొని..
మనవరాళ్ళు ఇద్దరు ఆశ్చర్యపోయారు.. ఎప్పుడు లేనిది నాయనమ్మ ఇలా ప్రేమగా మాట్లాడుతుందని వాళ్లకు పట్టరానంత సంతోషంగా అనిపించింది ఇద్దరు నాయనమ్మను గట్టిగా పట్టుకున్నారు..
ఇంతలో మనవడు రాజేష్ వచ్చాడు…
‘నాయనమ్మా! నాకు తినడానికి ఏదైనా పెట్టు” అన్నాడు రాజశేఖర్..
” తపాలా రొట్టె చేసి ముగ్గురికి పెడతాను ఉండండి రా”: అన్నది భాగ్యమ్మ..
” అదేంటి ?ముగ్గురికి ఎందుకు నాకు ఒక్కడికే కదా పెట్టాలి ..నేను మగ పిల్లవాడిని నేను తిన్నాకే మిగిలింది వాళ్ళకి పెట్టు” అన్నాడు అహంకారంగా రాజేష్..
అప్పుడు అర్థమైంది భాగ్యమ్మకి తాను ఎంత పొరపాటు చేసిందో… పరిస్థితి ఇలాగే ఉంటే చేయి దాటి పోతుంది అని గ్రహించి..
” ఒరేయ్ భడవా! ఏం మాటలు రా అవి తప్పు కదా! నీవు ఒక్కడివే తింటావా నీలాగే అక్కా చెల్లెలు కూడా కదా! ఈ రోజు నుండి అన్నీ సమానంగానే తినాలి సమానంగానే పనులు చేయాలి మరోసారి ఇలా మాట్లాడావంటే నేను ఊరుకోను” అని గట్టిగా అరిచింది భాగ్యమ్మ..
ఇదేంటి? రోజు గారాబం చేసే నాయనమ్మ ఇలా అరుస్తుంది.. తానే రోజు నువ్వు మగపిల్లాడివి నువ్వే తిను అని చెప్తుంది.. ఈరోజేమో అంతా సమానం అంటుంది.. అని అనుకున్నాడు రాజేష్ అయోమయంగా.. ఆ పసి మనసులో అర్థం కాని గందరగోళం ఏర్పడింది..
తండ్రి శ్రీనివాస్ రాజేష్ ను దగ్గరికి పిలుచుకొని” నాయనమ్మ చాదస్తంతో ఇన్నాళ్లు నీకు అలా చెప్పింది కానీ అలా ఉండకూడదు ..ఆడ పనులు మగ పనులు అంటూ ఏమీ ఉండవు పనులు మాత్రమే ఉంటాయి.. అన్ని అందరూ కలిసి చేసుకోవాలి. నేను మీ అత్త కూడా అలాగే చేసుకునే వాళ్ళము ఎప్పుడు అలా మాట్లాడకు నాన్నా” అని రాజేష్ ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్..
” అలాగే నాన్న! నేను కూడా అన్ని పనుల్లో సహాయం చేస్తాను ఇంకొకసారి ఇలా అనను” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజేష్..
ధరణి మరియు శ్రీనివాస్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు..