దొరసాని

ధారావాహికం – 26 వ భాగం

అనుకున్నట్లుగానే సీమంతం రోజు రానే వచ్చింది …అంతకన్నా ముందు రోజే దగ్గర బంధువులు అలేఖ్య అత్తగారు ,మామగారు… ఇంకా దగ్గర చుట్టాలంతా వచ్చారు… అందరికీ సౌకర్యంగా ఉండేలాగా ఏర్పాటు చేశారు… గదులలో పెద్దవాళ్ళకి మంచాలు ఏర్పాటు చేశారు… ఇంకా చిన్న వాళ్ళకి పిల్లలకి అందరికీ హాల్లో చుట్టూరా పరుపులు వేసి పడకలు ఏర్పాటు చేశారు.. వారం రోజుల నుండే ఇద్దరు వంట వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు వచ్చి పోయే వాళ్లకి ఫలహారాలు కాఫీలు చాయలు అందిస్తున్నారు ఎండాకాలం ఛాయలు ఉన్నాయి కాబట్టి పెరటి నుండి తెంపిన నిమ్మకాయలతో షర్బత్ చేసి ఎప్పటికప్పుడు కుండలో నీళ్లు కలిపి చల్లగా ఇస్తున్నారు ..ఇంటి పాడితో చేసిన మజ్జిగలో కాస్త ఉప్పు నిమ్మకాయ కరివేపాకు అల్లం ముక్కలు వేసి అందరికీ అందిస్తున్నారు… పెంకుటిల్లు కావడం వల్ల ఎక్కువ వేడిగా లేదు అందులో చుట్టూ అన్ని చెట్లు గాలి చక్కగా వీస్తుంది…

ముందు రోజు పూల తోరణాలు మామిడి తోరణాలు అన్నింటిని ద్వారాలకు ఇంట్లో చక్కగా వేలాడదీసారు… కొబ్బరాకులతో చిలకలను చేశారు వాటిని దండలుగా గూర్చీ ఇల్లంతా వేలాడదీశారు ,గాలికి ఊగుతుంటే నిజమైన చిలుకలు ఊగుతున్నట్టే అనిపిస్తుంది… ఇల్లంతా అలంకరణతో మెరిసిపోతుంది…

ఇంటి వెనుక కోసుకొచ్చిన గోరింటాకు మెత్తగా రుబ్బి ఆ సాయంత్రం అలేఖ్య చేతులకి కాళ్ళకి అందంగా తీర్చిదిద్దారు… అందరూ ఆడవాళ్లు కూడా రాత్రి భోజనాలు అయిన తర్వాత గోరింటాకు పెట్టుకున్నారు…

ఆడవాళ్లంతా గోరింటాకు పెట్టుకుంటే పిల్లలు పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు ఇల్లంతా కోలాహలంగా ఉంది…

దాదాపు అలంకరణలు అయ్యేవరకు రాత్రి 11 దాటింది…. అందరూ పడుకున్నారు… ఉదయమే లేవాలని అందరికీ నీలాంబరి ముందే చెప్పింది…

ఉదయం నాలుగు గంటలకే పనులు ఆరంభమయ్యాయి అందరూ లేచి నిత్య కృత్యములు తీర్చుకొని చక్కగా తయారై ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తున్నారు… హాల్లో ఎదురుగా ఒక సింహాసనం లాంటి కుర్చీ వేశారు అది వీళ్ళ పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న కుర్చీ… దాని మీద పట్టు వస్త్రం పరిచి కుర్చీ ముందర పెద్ద కార్పెట్లు పరిచారు… ఆ కార్పెట్ మీద పూల బుట్టలు పండ్ల బుట్టలు పిండి వంటల బుట్టలు స్వీట్ల బుట్టలు.. వరుసగా పెట్టారు దుమ్ము ధూళి సోకకుండా బుట్టలన్నిటిని పలుచని ప్లాస్టిక్ పేపర్ తో దాని చుట్టూ డెకరేట్ చేశారు… పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల గాజులన్నీ వేసి పెట్టారు.. గంధము అత్తరు పన్నీరు పసుపు కుంకుమ అన్నిటిని వెండి పళ్లాలలో పెట్టి ఉంచారు.

బయట కచేరిలో తడికలతో చక్కని పందిరి వేసి అలంకరించారు కూర్చోవడానికి కుర్చీలు వేయించారు…

పెరట్లో అందరికీ భోజనాలకి ఏర్పాటు చేశారు దాదాపు 100 మంది ఒకేసారి భోజనం చేసేలాగా ఏర్పాటు చేశారు..

ముహూర్తం టైం కావస్తుందని అలేఖ్యను తయారు కమ్మని చెప్పారు పూజారి…

మల్లెలు గులాబీలు చామంతులతో చక్కని పూలజడ వేశారు… ముందుగా అలేఖ్య అమ్మమ్మ గారు పెట్టిన పట్టుచీర కట్టుకొని చేతినిండా గాజులు వేసుకుని చక్కగా బొట్టు కాటుక పెట్టుకుని కాళ్ళకి పసుపు పారాణితో ఎంతో అందంగా కనిపిస్తుంది అలేఖ్య…. అలేఖ్య అత్తగారు దగ్గరుండి కోడల్ని తయారు చేస్తూ ఎంతో సంతోషపడుతుంది…

అలేఖ్యను కుర్చీలో కూర్చొపెట్టీ ముందుగా తల్లి తండ్రి ఆమె కట్టుకోవాల్సిన చీరను బొట్టు పెట్టి తాంబూలంతో బహూకరించారు… వెళ్లి పట్టుచీర కట్టుకొని కొత్తగా నీలాంబరి ,అలేఖ్య అత్తగారు కొన్న నగలన్నీ వేసుకొని బయటకు వచ్చింది అలేఖ్య.

అలేఖ్య కుర్చీలో కూర్చోగానే కాటుకను తీసుకొని వచ్చి అరికాలిలో పెట్టింది నీలాంబరి… ఈ సమయంలోనే దృష్టి దోషం తగులుతుందని..

అలేఖ్య అత్తగారు బట్టలు నగలు పెట్టి కోడలును ఆశీర్వదించింది ..సుధీర్ అయితే అపురూపంగా పక్కనే కూర్చుని అన్నీ చూస్తున్నాడు… ముత్తయిదువులందరూ ఒక్కొక్కరుగా వచ్చి చేతులకు గాజులు వేసి పండ్ల బుట్టలు ఇస్తున్నారు…. చక్కని ఫోటోలన్నీ తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు… కార్యక్రమమంతా ఎంతో వేడుకగా జరిగింది…

అందర్నీ భోజనాలకు పందిట్లోకి తీసుకెళ్లారు… తొమ్మిది రకాల పులిహోరలు, నాలుగు రకాల స్వీట్లు, గుత్తి వంకాయ కూర మామిడికాయ పప్పు, దొండకాయ వేపుడు, సాంబారు ,మిర్చి బజ్జీలు భక్షాలు మరియు అప్పడాలు వడియాలు ఇవన్నీ తయారు చేయించారు… వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనాలు చేశారు.. వెళ్ళేటప్పుడు అందరికీ గాజుల పెట్టెలు జాకెట్ బట్టలు పసుపు కుంకుమ అన్ని రకాల స్వీట్స్ బుట్టలలో పెట్టించి అలేఖ్యతో ఇప్పించారు…

అందరి భోజనాలు అయిపోయి వచ్చినవాళ్లు వెళ్ళిపోయేసరికి సాయంత్రం 6:00 దాటింది దగ్గర బంధువులు ఇంట్లోనే ఉన్నారు… ఎంతో బాగా సీమంతం జరిగిందని అందరూ మాట్లాడుకున్నారు … అలసిపోయిన అందరూ రాత్రికి తేలికగా ఉండే దద్దోజనం తిని పడుకున్నారు…

” అలేఖ్య! లేమ్మా ఒకసారి దిష్టి తీస్తాను తర్వాత పడుకుందువు గాని” అని లేపింది నీలాంబరి.

నిద్ర కళ్ళతో లేచిన అలేఖ్య అలాగే కూర్చుంది తలలో ఉన్న పూలన్నీ తీసివేసి చక్కగా తల దగ్గరికి దువ్వి జడ వేసి దిష్టి తీసేసింది.. “మొహం కడుక్కొని రా అలేఖ్య! కొంచెం పెరుగన్నం తిని పడుకుందువుగాని అలా ఉత్త కడుపుతో పడుకోకూడదు అమ్మా!” అని చెప్పింది నీలాంబరి.

” అత్తయ్య !నేను అలేఖ్యకు తినిపిస్తాను మీరు కొంచెం పెరుగన్నం కలిపి ఇవ్వండి” అన్నాడు సుధీర్.

చిన్న వెండి పళ్లెంలో కొంచెం పెరుగన్నం కలుపుకొని తెచ్చి ఇచ్చింది నీలాంబరి నంచుకోవడానికి పక్కన నిమ్మకాయ ముక్క పెట్టింది..

సీమంతం వేడుక ఎంతో చక్కగా ముగిసింది… రోజులు గడుస్తూనే ఉన్నాయి.. సుధీర్ తన తల్లిదండ్రులతో వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు.. వాళ్ళింట్లో కూడా శ్రీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు…

ఒక మంచి రోజు చూసుకుని నీలాంబరి భూపతితో కలిసి అలేఖ్య అత్తగారింటికి వెళ్ళింది..

అలేఖ్య అత్తవారింట్లో సీమంతం చాలా ఘనంగా చేశారు వాళ్లు కూడా దగ్గర బంధువులను మిత్రులు పిలుచుకొని అదే పద్ధతిలో చేసుకున్నారు… అలేఖ్య అత్తవారింట్లో చిన్న చిన్న పనులను చేస్తూ అందరి మన్ననలు అందుకుంది… నీలాంబరి వాళ్ళ దివాణం అంత పెద్దది కాకుండా కూడా వాళ్ళు కూడా ఇంచుమించు పెద్దగానే ఉంది పాతకాలం నాటి డాబాలు కదా చుట్టూరా కొబ్బరి చెట్లు దానిమ్మ చెట్లు జామ చెట్లు విరగ కాసి ఉన్నాయి…. ఆ చెట్ల కింద పెద్ద ఊయల కట్టించారు… అలేఖ్య ఆ ఊయలలో కూర్చుని ఊగుతుంటే వాళ్ళ అత్తగారికి మామగారికి ఎంతో ముచ్చట వేసింది ఇంట్లో వాళ్లకి ఆడపిల్ల లేనందువల్ల ఈ ముచ్చటలన్నీ అలేఖ్యతోనే తీరుతున్నాయి… కోడిని చూసి వాళ్ళు ఎంతో తృప్తి చెందారు.

అక్కడ సీమంతం చేసుకుని నెల రోజులు అక్కడే ఉండిపోయింది నీలాంబరి భూపతి మళ్లీ దివాణంకి వచ్చారు…

బాల సదనం పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి ఇంకా తుదిమెరుగులు మాత్రమే ఉన్నాయి…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంశోద్ధారకుడు

సమానత్వం