ఇప్పటివరకు: జస్టిస్ విజయమ్మ గారికి అనుకోని విధంగా చూసిన ఒక సంఘటన ఆలోచింపచేసింది. మైత్రేయి లాంటి అనేకమంది స్త్రీ లకు న్యాయం జరగాలంటే మార్పు రావాలి. ఆ మార్పు ఎక్కడనుంచి రావాలి? అని జస్టిస్ విజయమ్మ ఆలోచిస్తూఉండిపోయింది. కోర్టులో విచారణ మొదలయింది. లాయర్ కోదండపాణి అనర్గళంగా తప్పంతా మైత్రేయిదే అన్నట్లు వాదించేసాడు. అంతే ధీటుగా లాయర్ వసుంధర కోదండపాణి నోరు మూయించింది. రెండు వర్గాల వాదన విన్న విజయమ్మ ఫైనల్ హియరింగ్ ఎండాకాలం సెలవల తరువాత ఉంటుందని ప్రకటించారు.
ఇక చదవండి…
కోర్ట్ నుండి ఇంటికి చేరుకుంది మైత్రేయి. మనసంతా ఒక విధమయినా అవమానంతో నిండి పోయినట్లయింది. వెంటనే బాత్రూం లోకి వెళ్లి ఎన్ని బకెట్ల నీళ్లు తల మీద పోసుకుందో తెలీదు కానీ అక్కమ్మ వచ్చి చూసేసరికి హై టెంపరేచరతో వణికిపోతూ మంచం మీద కనిపించింది.
“అమ్మ! అమ్మ! ఏంటిది ఇలా వణికి పోతున్నారు. లేవండి ఆసుపత్రికి పోదాం.”అంటూ బలవంతం గ లేవదీసింది అక్కమ్మ.
బయటికెళ్లి వసారా గదిలో అద్దెకుంటున్న ఉన్న ప్రసాద్ ని పిలిచింది,”ప్రసాద్ బాబు! కూసంత ఆటో ని పిలుచుకొస్తారా! మైత్రేయి అమ్మగారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. దవాఖానకు తోలుకుపోవాలా!” గబగబా మైత్రేయి ఇంటివైపుకి వెళ్ళాడు. మంచంలో వణికిపోతూపడున్న మైత్రేయిని చూసాడు. అక్కమ్మ “మేడం గారిని బయటికి తీసుకు రా నేను ఆటో పిలుస్తాను” అంటూ చకచక వెళ్ళిపోయాడు.
ఆటో తెచ్చాక పెద్దగా అక్కమ్మని పిలిచాడు. ఇంతలోనే అక్కమ్మ కూడా మైత్రేయికి చుట్టూ
షాల్ కప్పి బయటికి తీసుకొచ్చింది. ఆమెని గోడ ఆసరాగా నిలబెట్టి తాళం వేస్తున్నది. ఆ కాసేపట్లోనే మైత్రేయి కిందకు జారిపోయింది. అదంతా దూరం నుండి గమనిస్తున్న ప్రసాద్ ఒక్క పరుగున అక్కడకు చేరుకున్నాడు. సునాయాసంగా ఆమె కిందకు పూర్తిగా జారీ పోకుండా పట్టుకొని రెండు చేతులతో పసిపిల్లను ఎత్తుకున్నట్లు ఎత్తుకొని ఆటో వైపు నడిచాడు. అక్కమ్మ వెనకాలే పరిగెత్తింది.
ఆటోని వేగంగా ఆసుపత్రికి పోనివ్వమని ఆమెని అలాగే పొదివిపట్టుకొని ఆటో లో కూర్చున్నాడు. ఇంకోవైపు అక్కమ్మ.
“ఇదేం సోద్యం! ఆ పిల్లాడు చేరి రెండు నెలలు కాలేదు. ఇంతలోకే ఇంత చనువా! పిదప కాలం పిదప బుద్దులు!” అంటూ మూతిని మూడు వంకర్లు తిప్పుకుంటూ కిటికీ దగ్గరనుండి లోపలికెళ్ళింది రమాదేవి .
ఆటో కరుణ మిషనరీస్ హాస్పిటల్ చేరగానే ఆమెను ఎమర్జన్సీ లో చేర్చుకున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపటికి ఆమెకు వణుకు తగ్గింది. అక్కమ్మ, ప్రసాదు ఆమె బెడ్ పక్కనే కూర్చుని ఉన్నారు.
రాత్రయింది. “బాబు! ఈ రాత్రికి నేనీడనే తొంగుంటాను. మీరెళ్ళండి. పొద్దునే రండి బాబు. నేను పని కిపోతాను మీకేమి ఇబ్బంది లేకపోతే!” అంటూ అడిగింది అక్కమ్మ . “అయ్యో! పర్లేదు ఆంటీ! నేను పొద్దునే వస్తాను! మీరు మీ పని చేసుకొని రండి. నాకు రేపు నైట్ షిఫ్ట్. పొద్దునపూట నేనుంటాను. “ అని లేచి వెళ్ళిపోయాడు. మైత్రేయి నిద్రలో ఉంది. అక్కమ్మ ఆ బెడ్ పక్కనే కింద ఒక దుప్పటి పరుచుకొని పడుకుండిపోయింది. పొద్దున్న డ్యూటీ మారిన నర్స్ వచ్చి ఆమెను లేపింది. అప్పుడు టైం 6:30 అయింది. అయ్యో ఆలస్యమైందే అనుకొంటూ ఉండగానే ప్రసాద్ ఒక ధర్మస్ నిండా కాఫీ తీసుకొని వచ్చాడు.
“ఆంటీ! ఇదిగో కొంచం కాఫీ తాగి పనికి వెళ్ళండి. డాక్టర్ వచ్చేదాకా నేనుంటా. అన్నాడు.
“అట్టాగే బాబు! ఆ రమాదేవమ్మ ఎం గొడవసేస్తా ఉందొ.” అని గబా గబా కాఫీ తాగేసి వెళ్ళిపోయింది.
మార్నింగ్ డ్యూటీ లో ఉన్న నర్స్ వచ్చింది. మగతగా పడిఉన్న మైత్రేయి కి టెంపరేచర్ ,బీపీ చెక్ చేసి, రికార్డు షీట్ మీద రాసి వెళ్లిపోతు, “ఆమె లేస్తే కొంచం వేడిగా ఏమైనా తాగించండి.ఆమెకు మీరేమవుతారు?”
“నేనా ? ఏమి కానండి. మేము పక్కపక్క ఇళ్లలోనే ఉంటాము.”అంటూ చిరునవ్వు నవ్వాడు. నర్స్ వెళ్ళిపోయింది.
ఆమె మంచం మీద కదిలి లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు. “అయ్యో! మైత్రేయి గారు, అలా లేవకండి. నేనున్నానుగా,” అని తలకింద దిండు సరిచేసి ఆమెను లేపి కూర్చోబెట్టాడు.
“మీకు బాగా శ్రమ ఇస్తున్నట్లున్నాను!” అని చాల ఇబ్బందిపడింది. ఇప్పుడే అతన్నీ నేరుగా చూడటం. అప్పటివరకు ఒకతను వరండా గదిలో బాడుగకు దిగడాన్ని అక్కమ్మ చెప్పగా విన్నది. కొంచం చామన చాయా లో పొడవుగా ఉన్న ప్రసాద్ చూడ ముచ్చటగా అనిపించాడు.
“పర్లేదు మేడం! ఆలా ఏమి ఫీలవకండి! జ్వరమొస్తేనే సుఖం , మీకు తెలుసా?” చాల కలుపుగోలుగా మాటలు పెంచాడు.
“అదేలాగా?”
“చూడండి! మనకు జ్వరం వచ్చింది కదా అని ఇంట్లో అందరు ఎంతో జాలి చూపిస్తారు. రెండో పాయింట్ మనకు ఏది కావాలంటే అవన్నీ మంచం దగ్గరికే వచ్చేస్తాయి. మూడో పాయింట్ మనకేమి తినాలనిపిస్తే అది అమ్మ చేసి పెడుతుంది. అంతకంటే ఎం సుఖం కావాలండి.” అంటూ నవ్వేసాడు. ఎంత స్వచ్ఛంగా , నిర్మలంగా నవ్వుతున్నాడు అని మనసులో అనుకోంది మైత్రేయి.
“ కాఫీ ఉన్నాయ్ తాగుతారా లేక కాంటీన్ నుండి వేడి పాలు తెచ్చివ్వ మంటారా?”” అడిగాడు.
“నేనేమయినా చిన్న పిల్లనా! కాఫీ ఇవ్వండి చాలు.” అని ఒక కప్ కాఫీ ప్రసాద్ చేతుల మీదుగా అందు కొని మనస్ఫూర్తిగా తాగింది.
ఎనిమిది కల్లా డ్యూటీ డాక్టర్ వచ్చి కొన్ని మందులు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రసాద్ చేతి కిచ్చి “ఇవి 10 రోజులు వాడండి. పదిగంటలకల్లా మా హెడ్ డాక్టరు వస్తారు ఆయన కూడా చెక్ చేసాక, మేమామెను డిశ్చార్జ్ చేస్తాము,” అని చెప్పి ఇంకో పేషెంట్ దగ్గరికెళ్ళాడు అదే వార్డులో.
వెనకాతలే ఉన్న నర్స్ “సార్! ఆమెకు ఏమయినా తినిపించండి,ఆ తరువాత ఇదిగో ఈ టాబ్లెట్స్ వేయండి. నన్ను పిలిస్తే నేనొస్తాను. ఆమెకొక ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి”, అని చెప్పివెళ్లిపోయింది.
హాస్పిటల్ కాంటీన్ నుండి ఇడ్లి తెచ్చి ఆమెకు ఎంతో ఆప్యాయంగా తినిపించాడు. వెంటనే టాబ్లెట్స్ ఇవ్వడానికి నర్స్ ని పిలుచుకొచ్చాడు. ఆమె ఇంజక్షన్ ఇచ్చివెళ్లిపోయింది.
“బాగా నెప్పిగా ఉన్నదా మైత్రేయి గారు!” అని అడిగాడు.
మైత్రేయికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ మధ్యన తన తోటి ఇంత ఆదరంగా ఎవ్వరు మాట్లాడటంలేదు, అక్కమ్మ వసుంధర తప్ప. మరొక వ్యక్తి ఇతను.
“మీతో నేనెప్పుడూ మాట్లాడలేదు. మీరు వరండా గదిలోకి అద్దెకి వచ్చారని మాత్రం తెలుసు. అక్కమ్మ చెప్పింది. మీరేం చేస్తుంటారు.”
“నేను ఇంజనీరింగ్ చదివానండి. ఒక కంపెనీలో ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ గ చేస్తున్నాను. నాదంతా ఫీల్డ్ వర్కే. అందుకే మీరు నన్నెక్కువ సార్లు చూసుండరు. మా మెయిన్ బ్రాంచ్ చెన్నై లో ఉన్నది. నేను ప్రతి నెల వెళ్లి రిపోర్ట్ చేస్తాను. ఆ పని మీద ప్రతినెలా మద్రాస్ వెళ్ళతుంటాను. ఆఫీస్ పనుంటే అక్కడే ఉంటుంటాను. నిన్ననే వచ్చాను. రాత్రి మీరు స్పృహ లేకుండా పడున్నారు. అందుకే నేను అక్కమ్మ కలిసి మిమ్మల్ని ఈ హాస్పిటల్లో చేర్పించాము.. రాత్రంతా అక్కమ్మ మీతోనే ఉన్నది. పొద్దునే నేను వచ్చాను”. అంటూ “మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ వచ్చే టైం అయింది”, అంటూ ఆమెను మళ్లి పడుకోపెట్టాడు.
“వీళ్లతో నాకే నాటి జన్మ సంబంధమో తెలియదు,” కళ్ళనుండి కన్నీటి చుక్కలు రాలి దిండును తడిపేశాయి.
“మీరు మాకేమి రుణపడలేదండి. మేమె మీకు ఋణముండి ఇలా సేవ చేసే అవకాశం మాకు దొరికిందేమో! అలా అలోచించి చూడండి. మీకే బాధ ఉండదు. మన పిచ్చి గాని! మనిషికి మనిషే సాయం చేయక పోతే ఇక మనిషెలా అవుతాడండీ!” అంటూ మనసులో మాట విన్నట్లుగా అదే చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు డాక్టర్ని చూసి.
“ఎం మేడం! ఎలా ఉన్నారు? బాగా కంగారు పెట్టేసారు.” అంటూ “ప్రసాద్! డిశ్చార్జ్ లెటర్ మా డ్యూటీ ఆఫీస్ లో ఇస్తారు. ఫీజు కట్టేసి , ఆ లెటర్ తీసుకునిరా. ఇంతలో మా నర్స్ ఆమెను రెడీ చేస్తారు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ప్రసాద్ వచ్చే సరికి మైత్రేయికి హాస్పిటల్ కోటు తీసేసి,ముందురోజు ఆమె ను అడ్మిట్ చేసినప్పుడు ఉన్న చీరని కట్టి కూర్చోపెట్టింది నర్స్. ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ హాస్పిటల్ బయటికి తీసుకొచ్చి ముందుగా మాట్లాడి ఉంచిన ఆటోలో కూర్చో బెట్టి ఇంటికి తీసుకొచ్చాడు.
అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలయింది.
(ఇంకా ఉంది)