ఉగాది పండుగ వస్తోందని మనమందరం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటాం. ఇంటా బయట శుభ్రం చేసుకుంటాం. ఇల్లంతా మామిడి తోరణాలతో పూలతో అలంకరించి పండగ వాతావరణం తెస్తాం. దేవుని పూజించి షడ్రుసుల సమ్మేళమైన ఉగాది పచ్చడి ఆరగిస్తా ఇంటిల్లపాది. కొత్త బట్టలు కడతాము, పిండి వంటలతో ముష్టాన్న భోజనం చేస్తాం . అంతే పండగ అయిపోయిందని చేతులు దులుపుకుంటాం. షడ్రుచులు మన జీవితంలో వచ్చే ఆటుపోట్లకు ప్రతీకలు అని గుర్తించం . తీపి ఉంటుంది,చేదు ఉంటుంది పులుపు కారం అన్నీ ఉంటాయి కదా… అది ఒక ఆచారం అని తినడమే కానీ… దానిలోని అంతరార్ధాన్ని తెలుసుకోవాలని అనుకోవటం లేదు. అలాగే ఉగాది నుండి ప్రారంభమయ్యే షడ్రుతువులను కూడా గమనించం…. మనసారా ఆస్వాదించం కూడా…. ఈ ఆరు రుతువులలో 6 సద్గుణాలు మిళితమై ఉన్నాయి. తనలో ఉన్న గుణానికి ముందు రుతువు లోని గుణాన్ని కలుపుకుంటూ ప్రయాణిస్తాయి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఇచ్చిన సందేశం లాగానే ఈ షడ్రుతువులు సద్గుణాలకు ఆలావాలమైనవి. ఉగాది అంతా ఆరు తోనే ముడిపడి ఉంది. ఆరు రుచులు, ఆరు ఋతువులు, ఆరు సద్గుణాలనే సంపదలు. ఇప్పుడు వీటి గురించి కొంచెం పరిశీలిద్దాం….
ఉగాది వసంత రుతువుతో ప్రారంభమైన వెళ్లిపోయిన శశిరంలోనే నిశ్శబ్దంగా దాగి ఉంది. ప్రకృతి అంతా మ్రోడుబారి ఉంటుంది అప్పటికి . కానీ వసంతం నిరాశ పడక శమము ( శాంతి)అనే సద్గుణంతో పరిస్థితుల ప్రభావానికి అనుగుణంగా శాంతంగా చిగురులు వేసుకుంటూ అంతా పచ్చతనాన్ని నింపుతుంది. ఎన్నో సొగసులు చూపిస్తుంది. కానీ విర్రవీగదు. తర్వాత వచ్చే గ్రీష్మ తాపాన్ని తగ్గించడానికి పచ్చదనం నింపడంలో తన వంతు కృషి చేస్తుంది. పశుపక్షాదుల నుండి మనుషుల వరకు ఆహ్లాదాన్ని నింపుతుంది
గ్రీష్మం తన తాపంతో జీవజాలాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంటా బయట కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితులు ఏర్పడి గాలి దుమారాలతో పాటు అప్పుడప్పుడు వర్షాలు కూడా పడతాయి కానీ గ్రీష్మం దమము అనే సగ్గుణాన్ని ఆశ్రయించి పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ రాబోయే వర్షరుతువు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ ఉంటుంది.
వర్ష ఋతువు గ్రీష్మంలో బీటలు వారిన భూమిని తన నీటితో తడుపుతుంది. కానీ ఒక్కొక్కసారి కుంభవృష్టి కురిసి,వరదలు వచ్చి ఊళ్లను ముంచేత్తేస్తుంది. అనుకున్నట్లుగా జరగదు. దీన్ని ఎదుర్కోవడమే తితిక్ష.”పెయిన్ అండ్ ప్రెస్టేషన్” ని బ్యాలెన్స్ గా ఎదుర్కోవడమే తితిక్ష. వర్ష ఋతువు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉపేక్షగా ఉంటుంది రాబోయే శరదృతువు కోసం ఎదురుచూస్తూ…. నీరు తగలడం వలన ప్రకృతి అంతా ఎంతో పచ్చదనాన్ని నింపుకుంటుది.మనము కూడా కొన్నింటిని, కొన్నిసార్లు ఉపేక్షించాలి. ఉపేక్షించడం వలన నిశ్చలత్వం వస్తుంది. చిన్న గడ్డిపోచను సుడిగాలి కదల్చలేనట్లు నిశ్చలత్వంగా ఉండాలి.
శరదృతువు ప్రవేశంతో వాతావరణం అంతా జీవత్వంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి దానిలో ఒక నిండుతనము, శ్రద్ధ కనిపిస్తాయి. శ్రద్ధ ఒక దైవ సంపద. నమ్మకంగా పనిచేయటమే శ్రద్ధ. సకాలంలో వర్షాలు పడటం వలన ప్రజలకు పాడి,పంట అందుతాయి. వర్షాలు కూడా అడుగంటుతాయి శరదృతువులో.సమతుల్యమైన వాతావరణం ఉంటుంది. అంటే సకారాత్మకమైన వాతావరణం ఉంటుంది. అందుకే దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు జరుపుకోవడానికి అనువుగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మనలో కూడా శ్రద్ధ అనే సుగుణం ఏర్పడుతుంది. శరదృతు వు శ్రద్ధ ద్వారా, నమ్మకం ద్వారా తన పనిని పలువురికి ఉపయోగకరంగా చేస్తుంది.
హేమంతం చామంతులను పూయిస్తుంది. వేదకాలంలో సంవత్సరం హేమంతంతోనే మొదలయ్యేది అంటారు. వాన జాడలు పూర్తిగా మరుగై అప్పటికే ప్రవేశించిన చలిని రెట్టింపు చేస్తూ ప్రకృతికాంతకు పులకింతలను కలుగ చేస్తుంది. ప్రతి పనిలోనూ ఆనందం చవిచూస్తూ చేయడంలో ఉపరతి అనే సద్గుణం కలిగి ఉంటుంది హేమంతం. ఇతర ఋతువులకు భిన్నంగా మనుషులను దగ్గర చేస్తుంది హేమంతం. ఎందుకంటే ఎండా వానలకు దడిసి దూరం దూరంగా ఉన్న జనం చిరు చలిలో దగ్గరగా చేరి ఉండటం జరుగుతుంది. ఇదే ఊపరతి.ఆనందం పలువురికి పంచడంలోనే ఉపరతి నిండి ఉంటుంది. ఒక్కటిగా కలిసి నడిస్తే సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుందోతెలియజేస్తుంది. ఒక విధంగా సృష్టికార్యానికి కూడా కారణభూతురాలు అవుతుంది.
శశి రుతువు వడ్డించిన విస్తర లాంటి కాలం. అన్ని అమిరి విశ్రాంతి తీసుకునే కాలం. చలి, పొగ మంచు తో కూడిన వాతావరణం కనబడుతుంది. చలికాలంలో పండే వ్యాపార పంటలకు అనుకూలం. ఉష్ణ మండల ప్రాంతాల్లో చెట్లు ఆకులను రాలుస్తాయి చెట్లను చలి బాధ నుండి కాపాడడానికి. ఈ కాలం రిలాక్స్ గా ఉండి క్రియేషన్ చేసే శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల అంతరంగాల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. ఈ రుతువులో ఆరవదైన సమాధానం అనే సద్గుణం నిశ్చలంగా ఉంటుంది. మ్రోడై ఉన్నా క్రియేషన్ అనే గుణం ఉండటం వలన రాబోయే వసంతానికి తన తోడ్పాటు అందించి సమాధాన పడుతుంది. మనకున్న దానితో సం తృప్తి పొంది ఇతరులకు మేలు చేయాలన్న గుణమే సమాధానం.
ఈ ఆరు సంపదలు ఉండటం వలన వివేకం అనే గొప్ప సంపదని పొంది ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతాయి రుతువులు.
కానీ మనుషుల మైన మనము నేటి ఆధునిక పోకడలతో కర్బనాన్ని ఎక్కువ విడుదల చేసి పర్యావరణ సమతుల్యాన్ని పోగొట్టుతున్నాము. అందువలన రుతువులలో కూడా సమతుల్యత దెబ్బ తింటోంది. రుతువులు తమ యొక్క సహజ స్థితిని కోల్పోతున్నాయి.
మనము కూడా అంతే కదా మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుండకపోతే సుగుణాలు నిలుపు కోవటం చాలా కష్టం. నేడు సంఘంలో కనిపించేది ఇదే కదా. ఏదైనా గతి తప్పితే మతి కూడా తప్పుతుంది.ఈ ఆరు రుతువులు మనకి ఆరు చక్కని పాఠాలనే సంపదలను అందిస్తున్నాయిమర్మగర్భంగా.