పల్లవి : గున్నమామి చిగురులు
వేప పూత నవ్వులు
కోకిలమ్మ రవళులు
విరులవాన సొగసులు
“గున్న”
చరణం:: నవ వసంత కాంతులు
నవనీత మనసులు
నందనమౌ జగతిలో
నవయుగాది జిలుగులు
“గున్న”
చరణం:: పురుడుపోయు ఆశలు
పురివిప్పిన కాంక్షలు
పుణీతమౌ ప్రకృతి
పుణ్యభూమి సంతతి
“గున్న”
చరణం:: ఇంటింటా తోరణం
మామిడాకు సుందరం
మరుమల్లెల పరిమళం
మనసు నిండు చందనం
“గున్న”
చరణం:: ఆరు రుచుల పచ్చడి
బ్రతుకు తీపి తెలుపది
స్వచ్ఛమైన ఉగాది
తెలుగింటి సందడి
“గున్న”
చరణం:: వసంతుడేలు యుగాది
నవజీవన ప్రమోది
నవకించిన మమతలు
చిరకాలం నిలవాలి
“గున్న”
చరణం:: మంచి ఎపుడు గెలవాలి
చెడును త్రుంచి వేయాలి
దయాకిరణ వెలుగులు
ధరణి నిండి సాగాలి
“గున్న””
చరణం::: ఒకరికొకరి తోడునీడ
మరొకరికై నిలవాలి
మరులుగొలుపు మకరందం
మనిషి మనిషి కావాలి
“గున్న”
చరణం:: నిర్మలమౌ నిస్వార్థం
నీతి నియమమవ్వాలి
పదుగురికై పాటుపడే
జనులు ఎపుడు గెలవాలి.
“గున్న””