( ఇప్పటివరకు: మైత్రేయి సుబ్బారావు మీద పెట్టిన గృహహింస కేసు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో జస్టిస్ విజయమ్మ గారి ముందు ప్రవేశపెట్టబడింది. మైత్రేయి తరఫున లాయర్ వసుంధర ఇన్ కెమెరా ప్రొసీజర్ కోసం అనుమతి కోరింది. అందువలన ఆమె కేసుని మరుసటి రోజుకి వాయిదా వేయడం జరిగింది. విజయమ్మ గారికి అనుకోని విధంగా చూసిన ఒక సంఘటన ఆలోచింపచేసింది. మైత్రేయి లాంటి అనేకమంది స్త్రీలకు న్యాయం జరగాలంటే మార్పు రావాలి. ఆ మార్పు ఎక్కడనుంచి రావాలి? అని జస్టిస్ విజయమ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది.)
ఆ మరునాడు మైత్రేయి కోర్ట్ కు హాజరైంది. ఇన్ కెమెరా ప్రొసీజర్ మొదలయింది. మెయిన్ కోర్ట్ రూమ్ లో కేవలం మైత్రేయి , ఆమె తరఫు న్యాయవాది వసుంధర, డిఫెన్సె లాయర్ కోదండపాణి గారు సుబ్బారావు, కొద్దీ దూరం లో ప్రత్యక్ష సాక్షులుగ అక్కమ్మ , రమాదేవి కూర్చొని ఉన్నారు. విజయమ్మ గారు రాగానే వాదనలు మొదలయ్యాయి.
“ గౌరవనీయులయిన జడ్జిగారికి , నా క్లయింట్ మైత్రేయిని ఆమే భర్త సుబ్బారావు గారు 498A of IPC ( గృహ హింసనుండి మహిళల రక్షణ చట్టం, 2005) క్రింద తనను హింసాత్మకం గా కొట్టి వేధించినట్లు ఆమె పోలీస్ కేసు పెట్టింది. దానికి తగిన యంక్వయిరీ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది. అందుకు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను కూడా కోర్ట్ కు తీసుకు రావడం జరిగింది, అన్ని వివరాలతో సాక్ష్య లతో ఉన్న ఫైల్ ని కోర్ట్ వారి ముందు పెట్టటం జరిగింది,” అంటూ వసుంధర కేసు ని వివరించింది.
ఒక్కొక్కరిగా సాక్షులను జడ్జి గారి ముందుకు పిలిచి జరిగిన సంఘటన తాలూకు వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత జడ్జి గారు డిఫెన్సె లాయర్ గారికి అవకాశమిచ్చారు.
కోదండ పాణిగారు ముందుగా ధన్యవాదములు తెలుపుకొని మైత్రేయిని మాత్రమే విచారించడానికి అనుమతి కోరారు. ఆమె అనుమతి నివ్వడం జరిగింది.
“శ్రీమతి మైత్రేయి గారు , మీకు వివాహమయి ఎంత కాలమయింది?”
“రేడు సంవత్సరాలు పూర్తయినాయండి. ఇది మూడో ఏడాది”.
“అలాగా. మరి మీ వారు అదే సుబ్బారావు గారు, పెళ్లయినప్పటి నుండి మీతోటి ఇలాగె ప్రవర్తిస్తున్నారు. అంటే కొట్టడం, తిట్టడం లాంటివన్న మాట.”
“లేదండి. ఈ మధ్యనే ఆయన ఈ విధంగా ప్రవర్తించారు”.
“అంటే! ఇదే మొదటిసారన్న మాట అయన ఇలాగ ప్రవర్తించటం.” ఆమె మౌనం గ ఉండిపోయింది.
“మీరు అవునో? కాదో? చెప్పాలి. లేక పోతే నిజం ఎలా తెలుస్తుంది. నా క్లయింటు , మీ భర్త అయినా సుబ్బారావు గారు ఈ విషయం లో చాల పశ్చాత్తాప పడుతున్నారు. మీరేమంటారు?”
అప్పుడు కూడా మైత్రేయి మౌనంగానే నిలబడింది. “మీరు నోరు మెదపక పోతే , మీరు ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని అనుకోవాల్సి ఉంటుంది. ఏమంటారు?”అంటూ చాల గంభీరం గ అడిగాడు.
వసుంధర కల్పించుకొని “ గౌరవనీయులయిన డిఫెన్స్ లాయర్ గారు అలా ఎలా అనుకొంటారు. అంత స్పష్టమయిన ఆధారాలు ఉంటె.?” అంటూ ఆయనని అడ్డుకొంది.
“ఉన్నాయమ్మ. నేను కూడా చూసాను. ఆధారలదేముంది ఎన్నయినా చూపించవచ్చు. కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఏమి జరిగిందో వాళ్ళే చెప్పాలి. పైగా నా క్లయింట్ సుబ్బారావు ని కూడా ఆమె తిరిగి కొట్టారాని చోటే కొట్టినట్లు ఆయన కూడా డాక్టర్ సర్టిఫికెట్ చూపిస్తున్నాడు. ఎమ్మా నువ్వతనిని కొట్టవా?” అంటుంటే విజయమ్మ గారి క్కూడా లీలగా నవ్వు వచ్చింది.
మళ్ళి తలాడించింది. “అలాకాదమ్మా. స్పష్టం గ చెప్పాలి.” అన్నాడాయన. “అవునండి. అతని పట్టునుండి నన్ను నేను తప్పించుకోవటం కోసం అతని మీద తిరగపడ్డాను. అతను కేవలం నన్ను శారీరకంగానే బాధపెట్టలేదు, మానసికంగా కూడా నేను బాధించపడ్డాను. చాలా అసభ్య పదజాలం తో నన్ను కించపరిచేవాడు. ఆలా మాట్లాడడమయితే చాల రోజులనుండి జరుగుతున్నది. నా ఆత్మ గౌరవం దెబ్బతిన్నది నేను కూడా గౌరవ ప్రదమయిన వృత్తిలో ఉన్నాను. అలాగే గౌరవనీయమయిన కుటుంబంలో పెరిగాను.” అంటూ గొంతు జీరపోగా కన్నీళ్లతో జడ్జి గారి వైపు చూసింది.
“అంటే దానర్ధం నువ్వు సుబ్బారావు గారిని కూడా తిరిగి కొట్టవన్న మాట.”
“ఇదీ జరిగింది జడ్జి గారు! అతను కొట్టాడు , ఆమె తిరిగి కొట్టింది. ఇందులో హింస రెండువైపులా జరిగింది. అంతే కాకుండా పోలీస్ కేసు పెట్టి అతని పరువు రోడ్డు కీడ్చడం జరిగింది. ఈ నష్టం ఎవరు పూడుస్తారు. నా క్లయింటు కూడా న్యాయం జరగాలి. తప్పంతా అతని దే అని అనడానికి వీలు లేదు ఎందుకంటే ఆమే ఎప్పుడు అతనితో సరిగా వ్యహరించలేదని, ఆమె వ్యవహారాలకు విసిగి తాను దూరంగా ఉంటున్నానని నా క్లయింట్ కోర్ట్ వారికీ తెలియ చేస్తున్నాడు,” అంటూ అనర్గళంగా తప్పంతే మైత్రేయిదే అన్నట్లు వాదించేసాడు కోదండపాణి.
చాలా చురుకుగా చూస్తూ “ wonderful! లాయర్ గారు. చాలాబాగుంది వాదన. మగవాడు ఎం చేసిన పరవాలేదు. కానీ ఒక్క ఆడపిల్ల ధైర్యం చేసి ప్రశ్నిస్తే రివర్స్ లో ఆమె క్యారెక్టర్ని ప్రశ్నిస్తారు. సుబ్బారావు గారు ఆమె ప్రవర్తన కు విసిగెత్తి దూరంగా పోయాడా? లేక ఆయన కున్న వ్యసనాలకు ఏ అడ్డం ఉండకూడదని దూరంగా పోయారో ముందు కనుక్కొండి? మీకు తెలియదంటే నేను నిరూపిస్తాను.“ అంటూ విరుచుకు పడింది వసుంధర .
రెండు గంటలు వాదనలు విన్న తరువాత జడ్జి విజయమ్మ గారు కేసు ఫైనల్ తీర్పుకు డేట్ అనౌన్స్ చేసారు. అప్పటి వరకు మరే రకమయిన హింసకు అతను పాల్పడ కూడదని, అలాటివి జరిగిన పక్షంలో అతనికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ అప్పటికి ఆ కేసును వాయిదా వేశారు ఆమె.
(ఇంకా ఉంది)