ఉగాది నాడు-నేడు

కథ

మాధవపెద్ది నాగలక్ష్మి

క్రొత్తసంవత్సరంకోసం ఎదురు చూస్తున్నాను. క్రొత్త సంవంవత్సరం త్వరగా వస్తే బాగుండును. ఈ ఏడాదంతా ప్రమాదాలు, హత్యలూ, విపరీతమైన రాజకీయ రణాలూ, రేపులూ వీటితో గడిచిపోయింది. ఇవన్నీ చూసి విసిగెత్తి పోయిన నేను క్రొత్త సంవత్సరంకోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. అనుకుంటుండంగానే అది రానే వచ్చింది. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించటానికి ఉవ్విళ్ళూరుతూ బయటకు వెళ్ళాను. మా ఇంటి చుట్టూ ఉన్న మామిడి చెట్లవైపు కోయిల పాట వినవచ్చని అలా బయటకు వెళ్ళాను.కోయిల పాట వినపడలేదు కానీ, బయట పక్కింటినుంచి పాప్ మ్యూజిక్ పెద్దగా చెవులు చిల్లులు పడేటట్లు వినపడుతోంది. ఉసూరుమంటూ లోపలికి నడిచాను. కాసేపయ్యాక మళ్ళీ బయటకు వెళ్లాను. మా ఇంటికి దూరంగా ఓ పెద్ద తోట ఉంది. అందులోకి అప్పుడప్పుడు నెమళ్ళు వస్తూంటాయి. అవేమన్నా నాట్యమాడుతున్నాయేమో చూద్దామని ఆత్రంగా వెళ్లాను. చూస్తే అందులో ఎమ్.ఎల్.ఏలు, పోలీసులు ఓ ఐటం సాంగ్కి స్టెప్పు లేస్తున్నారు ….హ హతవిధీ అనుకుంటూ మళ్ళీ లోపలికి నడిచాను. పూజయినా చేసుకుందామని దేవుడి గదిలోకి వెళ్లాను.ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో మా అమ్మాయి సుడిగాలిలా వచ్చి “ నాన్నా దేవుళ్ళ ఫోటోలకు పూజలని, పసుపులు, కుంకుమలు పెట్టి మరకలు చేయవాకు, నిన్ననే కష్టపడి పండగని అన్నీ తుడిచాను, పాడైతో నేను మళ్ళీ తుడవలేను…చెప్పి హడావుడిగా పరిగెత్తిపోయింది. మౌనంగా ధ్యానం చేసుకుని బయటికి వచ్చా. సాయంత్రం అయింది.
క్రొత్త బట్టలు కట్టుకుని బయటకు వెళ్దామని హుషారుగా ముఖం కడిగి లేచాను. చూస్తే క్రొత్త బట్టలు ఇస్త్రీ చేసి ఉన్నాయి. ఇదేమిటీ? అని మా శ్రీమతిని అడిగా…ఆ ఏం లేదండీ మీ బట్టల మడతల్లో దుమ్ము మరకలు కనబడితే మన అమ్మాయి ఆ దుమ్మువల్ల మీకు ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనని భయపడి బట్టలు ఉతికించి, ఇస్త్రీ చేయించిందని చల్లగా చెప్పింది శ్రీమతి. ఆహా ఈ అశౌచముకూడానా అనుకొని మౌనంగా ఆ బట్టలు వేసుకుని బయటకు నడిచా పంచాంగం అయినా విందామని.
బ్రాహ్మడు అప్పటికే మొదలు పెట్టేసాడు చెప్పటం, కాసేపు ఒక పార్టీ నాయకుడు మంత్రి అవుతాడని మరొకసారి వేరే పార్టీ నాయకుడు మంత్రి అవుతాడని ముఖ్య మంత్రి అవుతాడని పొగడడం,కాసేపు దేశం సుభిక్షంగా ఉంటుందని మరి కాసేపు వరదలు, అగ్ని ప్రమాదాలతో, తల్లడిల్లుతుందని వినలేక, అర్ధం చేసుకోలేక బయటకు వచ్చేసా !రాత్రయింది, పడుకుందామనుకుంటుండగా, మా అబ్బాయి, “ నాన్నా పడుకోకు, మంచి సినిమా పెడుతున్నా, అందరం సినిమా చూద్దాం రా “ అని కేక పెట్టాడు. శ్రీరామ నవమి రాబోతున్నది కదా రామాయణం మీద సినిమానేమో అనుకొని ”ఏం పేరు బాబూ అని అడిగా ‘చావు కేక ’ సినిమా పేరు, థ్రిల్లర్ మూవీ నాన్నా ఉత్సాహంగా అరిచాడు అబ్బాయి. మీరు చూడండి బాబూ, నాకు నిద్ర వస్తోంది అని ముసుగు తన్ని పడుకున్నాను.నిద్రలో తీయని జ్ఞాపకాలు. …మా చిన్నతనంలో ఉగాది ఎంత బాగుండేది! ఊరి నుంచి అక్క, బావ, పిల్లలూ వచ్చేవాళ్ళు.పండగనాడు ప్రొద్దున్నే మా అమ్మ మా అందరికీ తలంటి పోసి క్రొత్త బట్టలు కట్టబెట్టి, ముద్దుగా అలంకరించి గుడికి తీసుకెళ్ళేది. పూజారులచేత ఆశీర్వచనం చేయించేది. చేదు, వగరు, ఉప్పు, పులుపు కారం, చేదు తీపి కలగలసిన ఉగాది పచ్చడి ప్రసాదంగా పెట్టేది. మధ్హ్యాన్నం గారెలు, పులిహోర, పరమాన్నంతో తృప్తిగా, కడుపునిండా దగ్గర కూర్చుని తినిపించేది. సాయంత్రం నాన్న మళ్ళీ గుడికి తీసుకెళ్ళేవారు. పంచాంగం వినమనేవారు. అదివిన్న జనం అందరూ, సంతోషంగా, ఈ సంవత్సరం మనకు బాగుందని ఎవరికి వారు, మాకు రాజ పూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ, రాబడి ఎక్కువ, ఖర్చు తక్కువ అని అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకునేవారు. పంటలు బాగా పండుతాయట, దేశం సస్య శ్యామలంగా ఉంటుందట, ఇహ మనకు తిండికి బట్టకు కొరవలేదు అని అందరూ కాసేపు పంతులుగారి పంచాంగం మీద చర్చలు జరుపుతూ గుళ్లో కూర్చునేవాళ్ళు. అమ్మలందరూ అందమైన చీరలు కట్టుకుని, ఒంటినిండా సొమ్ములు పెట్టుకుని ఒకరికొకరు చూపించుకుంటూ సంబరపడేవారు. ఇంకా ఎన్నెన్నో తీయని జ్ఞాపకాలు. …ఆరోజులు మరల వస్తాయా? ఇలా ఆలోచనలు నెమరు వేసుకుంటూ, ఈ ఉగాది ఇలా గడిచింది వచ్చే ఉగాదికి పరిస్థితులు ఎలా ఉంటాయో అనుకుంటూ హాయిగా నిద్రలోకి జారిపోయా!
మాధవపెద్ది నాగలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధ్యాస

ఉగాది కవితలు