మంచు తుఫాన్ లో బామ్మామనవరాలు!

కథ

మాలా కుమార్

అలారం చప్పుడుకు చిన్నగా కళ్ళు తెరిచి, సెల్ ఆఫ్ చేయబోయింది కాళింది. అంతలోనే అమ్మో ఈ రోజు కస్టమర్ కాల్, ఆ తరువాత వరుసగా మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేవక పోతే అత్తగారికి, ఆధ్యకు వంటచేసి ఉంచలేదు. అసలు ఇప్పటికే బామ్మామనవరాళ్ళిద్దరూ లేచి వంటింట్లో వెతుక్కుంటున్నారేమో అనుకుంటూ, కంఫర్టర్ జరిపి లేచింది. పక్కన సౌరభ్  నిద్రలో ఉన్నాడు. కాళింది ఫ్రెషప్ అయ్యి కిందికి వెళ్ళింది. కాఫీ కలుపుకొని కిటికీ దగ్గరకు కుర్చీ జరుపుకొని కూర్చుంది. బయట ఇంకా మబ్బుమబ్బుగానే ఉంది. స్ట్రీట్ లైట్ వెలుగులో తెల్లగా, చిన్నచిన్న తుంపరలుగా పడుతున్న మంచు మెరుస్తూ కనిపిస్తోంది. కిటికీ గ్లాస్ డోర్ లో నుంచి బయటకు చూసింది.  ఆ చిరుచీకటిలో, స్ట్రీట్ లైట్ వెలుగులో రోడ్ అంతా తెల్లగా కనిపిస్తోంది. సన్నగా పడుతున్న మంచు బిందువులు మల్లెల వాన కురిపిస్తున్నట్లుగా ఉన్నాయి. మంచు కురిసేవేళలో మల్లె విరిసేనెందుకో అని కూనిరాగం తీస్తూ వెచ్చని కాఫీని ఆస్వాదిస్తోంది.

“ఆ ఆ మల్లెలే కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి రెండురోజులు స్నో స్ట్రోం ఉందిఇంక అప్పుడేమి కురుస్తాయో” అప్పుడే నిద్ర లేచి వచ్చినఅన్నాడు సౌరభ్ కాఫీ కలుపుకుంటూ.

“ఏంటి సౌరభ్ కాస్త పాటైనా పాడుకోనీయవు అని గుణిసింది గారాబంగా కాళింది.

“సరే సరే తల్లీ నీ ఇష్ఠం ఎన్ని పాటలయినా పాడుకో. నేను ఈ తుఫాన్ తగ్గే  వరకూ హోటల్ లో ఉంటాను చెప్పానుగా? వీళ్ళిద్దరూ ఇంకా లేవలేదా?” అడిగాడు.

“రాత్రంతా పాటలూ డాన్స్ లు చేసుకుంటూ ఉన్నారు. ఇక అప్పుడే లేస్తారా?” అంటూ ఓసారి అత్తగారి గదిలోకి తొంగి చూసింది. బామ్మా మనవరాళ్ళిద్దరూ హాయిగా నిద్రలో ఉన్నారు. ఆధ్య బామ్మ పక్కన ఎక్కడ ముడుచుకొని ఉందో కనిపించలేదు. ఆధ్యను విడిగా పడుకోనీయండి దాని రూం లో అంటే ఇద్దరిలో ఎవరూ తన మాట వినరు. నేను ఇక్కడున్నన్ని రోజులూ నా దగ్గరే పడుకోనీయి అన్నారు అత్తగారు. ఆధ్యా రాదు బామ్మాబామ్మా అంటూ ఆవిడతోనే ఉంటుంది. ఓసారి వాళ్ళ వైపు చూసి వంటగదిలోకి వెళ్ళింది. సౌరభ్ కాఫీ తీసుకొని పైకి వెళ్ళినట్లున్నాడు.

కొద్దిసేపు తరువాతఅనసూయ, వెనకాలే మూడేళ్ళ ఆధ్య వచ్చారు.

వాళ్ళను చూస్తూనే “ఆంటీ మైక్రోవేవ్ లో ఇడ్లీ ఉన్నాయి. మీరు తినేయండి. నాకిప్పుడు అరగంటలో కస్టమర్ కాల్ ఉంది. అదయ్యాక వచ్చి వంట చేస్తాను. ఆద్యా, ఇదో ఈ పాలు తాగేసి అల్లరి చేయకుండా ఆడుకో” అంది కాళింది.

సౌరభ్ ట్రావెల్ సూట్కేస్ తో వచ్చి తల్లిని చూసి, “అమ్మా బయట ఊళ్ళో ఉన్న మా టీం వాళ్ళను నలుగురిని పిలిచాను. వాళ్ళు హోటల్ లో ఉన్నారు. సాయంత్రం నుంచి రెండురోజులు స్నో స్ట్రాం ఉంది. బయటకు వెళ్ళలేము. అందుకని నేను కూడా హోటల్ లోనే ఉంటాను. నువ్వూ నీ మనవరాలూ అల్లరి చేయకుండా కాస్త బుద్దిగా, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం అవుతే కాళింది చూసుకుంటుంది” అన్నాడు.

“అంటే బయటకు వెళ్ళలేమా?” అంటూ బయటకు చూసింది అనసూయ. బయట సన్నగా మంచు తుంపరలు పడుతున్నాయి.”మంచేమీ ఎక్కువగా లేదు కదరా? బయటకు వెళ్ళ వచ్చేమో. ఓసారి బయటకు వెళ్ళి మంచు పట్టుకోనా?” చిన్నపిల్లలా సంబరపడుతూ అడిగింది.

“అవునా ఎక్కువగా లేదా? అయితే ఓసారి బయటకు వెళ్ళిరా” అన్నాడు సౌరభ్ ఇడ్లీ తింటూ.

అనసూయ తలుపు దగ్గరకు వెళ్ళి తీయబోయింది. తెరుచుకోలేదు. గట్టిగా ఉంది. తలుపుకు ఉన్న గ్లాస్ లో నుంచి ముందుకు వంగి చూసింది. తలుపు ముందు వరకూ మంచు తెల్లగా ఉంది. ఇంటి ముందు రోడ్ అసలు కనిపించటం లేదు. అంతా తెల్లగా మంచు పరుచుకొని ఉంది.

“ఇదేమిట్రా తలుపు తెరుచుకోవటము లేదు. నువ్వెట్లా వెళుతావు? గ్యారేజ్ ముందు కూడా అంతా మంచు ఉంది”అంది గాభరాగా.

“తెలిసింది కదా? నవ్వుతూ అని, ఇప్పుడు అస్సలు బయటకు వెళ్ళలేమమ్మా. బయటకు వెళితే ఫ్రీజ్ అవుతాము. కనుగుడ్లు దెబ్బ తింటాయి. నువ్వు కష్టపడి తలుపు తీసి బయటకు వెళ్ళాలని చూడకు” అన్నాడు.

“మరి నువ్వెట్లా వెళుతావు?” అని అడుగుతుండగానే బయట ఏదో నీడ కదిలినట్లనిపిస్తే అటు చూసింది. మనిషి కనిపించకుండా వంటినిండా నల్లటి బట్టలు, తలకు పెద్ద నల్లటి మంకీ కాప్, కళ్ళకు పెద్దపెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్న ఒకతను పెద్ద ఆయుధం లాంటిది ఏదో పట్టుకొని వరండా ఎక్కుతున్నాడు. అతన్ని చూడగానే ఒక్క క్షణం మంచులో ఉన్నట్లు బిగుసుకుపోయింది. నోట మాటరాలేదు. గబగబా సౌరభ్ దగ్గరకు వచ్చి “ఎవరో సినిమాలో చూపించే హంతకుడులాంటి వాడు వచ్చాడురా” అంది గుసగుసగా.

హంతకుడా అని సౌరభ్ బిత్తరబోయి గబగబా తలుపు దగ్గరికి వచ్చి చూసాడు. అక్కడ క్లీనర్ తలుపు దగ్గర, వరండాలో ఉన్న మంచును పెద్ద పారలాంటి దానితో జరిపి కిందకు, పక్కకు వేస్తున్నాడు.

సౌరభ్ వెనకాలే “వద్దురా అటు వెళ్ళకు. పోలీస్ కు ఫోన్ చేయి” అంటూ గాభరాగా వచ్చిన అనసూయతో  “అతను కిల్లర్ కాదు. క్లీనర్” అని నవ్వాడు.

ఇంతలోనే డబ్ డబ్ అని చప్పుడు చేసుకుంటూ ఓ పెద్ద బుల్డోజర్ లాంటి వెహికిల్ వచ్చి, ఇంటి ముందున్న మంచునుఎత్తి పక్కకు వేస్తుంటే, వాళ్ళను వింతగా చూస్తూ “అబ్బా గుండె దడదడలాడిపోయింది. ఏమిటిరా మరీ అట్లా బందిపోటులా అంత ముసుగేసుకొని వచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళా?  మన దగ్గర చెత్త తీయటానికి వస్తారు. అట్లా వచ్చారా?” కుతూహలంగా అడిగింది అనసూయ.

“మున్సిపాలిటీ వాళ్ళు కాదు. మనము డబ్బులు ఇచ్చి పిలిపిస్తాము. ప్రతినెలా 500 డాలర్ లు కడతాము. అతను నీకు బదిపోటు, హంతకుడిలా కనిపించాడా? మరి అంత కవర్ చేసుకోకపోతే ఈ మంచులో ఎట్లా వస్తాడు? ” అన్నాడు సౌరభ్.

“అంటే మంచు కాలం కాకపోయినా, మంచు పడకపోయినా కడతావా?” ఆసక్తిగా అడిగింది అనసూయ.

“మంచు లేకపోయినప్పుడు, ఇంటి చుట్టూ గడ్డి తీసి, క్లీన్ చేయటమూ అదే లాన్ మూవింగ్ అవీ చేస్తారు. సంవత్సరమంతా ఏదో ఒక మేంటెనెన్స్ ఉంటుంది కదా! అన్నీ వాళ్ళే చేస్తారు. కొంత మంది ఒక ప్రైవేట్ అసోషియేయన్ లా ఉండి ఇవన్నీ చేస్తారు.” అని తల్లికి వివరంగా చెప్పి, “గ్యారేజ్ ముందు క్లీన్ చేసారు కదా. ఇంక నేను వెళుతానమ్మా” అని చెప్పి వెళ్ళాడు సౌరభ్.

సౌరభ్ కార్ తీసి వెళ్ళాక, కాసేపు బయటవాళ్ళు చేస్తున్నది చూసి లోపలికి వచ్చింది అనసూయ.

కాల్ అయ్యాక వచ్చి వంటచేద్దామనుకుంది కానీ మళ్ళీ ఆ తరువాత మీటింగ్ లతో ఎంత టైం తీసుకుంటుందో వంటచేసి వెళితే ఓపనైపోతుంది అనుకొని తల్లీకొడుకుల సంభాషణ వింటూనే గబగబా వంట చేస్తోంది కాళింది.

కాళిందితో ” అయ్య బాబోయ్ ఇంటి ముందు క్లీన్ చేయటానికి నెలకు దాదాపు 25000 ఇస్తారన్నమాట” ఆశ్చర్యంగా అంది అనసూయ.

“ఇవ్వకపోతే మరి ఎవరు తీస్తారు అదంతా? అయినా మీరట్లా రూపాయల్లోకి మార్చుకొని చూడకండి ఆంటీ” అంటూనే డైనింగ్ టేబుల్ సద్ది హడావిడిగా వెళ్ళిపోయింది కాళింది.

మీటింగ్స్ నూ మిగితా ఆఫీస్ పని ముగించుకొని సిస్టం మూసి, ఇల్లంతా నిశబ్ధంగా ఉంది. ఈ అల్లరిగాంగ్ ఏదబ్బా అనుకుంటూ కిందికి వచ్చి “ఆధ్యా ఎక్కడా? ఏం చేస్తున్నావు?” అని పిలిచింది.

“ఇక్కడ పౌడర్ రూం లో మమ్మీ. బామ్మకు మేకప్ చేస్తున్నాను” అని జావాబిచ్చింది ఆధ్య.

“బాత్ రూం లో మేకప్ ఏమిటీ” అంటూ రెస్ట్ రూం తలుపు తీసి, అద్దం ముందు కౌంటర్ మీద కూర్చున్న ఆధ్య ఎదురుగా నిలుచున్న అత్తగారిని చూసింది.

“నువ్వు ఈ బాత్ రూం ను పౌడర్ రూం అంటారని చెప్పావుగా. అందుకని ఇక్కడ ఆద్య మేకప్ చేస్తానంటే సరేనన్నాను” అంటూ తన వైపు తిరిగిన అత్తగారిని ఓ క్షణం తెల్లబోయి చూసి, పక్కున నవ్వింది కాళింది.

“ఎందుకట్లా నవ్వుతావు? ఏదో చిన్నపిల్ల దానికొచ్చినట్లు చేసింది” అంటూ అద్దం వైపు తిరిగి, అద్దం లో, తన మొహం నిండా ఉన్న పింక్ పౌడర్, పెద్దగా ఉన్న బొట్టు, కళ్ళ చుట్టూ మందంగా దిద్దిన ఐలైనర్,పెదాల నిండా రక్తం తాగినట్లున్న ఎర్రగా పులిమిన రెడ్ లిప్ స్టిక్,  విరబోసిన జుట్టు తో అచ్చం దయ్యంలా ఉన్న తన ఆకారం చూసుకుంటూ “కడిగేసుకుంటానులే నువ్వేమీ నవ్వక్కరలేదు” అంది ఉక్రోశంగా అనసూయ.

“కడిగేసుకుంటారా? ఆ మేకప్ పోవటానికి ఎన్ని నీళ్ళు కావాలో తెలుసా? అయినా ఇప్పుడు నీళ్ళు బంద్ అవుతే ఏం చేస్తారు?” అంటూ ఆద్యను తీసుకొని బయటకు వెళ్ళింది కాళింది.

శుభ్రంగా కడుక్కొని వచ్చి”ఇక్కడ నీళ్ళు ఎప్పుడూ బంద్ అవవుకదా? నీళ్ళు బంద్ అవుతాయంటావేమిటి?”అడిగింది కోడలిని.

“ఎప్పుడూ కావాంటీ. కానీ ఈ మంచు తుఫాన్ కు కరెంట్ ఫేల్ అవుతే, నల్లాలూ బంద్ అవుతాయి. ఇదో ఈ టార్చ్ లైట్ మీ దగ్గర ఉంచుకోండి. కరెంట్ పోతే భయపడకండి. ఇదో ఈ లైటర్ ఈ ఫైయర్ ప్లేస్ దగ్గర ఉంచుతున్నాను. కరెంట్ పోతే ఇది వెలిగిస్తాను” అంది కాళింది.

“కరెంట్ పోతుందా? అయినా ఒక్క పూట పోతే ఏమవుతుంది. మా ఇండియాలో అవుతే ఎప్పుడూ పోతునేఉంటుంది. నాకలవాటేలే ఏమీ భయపడను” అంది అనసూయ.

“అక్కడ కరెంట్ పోతే తలుపులు తీస్తాము గాలి వస్తుంది. ఇక్కడ తలుపులు తీయలేము. తలుపు తీస్తే గడ్డకట్టిపోతాము. ఒక్క నీటి చుక్క కిందికి పడేలోపు మంచుగడ్డ అయిపోతుంది. నీళ్ళు ఈ చలికి పైప్ లల్లో గడ్డకట్టిపోయి, పైప్ లు పగిలిపోతాయి. ఎక్కువ సేపు గాలి లేకుండా ఇంట్లోనే ఉంటే మనుషులు చచ్చిపోతారు.ఇక్కడఈ సీజన్ లో కరెంట్ పోతే అంత కష్టం ” అని కాళింది చెపుతుండగానే పెద్దగా సైరన్ ఇస్తూ ఇంటి పక్క నుంచి పోలీస్ వాన్ దాని వెనుక ఫైర్ ఇంజన్ వెళ్ళాయి. ఉలిక్కి పడి “ఇదేమిటి?” అంది భయంభయంగా అనసూయ. ఆద్య కాళిందిని గట్టిగా కరుచుకుంది.

“ఎక్కడైనా ఈ మంచు మీద కార్ లు జారి పడిపోతుంటాయి. అందుకనిఏ కార్ అయినా జారి పడిపోయిందేమోనని చూసుకుంటూ అట్లా గస్తీ తిరుగుతుంటారు పోలీసులూ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏ ఆక్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త.” అని చెప్పింది కాళింది.

అయిదింటికే పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. దట్టంగా మంచు కురుస్తోంది. డిన్నర్ రెడీ చేసి పిలవటానికి వస్తే బామ్మామనవరాళ్ళిద్దరూ బిక్కుబిక్కుమనుకుంటూ మంచం మీద కూర్చొని బయట పడుతున్న మంచును చూస్తున్నారు. అనసూయ హనుమాన్ చాలిసా చిన్నగా చదువుకుంటోంది.

హడావిడిగా ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ ఉండే వాళ్ళిద్దరూ అట్లా కూర్చొని ఉండటము చూస్తుంటే మరీ భయపెట్టానా అని ఓ పక్క జాలి, ఓ పక్క నవ్వూ వచ్చాయి కాళిందికి. “ఇప్పుడేమీ ప్రమాదం జరగలేదు కాస్త రిలాక్స్ అవ్వండి ఇద్దరూ. హాయిగా డిన్నర్ తిని పడుకోండి” అంది నవ్వుతూ.

రెండోరోజు సాయంకాలనికి మంచు తుఫాన్ వెలిసింది. మామూలుగా సన్నని మంచు పడుతోంది. సౌరభ్ ఇంటికి వచ్చాడు. సౌరభ్ ను ఆత్రంగా పట్టుకొని “అక్కడ మీకేమీ ఇబ్బంది కాలేదు కదా నాన్నా?” అడిగింది అనసూయ.

“ఒక అయిదు నిమిషాలు కరెంట్ పోయింది. అందరినీ రూంలల్లో నుంచి లాంజ్ లోకి రమ్మని అనౌన్స్ మెంట్చేసారు. అందరమూ లాంజ్ లోకి వచ్చాము. కరెంట్ రాగానే మా రూంలల్లోకి వెళ్ళిపోయాము. హోటల్ లో పోలీసులు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్ అన్నీ రెడీగా ఉంచారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు” అన్నాడు.

“అమ్మయ్య ఈ మంచుతుఫాన్ ఏ ఇబ్బందీ పెట్ట కుండా వెళ్ళిపోయింది” అంది అనసూయగుండేల మీద చేయి వేసుకొని.

“ఎలక్ట్రిక్, వాటర్, పోలీస్, ఫైర్ ఇన్ని డిపార్ట్మెంట్ ల వాళ్ళు కలిసి మనకే ఇబ్బందీ లేకుండా చేసారు.అందరి సహకారముతో అంతా క్లియర్ అయ్యి, మనము మాములుగా తిరగకలుగుతున్నాము. ఏఒక్కరూ సరిగ్గా చేయలేకపోయినా, ఒకరికొకరు సహకరించుకోలేకపోయినా జనజీవనం అస్త్యావిస్త్యం అయ్యేది. మరి నీ మంచు మురిపెం తీరిందా?” అడిగాడు సౌరభ్.

కొడుకు మాటకు జవాబివ్వకుండా బయటకు చూసింది అనసూయ. జల్లులా మంచు ఉండీ ఉండీ కురుస్తోంది. వెనుక ఉన్న పెద్దపెద్ద చెట్ల మీదంతా తెల్లని దూది రాసులుగా పోసినట్లు అందంగా కనులకింపుగా ఉన్నాయి ఆ చెట్లు. మధ్యాహ్నం రోడ్ అంతా క్లీన్ చేసినట్లున్నారు, రోడ్ కు రెండు వైపులా మంచు కొండలా పడి ఉంది. ఆ రెండు కొండల మధ్య రోడ్ నల్లగా మెరిసిపోతూ శుభ్రంగా ఉంది. తెల్లగా, నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ఉన్న ఆ ప్రకృతిని చూస్తూ “బయట చూడు ఎంత బాగుందో.ఆ చెట్లను చూస్తుంటే హిమాలయాలల్లో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులలాగా ఎంత నిశ్చలంగా, గంభీరంగా ఉన్నాయో! హిమాలయాలను చూడాలన్న నా కోరిక ఇట్లా తీరింది. ఎంత చూసినా ఆ మురిపెం తీరదురా. ఈ సారి మీడాడీని కూడా రమ్మనాలి” అంది పరవశంగా ఆ మంచును చూస్తూ.అత్తగారి పరవశం చూస్తూ “హిమగిరి సొగసులూ, మురిపించెను మనసులూ” అని రాగం తీసింది కాళింది.కాళిందితో గళం కలిపింది అనసూయ.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జీవన పయనం

శాంతి, శక్తి, చైతన్యమై..