ప్రభవ విభవల సంవత్సరాల పరిభ్రమణంలో
అయనాలు సైతం క్షణాలుగా మారుతూ యుగయుగాలుగా
చరిత్రకు చేరుతున్న మరోవత్సరం
నేడూ ఓ కొత్త వసంతం
నిలువెత్తు ప్రకృతి క్రోధిగా
పచ్చదనాల పలకరింతలతో
వసంతరాగాలు వినిపిస్తూ
షడ్ రుచులను తినిపిస్తూ
షడ్ గుణాలను శమించేలా
స్వాగతిస్తోంది.
గత శోభకృత్ ఊడల నీడల్లో
ఎన్నో రుచులు తిన్నా
ప్లవగా,శుభకృత్ గా పలకరించినా
ఇంకా చేతులు కడుగుతూనే
దూరం దూరం జరుగుతూ
ముచ్చటగా ముసుగులు
తొడుగుతూ అక్కడక్కడా వున్న
పుచ్చుకున్న ఔషధాలు సరిపడక సరి కొత్త రోగాలతో
ఆధునాతన ఆసుపత్రులలో అలరింపులలో అలసి సొలసి గగనానికేగిన
గానగంధర్వులు, సాహితీమూర్తులు ఎందరో నటశేఖరులు,కళాతపస్వులు
ఎందరో కనుమరుగు అయినా.. ఆటుపోట్ల నడుమ
నాటు-నాటు,పాటకు ఆస్కారు అవార్డుల
స్వాగతాలతో అంతర్జాల వెలుగులు,ఎన్నికలు పోరు
రాజ్యాంగంలో మార్పులు బాల రాముని ఆగమనం, కళ్యాణ రామునికై ఎదురుచూపు
కొత్త ఆశలకు మెుగ్గలు తొడుగుతుంటే ఒక్కొక్కటిగా
ఆనాటి అమరవీరుల త్యాగాలు వెలుగు జిమ్ముతుంటే విస్తుబోతూ
ఆదరించే జనాలు,మారే మనుషుల రాజకీయ వైనాలు,
ఎన్నో కలగలుపుల స్వరాలు
కలిసి పలికే స్వరజతులతో
కాలం ఋతువులు మారుస్తూ
అన్నిటినీ క్షమిస్తూ
ప్రకృతి ఎప్పటికప్పుడు
అక్కున చేర్చుకుని అలరిస్తూనే వుంది.
మరో వసంతంతో
క్రోధిగా స్వాగతిస్తోంది.