“నాకేం సుఖం సంతోషం లేదు. తెల్లవారి లేచినప్పటి నుంచి ఇంటి చాకిరీ తోనే సరిపోతుందన్నది నిష్టూరంగా భర్తతో నాగమణి.
“నాలాంటి వాడిని భర్తగా పొందటం నీ దురదృష్టం. ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. పిల్లల చదువులు అద్దంతరంగా ఆగిపోయాయి. ఎలాగైనా వాళ్ళ చదువు పూర్తి చేస్తే ఉద్యోగాలు వెతుక్కుంటారు. మనకి కూడా అండదండలుగా నిలబడతారు అన్నాడు భర్త శివరాం.
“ఫస్ట్ తారీకు వచ్చేటప్పటికి ఇంటి అద్దె కట్టాలి. సరుకులు, పాలు వగైరా ఎంత లేదన్నా నెలకి అంతంత మాత్రమే వాడితేనే పాతికవేలన్నా కావాలి. నేను కూడా ఏదైనా పని వెతుక్కుంటాను అన్నది నాగమణి.
“ఎక్కడో బట్టల కొట్లో ఉద్యోగం ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు నేను వెళ్లి వస్తానంటూ బయలుదేరాడు శివరాం.
“బట్టల షాప్ కి వెళ్లి ఆశగా అడిగాడు. నిన్ననే ఉద్యోగాలన్నీ పూర్తయినాయి. ఖాళీ లేవన్నారు.
“ఉసురుమంటూ తిరిగి వస్తుంటే పరధ్యానంగా ఉన్న శివరాం ని ఎదురుగా వస్తున్న ఆటో గుద్దేసింది.
“హాస్పిటల్ కి తీసుకు వెళ్లే లోగానే శివరాం ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి.
“ఇంటికి ఉన్న ఒక్క ఆధారం కూడా తెగిపోయింది నాగమణి ఒంటరి అయింది. ఇటు పుట్టింటి వాళ్ళు కుటుంబం కూడా అంతంత మాత్రమే. ఏదో ఒక పని చూసుకుని పిల్లల్ని పోషించాలి అనుకుంది.
“సుబ్బలక్ష్మి పెళ్లిళ్లకు పేరంటాలకు అందరి ఇంటికి వెళ్లి వంటలు చేస్తుంది. నాగమణి కూడా వస్తుందేమో అని అడిగింది.
“పెళ్లి వంటలకు వెళితే కూరలు తరిగితే 500 ఇస్తారు వస్తావా అన్నది.
“నెలంతాపదివేల కోసం కష్ట పడటం దేనికి. అలాగే వస్తానంది.
“ఎక్కడ పని ఉంటే అక్కడికి ఇద్దరూ కలిసి వెళ్ళేవారు.
“కూరలు తరిగేది మిక్సీలు పట్టేది.
“పెళ్లిళ్ల సీజన్లో రోజు పని తగిలేది. గాడి పొయ్యిల దగ్గర పెద్ద పెద్ద వంటలు చేయడం నేర్చుకుంది. వేడి సెగ తగిలి ఒళ్లంతా నీరసం ఆవహించినా లెక్క చేసేది కాదు. ఒక్కోసారి నూనె బాండీలో పిండి వంటలు చేస్తుంటే నూనె మీద పడి ఒళ్ళు కాలింది.
“వారం రోజులు విశ్రాంతి తీసుకుంది.
“ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించడమే ఆమె ధ్యేయంగా పెట్టుకుంది. పెళ్లిళ్లు పేరంటాలు చివరికి అసుభాలకు కూడా వెళ్ళి వంట చేసేది.
“పదేళ్లు గిర్రున తిరిగాయి..”అమ్మా! కాలేజీలో చేరుతాను. అన్నాడు కొడుకు.
“మీకోసమే కష్టపడుతున్నాను. మీరు బాగా చదువుకుంటే అంతకంటే కావలసింది ఏముంది.
“పిల్ల లిద్దరిని చదివించింది.
“నీ కష్టాలు తీరిపోయాయి. పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటే నీకు వంట చేసే పని తప్పుతుంది లే అన్నారంతా.
“ఇటు వంటలు చేయటం, పచ్చళ్ళు, ఊరగాయలు అప్పడాలు వడియాలు తయారు చేయటం వాటిని కోట్లకు వేయటం వలన ఆదాయం బాగానే ఉంది.
“కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది.
“కట్న కానుకలు ఇవ్వలేము. నాపెళ్ళి ఎలా చేస్తావు. నాకు తగిన వాడిని నేనే చూసుకొని చేసుకొచ్చానంటూ కూతురు పెళ్లి చేసుకొని వచ్చింది.
“నేను చచ్చాను అనుకున్నావా! వంటలు చేసుకుని బ్రతికే దాన్ని పెళ్లెం చేస్తావు లే అనుకున్నావా. మీకోసమేగా కష్టపడుతున్నాను. మంచి చెడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకున్నావు నీ కర్మ అంటూ వదిలేసింది.
“నాగమణి ఎంత కష్ట పడినా పిల్లల దృష్టిలో చులకనగానే చూడబడింది.
“కాలేజీ సెలక్షన్ లో నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు కొడుకు హేమంత్.
“చాలా సంతోషం. మీ నాన్న లేకపోయినా మీరు మీ కృషితో పైకి వచ్చారు. ఇప్పటికీ కాస్త బరువు తగ్గింది. నా దిగులంతా మీకోసమే.!
“అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది కదా. నువ్వు ఇప్పటికైనా విస్రాంతి తీసుకో. ఉద్యోగంలో చేరాక మంచి ఇల్లు చూసుకుని నిన్ను తీసుకువెళ్తాను.
“ఇప్పటినుంచి ఎందుకులే. నా ఒంట్లో ఇంకా శక్తి ఉన్నది. కొన్నాళ్ల కష్టపడితే లేవలేని పరిస్థితిలో హాయిగా కూర్చొని తినవచ్చు.
“ఎందుకమ్మా! నామాట విను. వంటలు చేయటం మానుకో.
“దాని వల్ల కలిగే అవమానం లేదు. ఎంత మంది కష్ట పడటం లేదు. ఇప్పటినుంచి మీ మీద ఆధారపడకూడదు. నాకంటూ ఓ సంపాదన ఉండాలి.
“హేమంత్ ఉద్యోగంలో చేరాడు.
నాగమణి ప్రతినిత్యం వంటలకు వెళుతూనే ఉంది. రాను రాను ఓపిక నశించి పోతున్నది.
బీపీ షుగరు ప్రారంభమైనాయి.
“కొడుకు చెప్పినట్లుగా కష్టపడటం దేనికి. ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు అన్నది సుబ్బలక్ష్మి.
“పిల్లలు ఇప్పుడు అలానే అంటారు. రేపు పెళ్లి చేసుకుని భార్య వచ్చాక పిల్లలు పుట్టాక మనం భారంగా అనిపిస్తాం.
“ఆ మాట కూడా నిజమే నాగమణి. పోనీ ఎక్కడైనా నెలవారి వంట పని కుదరచ్చమంటావా!
“ఆదివారం పేపర్ ప్రకటన చూసింది. వంట మనిషి కావలెను. నెలకి మంచి జీతం ఉంటుంది. భోజన సదుపాయాలు కల్పించబడును. ప్రకటన కింద సెల్ నెంబర్ ఇచ్చారు.
నాగమణి ఫోన్ చేసి వెళ్ళింది.
భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు. ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్లు ఉన్నారు. ఆ నలుగురికి రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం వంట చేయాలని చెప్పారు.
“నాగమణి సరేనన్నది.
“ఇంట్లో పిల్లలు ఇద్దరు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.
“ఉదయమే వెళ్లి వాళ్లకి టిఫిన్ చేసి పెట్టి వంట చేసి పెట్టి వచ్చేది. నాగమణి ఆ ఇంట్లో ఒక మనిషిలాగ కలిసిపోయింది
“భార్యా భర్తలిద్దరూ హాస్పటల్ కి వెళితే పెద్ద వాళ్ళకి తోడుగా ఉండ మన్నారు.
“వంటరిగా ఉండి బాధ పడేకన్నా అక్కడే ఉండ టానికి నిశ్చయించుకుంది.
“కొడుకు వస్తున్నట్లు ఫోన్ చేశాడు.
“నాగమణి నాలుగు రోజులుగా జ్వరంతో పడుకొని ఉంది.
అక్కని చూడ డానికి చక్రధర్ వచ్చాడు.
“మసిబారిపోయిన శరీరం లోతుకుపోయిన కళ్ళు నేరిసి పోయిన తల అక్క అవతారం చూసి బాధ పడ్డాడు.
“అక్క ఎందుకు వచ్చిన ఈ శ్రమ. హాయిగా కొడుకు దగ్గరికి వెళ్లి ఉండలేకపోయావా! మందులు ఏమైనా వేసుకున్నావా!
నేను తెస్తానంటూ బజారుకు వెళ్లి పాలు టాబ్లెట్స్ తీసుకుని వచ్చాడు.
కడుపున పుట్టిన పిల్లలు రాకపోయినా తమ్ముడు నువ్వే ఆదుకుంటున్నావు అంటూ ఓపిక తెచ్చుకొని టాబ్లెట్ వేసుకుని పాలు తాగింది.
“తలుపులు నెట్టుకుని వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు అక్క తమ్ముడు. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఆకళ్లు కొడుకుని చూడగానే సంతోషంతో లేచి కూర్చుంది.
“కొడుకు పక్కనే మరో అమ్మాయి ఉండడంతో నాగమణి అనుమానంగా చూసింది.
“అమ్మా! మమ్మల్ని దీవించమంటూ వంగి పాదాలకు నమస్కారం చేశారు. నీ కోడలు సుమ. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్నాడు హేమంత్.
“అదేమిటి రా! మీ అమ్మతో ఒక మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవా! ఒకగా నాకు కొడుకువి నువ్వు తప్ప ఇంకెవరున్నారు. నీ చెల్లెలు కూడా నీకంటే ముందే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అవునులే మీ నాన్న బతికి ఉంటే ఇలా చేసేవారేనా అన్నాడు నిష్టూరంగా చక్రధర్.
“అదేం లేదు మామయ్యా. మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. అమ్మకి చెప్పాలని అనుకున్నాను….
“అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు పాపం వాళ్ళు ఏమన్నా తిన్నారో లేదో వంట చేసి పెడతానంటూ లేచింది నాగమణి.
“మేము వచ్చేటపుడు తినే వచ్చాము. నువ్వు విశ్రాంతి తీసుకో మంటు భార్యని తీసుకొని గదిలోకి వెళ్ళాడు.
“మనతో పాటు అమ్మని కూడా తీసుకొని వెళదాం అన్నాడు హేమంత్.
“మీఅమ్మనా! ఆవంట మనిషిని మన వెంట తీసుకొని వెళ్ళితే మన పరువేం కావాలి. మన స్టేటస్ ఏమిటి మీ అమ్మ స్టేటస్ ఏమిటి? మా నాన్న ఒక లాయరు. మా అమ్మ కాలేజీలో లెక్చరర్. మనిద్దరం మంచి జాబులు చేస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీ అమ్మ ఎక్కడో ఆశ్రమలో ఉందని మైండ్ సరిగా పనిచేయడం లేదని చెప్పావు. ఇక్కడికి వచ్చాక నిజం తెలిసింది. ఒక వంట మనిషిని నా అత్తగారిగా చెప్పుకోవడం ఇష్టం లేదు. మనతోపాటు మీ అమ్మని తీసుకు రావాలంటే కుదరదు. ఆశ్రమంలో చేర్పించు. అంతేకానీ మనం వెంట మాత్రం తీసుకురావడానికి వీల్లేదు అని కరాకండిగా చెప్పేసింది సుమ.
“అమ్మకి మనం తప్ప ఎవరున్నారు..
“మీ అమ్మని మాత్రం ఆశ్రమంలో చేర్పించు లేకపోతే ఇక్కడే వదిలేసి నాతో పాటు రా. నీ ఇష్టం అన్నది.
అప్రయత్నంగానే ఆ మాటలు నాగమణి చెవుల పడినాయి.
తెల్లవారి నాక నాగమణి కాఫీ చేసి తీసుకెళ్ళింది.
“కోడలు ముభావంగా ఉన్నది.
“మధ్యాహ్నం భోజనాలు చేశారు. అంత నీరసంలోనూ నాగమణి వంట చేసింది. కోడలు గదిలో నుంచి బయటికి రాలేదు.
“మామయ్యా అమ్మని బాగా చూసుకో మేము బయలుదేరుతాము అమ్మని కాస్త కనిపెట్టుకొని ఉండు అన్నాడు హేమంత్.
“అదేమిటి! అమ్మని మీతో తీసుకొని వెళ్ళటం లేదా!
“లేదు! మామయ్యా. మేము అమెరికా వెళ్లాల్సి వస్తుంది.
“అక్కడికి తీసుకు వెళ్ళండి. మీరెక్కడ ఉంటే అమ్మ కూడా అక్కడ ఉంటుంది.
“అమ్మ వచ్చినా అక్కడ ఉండ లేదు. ఇక్కడ అలవాటు గదా. ఇక్కడే ఉండ నీ.
“మీతో రావడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను వస్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా చెప్పమంది నాగమణి.
“కొడుకు కోడలు ఇద్దరూ మాట్లాడలేదు.
“అవునులే! ఎందుకంటే నేను వంట మనిషిని కదా! నీ అత్తింటి తరపు వాళ్లంతా పెద్ద హోదాలో ఉన్నారు. నా అత్తగారు వంట మనిషి అని చెప్పుకోవడానికి నీ భార్యకి నామోషి. ఏమమ్మా కోడలా! అంతేనా?
“మీ అమ్మ కూడా వంట మనిషే. ప్రతి ఇంట్లో ప్రతి తల్లి వంట చేసి బిడ్డల కడుపు నింపుతుంది. అన్నపూర్ణ లాగా రకరకాల రుచులతో వండి పెడుతుంది. పెళ్లి, పేరంటం అశుభకార్యాలకు కూడా వంట మనుషులు లేకపోతే జరుగు తుందా. ఇన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి వంటవాలు లేకుండా ఎక్కడైనా భోజనం చేశారా. వంట చేస్తేనే కదా మనకి భోజనాలు ఉండేది. వంట మనిషి అంటే అంత చులకనగా ఉందా నీకు!
“నేను వంటలు చేసి సంపాదించిన దాంతోనే నీ భర్తని చదివించాను. వాడి కడుపు నింపడం కోసం వంట మనిషిగా మారాను. ఉదయం నుంచీ రాత్రి వరకూ కష్ట పడ్డాను. నేను వంట మనిషిని అన్నంత మాత్రాన నా గౌరవం త గ్గ లేదు.
ఈ వంట మనిషి కడుపునేగా పుట్టాడు నీ భర్త. అన్నది ఆవేశంగా నాగమణి.
చూశారా! మీ అమ్మకి ఎంత పొగరో! మీ అమ్మ ఏమన్నా కలెక్టరా, డాక్టరా! ఆఫ్ట్రాల్ ఒక వంట మనిషి. ఈమెతో మనకు మాటలు ఏంటి! పదండి వెళదామంటూ భర్తని తీసుకొని కారెక్కింది.
“అమ్మ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకున్నాడు హేమంత్.
“బెంగళూరులో నాలుగేళ్ల తర్వాత అమెరికా వెళ్లారు హేమంత్ భార్య సుమ. అక్కడ డాక్టర్ రమణ గారితో పరిచయం అయింది హేమంత్ కి.
“రేపు మా కోడలు కి శ్రీమంతం మీ భార్యాభర్తలిద్దరూ డిన్నర్ కి రావాలన్నారు.
“హేమంతు సుమ వెళ్లేసరికి చాలామంది వచ్చారు. టేబుల్స్ మీద రకరకాల ఐటమ్స్ ఒకదాన్ని మించి ఒకటి నోరూరిస్తున్నాయి.
“అందరికీ భోజనాలు వడ్డించారు. సేమియా పాయసం, బొబ్బట్లు, పులిహోర అన్ని తెలుగింటి వంటలు. ఇంత కమ్మని భోజనం చేసి ఎంతకాలమైందో! అచ్చు మా అమ్మ కూడా ఇలాగే చేసేదండి అంటూ బొబ్బట్లు తుంచి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి అనుకోండి. ఎవరో గాని మీ వెంట ఆవిడ చాలా బాగా చేశారు. ఆమెని అభినందించాల్సిందే అన్నాడు హేమంతు. బొబ్బట్లు వేయ బోతున్న నాగమణిని చూసి అవాక్కయ్యారు భార్యాభర్తలు.
“ఆకుపచ్చ జరీ చీరలో, మెడలో రెండు పేటల చంద్రహారం, చేతులకు బంగారు గాజులు వేసుకున్న తల్లినిచూడ గానే నోట్లో పెట్టు కొన్న బొబ్బట్లు ముక్క జారి ప్లేట్లో పడింది.
“ఈమె మా వంట ఆవిడ. వంట చాలా బాగా చేస్తుంది. ఆమె తెనాలిలో ఉన్నప్పుడు మా ఇంట్లోనే వంట చేసి పెట్టేది. ఇలాంటి మనిషి దొరకటం మా అదృష్టం. మేము మా ఇంట్లో ఒక మనిషిగా చూసుకుంటాం. మాతో పాటు ఈమెను కూడా తీసుకువచ్చాము. ఆవిడ పేరుకి వంటమనిషి అయినా మాకు తల్లి లాంటిది. పెద్ద దిక్కు. ఆమెకే లోటు లేకుండా చూసుకుంటాం. ఆమె పేరు నా కొంత డబ్బు డిపాజిట్ చేశాను అన్నారు డాక్టర్ గారు.
“అత్త గారిని ఇంత గౌరవంగా చూస్తున్నారు అంటే ఆమె విలువేమిటో తెలిసింది.
“అక్కడ తల్లిని చూసిన హేమంత్ సుమలకు నోట మాట రాలేదు. అమెరికాలో కూడా వంటావిడకు ఇంత విలువ ఉందా!
“మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి విలువలు ఉంటాయి. చేసే పనిని బట్టి కాదు. అందుకే ఆవిడ బ్రతికినంత కాలం మా దగ్గరే ఉంటుంది అన్నారు రమణ గారు.
“ఆ మాటలకు హేమంత్ కు చెంప దెబ్బ పెట్టినట్టుగా ఉంది.
“కథ పేరు. అమెరికా కుక్.
రచన. తాటి కోల పద్మావతి