ఆ ఎనభై ఏళ్ళ బాధాతప్త వృద్ధ హృదయం తట్టుకోలేక తల్లడిల్లిపోతూంది. గుండె బ్రద్దలై పొంగిపొర్లుతున్న దుఖ్ఖం ఏ క్షణంలోనయినా జీవం లేని ఆ గాజుకళ్ళల్లోంచి కట్టలు తెంచుకుని ఉబికి జలపాతంలా అతని ఎండి బీటలు వారిన చెక్కిళ్ళ పై జాలువారడానికి సిధ్ధంగా ఉంది. కానీ తన చేయిని గట్టిగా ఒక ఆలంబనగా పట్టుకుని నిల్చిన ఆ చిన్నారి సుతిమెత్తని చేతి స్పర్ష తన బాధ్యతను బరువుగా గుర్తుచేయగా, లావాలాంటి ఆ బడబాగ్ని జలపాతాన్ని తన కళ్ళల్లోంచి బయటికి రాకుండా విశ్వప్రయత్నం చేయాల్సొచ్చింది. విశ్వనాధం గారు…
“తాతయ్యా అయిపోయిందని పంతులుగారు చెప్పారు,” తనను కుదుపుతూ చెప్తున్న పదమూడేళ్ళ మనమడు అన్వేష్ మాట వినపడగానే, కన్నీటిని కళ్ళల్లోనె సమాధి చేస్తూ, “వెళ్దాం పద,” అంటూ ఆ గోదావరి నది ఒడ్డునుంచి భారమయిన మనసుతో బరువైన అడుగులు వేస్తూ, అక్కడే ఎదురుచూస్తున్న ఆటోలో అద్దె ఇంటికి మనవడితో పాటు బయల్దేరారు విశ్వనాధం గారు.
‘ఏళ్ళకు ఏళ్ళు, వాటితో పాటు మనుషులూ కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నారు.” బాధగా మూలిగింది ఆయన హృదయం. కళ్ళుమూసుకుని కూర్చున్న ఆయన మనసులో ఆలోచనలు సుళ్ళుతిరుగుతూ గతం, బొమ్మ సరిగా కనిపించని , ఒక పాత సినిమా రీలులా కళ్ళముందు మెదిలింది.
తన పద్దెనిమిదేళ్ళ వయసులోనే, చదువుతున్న ఎఫే ఇంకా పూర్తికాకుండానే బడిపంతులు కొలువు వెతుక్కుంటూ వచ్చింది. ఎగిరిగంతేసి ఆ జాబ్ లో జాయిన్ కావడం, మేనమామ కూతురు జానకితో పెళ్ళి కావడం వెంటవెంట జరిగిపోయాయి.
ఆతర్వాత వరుసగా నలుగురాడపిల్లలు, చిట్టచివరికి ఎదురుచూడగా చూడగా వంశోద్ధారకుడు మోహన్ పుట్టాడని ఎంతో సంబరపడ్డారు.
చిన్న ఉద్యోగం అయినా మొదట్లో ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకునేవారు. కానీ రానురాను పిల్లలు పెరిగినా కొద్దీ ఖర్చులు పెరగిగాయి. తన భార్య జానకి మాత్రం ముందూ వెనకా చూడకుండా ఇదివరకులాగే ఖర్చులు పెట్టడంతో నెలాఖరులో అప్పులు చేయాల్సి వచ్చేది. నలుగురు ఆడపిల్లలకు కట్నాలిచ్చి పెళ్ళిల్లు చేసేసరికి ఉన్న కొద్దిపాటి ఆస్తి, ఇల్లూ హారతి కర్పూరంలా హరించుకుపోయాయి. చివరికి తామిద్దరూ కొడుకు సంపాదనపై ఆధారపడక తప్పలేదు.
దూరపు బంధువుల అమ్మాయి నీరజ. చామనచాయ అయినా, పెద్ద పెద్ద కళ్ళతో ఆకర్షణీయంగా ఉంటుంది. నెమ్మదయిన అమ్మాయి. ఎక్కువ చదువుకోకపోయినా ఫర్వాలేదు అని మోహన్ కి నచ్చచెప్పి మూడుముళ్ళూ వేయించారు. తన నమ్మకం వమ్ముకాలేదు. నిజంగానే నీరజ చాలా మంచి అమ్మాయి. తమను కూడా ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డాలాగా చూసుకుంటుంది.
మోహన్ కు వచ్చే జీతం తక్కువయినా పొదుపుగా గుట్టుగా సంసారం వెళ్ళదీసుకుంటూ, తన పదమూడేళ్ళ పాప మనోఙ్ఞ ను, పదకొండేళ్ళ బాబు అన్వేష్ ను తీర్చిదిద్దుతూంది. అందుకే కోడలు నీరజ అంటే అంతులేని అభిమానం తనకి. ఉబికి వచ్చే కన్నీటిని ఉత్తరీయంతో అద్దుకున్నారు విశ్వనాధం గారు.
సరిగ్గా సంవత్సరం క్రితం ఉన్నట్టుండి జానకి కుప్పకూలిపోయింది. లేపడానికి ప్రయత్నిస్తే అప్పటికే అపస్మారకస్తితిలోకి జారిపోయిందామె. కళ్ళు వాలిపోయి, గుండె ఆగిపోయి తన చేతుల్లో అచేతనంగా ఒరిగిపోయిన అర్ధాంగిని చూసి గుండె చెరువయిపోయింది తనకి. జీవితాంతం తనకు తోడుగా, అడుగులో అడుగేసి నడిచిన ఆమె ఆఖరి ప్రయాణానికి తనూ తోడుగా వెళ్ళాలనుకున్నాడు కానీ కొడుకు, కోడలు, మనుమరాలు, మనుమడు కాళ్ళను కదపకుండా వేసిన ప్రేమ బంధాలకు కట్టుబడి పోయాడు. తన పిల్లలతో పాటు తననూ మరో కొడుకు లాగా చూసుకునే తల్లిప్రేమను పంచే కోడలు ప్రేమ లో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు విశ్వనాధంగారు.
ఇంతలో ప్రపంచమంతా గడగడలాడిస్తూ , ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రళయ తాండవం చేస్తూ, వికృత కోరలు చాస్తూ, కంటికి కనిపించని భూతం ఇండియాలో ఇనుప పాదం మోపింది. దిక్కుతోచని ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీనితో గుళ్ళు, బళ్ళు, మసీదులు, ఆఫీసులు ఒక్కటేమిటి అన్నీ మూతపడ్డాయి. మూలిగే నక్కపై తాటికాయ అన్నట్టు మోహన్ ఉద్యోగం కాస్తా ఊడింది. చేసేది లేక ఆన్లైన్ ఆర్డర్లు ఇంటింటికి తిరిగి ఇచ్చే జాబ్ తక్కువ జీతానికి తీసుకున్నాడు. రాత్రీ పగలూ కష్టపడి పనిచేసే కొడుకును చూసి బాధగా ఉన్నా, కించిత్తు గర్వంగా కూడా ఉండేది విశ్వనాధం గారికి.
ఇప్పటికి సరిగ్గా పధ్ధెనిమిది రోజులక్రితం, రాత్రి పదకొండు గంటలప్పుడు, “మామయ్య గారూ, మీ అబ్బాయికి విపరీతమయిన జ్వరంగా ఉందండీ. నాకు చాలా భయంగా ఉంది. ఏంచేయాలో తోచడం లేదు,” అంటూ కన్నీరు పెట్టుకున్న నీరజ మాటలకు ఒక్కసారే విపరీతమయిన ఆందోళనకు గురయింది ఆయన మనసు.
“ఏంఫర్వాలేదమ్మా. మామూలు జ్వరానికే ఇంత భయపడితే ఎలా?” తనను తాను సంబాళించుకుంటూ కోడలికి ధైర్యం చెప్పారు విశ్వనాధం గారు, “ఈరాత్రికి రెండు పారసీటమాల్ టాబ్లెట్లు వేస్తే సరి, పొద్దుటివరకు అదే తగ్గిపోతుంది.”
మూడు రోజులయినా జ్వరం తగ్గకపోవడం కాదుకదా ఇంకా టెంపరేచర్ పెరిగి, విపరీతమయిన దగ్గు, ఊపిరాడని ఆయాసం ముప్పిరిగొని అతని పరిస్తితి చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. దగ్గర్లో ఉన్న డాక్టర్ కరోనా టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని తెలింది. నీరజ కళ్ళల్లో కనిపించిన అధికమయిన భయాందోళనలు గుర్తించి, మనసులోని తన అధైర్యాన్ని, అసహాయతను దీపారాధన చేసే నెపంతో కప్పి పుచ్చుకున్నారు విశ్వనాధం గారు.
సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో, “మామయ్యగారూ,” అంటూ ఆర్ధ్రంగా వినిపించింది నీరజ పిలుపు.
కళ్ళు తెరిచి, “ఏమ్మా నీరజా…?” ఆప్యాయంగా అంటూ ఆమెవేపు చూసారు విశ్వనాధం గారు.
“నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆయన జ్వరతీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు.” ఆందోళన పడింది నీరజ.
“నేను కూడా వాడికి త్వరగా స్వస్తత చేకూరాలని ఆ దేవదేవుడితో మొరపెట్టుకుంటున్నానమ్మా,” గాద్గదికంగా అన్నారు ఆయన.
“ఏదయినా హాస్పిటల్లో చేర్పించుదాం మామయ్యగారూ.”
“అవునమ్మా నేనూ అదే ఆలోచిస్తున్నాను,” అంటూ ఆలోచనలో పడ్డారు విశ్వనాధం గారు. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు లక్షలు ఫీజులు కట్టి చేర్పించలేని పరిస్తితి. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఎవరూ పట్టించుకోరు కానీ తప్పదు. “పరమేశ్వరా అంతా నీదే భారం,” అంటూ లేచారాయన.
“అమ్మా నీరజా, మన పిల్లలను స్కూలుకి తీసుకెళ్ళే ఆటో వెంకటేష్ కు ఫోన్ చేసి విషయం వివరించమ్మా. మోహన్ ని హాస్పిటల్లో చేర్పించాలి దయతలచి రమ్మని చెప్పమ్మా.”
ఆటో వెంకటేష్ దయా, సహకారాలతో మోహన్ ని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాలని తీసుకెళ్ళారు విశ్వనాధం గారు.
ఎవరూ పట్టించుకోకుండా, గంట సేపటినుంచీ కారిడార్లో స్ట్రెచర్ పైన స్పృహ లేకుండా పడి ఉన్న కొడుకుని చూసి గుండె తరుక్కుపోయి, కాలయాపన చేస్తే ఏం ముంచుకొస్తుందో అని బెంబేలు పడే మనసుని ఎలాగో అదుపులో పెట్టుకుని, డబ్బు లేని తనను చూసీ చూడనట్టుగా, అటూ ఇటూ హడావుడిగా తిరుగే వార్డ్ బాయిస్ ను, డాక్టర్ను పిలవమని కాళ్ళావేళ్ళా పడగా, “ఆగు ఆగు. కరోనా కేస్ ఇది. టైం పడుతది,” అంటూ విసుక్కుంటూ, చివరికి ఎలాగో పిలిచారు డాక్టర్ని.
విధిలేక డ్యూటీ చేస్తున్న డాక్టర్ ముభావంగా, తనతో ఒక్కమాటయినా మాట్లాడకుండా, అడ్మిషన్ నోట్స్ ఎవో రాసుకుంటుంటే వెళ్ళి అతని కాళ్ళమీద పడి తన ఒక్కగానొక్క కొడుకుని ఎలాగయినా కాపాడమని ప్రార్థించాడు. వార్డ్ బాయిస్ నెట్టుకుంటూ తీసికెళ్ళే స్త్రెచర్ వెనక మూసుకున్న తలుపుల ముందు కుప్పకూలిపోయిన విశ్వనాధం గారిని ఓదార్చి ఇంటికి చేర్చాడు ఆటో వెంకటేష్.
వెంటిలేటర్ అనబడే ముళ్ళకంచె లాంటి అంపశయ్యపై మూడు రోజులు మృత్యువుతో పోరాడి పోరాడి అలసిసొలిసిన మోహన్ ప్రాణం కరోనా కర్కశత్వానికి బలైపోయింది.
ఫోన్ ద్వారా ఆ దుర్వార్త విన్న విశ్వనాధం గారికి ఒక్క క్షణం గుండె లయ తప్పింది. అసలు అది ఆ క్షణంలోనే ఎందుకాగిపోలేదో అర్థం కాలెదు. ఆయన నవనాడులు క్రుంగిపోయాయి , హృదయంలో శూలాలు దిగబడ్డాయి, మిన్ను విరిగి మీద పడింది. ఇక భరించలేనన్నట్టు చెతిలో ఉన్న చిన్న డబ్బా ఫోన్ కూడా జారి క్రిందపడి ముక్కలైపోయింది.
విశ్వనాధం గారిని అలా చూడగానే పరిస్తితి అర్థమయిన నీరజ “మోహన్…” అంటూ ఒక్క గావుకేక పెట్టి విరుచుకు పడిపోయింది. స్ప్రుహ తప్పిన తల్లిని చూసి భయపడిన పిల్లలు హృదయవిదారకంగా రోదిస్తుంటే,వాళ్ళను ఎలా ఓదార్చాలో, ఏంచెప్పాలో తెలియక విశ్వనాధం గారి గుండె తరుక్కుపోయింది. తనే ఎలాగో తన బాధను దిగమింగి ఓపిక తెచ్చుకుని నీరజ ముఖంపై నీళ్ళు చల్లారు.
మెల్లిగా కళ్ళు విప్పి, కట్టలు తెంచుకు వస్తున్న దుఖ్ఖానికి ఆనకట్టవేయలేక కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, భయంకరమయిన ప్రళయంలో చిక్కుకున్న చిగురుటాకులా వణికిపోతూన్న కోడలిని ఎలా ఓదార్చాలో తెలియక, కన్నతండ్రిలా గుండెలకు హత్తుకోవడం తప్ప మరింకేమీ చేయలేకపోయారాయన.
“ధైర్యంగా ఉండాలి తల్లీ. నువ్వె ఇలా అయిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు?” ఎలాగో గొంతు పెకిలించుకున్నారాయన.
“ఎలా ఉండమంటారు మామయ్యా? ఏం చూసుకుని బ్రతకమంటారు? నా బ్రతుకిలా బండలు చేశాడు దేవుడు. తనను బ్రతికించి నన్ను తీసుకుపో దేవుడా!” తల గోడకేసి కొట్టుకుంటూ హృదయవిదారకంగా విలపిస్తున్న నీరజ ను ఆపలేకపోయారు ఆయన.
“ఆయన లేని జీవితం నేను భరించలేను…” ఆమె నుదురు చిట్లి రక్తం రాసాగింది.
మెల్లిగా ఓపిక చేసుకుని వెళ్ళి ఆమె నుదుటి గాయం తన ఉత్తరీయంతో తుడుస్తూ, “నీ కష్టం ఓర్చుకోలేనిదీ, ఎవరూ తీర్చలేనిదీ అమ్మా కానీ నీ పిల్లలకోసం నీ దుఖ్ఖం దిగమింగుకోక తప్పదమ్మా.”
“నావల్ల కాదు మామయ్యా. ఇక వాళ్ళకు తల్లీ తండ్రీ అన్నీ మీరే,” తడబడుతూ లేచి బాల్కనీ గోడనెక్కబోయిన ఆమె కాళ్ళను చుట్టుకున్నారు పిల్లలిద్దరూ.
భయకంపితుడయిన విశ్వనాధం గారు, ఇక తన వశంకానట్టు ఎలుగెత్తి, “అమ్మా నీరజా…మోహన్… అంటూ అశ్రు నయనా లతో నాకింత ఆయుశ్శు ఎందుకిచ్చావు ఈశ్వరా! నేనేం పాపం చేసానని ఈ వృద్దాప్యం లో నాకీ క్షోభ పెట్టావు దేవుడా!” రెండు చేతులూ ఆకాశం వేపు సాచిన ఆయన కంఠం శక్తి లేక పూడుకుపోయి వెక్కిళ్ళు పడసాగింది.
తల్లినీ, తాతయ్యనూ అలా చూసేసరికి పిల్లలిద్దరూ ప్రళయంలో చిక్కుకున్న, పూల రెక్కల్లా .. అల్లల్లాడిపోయి భయంతో గావుకేకలు పెడుతూ ఏడవసాగారు.
ఆముగ్గురు నిస్సహాయులూ తనపైనే ఆధారపడ్డారని ఒక్కసారిగా అర్థమయిందెమో, అవాక్కయి తేరిపారచూసింది నీరజ.
కన్నీళ్ళకు కూడా ఖరీదు కట్టే కనికరం లేని హాస్పిటల్ సిబ్బందికి లంచమిచ్చి కడసారి చూపును కూడా కొనలేని దీన స్థితి తమది.
తన హృదయంలో దేవుడిలా నిల్పుకుని ఆరాధించిన భర్త అంతిమ దర్శనం కూడా చేసుకోలేక, చావలేక, బ్రతకలేక బాధాబడబాగ్నిలో ఆహుతైపోతున్న నీరజ నికృష్ట పరిస్థితి.
తండ్రి కరువై కనీసం చివరి చూపులకు కూడా నోచుకోని హృదయవిదారకమయిన పసి పిల్లల దుస్తితి.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన రక్తంలో రక్తం, అందరూ ఉండి కూడా చివరికి మునిసిపాలిటీవాళ్ళు తీసి అవతల పారేసిన అనాధ శవం అయ్యాడా మోహన్? ఇది చూడడానికేనా తనిన్నాళ్ళూ బ్రతికి ఉంది! కన్నకొడుకుని కడసారి కళ్ళారా చూసుకోలేని ధవుర్భాగ్యపు పరిస్తితి. తన తలకొరివి పెట్టాల్సిన కొడుకుకి తనే పిండప్రదానం చేయించి వస్తున్నాడు. హృదయం వేయి ముక్కలైపోయి, బడబాగ్ని జ్వాలలు గుండెను దహించివేస్తుండగా అంతులేని ఆవేదనతో నిర్వికారంగా నిట్టూర్చారు విశ్వనాధం గారు.
ఇక ఆగలేమంటూ రెండు కన్నెటిబొట్లు నిశ్శబ్దంగా రాలిపడ్డాయి తనను పొదిమిపట్టుక్కూర్చున్న అన్వేష్ తలపై.
‘తాతయ్యా…?” తలపైకెత్తి చూశాడు అన్వేష్.
“ఏంలెదు నాన్నా,” గబగబా కళ్ళు తుడుచుకుని మనవడి తల నిమిరారు విశ్వనాధం గారు.
మౌనంగా తనవెపే ఆత్రుతగా, చూస్తున్న వాడి కళ్ళల్లో తడి, అంతులేని భయం. హృదయం ద్రవించి పోయింది ఆయనకు. ఆ చిన్నారి లేతమనసులో ఎంత బాధ ఉందో? ఎన్ని జవాబు దొరకని ప్రశ్నలు రేకెత్తుతున్నాయో జీవితంలో పండిపోయిన తను ఊహించుకోగలడు. మనవడి లేత తమలపాకులాంటి అరచేయిని తన హృదయానికి హత్తుకుంటే అచ్చం మోహన్ స్పర్షలాగే అనిపించింది. మరో చేత్తో వాడి తలను పైకెత్తి ముద్దు పెట్టుకుంటే చిన్నప్పటి మోహనే తన పక్కన కూర్చున్నాడా అనిపించి ఒక్క క్షణం ఆయన పెదవులపై కనీకనిపించని నిర్లిప్తమయిన హాసరేఖ.
ఆటో మెయిన్ రోడ్ దాటి గతుకుల రోడ్డు సందులోకి తిరిగింది.
కోడలు గురించి, పిల్లల గురించి ఆలోచనలు మనసును తొలిచేస్తున్నాయి. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? తన ముసలి శరీరం ఏం పని చేయగలదు? టెంత్ క్లాస్ కూడా చదవని నీరజకు ఏం ఉద్యోగం వస్తుంది? ఇంట్లో చిల్లిగవ్వ లేదు. బ్రతుకుబండి సాగడానికి ఏ ఆధారమూ లేదు. మనోఙ్ఞ, అన్వేష్ లను ఎలా చదివించాలి? తర్వాత మనోఙ్ఞ పెళ్ళి ఎలా చేయాలి? ఈ బాధ్యతలన్నీ అమాయకురాలయిన నీరజ ఎలా నిర్వర్తించగలదు? ఎదలో ఒక పెద్ద బండరాయి పడిన భారం.
అంతులేని అలల ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆటో అద్దె ఇంటిముందు ఆగింది. నిశ్శబ్దనిశీధి ఆవరించింది. గాలి స్థంభించింది. విశ్వనాధంగారి ఊపిరి అనంతవాయువుల్లో…లీనమై పోయింది….