తరం మారింది

కథ

 

-మాధవ పెద్ది ఉష

అన్నపూర్ణ, రాఘవల ఏకైక సంతానం అయిన శశికాంత్‌ వివాహం వైభవోపేతంగానూ, అంగరంగ వైభవంగానూ జరిగింది. అమెరికాలో న్యూజెర్సీలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా పెద్ద కంపెనీలో ఉన్నత పదవిలో వున్న శశికాంత్‌ పెళ్లి చేసుకుని భార్యతో సహా తిరిగి అమెరికా వెళ్లిపోవడానికి నెలా పదిహేనురోజులు సెలవు పెట్టి ఇండియా వచ్చాడు.

అప్పటికే తల్లీదండ్రీ చూసి ఉంచిన అమ్మాయిల్లో నిరుపమ ఎంతో నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, ఆమెకు కూడా శశికాంత్‌ నచ్చడంతో పెద్దలు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయడం, పెళ్లి నిర్విఘ్నంగా జరగడం వెంట వెంటనే జరిగిపోయాయి.

కొత్త కోడలు అందమైనదే కాకుండా అణకువ, మన్నన, పెద్దలయందు గౌరవం కలిగి ఉండడం చూసాక అన్నపూర్ణ ఏనుగెక్కినంత సంబరంగా ఉంది.

పుట్టింటి నుంచి ఘనమైన సారెతో అత్తవారింటికి వచ్చిన నిరుపమను సాదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ. అంతేకాదు, కొడుకు కోడలిని కూర్చోబెట్టి దిష్టి తీసి హారతులిచ్చింది.

కొత్త కోడలిని చూద్దామని హాల్లోకి వచ్చిన అత్తగారు కామాక్షమ్మను కసిరింది అన్నపూర్ణ.

”ఏంటండీ.. మీకసలే దగ్గుగా ఉంది కదా, తగ్గేదాకా ఆ గదిలోంచి బయటకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలండి” అంది విసురుగా.

ఆ మాటలకు డెబ్బై ఐదేళ్ల కామాక్షమ్మ చిన్నముఖం చేసుకుని గదిలోకి వెళ్లిపోయింది.

కోడలి మాటలు ఆమెకు ములుకుల్లా బాధించాయి. కానీ అంతలోనే సర్దుకుని తన బాధను తనలోనే దిగమింగుకుని తన గదిలోకి వెళ్లిపోయింది. ఎందుకంటే తనకు ఏదైనా సుస్తి చేసినప్పుడల్లా తనని ఓ అంటరానిదానిలా చూడడం కోడలికి అలవాటే.

అన్నపూర్ణ అత్తగారన్నా, ఆవిడ అలవాట్లన్నా తగని చిరాకు. ఆవిడ భోజనం చేసినప్పుడు చుట్టూతా మెతుకులు పడడం, మజ్జిగ చేతిని సరిగ్గా కడుక్కోకుండానే అదే చేత్తో కంచం తీసి టేబుల్ని తుడవడం, దాని మీద మరకలు, వాష్‌ బేసిన్లో అన్నం తిన్న చేత్తోనే పంపు తెరవడం… ఇవన్నీ చూస్తుంటే ఆమెకు కంపరంగా ఉంటుంది.

అప్పటికి ఎన్నోసార్లు చెప్పింది ”మీరు అన్నం తిన్న చేత్తో కాక ఎడం చేత్తో పంపు తెరవండి” అని.

కానీ వృద్ధాప్యంవల్ల కామాక్షమ్మకి అన్నపూర్ణ చెప్పింది చెవికెక్కడంలేదు. ”ఖర్మ… ఖర్మ ఈవిడ ఒకత్తి శనిలాగా నాకు తగులుకుంది’ అని అన్నపూర్ణ అనుకోని రోజులేదు. అందుకే తన అక్కసంతా పెద్ద కొడుకుగా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని అత్తగారి బాధ్యత అంతా నెత్తిమీద వేసుకున్న భర్తమీద తీర్చుకుంటూ ఉంటుంది.

అలా భార్య తనమీద దాడి చేసినప్పుడల్లా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అలవాటు చేసుకున్నాడు రాఘవ. ఎందుకంటే తల్లిని వెనకేసుకొచ్చి ఏం మాట్లాడినా భద్రకాళే అవుతుంది అన్నపూర్ణ.

అంతేకాదు, ఆవిడ తన హయాంలో తనని ఎంత రాచి రంపాన పెట్టిందో అవన్నీ ఏకరువుపెడుతుంది.

నాయనమ్మని తల్లి అంతలా చీదరించుకోవడం శశికాంత్కు కూడా ఇష్టం లేదు. అప్పటికీ ఎన్నిసార్లో తల్లికి చెప్పి చూసాడు. కానీ ఫలితం శూన్యం.

—–

కొత్త కోడలు నిరుపమ ఉన్న ఆ పదిరోజులు అత్తవారింట వారి మనస్సుల్లో తన కలుపుగోలుతనంతో, తన మంచి ప్రవర్తనతో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచు కుంది. ఇంత మంచి కోడలు దొరికినందుకు అన్నపూర్ణ ఎంతగానో మురిసిపోయింది.

కొడుకు కోడలు కలసి అమెరికా వెళ్లిపోయే రోజు రానే వచ్చింది. నిరుపమ, శశికాంత్‌ వెళ్లేరోజు పెద్దలందరికీ పాదాభివందనం చేసి వీడ్కోలు తీసుకున్నారు.

నిరుపమ అయితే ”అత్తయ్యగారూ, మామయ్యగారూ! మేము వెళ్లి సెటిల్‌ అయ్యాక మీకు టిక్కెట్లు పంపిస్తాము. మీరు తప్పక రావాలి. మీకు దగ్గరుండి అమెరికా చూపిస్తాము” అన్నది.

”అలాగేనమ్మా, ముందు మీరు వెళ్లి అక్కడ సెటిల్‌ అవ్వండి. మీ కొత్త కాపురం చూడడానికి తప్పక వస్తాము”. అన్నది ఆనందంగా.

దగ్గరనుంచి, తరచూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. చాలావరకూ వాళ్లిద్దరూ తమ తమ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇంటికి చాలావరకూ వస్తువులు అమర్చుకున్నామని చెప్పారు.

అది విన్నప్పటినుంచీ కొడుకు అమెరికాకు రమ్మని ఎప్పుడు పిలుస్తాడా అని తహతహలాడసాగింది అన్నపూర్ణ.

ఆ శుభ సమయం రానే వచ్చింది. ఓ శుభోదయాన శశికాంత్‌ ఫోన్‌ చేసి తల్లిదండ్రులకు చెప్పాడు.

”అమ్మా, నాన్నా… మీరు అమెరికా రావడానికి టిక్కెట్స్‌ పంపిస్తాను. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి” అన్నాడు.

”అలాగేలేరా. నీకు ఎప్పుడు వీలు అవుతుందో చూసుకుని వీసాకి కావాల్సిన పేపర్స్‌ పంపించు. మేము ఎప్పుడైనా రెడీనే” అని చెప్పాడు తండ్రి.

శశికాంత్‌ పంపిన పేపర్స్‌ అందగానే వీసాకి అప్లై చేసాడు రాఘవ. తక్కువ వ్యవధిలోనే వీసా వచ్చింది. ఆ కబురు అందగానే తల్లిదండ్రులకు టిక్కెట్స్‌ పంపించాడు శశికాంత్‌.

కొడుకు అమెరికాకు తీసుకువెళ్తున్నందుకు అన్నపూర్ణకు తెగ సంబరంగా ఉంది.

కొడుకు, కోడలికి ఇష్టమైన ఊరగాయలు, స్వీట్స్‌ ప్యాక్‌ చేసింది. మొదటిసారి అమెరికా చూడబోతున్నందుకు ఆమె ఆనందానికి అవధులులేవు. అమెరికాకి బయలుదేరేందుకు ఒక వారంరోజులు ముందే తల్లిని తన తమ్ముడి దగ్గరకు పంపించాడు రాఘవ.

—–

న్యూజెర్సీలోని ఎయిర్‌ పోర్టుకి తల్లిదండ్రులను రిసీవ్‌ చేసుకోవడానికి భార్యతో సహా వచ్చాడు శశికాంత్‌.

కోడుకు కారు నడుపుతుంటే భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికానీ, అక్కడి విశాలమైన రోడ్లని చూసి ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు రాఘవ దంపతులు.

మన దేశంలోలా ఆటోలూ, స్కూటర్లు లేకపోవడం ఎంతో వింతనిపించింది. జనం కూడా మన దేశంలోకన్నా తక్కువే. హైవేమీద కార్లు ఒక క్రమపద్ధతిన పోతుండడం, ఒక కారుకీ, ఒక కారుకీ మధ్య తగినంత ఎడం ఉండడం గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు.

చూస్తుండగానే ఓ ఇండిపెండెంట్‌ ఇంటి ముందు కారాపి చెప్పాడు శశికాంత్‌.

”ఇదే నాన్నా మనిల్లు. ఇక్కడ ఒక రకమైన స్థోమత వున్న వాళ్ళు ఇండిపెండెంట్‌ ఇళ్లే కొనుక్కుంటారు. మార్కెట్కీ, దానికీ దూరమైనా ఇలాంటి ఇళ్లల్లో ఉండడం ఒక ప్రెస్టేజ్‌ గా భావిస్తారు ఇక్కడివాళ్లు” వివరించాడు శశికాంత్‌.

తరువాత తల్లినీ, తండ్రినీ లోపలకు తీసుకువెళ్లి హాల్లో కూర్చోబెట్టి కారులోని లగేజీ అంతా తీసుకెళ్లి తల్లిదండ్రుల కోసం కేటాయించిన ఎటాచ్డ్‌ బాత్రూం వున్న బెడ్రూంలో పెట్టాడు.

ఆ తరువాత తల్లికీ తండ్రికీ ఇల్లంతా చూపించాడు.

”ఇక్కడ చాలామటుకు ఇళ్లల్లో బెడ్‌ రూములన్నీ మేడ మీద ఉంటాయి. క్రింద హాలు, డైనింగ్‌ రూం, కిచెన్‌, ఫామిలీ రూమ్‌, ఫార్మల్‌ డైనింగ్‌ రూం ఉంటాయి. క్రింద హాఫ్‌ బాత్రూం, పైన ఫుల్‌ బాత్రూంలు ఉంటాయి. అంతే కాదు, క్రింద బేస్మెంట్‌ కూడా ఉంటుంది” అని వివరంగా తండ్రికి చెప్పాడు.

బాత్‌ టబ్లో నిలబడి షవర్‌ బాత్‌ ఎలా చేయాలో కొడుకు చెప్పాక స్నానం చేసారు అన్నపూర్ణ, రాఘవ.

అప్పుడు సమయం ఎనిమిది కావస్తున్నది. కొడుకు కోడలితోపాటు భోజనం ముగించారు అన్నపూర్ణ దంపతులు. భోజనం చేస్తున్నప్పుడు జెట్‌ ల్యాగ్‌ గురించి వివరించి చెప్పాడు శశికాంత్‌.

”ఇప్పుడు ఇండియాలో పగలు కాబట్టి మీకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అందుకని ఆందోళన చెందకండి. రెండు మూడురోజుల్లో అదే సర్దుకుంటుంది” అన్నాడు.

—–

రాఘవ దంపతులు అమెరికా వచ్చి అప్పుడే వారం పదిరోజులు కావస్తోంది. మెల్లమెల్లగా అమెరికా జీవనానికి అలవాటు పడుతున్నారు.

మొదటి వీకెండ్‌ తల్లిదండ్రులను ‘న్యూయార్క్‌ సిటీకి తీసుకెళ్లాడు శశికాంత్‌.

ముఖ్యంగా చూడవలసిన ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌, మేడమ్‌ టుస్సాడ్స్‌, న్యూయార్క్‌ లో ప్రసిద్ధి చెందిన టైం స్క్వేర్‌ వగైరా చూపించారు శశికాంత్‌ దంపతులు.

రోజులు గడుస్తున్నకొద్దీ అన్నపూర్ణ కొత్త వాతావరణానికి అలవాటుపడ్డాక వంటింటి బాధ్యత తను తీసుకుంది.

కోడలు ‘ఎందుకత్తయ్యగారూ మీకు శ్రమ, మీరేం చేయవద్దు, అంతా నేను చూసుకుంటాను గదా” అన్నా కూడా అన్నపూర్ణ వినలేదు.

”ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందమ్మా. ఆ మాత్రం ఎక్సర్‌ సైజ్‌ కూడా లేకపోతే ఎట్లా?” అన్నది.

ఇక చేసేదిలేక నిరుపమకు ఒప్పుకోక తప్పలేదు.

—-

ఆ రోజు కొడుకు కోడలు ఆఫీసులకి వెళ్లాక అన్నపూర్ణ తన రంగు పోయే చీరలు, బ్లవుజ్‌ లు విడిగా ఉతుక్కుని బ్యాక్‌ యార్డ్‌ లోని రెయిలింగ్‌ మీద ఆరేసింది.

కానీ ఆ రోజు ఎండ అంతగా లేనందువల్ల అవి ఆరలేదు. సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చిన నిరుపమ అత్తగారి బట్టలు వెనకాల ఆరేసి ఉండడం చూసి కొద్దిగా చిరాకు పడింది.

అయినా తన చిరాకును దాచి పెట్టుకుంటూ అన్నపూర్ణతో ”చూడండి అత్తయ్యగారూ! ఇక్కడ అమెరికాలో ఇలా బట్టలు ఎవరూ బయట ఆరేసుకోరండి. మీరు ఇకనుంచి లోపలే ఆరేసుకుంటూ ఉండండి” అని చెప్పింది ఎంతో మృదువుగా.

కానీ అన్నపూర్ణ మనసు కొద్దిగా చురుక్కుమంది. అయినా బయటపడకుండా ”అలాగేనమ్మా” అన్నది.

రోజులు గడుస్తున్నకొద్దీ నిరుపమకి అత్తగారి పద్ధతులు నచ్చడంలేదు.

ముఖ్యంగా కిచెన్‌ లో ఆమెకు మిక్సీలు, రైస్‌ కుక్కర్లు అన్నీ కేబినేట్‌ లోపల పెట్టుకోవడం అలవాటు. కానీ అన్నపూర్ణ అవన్నీ ఇండియాలో అలవాటు ప్రకారం కిచెన్‌ ప్లాట్‌ ఫారంమీదే పెట్టసాగింది.

కొన్నాళ్లు చూసాక ఇక ఆపుకోలేక నిరుపమ మర్యాదగానే అత్తగారికి చెప్పింది.

”చూడండి అత్తయ్యగారూ ! ఇక్కడ అందరూ కిచెన్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద ఏమీ ఉంచరు. అన్నీ కప్‌ బోర్డ్స్‌ లో పెట్టుకుంటారు. మీరు గ్రైండర్‌, రైస్‌ కుక్కర్స్‌ లాంటి వాటిని వాడుకోవడం అయిపోయాక మళ్లీ తిరిగి కిచెన్‌ క్యాబినెట్స్‌ లోనే పెట్టేస్తూ ఉండండి ఏం” అని చెప్పింది.

తనకు అలవాటులేని పనవడం మూలాన కొద్దిగా శ్రమ అయినా కోడలు చెప్పినట్టే చేయసాగింది అన్నపూర్ణ.

—-

మనుష్యుల మనస్సుల్లో ఎన్ని విభేదాలు, ఎన్ని చికాకులు ఉన్నా కాలచక్రం ఆగదు కదా.

అప్పుడే అన్నపూర్ణ దంపతులు అమెరికా వచ్చి మూడునెలలు కావస్తున్నది

ఈ వ్యవధిలో శశికాంత్‌ తల్లిదండ్రులకు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, ఇంకా దగ్గరలోని మరి కొన్ని చూడవలసిన ప్రదేశాలను చూపించాడు.

ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి భోజనాలు అయ్యాక శశికాంత్‌ తండ్రి గదిలోకి ”నాన్నగారూ” అంటూ వచ్చాడు.

అప్పుడు అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది.

శశికాంత్‌ ఆవిడను కూడా అక్కడ చూసాక తల్లితోనే విషయం చెప్తే మంచిదనిపించి ఆవిడని ఉద్దేశించి ”ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకమ్మా. నువ్వు ఎన్నిరోజుకోసారి జుట్టుకి డై వేసుకుంటావు” అనడిగాడు.

”నెలకోసారి వేసుకుంటాను. ఏం ఎందుకలా అడిగావు?” అని కొడుకును ప్రశ్నించింది.

”ఏం లేదమ్మా. నువ్వు డై వేసుకోవడంవల్ల బాత్‌ టబ్‌ అంతా పాడవుతోంది. మేము ఎంత క్లీన్‌ చేసినా పోవడంలేదు. నేను సర్దుకుపోతానుగానీ నిరుపమకి బాత్రూం నీట్‌ గా లేకపోతే తోచదు. అందుకని నువ్వు డై వేసుకోవడం తప్పనిసరైతే బాత్‌ టబ్‌ కు డై అంటకుండా చూసుకో” అన్నాడు.

కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ ముందు నిర్ఘాంతపోయింది. ఆ తరువాత కొడుకు చేత అలా చెప్పించుకోవలసి వచ్చినందుకు సిగ్గుతో చితికిపోయింది.

కొడుకు వెళ్లిపోయాక మౌనంగా నిద్రకు ఉపక్రమిస్తున్న అన్నపూర్ణతో అన్నాడు రాఘవ.

”అబ్బాయి మాటలకు బాధపడుతున్నావా పూర్ణా?” అన్నాడు సౌమ్యంగానే.

”అదేంకాదుకానీ పెళ్లయి మన ఇంటికి వచ్చాక కోడలు మనతో గడిపిన ఆ కొద్దిరోజుల్లో కలుపుగోలుతనానికి, ఆమె వినయ విధేయతలకూ, పెద్దలపట్ల ఆమె చూపించిన గౌరవానికీ ఎంతో మురిసిపోయాను. అంతేకాదు, ఈమెతో నా భావి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుందని ఆశపడ్డాను. ఈ మాటలు నేను ఈ రోజు మనబ్బాయి చెప్పిన ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. ఇక్కడికి వచ్చినప్పటినుంచీ జరిగిన కొన్ని విషయాలను ఆధారం చేసుకుని ఆలోచిస్తే మన కోడలికి నా అలవాట్లు, పద్ధతులు అవీ అంతగా నచ్చినట్లు లేవనిపిస్తోంది. కానీ చదువుకున్నదీ, ఉద్యోగం చేస్తున్నది కావడంవల్ల ఆమె నేను మా అత్తగారి దగ్గర బయటపడినట్లుగా నా దగ్గర బయటపడడంలేదు. అది నేను గ్రహించాను. అనాదిగా అతాకోడళ్ల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణకి ఇక అంతమేలేదా? అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్లలాగా కలసి మెలసి సహజీవనం సాగించటం సాధ్యం కాదా? ఇదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. కానీ మీరు నేను గురువింద గింజలాగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నాలోనూ లోపం వుంది కాదనడంలేదు….” అంది.

”అవును నిజమే. పాతకాలంలో అత్తగార్లు కోడళ్లమీద అధికారం చెలాయించేవారు. ఆ తరువాత కోడళ్లు పెత్తనం చేతికొచ్చాక అత్తగార్లకి పెద్దతనంవల్ల వచ్చిన ధోరణి ఎబ్బెట్టుగా కనిపించే వారి అలవాట్లను సాకుగా తీసుకుని వారిని మాటలతో మానసికంగా హింసించేవారు, హింసిస్తున్నారు కూడా. నువ్వూ అదే చేస్తున్నావు మా అమ్మతో. కానీ నీ కోడలి దగ్గరనుంచి మాత్రం విధేయత ఆశిస్తున్నావు. అది అత్యాశ కాదా? కానీ నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తరంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ తరం చాలామంది అమ్మాయిలు బాగా చదువుకుని వ్యక్తిత్వ వికాసం పూర్తిగా అయినాకే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంతేకాదు, వారు తమ స్వంత అభిప్రాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి సిద్ధంగాలేరు. అందుకే నీలాంటి తెలివైన ఈ కాలం అత్తగార్లు తమ అహాన్ని పక్కనపెట్టి మొదట్నుంచీ కోడలితో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ తరం అత్తగార్లలో నేడు వస్తున్న ఎంతో అభినందనీయమైన మార్పు. ఒప్పుకుంటావా?” అన్నాడు రాఘవ.

అందుకు అంగీకార సూచనగా ఓ చిరునవ్వు నాట్యం చేసింది అన్నపూర్ణ పెదవులమీద.

 

ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక – అక్టోబర్‌ 2014

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

కుంకుమ బరిణ –